Telugu writer
-
పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్/పిఠాపురం: సుప్రసిద్ధ తెలుగు రచయిత తల్లావఝల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు’ కథా సంపుటికి ఈ పురస్కారం ప్రకటించారు. బేతవోలు రామబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వరరావు జ్యూరీగా వ్యవహరించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో 24 భారతీయ భాషల పురస్కార గ్రహీతలను ప్రకటించారు. ఈసారి కేవలం 5 భాషల్లో కథా సంపుటాలు అవార్డులు గెలుచుకోగా వాటిలో ఒకటి తెలుగు సంపుటి కావడం గమనార్హం. ఎక్కువ భాషల్లో కవిత్వానికే అకాడమీ పురస్కారం మొగ్గు చూపింది. పిఠాపురంలో జననం.. రాజమహేంద్రవరంలో చిరకాలంగా జీవనం 1945 మే 14న పిఠాపురంలో జన్మించిన తల్లావఝల పతంజలి శాస్త్రి బాల్యం, కాలేజీ జీవితం అంతా ఒంగోలులోనే గడిచింది. తల్లి మహాలక్ష్మి, తండ్రి కృత్తివాస తీర్థులు. పతంజలి శాస్త్రి ఇరువైపుల తాతగార్లు తల్లావఝల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. ఎస్.వి.యూనివర్సిటీలో ఎం.ఏ చేసిన పతంజలి శాస్త్రి పూణె నుంచి ఆర్కియాలజీలో పీహెచ్డీ చేశారు. అమలాపురం కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా పని చేసి.. ఆ తర్వాత ‘ఎన్విరాన్మెంట్ సెంటర్’స్థాపించి పర్యావరణ రంగంలో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల రక్షణ కోసం చాలా పోరాడారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలలో పర్యావరణ కార్యకర్తగా సదస్సులకు హాజరయ్యారు. దక్షిణ భారతదేశ చరిత్ర మీద, దేవాలయాల వాస్తు మీద పతంజలి శాస్త్రికి విశేష పరిజ్ఞానం ఉంది. భార్య విజయలక్ష్మితో రాజమండ్రిలో చిరకాలంగా జీవనం గడుపుతున్నారు. కుమారుడు శశి, కుమార్తె గాయత్రి. అర్ధ శతాబ్దానికి పైగా కథారచయితగా.. ప్రత్యేక కథాశైలితో ప్రతిష్ట 1960ల నుంచి కథలు రాస్తున్న పతంజలి శాస్త్రిది తెలుగులో ప్రత్యేక శైలి. తేటతెల్లంగా కథావస్తువును బయల్పరచకుండా పాఠకుడి మేధ కొద్దీ అర్థం చేసుకునే విషయాలను ఇమడ్చుతారు ఆయన. నిర్దిష్టమైన సాంస్కృతిక నేపథ్యంతో కాకుండా సార్వజనీనమైన మానవ ప్రవర్తనలతో కథను చెప్పడం ఆయన ధోరణిలో కనిపిస్తుంది. జేబు దొంగలు, హోటల్ క్లీనర్లు, ఐటీ ఉద్యోగాల కట్టు బానిసలు, రంగు రాళ్ల వెతుకులాటలో ప్రాణాలు కోల్పోయే వాళ్లు, వేశ్యలు, గారడీల వాళ్లు పాత్రలుగా ఆయన కథల్లో కనిపిస్తారు. ‘వడ్ల చిలుకలు’, ‘పతంజలి శాస్త్రి కథలు’, ‘నలుపెరుపు’, ‘రామేశ్వరం కాకులు’ పతంజలి శాస్త్రి కథాసంపుటాలు కాగా ‘హోరు’, ‘దేవర కోటేశు’, ‘గేద మీద పిట్ట’నవలలు. వీటిలో ‘గేద మీద పిట్ట’ముఖ్య వస్తువు ‘మగ వేశ్యలు’కావడం ఒక ప్రత్యేకత. ‘మాధవి’అనే నాటకం రాశారు. గాథాసప్తశతిలోని వంద కథల్ని తెలుగులోకి అనువదించారు. ‘నేను నడుస్తున్నా, బస్సులో ఉన్నా, ఏం చేస్తున్నా మనసులో ఏదో కథ రాస్తూనే ఉంటాను’అని చెప్పే పతంజలి శాస్త్రి అలుపెరగక రాస్తూనే ఉన్నారు. పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడం పట్ల పలువులు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. సాహిత్యం నా జీవితం నా సాహిత్య వ్యాసంగం గుర్తింపు కోసమో, పురస్కారాల కోసమో కాదు. పర్యావరణం, సాహిత్యం నా జీవితం.. నా రచన. ‘రామేశ్వరం కాకులు’ దేశంలోనే గౌరవప్రదమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం సంతోషం. అధ్యయనం, అనుశీలనం నా ధ్యేయాలు.. ఇంకా రాస్తూనే ఉంటాను. -తల్లావఝల పతంజలి శాస్త్రి, రాజమహేంద్రవరం -
రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా పెనుగొండ లక్ష్మీనారాయణ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారతీయ అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈయన దాదాపు 45 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఎనిమిదేళ్లుగా జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణ వివిధ విమర్శనా గ్రంథాలు రాశారు. అనేక కథాసంపుటాలకు సంపాదకులుగా వ్యవహరించారు. పలు రాష్ట్ర మహాసభలకు నేతృత్వం వహించారు. కాగా జాతీయ అధ్యక్షులుగా పెనుగొండ, ఆంధ్రప్రదేశ్ అభ్యదయ రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం, ప్రధాన కార్యదర్శిగా వల్లూరు శివప్రసాద్ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
కవులు, కళాకారులకు పుట్టినిల్లు తెలుగు నేల
సాక్షి, అమరావతి: మహామహులైన కళాకారులు, కవులకు పుట్టినిల్లు తెలుగు నేల అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి అన్నారు. ముఖ్యంగా జాతిని జాగృతం చేసి, ప్రకృతిలో ఓలలాడించిన సాహిత్యం కృష్ణాజిల్లా కవులకే చెల్లుతుందన్నారు. విజయవాడలో రెండ్రోజులుగా జరుగుతున్న 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవరికీ లేని ప్రత్యేకత తెలుగు వారికి మాత్రమే ఉందన్నారు. ‘తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలను పెంచుకుందాం’ అని సభికులకు పిలుపునిచ్చారు. తెలుగు గడ్డపై సాహిత్య యోధులు ఉన్నంత వరకు అమ్మభాషకు ఆపద వాటిల్లదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎందరో కవులు, కళాకారులు, వాగ్గేయకారులు ఉత్తరాన పర్లాకిమిడి నుంచి దక్షిణాన కావేరి తీరం వరకు వేసిన పునాదులే తెలుగుకు రక్షా కవచాలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. అయినప్పటికీ భాష విషయంలో అలసత్వం వహించకూడదన్నారు. మరోవైపు.. తమిళులు, కన్నడిగులతో పోలిస్తే తెలుగు వారికి భాషాభిమానం తక్కువని ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మ పొత్తిళ్లలోనే జీవనం ప్రారంభమవుతుందని.. మాతృభాష పరిరక్షణలో అమ్మలే ముఖ్య భూమిక పోషించాలని కోరారు. భావితరాలకు భాషా సంస్కృతి దూరం కాకూడదన్నారు. ఉపాధ్యాయులు భాష పరిరక్షణపై విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని జస్టిస్ శేషసాయి సూచించారు. ప్రజలు భాషా సంస్కృతిని మర్చిపోతే.. ఆ భాష మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుందన్నారు. రచయితలు తెలుగుజాతిని ప్రభావితం చేయాలి.. సినీకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా తెలుగు పరిరక్షణపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయన్నారు. అప్పుడే తెలుగుకు సరైన ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం వచ్చేదికాదన్నారు. రచయితలు, కవులు తమ సాహిత్యంతో తెలుగుజాతిని ప్రభావితం చేయాలన్నారు. భాషా ప్రవాహం నిరంతరం పారుతూ.. నిత్య కల్యాణంగా ఉండాలన్నారు. ప్రస్తుత ఏపీ సీఎం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు. తెలుగు పరిరక్షణలో కూడా వెనక్కి తగ్గకుండా పాలన సాగిస్తారన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం పద్యాలు, పాటలతో ఆయన అలరించారు. మరో సహజ కవి అందెశ్రీ మాట్లాడుతూ.. పాశ్చాత్య ఎంగిలి భాషను కలపనంత వరకూ తెలుగు పరిమళం, గుబాళింపు ఎన్నటికీ తగ్గదన్నారు. అనంతరం ముఖ్యఅతిథులను ఘనంగా సత్కరించారు. కేవీ సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్య రూపకం ఆకట్టుకుంది. సభాధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్ వ్యవహరించారు. 18 తీర్మానాలు ఆమోదం ఇక రెండ్రోజుల పాటు సాగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఉత్సాహంగా సాగాయి. దేశ, విదేశాల నుంచి ప్రవాస తెలుగు రచయితలు, కవులు, సాహితీ ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ‘మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, విదేశీ, మహిళా ప్రతినిధుల సదస్సు, రాష్ట్రేతర, భాషోద్యమ ప్రతినిధుల సదస్సు, సాంస్కృతిక రంగ, చరిత్ర, వైజ్ఞానిక, విమర్శ సదస్సులతో పాటు మారుతున్న సామాజిక పరిస్థితులపై తెలుగు కవితలు, సామాజిక మార్పులు.. సాహిత్య ప్రక్రియ సదస్సులు, మహిళా ప్రతినిధుల కవిసమ్మేళనంలో సాహితీ ప్రముఖులు భాగస్వాములయ్యారు. అలాగే, మహాసభల్లో 18 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటిల్లో ముఖ్యమైనవి.. ► మాతృభాష పరిరక్షణకు జన బాహుళ్యాన్ని అభ్యర్థించాలి ► శతక పద్యాలు, సూక్తులను చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి ► మాతృభాష వస్తేనే ఇతర భాషల్లో రాణిస్తారన్న యునెస్కో సూచనలను విద్యారంగం పరిగణనలోకి తీసుకోవాలి ► సాంస్కృతిక కళలపై పిల్లలకు అభిరుచి కలిగించేలా తల్లిదండ్రులు కృషిచేయాలి ► పాఠశాలల్లో తెలుగు భాషా చరిత్రను కూడా పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు, సంస్కృతిపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించేలా విద్యరంగం చర్యలు చేపట్టాలి ► జాతీయ నూతన విద్యా విధానం మేరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి ► ఇంటర్, డిగ్రీలో ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరి చేయాలి ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారికి రిజర్వేషన్లతో పాటు సర్వీస్ కమిషన్ పరీక్షల్లో తెలుగులో చదివితే ఐదు శాతం ప్రోత్సాహక మార్కులు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి ► రాష్ట్రేతర తెలుగు సంస్థలకు ప్రభుత్వాలు సహకారం అందించాలి ► ఉత్తరభారత ప్రజలు కూడా తెలుగు భాష నేర్చుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ► భాషోద్యమానికి ప్రతి ఒక్కరూ సైనికులుగా శ్రమించేందుకు ముందుకురావాలి ► ఆధునిక పరికరాల వాడకంలో తెలుగును ఎక్కువగా వినియోగించాలని యువతకు సూచన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయారు తమిళనాడులో జయలలిత అధికారంలోకి వచ్చాక ఎంజీఆర్‌కు భారతరత్న వచ్చేలా చేసింది. చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్‌కు ఎందుకు భారతరత్న ఇప్పించలేకపోయారు? కేంద్రంలో అత్యున్నత పదవులు చేపట్టిన పీవీ నరహింహారావు, వెంకయ్యనాయుడు తెలుగుకు చేయాల్సిన మేలు చేయలేదు. ఈ సభలోనైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయాలి. – ఎంఎస్ రామస్వామిరెడ్డి, హోసూరు, తమిళనాడు మాతృభాషను ప్రేమిద్దాం.. పర భాషను గౌరవిద్దాం మనం మాతృభాషతో పాటు ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి. దేనిని నిర్లక్ష్యం చేయకూడదు. అబుదాబిలో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సంఘాన్ని నిర్వహిస్తున్నాం. – కాళ్లూరి యామిని, అబుదాబి ఒడిశాలో తెలుగు స్కూలుకు ఏపీ సర్కారు కృషి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన తర్వాత ఒడిశాలో దాదాపు తెలుగు స్కూళ్లు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి ఏపీ, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లోనూ ఉంది. ఇటీవల ఏపీ సర్కారు ఒడిశాలో స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. – ఎం.సత్యనారాయణమూర్తి, బరంపురం తెలుగులో విదేశీయుల సందడి మరోవైపు.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో శనివారం విదేశీయులు తెలుగులో సందడి చేశారు. ఇటలీ, ఫ్రాన్స్, పోలండ్‌కు చెందిన వ్యక్తులు తెలుగులో మాట్లాడి అదరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా పోలండ్‌కు చెందిన బుజ్జి అనే చిన్నారి ఘంటశాల వెంకటేళ్వరరావు పాడిన పద్యాలు, పాటలను పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే, ఓహో సుందరీ, ‘బొమ్మను చేసి.. ప్రాణం పోసి’ పాటలతో శ్రీకృష్ణదేవరాయలు పద్యాలను అచ్చతెలుగులో చక్కగా పాడి ఔరా అనిపించాడు. అలాగే, ఇటలీకి చెందిన యువతి మరియ కసదే మూడేళ్లుగా తెలుగు నేర్చుకుంటూ.. తెలుగులోనే పీహెచ్డీ చేస్తోంది. స్పష్టమైన ఆమె ఉచ్ఛారణ అందరినీ ఆకట్టుకుంది. ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలన్న తపనతో ఫ్రాన్స్‌లోని ప్రాచ్యభాష నాగరికతల జాతీయ సంస్థలో చేరి తెలుగు నేర్చుకుంది. ఆమెకు ఉర్దూ, హిందీ భాషలు వచ్చు. శ్రీశైలం ప్రాంతంలో వీరశైవులపై పరిశోధనలు చేసింది. ఇప్పుడు దక్కనీ భాషపై హైదరాబాద్‌లో పరిశోధన చేస్తోంది. తనకు తెలుగు పత్రికలు తెలియనప్పటికీ పరిశోధనలో భాగంగా విదేశాల్లో ఉన్నప్పుడే ‘సాక్షి’ ఆర్టికల్స్ చదివేదాన్నని చెప్పింది. మరోవైపు.. ఫ్రాన్స్‌కు చెందిన దానియెల్ నేజర్స్ సైతం తెలుగులో అనర్గళంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. -
Writers Meet 2022: కొత్త రచయితల గట్టి వాగ్దానం
‘తెలుగులో ఇంత వరకూ బెస్తవారి మీద మంచి నవల లేదు. ఆ నవల బెస్త సమూహంలోని రచయిత నుంచే రావాలి. నేను ఆ వెలితిని పూడ్చాలనుకుంటున్నాను’ అన్నాడు ప్రసాద్ సూరి. ఇతను హైదరాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. ఇప్పటికే రెండు నవలలు రాశాడు. ‘మా చిత్తూరులోని బహుదా నది ఎండిపోతే ఏడుస్తాను. ప్రవహిస్తే నవ్వుతాను. దాని చుట్టుపక్కల జీవితాలను కథలుగా రాస్తాను’ అన్నాడు సుదర్శన్. ఇతనికి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ‘బహుదా కథలు’ అనే పుస్తకం వెలువరించాడు. ‘మా పార్వతీపురంలో నా వయసు రచయితలు ఎవరూ లేరు. ఇప్పటి కాలంలో నాతోనే మా ప్రాంతంలో మళ్లీ కథలు మొదలయ్యాయి’ అంటాడు భోగాపురం చంద్రశేఖర్. ‘రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, కరువు అనుకోవద్దు. ఆకాశం ఉంది. ప్రేమ ఉంది. ఆప్యాయతలు ఉన్నాయి. అవి నేను రాస్తు న్నాను’ అన్నాడు సురేంద్ర శీలం. రెండు రోజుల ‘శీతాకాల కథా ఉత్సవం’లో యువ రచయితల మాటలు ఇవి. ప్రతి ఏటా జరుగుతున్న ట్టుగానే ఈ సంవత్సరం ‘రైటర్స్ మీట్’ ఆధ్వర్వంలో హైదరాబాద్ సమీపాన శామీర్‌పేటలో ‘ల్యాండ్ ఆఫ్ లవ్’ సౌందర్య క్షేత్రంలో నవంబర్ 26, 27 తేదీలలో 50 మంది రచయితలు, విమర్శకులు, పాఠకులు ‘శీతాకాల కథాఉత్సవం’లో పాల్గొన్నారు. వీరిలో అందరినీ ఆకట్టున్నది యువ రచయితలే. ఐటీ రంగంలో పని చేస్తూ కథలు రాస్తున్న శ్రీ ఊహ, అంట్రప్రెన్యూర్‌గా ఉంటూ కథను ప్రేమించే రుబీనా పర్వీన్, స్త్రీల సమస్యలను ప్రస్తావించే నస్రీన్ ఖాన్, విజయవాడ కథకుడు అనిల్ డ్యాని, తెలంగాణ కథను పరిశోధించిన దేవేంద్ర... ఇక కుల వివక్షను, పేదరికాన్ని అధిగమించి రచయితగా ఎదిగిన యాకమ్మ ప్రయాణం అందరి చేత కంటతడి పెట్టించింది. స్పార్క్ ఉన్న వర్ధమాన రచయితలను వెతికి ఆహ్వానాలు పంపడం రైటర్స్ మీట్ ప్రత్యేకత. వారిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయటంతో పాటు సీనియర్ రచయితలచే కథారచనలో మెళకువలను నేర్పుతారు ఈ శిబిరంలో. రచయితల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించి ఒకరికి ఒకరు దోహదపడేలా చేయడం కూడా రైటర్స్ మీట్ ఉద్దేశాలలో ఒకటి. ఈ సంవత్సరం జరిగిన రైటర్స్ మీట్లో ప్రముఖ రచయితలు వి.రాజా రామమోహనరావు, వాడ్రేవు చినవీరభద్రుడు, అయోధ్యా రెడ్డి కథా రచనలో తమ అనుభవాలను పంచారు. ఖాన్ యజ్దానీ, జి.వెంకట కృష్ణ, రమణమూర్తి, ఆదిత్య కొర్రపాటి కథావిమర్శ చేశారు. మలయాళ భాష రచయితలు బుకర్ ప్రైజ్ వరకూ ఎదుగుతుంటే తెలుగులో ఎవరూ అంతవరకు ఎందుకు పోవడం లేదన్న ప్రశ్న వచ్చింది. ‘కథను ఏ రచయితైనా చదివిస్తాడు. కానీ రెండోసారి పాఠకుడు ఆ కథను చదవాలంటే అందులో ఏం ఉండాలి’ అనే ప్రశ్న ఆలోచనల్లో పడేసింది. కథకులకు ఉండాల్సిన దృక్పథం గురించి ఖాన్ యజ్దానీ మాట్లాడితే, ‘కథలు రాయండి. ప్రవక్తలుగా మారకండి. రాస్తూ వెళ్లడమే మీ పని’ అన్నారు అయోధ్యా రెడ్డి. వి.రాజా రామమోహనరావు యువతరాన్ని భయపడవద్దనీ, నచ్చినట్టు రాయమనీ సలహా ఇచ్చారు. పాల్గొన్న ప్రతివారు తమ రచనల నేపథ్యాన్నో, రాయవలసిన కథాంశాలనో స్పృశించారు. కరుణ కుమార్, మహి బెజవాడ, సాయి వంశీ తదితరులు తాము ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారో తెలియ చేశారు. చాలా ఆలస్యంగా కథా రచన ఆరంభించిన మారుతి పౌరోహిత్యం, చిలు కూరు రామశర్మ తమ రచనలను చెప్పిన తీరు ఆకర్షణీయమే. పాఠకులుగా విచ్చేసిన శుభశ్రీ, దేవిరెడ్డి రాజేశ్వరి లోతు తక్కువ కథలు రావడానికి రచయితలు తగినంతగా చదవకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) శీతాకాల కథా ఉత్సవాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడంలో భాగంగా ఈసారి రఘు మందాటి ఫొటో ఎగ్జిబిషన్ ‘థండర్ డ్రాగన్’, శ్రీపాల్ సామా దర్శకత్వం వహించిన ‘హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే’ సినిమా ప్రదర్శన, రచయిత్రి ఝాన్సీ పాపుదేశి కథల పుస్తకం ‘దేవుడమ్మ’ ఆవిష్కరణ ఆకర్షణలుగా నిలిచాయి. కథా రచన పట్ల కొత్త కమిట్మెంట్ను, కథకుల మధ్య కొత్త బాండింగ్‌ను ఏర్పరచిన ఈ రైటర్స్ మీట్ సమావేశాలు కొత్త తరానికి నూతనోత్సాహాన్ని పంచే కాంతిపుంజాలు. (చదవండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - సి.ఎస్. రాంబాబు ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి, రచయిత -
Rachamallu Ramachandra Reddy: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!
విమర్శకుడిగా, కథకుడిగా, సమీక్షకుడిగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.) తెలుగు మేధావుల ప్రశంసలకు పాత్రమ య్యారు. తాను స్వయంగా చక్కని కథానికలు రాయడమే కాదు ఒక తరం కథకులను తర్ఫీదు చేశారు. మంచి విమర్శకుడిగా తాను రాణించడమే కాదు ఎందరో విమర్శకులకు పదును పెట్టారాయన. ప్రత్యేకించి విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండ గలదో చేసి, చూపించారు. ప్రాక్పశ్చిమ దేశాల సాహి త్యాన్ని క్షుణ్ణంగా చదివిన కొద్దిమంది విమర్శకుల్లో రా.రా. ఒకరు. మార్క్స్, ఎంగెల్స్, గ్రామ్సీ, గియోర్గీ లూకాస్ లాంటి సిద్ధాంతవేత్తల రచనలు చదివిన రచయితలు చాలా తక్కువ. రా.రా. వారిలో ఒకరు! తెలుగు సాహితి నిస్తబ్ధంగా పడివుండిన దశలో 1968లో ‘సంవేదన’ పత్రిక మొదలుపెట్టి చైతన్యం తీసుకొచ్చిన వాడు రా.రా. ఆయన కథా సంపుటి ‘అలసిన గుండెలు’ కొడవటిగంటి కుటుంబరావుకు బాగా నచ్చింది. రా.రా.ను విమర్శకుడిగానే కాక, కథక శిల్పిగా కూడా... కథాశిల్పం గురించి లోతుగా అధ్యయనం చేసి, పుస్తకం రాసిన వల్లంపాటి గౌరవించేవారు. ఇక, సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి తదితరుల మాట చెప్పనక్కర్లేదు. వాళ్లను రా.రా. అంతేవాసులనవచ్చు. ‘అనువాదకుడిగానూ, అను వాద ప్రక్రియ అధ్యయనశీలిగానూ’ ఒక్కమాటలో చెప్తే రా.రా. కృషి అనన్యసాధ్యం! విమర్శకుల్లో రా.రా. మెథడాలజీని, మెథడ్‌ను రెండింటినీ ఒకమేరకు ఒంటపట్టించుకున్నవారు ఆర్వీయార్ . ‘సంవేదన’ సంపాదకుడిగా రా.రా. ఆ పత్రికలో సుదీర్ఘ సమీక్షలు చేసేవారు; చేయించేవారు కూడా! అయితే, రా.రా. విమర్శచేసే తీరుతెన్నులపై పూలే కాదు రాళ్లు కురిపించినవాళ్ళూ కొంద రున్నారు! ఆయన విమర్శను కొందరు ‘వ్యక్తిగత’ విమర్శగా పరిగణించారు! అందులో వ్యక్తమయ్యే ధర్మాగ్రహమే అందుకు కారణం. రా.రా. అభిమాన కవి శ్రీశ్రీయే ఆయన్ను ‘క్రూరమయిన విమర్శకుడ’ని అన్న సంగతి మన కందరికీ తెలుసు. ఇలాంటిది ప్రతి రచయిత విషయంలోనూ జరగదు. కాన్సిక్వెన్సియల్ రచయితల విషయంలోనే అలా జరుగుతుంది! ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పవలసివుంది. రా.రా. ఏ రంగంలో కృషి చేసినా దానిపై తన ముద్ర బలంగా వేసిన వారు. వాటిల్లో అనువాదం కూడా ఒకటి! ‘అనువాదం అంటే ఏమిటి?’ అనే ప్రశ్న ఎంత సరళమైందో దానికి వచ్చిన సమాధానాలు అంతే జటిలంగా ఉన్నాయి! ‘మూలభాషలోని పాఠాన్ని, లక్ష్యభాషలోకి మార్చడమే అనువాదం’ అనేది అతి సరళమైన నిర్వచనం అనిపించు కుంటుందేమో! అయితే, రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ కవి అనువాదం విషయంలో అంత ‘సరళంగా’ ఆలోచిం చినట్లు కనబడదు. కవిత్వానికి ఓ నిర్వచనం చెప్పవయ్యా మహానుభావా అంటే ‘అనువాదంలో లుప్తమైపోయేదే కవిత్వం’ అన్నాడు ఫ్రాస్ట్! ఈ విష యంలో ఫ్రాస్ట్‌కు మరెందరో మద్దతుదారులు కూడా వున్నారు; అసలు అనువాదాల ‘శీలాన్నే’ శంకించారు కొందరు. అలాంటి ఫ్రెంచ్ సామెత ఒకదాన్ని రా.రా. తన పుస్తకం ‘అనువాద సమస్యలు’ మొదట్లోనే పేర్కొ న్నారు. ఆ పాటి హాస్య ప్రియత్వం లేకుండానే ఆయన అన్నేళ్ళు అనువాద రంగంలో గడపగలిగారంటారా? రా.రా. పెద్దగా మెచ్చని ఓ మాటతోనే ఆయన్ని అభివర్ణించగలం. అది (బాగా అరిగిపోయిన మాటే అనుకోండి) బహుముఖ ప్రజ్ఞావంతుడు! ‘సారస్వత వివేచన’ అనే విమర్శ వ్యాసాల సంకలనం వెలువరించిన గొప్ప విమర్శకుడు రా.రా. నన్నయ, తిక్కన, పోతన, పెద్దన, ఏనుగు లక్ష్మణకవి, గురజాడ, దువ్వూరి రామిరెడ్డి, చలం, విశ్వనాథ, శ్రీశ్రీ, మహీధర, కాళోజీ, ఆర్.ఎస్. సుదర్శనం, బంగోరె, కేవీఆర్, అద్దేపల్లి రామమోహనరావు లాంటి తెలుగు వాళ్ళ కృషితో పాటు ఉమర్ ఖయావ్ు, రబీంద్రనాథ్ టాగోర్ తదితరుల రచనలను కూడా విమర్శనాత్మకంగా విశ్లేషించి నిష్కర్ష చేసిన వాడు రా.రా. ఆయన వ్యాసాలన్నింట్లో ముఖ్యంగా ‘అనువాద సమ స్యలు’లో మెటా ఫర్‌ను (ఆలంకారిక అభి వ్యక్తిని) విస్తృతంగా వాడడం కనిపిస్తుంది. ఇది, మనకో మాట చెప్తుంది. ‘హృదయ వాది’ రా.రా. ‘మనసులో కవి’ (ఎ పొయెట్ ఎట్ హార్ట్) అయివుండాలి!! దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి చెప్తూ ‘‘తిలక్‌లోని ప్రముఖమైన గుణం భావు కత్వం. కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. శ్రీశ్రీ తర్వాత ఇంత భావుకత్వంగల కవి మనకు లేడేమో!’ అన్నారు రా.రా. ‘అలౌకిక సౌందర్య శోభితమయిన ఐంద్రజాలికుని అంతఃపురం లాగుంది అతని కవితా చందన శాల’ అని కూడా అన్నారాయన. ఆ వ్యాసం తిలక్ ‘వస్తుతః భావకవి’ అని సాదరంగా స్థాపించిందని గుర్తుంచుకోవాలి! అలాంటి వ్యాసానికి అలాంటి భాష ఉపయోగించడానికి అంతో ఇంతో కవి అయివుండాలి! ‘మల్లారెడ్డి గేయాలు’ పరిచయ వాక్యాల్లో వ్యక్తమయిన ‘అనన్యత లాంటి అన్యోన్యత’ లాంటి అలంకారాలూ ఆ విషయాన్నే పట్టిస్తాయి. ‘రేపటికోసం’ సంకలనంలో, బెర్టోల్ట్ బ్రెష్ట్ రాసిన ‘మృత సైనికోపాఖ్యానం’ అనే పాటకి రా.రా. చేసిన అనువాదం చూస్తే, గేయ రచనలోనూ ఆయన సిద్ధహస్తుడని రుజువ వుతుంది. అదృష్టదీపక్ కవితా సంపుటి ‘ప్రాణం’ పుస్తకానికి రా.రా. ముందు మాట కూడా కవిత్వం పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్తే, విమర్శ ఎంత సృజనాత్మకంగా వుండగలదో చూపించా డాయన. మరీ ముఖ్యంగా ఆయన రాసిన సమీక్ష వ్యాసాలు విమర్శ రంగాన్ని కొత్త మలుపు తిప్పాయి. ‘చుక్కలు చీకటి’, ‘నీతి గానుగ’ లాంటి గొప్ప కథలు రాసిన రా.రా., సొదుం జయరాం (వాడిన మల్లెలు), కేతు విశ్వనాథరెడ్డి (జప్తు), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి (కుట్ర) లాంటి కథకులనూ పదునుపెట్టి, తెలుగు సాహితికి పరిచయం చేశారు. ‘సంవేదన’ పత్రికలో జయరాం కథానిక ‘వాడిన మల్లెలు’ పై చేసిన ప్రయోగం, దాన్ని సవిమర్శకంగా విశ్లేషిస్తూ కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసమూ కథానిక రచయితల పాలిట పెద్దబాలశిక్ష లాంటివి! పిల్లల కోసం ‘చంద్ర మండలం శశిరేఖ’, ‘విక్రమార్కుని విడ్డూరం’, ‘అన్నంపెట్టని చదువు’ లాంటి విలువైన ఆసక్తికరమైన రచనలు చేసినవారు రా.రా. రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య జీవితంలో పత్రికలదీ పెద్దపాత్రే! ‘సవ్యసాచి’, ‘సంవేదన’ లాంటి పత్రికలకు ‘సంపాదకుడిగా’ ఉండిన ప్రతిభా వంతుడాయన. ‘వ్యక్తి స్వాతంత్య్రం సమాజ శ్రేయస్సు’ లాంటి సైద్ధాంతిక విషయాలను ఏనాడో చర్చించిన మేధావి రా.రా. తర్వాతి రోజుల్లో పుస్తక రూపంలో వచ్చిన ఈ దీర్ఘ వ్యాసం ‘సందేశం’ పత్రికలో మొదటిసారి అచ్చయినట్టుంది. దినపత్రి కల్లో స్పష్టంగానూ, స్ఫుటంగానూ, నిర్దుష్టంగానూ ఉండే అనువాదాలు చేసేలా విద్యార్థులకు ఒరవడి నిచ్చిన శిక్షకులు రా.రా. ఇక, రాచమల్లు రామచంద్రారెడ్డి రెండున్నర దశాబ్దాల కాలం కేంద్రీకరించి పనిచేసిన రంగం అనువాదం! అంతేకాదు రచనా ప్రక్రియ గానూ, శాస్త్రం గానూ అనువాదాన్ని సాధన చేశారాయన. పరిశోధకుల పరిభాషలో వాటిని మెథడ్గానూ, మెథడాలజీగానూ ఆయన సాధన చేశారని చెప్పొచ్చు! రా.రా. ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి 1988లో కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే! భారతీయ భాషల్లో అలాంటి పుస్తకం అంతవరకూ రాలేదని అప్పట్లో ఓ సమీక్షకుడు పేర్కొన్నారు! - మందలపర్తి కిశోర్ సీనియర్ పాత్రికేయుడు (నేడు కేంద్ర సాహిత్య అకాడమీ, యోగి వేమన విశ్వవిద్యాలయం, బ్రౌన్ గ్రంథాలయం రా.రా. శతజయంతి సదస్సు నిర్వహిస్తున్నాయి) -
Shanti Narayana: ‘అనంత’ సాంస్కృతిక సేనాని
జీవితాన్ని వెతుక్కునే దశ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకునే దశకు శాంతి నారాయణ ఎదగడం నల్లేరు మీద బండి నడకలా సాగలేదు. ‘నీ కొడుక్కి చదు వెందుకు, కూలికి పంపించు’ అనిపించుకున్న దశ నుంచి ఎంఏ, పీహెచ్డీ చేసే దశకు శాంతి నారాయణ ప్రయాణం సునాయాసంగా జరగలేదు. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమా నతలను అనుభవించే దశ నుంచి, వాటిని నిర్మూలించాలనే రచనలు చేసే దశకు ఆయన చేరడం చిన్నపని కాదు. అదొక సంఘర్షణ. అదొక సమరం. బాల్యంలో తగిలిన గాయాలను స్వయంకృషితో, సహృదయుల చేయూతతో మాన్పుకుంటూ, మాన్పుకుంటూ గాయాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా సాహిత్య సృష్టి చేస్తున్న రచయిత డాక్టర్ శాంతి నారాయణ. డెబ్భై అయిదేళ్ళ వయసుగల (1946) శాంతి నారాయణకు 50 ఏళ్ళ సాహిత్య జీవితం (1972–2022) ఉంది. ఆయన కవి, కథా రచయిత, నవలా రచయిత, ఫీచర్ రచయిత. జీవితాన్ని వెతు క్కుంటూ, 50 ఏళ్ళలో అనేక సామాజిక, సాహిత్య కార్యకలాపాల్లో నిమగ్నమౌతూ, యాభై ఏళ్ళలో అసంఖ్యాక రచనలు చేసిన నిబద్ధత, నిమగ్నత గల రచయిత. శాంతి నారాయణ జీవితం మూడు ముఖాలుగా సాగుతున్నది. 1. వ్యక్తిగత జీవితం. 2. సామాజిక జీవితం. 3. సాహిత్య జీవితం. శాంతి నారాయణ వ్యక్తిగత జీవితంలో కుల వ్యతిరేకి. లౌకిక వాది. భౌతికవాది. తాను కులాంతర వివాహం చేసుకోవడమేగాక, తన సంతానానికీ కులాం తర వివాహాలు చేశారు. ఈ విషయంలో ఆయన చాలామంది మహా మహులను వెనక్కి నెట్టేశారు. రచయితగా శాంతినారాయణ గత అయిదు దశాబ్దాలలో 16 పుస్తకాలు ప్రచురించారు. ఆయన అవధాని కాబోయి ఆధునిక రచయిత కావడం గుర్తించదగిన విశేషం. 1972లో ‘రక్తపు ముద్ద పిలిచింది’ అనే కథా సంపుటి ప్రచురణతో ఆయన సాహిత్య జీవితం మొదలై, 2022లో ‘ముడి’, ‘సాధన’ అనే రెండు నవలల ప్రచురణ దాకా వచ్చింది. ఈ మధ్యలో ‘నడిరేయి నగరం’(1978), ‘కొత్త అక్షరాలమై’ (2017) అనే కావ్యాలూ; ‘రస్తా’ (1976), ‘పల్లేరు ముళ్ళు’ (1998), ‘నమ్ముకున్న రాజ్యం ’(2004), ‘కొండచిలువ’ (2016), ‘బతుకుబంతి’ (2017) కథల సంపుటాలు; ‘మాధురి’ (1980), ‘పెన్నేటి మలుపులు’ (2001) వంటి నాలుగు నవలలు; ‘నాలుగు అస్తిత్వాలు–నాలుగు నవలికలు’ అనే గ్రంథం; ‘నాగల కట్ట సుద్దులు’ అనే ఫీచర్ రచన రెండు సంపుటాలు ప్రచురించారు. శాంతి నారాయణ అనంతపురం జిల్లా సామాజిక రంగంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 1989కి ముందు రాయదుర్గంలో పనిచేస్తున్నప్పుడు అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురంకు బదిలీ అయ్యాక 1989–2002 మధ్య ‘జిల్లా రచయితల సంఘం’ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఆయన అనేక విలువైన కార్యక్రమాలు నిర్వహించారు. ఏళ్ళతరబడి నిద్రా వస్థలో ఉండిపోయిన జిల్లా రచయితల సంఘాన్ని పునరుజ్జీవింప జేయడంలో శాంతినారాయణ చురుకైన పాత్ర నిర్వహించారు. తెలుగు నవల వచ్చి 116 ఏళ్ళ చరిత్ర పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సు చరిత్రాత్మకమైనది. 2002–2004 మధ్య అనంతపురం జిల్లాను కరువు అతలాకుతలం చేసినప్పుడు అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, మేధావులు చేసిన కరువు అధ్యయన యాత్ర, రైతు ఆత్మవిశ్వాస యాత్రల్లో శాంతి నారాయణ భాగస్వామి అయ్యారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తరఫున ‘వొరుపు’ అనే కవిత్వ సంకలనాన్నీ, ‘ఇనుప గజ్జెల తల్లి’ అనే కథల సంకలనాన్నీ సంపా దకత్వం వహించి ప్రచురించారు. అలాగే అనంతపురం జిల్లాలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు దళిత సంఘీభావం సమితి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలలో ఆయన పాల్గొన్నారు. తాను రచనలు చేయడమే కాకుండా, ‘విమలా శాంతి సామాజిక సాహిత్య సేవా సమితి’ స్థాపించి 2006 నుండి, 17 ఏళ్ళుగా, కవులు, కథా రచయితలకు పురస్కారాలిస్తున్నారు. ఇవాళ ప్రసిద్దిగాంచిన రచయితలుగా పేరు పొందిన వాళ్ళలో చాలామంది ఆయన పురస్కారాలు తీసుకున్నవారే. అంతేగాక, విమలా శాంతి జీవిత సాఫల్య పురస్కారం స్థాపించి మొదటిసారిగా, 2021లో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డికి ఇచ్చారు. ఇది శాంతి నారాయణ బహుముఖీన జీవితం. (క్లిక్ చేయండి: తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!) - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు (నవంబర్ 1న డాక్టర్ శాంతి నారాయణకు‘వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార’ప్రదానం) -
Ronanki Appalaswamy: నడిచే బహు భాషాకోవిదుడు
కళింగాంధ్రలో జన్మించి రచయితగా, బోధకుడిగా, అనువాదుకుడిగా, సాహితీ విమర్శకుడిగా, అభ్యుదయవాదిగా ఆచార్య రోణంకి అప్పలస్వామి చేసిన పయనం తరగని స్ఫూర్తిని పంచింది. ఆయన 1909 సెప్టెంబరు 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఇజ్జవరం గ్రామంలో జన్మించారు. మూడో ఫారం చదువుతుండగానే పోతన భాగవతంలోని ఘట్టాలను కంఠస్థం చేసిన అప్పలస్వామి, తర్వాత కాలంలో ప్రపంచమే నివ్వరపోయేటంత భాషావేత్తగా ఎదిగారు. విజయనగరం ఎంఆర్ కళాశాలలో ఆంగ్ల బోధకుడిగా 1934లో కెరీర్ ప్రారం భించారు. ఒక వైపు ఆంగ్ల అధ్యాపకునిగా ఉంటూనే ఫ్రెంచ్, స్పానిష్, గ్రీకు, హీబ్రూ, ఇటాలియన్ వంటి యూరోపియన్ భాష లను ఆధ్యయనం చేశారు. ఆయా భాషల్లో కవితలు, రచనలు చేయడమేకాక అను వాదాలూ చేశారు. గ్రామఫోన్ ప్లేట్లు పెట్టుకొని జర్మన్, లాటిన్ లాంటి భాషల్లో నైపుణ్యం సంపా దించారు. హిందీ, ఒడియా, కన్నడం, బెంగాలీ వంటి భార తీయ భాషల్లో సైతం అసర్గళంగా మాట్లాడే శక్తి సొంతం చేసుకున్నారు. విజయనగరంలో వున్న తొలినాళ్లలో ‘సాంగ్స్ అండ్ లిరిక్స్’ పేరిట తొలికవితా సంపుటిని 1935లో వెలువ రించారు. అల్లసాని పెద్దన, క్షేత్రయ్య రచనలను ఆంగ్లీకరిం చారు. మేకియవెల్లి ఇటాలియన్ భాషలో రాసిన ‘ప్రిన్స్’ గ్రంథాన్ని, ‘రాజనీతి’ పేరుతో తెలుగులోకి సరళంగా అనువదించారు. మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన ‘పూర్ణమ్మ’, ‘తోకచుక్క’లను ఇంగ్లీష్‌లోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, నారాయణ బాబు, విశ్వ సుందరమ్మ, చాకలి బంగారమ్మ వంటివారిని ప్రపంచ కవితా ప్రియులకు పరిచయం చేసింది రోణంకి వారే. ఆకాశవాణిలో కొన్ని సంవత్సరాలు ప్రసంగాలు చేశారు. ఆంగ్లభాషలో ఉత్తమ బోధకుడిగా, పలు భాషల్లో నిష్టాతుడిగా ఖ్యాతిగాంచిన రోణంకి అప్పలస్వామిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధన చేయమని ఆహ్వానం లభిం చింది. యూజీసీ ఎమెచ్యూర్ ప్రొఫెసర్‌గా నియమించింది. చాగంటి సోమయాజులు (చాసో), శ్రీరంగం నారాయణబాబు, చిర్రావూరి సర్వేశ్వర శర్మలు రోణంకికి మంచి స్నేహితులు. ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడి రాజు ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. (క్లిక్ చేయండి: ఉత్తమ కథల సంకలనంలో ‘వేంపల్లె’ కథ) ప్రముఖ రచయిత ఆరుద్ర, రోణంకి మాష్టారుకు శిష్యుడే. అందుకే తన తొలి కావ్యం ‘త్వమేవాహం’ను అప్పల స్వామికి అంకితం చేశారు. డాక్టర్ మానేపల్లి తన తొలి కవితా సంపుటి ‘వెలిగించే దీపాలు’ను రోణంకి గారికే అంకితమిచ్చి మాష్టారు రుణం తీర్చుకున్నారు. పీవీ నరసింహారావు, పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి వారితో సమాన ప్రతిభా పాటవాలు కలిగిన ఆచార్య అప్పలస్వామి జీవిత చరిత్రను, రచనలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు వ్యాసకర్త అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం (సెప్టెంబరు 15నఆచార్య రోణంకి అప్పలస్వామి జయంతి) -
ఉత్తమ కథల సంకలనంలో ‘వేంపల్లె’ కథ
కడప కల్చరల్ : జాతీయ స్థాయిలో అలోఫ్ బుక్ కంపెనీ ప్రచురించిన ఉత్తమ కథల సంకలనంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన యువ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్ కథకు చోటు లభించింది. ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థగా దక్షిణాసియా దేశాల్లో ఎంతో ఆదరణగల అలోఫ్ బుక్ కంపెనీ ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన భారతీయ ఉత్తమ వర్తమాన కథల ఆంగ్ల సంకలనంలో తెలుగు నుంచి వేంపల్లె షరీఫ్ రాసిన ‘ఒంటి చేయి’ కథకు చోటు దక్కింది. దేశంలోని వివిధ భాషల్లో 40 మంది ఉత్తమ వర్థమాన కథలతో ఆ కంపెనీ ‘ఏ కేస్ ఆఫ్ ఇండియన్ మార్వెల్స్’ పేరిట పుస్తకాన్ని ప్రచురించింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పెంగ్విన్ ప్రచురణ సంస్థ సీఈఓ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఇక షరీఫ్ కథను బెంగళూరుకు చెందిన ప్రముఖ అనువాదకులు ఎన్ఎస్ మూర్తి ‘క్రిపుల్డ్ వరల్డ్’ పేరుతో అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమి ద్వైమాస పత్రిక ది ఇండియన్ లిటరేచర్‌లో కూడా ఈ కథ ఆంగ్ల అనువాదం ప్రచురితమైంది. (క్లిక్: భార్య, ఇద్దరు పిల్లలతో కేరళ టూర్.. చివరికి ఏమైంది?) -
ఆ వృత్తులకు గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు
కొన్నాళ్ళ కిందట ఒక ఇంటర్వ్యూ చూశాను. సెక్స్ వర్కర్ల సంఘానికి ప్రతినిధిగా వున్న ఒక స్త్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ అది. వ్యభిచారాన్ని ఒక పని (వర్క్) గానూ, ఆ పని చేసే వారిని ‘సెక్సు వర్కర్లు’ గానూ, గుర్తించి, వారిని సానుభూతితో కాక గౌరవంగా చూడాలని ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇలాంటి వాదన, కొత్త దేమీ కాదు. పాతికేళ్ళ కిందట (1997లో) కలకత్తా లోని ఒక మహిళా సంఘం వారు ‘‘సెక్స్ వర్కర్స్ మానిఫెస్టో’’ అని ఒక ప్రణాళికనే విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చేసిన వాదనలు గానీ, చూపిన పరిష్కారాలు గానీ, ఆడ వాళ్ళని మరింత అధోగతికి దిగజార్చేవిగా ఉన్నాయి. క్లుప్తంగా కొన్నిటిని చూద్దాం. (1) ‘సెక్సు’ని ఒక ‘పని’గా, ఒక ‘వృత్తి’గా అనడం పచ్చి వ్యాపార దృష్టి! స్త్రీలని ‘సెక్స్ ఆబ్జెక్ట్స్’గా (‘భోగ్య వస్తువు’గా), తిరుగుబోతు పురుషులకు అందుబాటులో ఉంచడం తప్పులేదనే దృష్టి అది! ఇలాంటి దృష్టిని ‘పితృస్వామ్య’ దృష్టి అనీ, ‘పురుషాధిక్య భావజాలం’ అనీ అనొచ్చు. కానీ, ఇక్కడ ఆ భావాల్ని ప్రకటించినది, పురుషుడు కాదు, ఒక స్త్రీ! అంటే, జీవశాస్త్ర పరంగా స్త్రీలు, పురుషుల నించీ వేరుగా ఉంటారే గానీ, సామాజికంగా స్త్రీల భావాలు, పురుషుల భావాల నించీ తేడాగా ఉండవని అర్ధం! కట్నం కోసం వేధించే వాళ్ళూ, వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళూ ప్రధానంగా స్త్రీలే కదా? (2) వ్యభిచారాన్ని ఒక ‘వృత్తి’గా చెప్పే సంస్కర్తలు, సమాజంలో, స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉండాలని చెపుతున్నారు? ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం కేవలం శారీరక సంబంధమేనా? ఒక కుటుంబంగా ఉండడమూ, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరూ బాధ్యతలు పంచుకోవడమూ ఉండాలా, అక్కరలేదా? డబ్బు– ఆదాయ దృష్టితో వ్యభిచారాన్ని సమర్ధిస్తే, ఇంకా మానవ సంబంధాల నేవి ఎలా ఉంటాయి? (3) వ్యభిచారిణుల్ని ‘కార్మికులు’గా గుర్తించమని పోరాడుతున్నారట! పోరాటాలు జరగాల్సింది, ‘ఒళ్ళమ్ము కుని’ బ్రతికే నీచ స్థితి నించీ తప్పించి, గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు చూపించమనే డిమాండుతో! (4) ఆర్ధిక అవసరాల వల్ల బ్రతుకుతెరువు కోసం ఈ ‘పని’లోకి వస్తున్నారని ఈమె చెపుతున్నారు. అంటే గతి లేకే వస్తున్నట్టు కాదా? మరి, ‘స్వచ్ఛందంగా’ వస్తున్నారని సమర్ధించుకోవడం ఏమిటి? (5) ‘భర్త బాధ్యతగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువగా వస్తుంటారు’ అని అంటున్నారు. కానీ, భర్తలు బాధ్యతగా లేని సంసారాలు అనేక లక్షలుంటాయి. ఆ స్త్రీలందరూ ఇదే వ్యభిచారాన్ని బ్రతుకుతెరువుగా చేసుకుంటు న్నారా? చేసుకోవాలా? (6) ‘మా వాళ్ళెవరూ, ఈ పనిని బ్రతుకుతెరువుకోసమే గానీ ఆదాయ వనరుగా చూడర’ని ఒక పక్క చెపుతూ, ఇంకో పక్క పాచి పనుల వల్ల వచ్చే ఆదాయం పిల్లల్ని ఇంజనీ రింగూ, మెడిసినూ చదివించడానికి సరిపోదనడం అంటే, వ్యభిచారాన్ని (‘ఈ పనిని’) ఆదాయ వనరుగా చూడ్డం కాదా? (7) ‘పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందంటున్నారు. పరస్పరం అంగీకారమైతే, ఒకరు మాత్రమే డబ్బులివ్వడం, ఇంకోరు తీసుకోవడమెందుకు? ఇద్దరికీ అది శృంగారమైతే, ఆ మొగవాడే ఆ ఆడదానికి డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఆడది కూడా, ఆ మగవాడికి డబ్బు ఇవ్వాల్సిందే కదా? అలా ఎందుకు జరగదు? (8) వ్యభిచారిణులు, ఆ ‘వృత్తి’ ద్వారా డబ్బు చక్కగా సంపాదించి, పిల్లల్ని డాక్టర్లనీ, ఇంజనీర్లనీ చెయ్యగలుగు తున్నారట! ఈ పాతికవేల మందీ, తమ పిల్లల్లో ఒకటి రెండు వందల మంది పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేశారను కుందాం. అన్ని వేలల్లో, మిగతా పిల్లల సంగతి ఏమిటి? అయినా తమ పిల్లల్ని డబ్బు సంపాదించే ఉద్యోగులుగా చేయడానికేనా ఆ తల్లులు వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించేది? డబ్బు బాగా సంపాదించకుండా, మాములు కూలి పనులతో, పేదరికంతో బ్రతికే స్త్రీలను మూర్ఖులుగా అనుకోవాలా? (క్లిక్: అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు) (9) చివరికి చెప్పుకోవాలిసిన మాట, గౌరవాలకు తగిన నడతలకే గౌరవాలు దొరుకుతాయి గానీ, వ్యభిచారాలూ, దొంగతనాలూ, హత్యలూ వంటి ‘వృత్తులకు’ గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు. దాన్ని డబ్బు పోసి కొనలేరు. వ్యభిచారిణుల పిల్లలైనా, వాళ్ళు కూడా అదే దారిలో వెళితే తప్ప, వాళ్లయినా, తల్లుల్ని గౌరవించరు! గౌరవించలేరు! గౌరవించకూడదు! (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - రంగనాయకమ్మ సుప్రసిద్ధ రచయిత్రి -
ఎందుకో?.. నేను పుట్టినప్పుడు పూలవాన కురవలేదు..
సీటీఆర్ (రాజమహేంద్రవరం): పాత్రికేయునిగా, కథా రచయితగా, సినీ రచయితగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న ముళ్లపూడి వెంకట రమణ ధవళేశ్వరంలో 1931 జూన్ 28న జన్మించారు.. తన జన్మదినం గురించే ఆయన స్వీయచరిత్రలో విసిరిన చమక్కులను ముందుగా చూద్దాం...‘జ్యేష్ఠా నక్షత్రం, వృశ్చికరాశిలో పుట్టాను. అంటే జూన్ 28 తెల్లవారు జామున, 1931లో. పీవీగారు కూడా జూన్ ఇరవైయ్యెనిమిదే, 1921లో. అంటే నా కన్నా పదేళ్ల చిన్న. ఈ మాటంటే ఆయన పకాపకా నవ్వారు. ఎందుకో?... రాజమండ్రి, ధవళేశ్వరాల మధ్యనున్న ఆల్కాట్ గార్డెన్స్ ఆసుపత్రిలో పుట్టాను. నేను పుట్టినప్పుడు దేవదుందుభులు మోగలేదు. అచ్చరలాడలేదు. గంధర్వులు పాడలేదు. పూలవాన కురవలేదు.’’ కష్టాలతో చెలిమి... పట్టుమని పదేళ్లు రానివయసులోనే ముళ్లపూడి తండ్రిని కోల్పోయారు. కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పొట్ట చేతపట్టుకుని మద్రాసు మహానగరానికి వెళ్లారు. ఒక మెట్టగదిలో ముళ్లపూడి, ఆయన సోదరుడు, తల్లి కాపురం. తల్లి విస్తర్లు కుట్టి, ప్రెస్సులో కంపోజింగ్ పనులు చేసి సంసార నౌకను నడిపారు. మధ్యలో 7,8 తరగతులు చదువుకోవడానికి ముళ్లపూడి తల్లి, సోదరుడితో కలసి రాజమండ్రి వచ్చి, ఇన్నీసుపేటలోని కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చదివారు. తిరిగి మద్రాసు చేరుకున్నారు. ఎస్సెల్సీ వరకు చదువు కొనసాగింది. పూలేకాదు, ముళ్ళూ... పాత్రికేయ జీవితంలో అందుకున్న సన్మానాలు, పొందిన బిరుదుల, మెళ్లో వేసిన శాలువాలూ, పూలదండలే కాదు, పొందిన అవమానాలు, అగచాట్లు, డబ్బు చిక్కులూ, ఛీత్కారాలు అన్నిటినీ ముళ్లపూడి తన స్వీయచరిత్రలో చెప్పుకొచ్చారు. పొలిటికల్ కాలమిస్టుగా పనిచేస్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు క్లబ్‌కు తీసుకువెళ్లి నా పేరు చెప్పి భోజనం లాగించెయ్. .అన్నారు..అప్పటికే ఆకలి ‘రుచి’పూర్తిగా తెలిసిన ముళ్లపూడి డైనింగ్ హాలులోకి వెళ్లి బేరర్‌కు చెప్పారు. ‘డ్రైవర్సుకీ, బోయెస్కీ బాక్ సైడ్ షెడ్లో ఇరికప్పా, పిన్నాలే పో’ అన్నాడు వాడు. సంజీవరెడ్డిగారికి ఏదో అనుమానం వచ్చి, హాలులోకి వచ్చి బేరర్‌ను చివాట్లు పెట్టారు. సినీ రిపోర్టరుగా ఉండగా గుచ్చుకున్న మరో ముల్లు.. సినీ స్టూడియోలో ఓ సారి ఎస్వీ రంగారావుగారు ఎదురయ్యారు. రమణని పిలిచి చెంప ఛెళ్లు మనిపించారు..‘‘చూడు రమణా! పత్రికకూ, నీ ఆఫీసుకూ ఓ స్టేటస్ ఉంది. స్టార్‌గా నాకో దర్జా ఉంది. నువ్విలా మాసిన గడ్డంతో, కాల్చిన చిలకడదుంపలా రావడం ఇన్సల్టు. మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండవచ్చును గదా’’ అన్నారు ఎస్వీఆర్.. ఇలాంటి అనుభవమే ఒకసారి అక్కినేనితో ఎదురయింది. ఆయన ఏదో కబుర్లు చెబుతూ...‘రమణగారూ. కొన్ని తత్వాలే అంత. ఫరెగ్జాంపుల్, మిమ్మల్ని మార్చడం మీ దేవుడి తరం కాదు, మీకు కోటి రూపాయలిచ్చినా ఈ మురికి బట్టలే వేసుకుంటారు..’ రమణ కోపంతో రిటార్ట్ ఇచ్చారు..‘‘సార్. ఇవి నలిగిన బట్టలు కావచ్చుకాని, మురికివి మాత్రం కావు. నేను ఒకసారి కట్టివిడిచిన బట్టను ఉతికి ఆరేస్తేకాని కట్టను. మీరు మీ ప్యాంట్లూ, సిల్కు చొక్కాలూ తొడిగి విప్పాక, చిలక్కొయ్యకేస్తారు. పదేసి రోజులు అదే వాడుతారు. నాకున్నది ఒకటే జత. కాని ప్రతిరాత్రి ఉతికారేసుకుంటాను. తువ్వాలు కట్టుకుని పడుకుంటాను. నాకు సిగ్గులేదు కాని, పొగరుంది...’ నిరుద్యోగ విజయాలు, పాత్రికేయునిగా ఉద్యోగం రెండేళ్ల ‘నిరుద్యోగ విజయాలు’ తరువాత నాటి ప్రముఖ ఆంధ్రపత్రికలో పాత్రికేయునిగా ఉద్యోగం ముళ్లపూడిని వరించింది. పాత్రికేయునిగా తనదైన ముద్ర వేస్తూనే, కథారచయితగా ముళ్లపూడి తన సత్తా చూపారు. రెండుజెళ్ల సీతలూ, సీగానపెసూనాంబలు, బుడుగులూ, అప్పారావులూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి. గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశంలాగా, పానుగంటి జంఘాల శాస్త్రిలాగా ముళ్లపూడి సృష్టించిన అప్పారావు పుస్తకాల పుటల నుంచి వచ్చి, తెలుగువారి జీవితంలోకి చొరబడ్డాడు. (చదవండి: వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ?) తాగింది కావేరి జలాలు, ఉపాసించింది గోదావరి జలాలు తుది వరకు మద్రాసులోనే జీవించినా, ఆయన ధ్యాస, యాస, శ్వాస గోదావరి చుట్టుతానే తిరిగింది. తన 14 ఏటా నుంచి నేస్తం అయిన బాపుతో కలసి నిర్మించిన సాక్షి, అందాలరాముడు, ముత్యాలముగ్గు, స్నేహం, బుద్ధిమంతుడు మొదలైన సినిమాలు ఈ గడ్డనే పురుడు పోసుకున్నాయి. ఈ మాండలికమే ఆ పాత్రలు మాట్లాడాయి.. ఆరుద్ర చెప్పినట్లు ‘‘హాస్యం ముళ్లపూడి వాడి, వేడి తాకిడికి ఈ డేరింది’’ అనడంలో అతిశయోక్తి లేదు. (చదవండి: పిల్లనగ్రోవికి ఒళ్లంతా గేయాలే) -
నిష్కర్ష విమర్శకుడు!
నేను అనే స్వోత్కర్షలేని సాదాతనం; మాటల్లోనూ, చేతల్లోనూ ద్వంద్వాలు లేని వ్యక్తిత్వం; జీవితంలోనూ, బోధనలోనూ ఉన్నత ప్రమాణాలను లక్ష్యించి ఆచరించిన ఆదర్శం; ఏది చదివినా, రాసినా లోనారసి పరిశీలనం; వివేచనం పరిశోధనం; వీటన్నిటి మూర్తిమత్వం ప్రస్ఫుటించిన ఆచార్యులు కేకే రంగనాథాచార్యులు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, తెలుగు శాఖాధిపతిగా, మానవీయ విభాగం డీన్‌గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, ఆరుద్రలను దగ్గరగా ఎరిగి, దిగంబర, విప్లవ కవులతో సన్నిహితంగా ఉండి, వారి తాత్విక దృక్పథాలను తనదైన చూపుతో విశ్లేషించారు. 2021 మే 15 దాకా నిశ్చలంగా భాషా సాహిత్యాల గురించి బహుముఖీన ఆలోచనలు చేస్తూనే తనువు చాలించారు. మార్క్సిస్ట్ సామాజిక దృక్పథంతో పురాణయుగం నుంచి స్త్రీవాద, దళిత సాహిత్య దశల వరకూ చారిత్రక భూమికని పట్టి చూపిన విమర్శకుడు. హేతువాద, ప్రజాస్వామిక సంస్కృతిని ఆచరించి చూపిన ఆచరణవాది. ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంపై ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వేదికపై దశాబ్ద కాలానికి పైగా సమావేశాలు నిర్వహించి ప్రముఖులచే ప్రసంగాలు చేయించి, వాటిని సంకలనాలుగా తెచ్చిన రంగనాథాచార్యుల కృషి మరువరానిది. (క్లిక్: తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్) ‘తెలుగు సాహిత్యం– మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’, ‘తెలుగు సాహిత్య వికాసం’, ‘తెలుగు సాహిత్యం–చారిత్రక భూమిక’, ‘సామయిక వ్యాసాలు’, ‘బహుముఖం’, ‘తెలుగు భాష సంగ్రహ స్వరూపం వంటి రచనలు ఆయన పరిశోధన పరిశ్రమను చూపిస్తాయి. ఆయా గ్రంథాలకు ఆయన రాసిన విపుల పీఠికలు విమర్శకులకు, పరిశోధకులకు కరదీపికల వంటివి. ఏ ధోరణినైనా ఏ ఉద్యమాన్నైనా సమగ్ర దృష్టితో దర్శించడం, తులనాత్మకంగా పరిశీలించడం, చారిత్రక పరిణామ దృక్పథంతో వివేచించడం, అంచనా వేయడం అనే విమర్శన కృత్యాన్ని నిరంతరం నిర్వహించారు. ఆయన ఏది మాట్లాడినా, బోధించినా, రాసినా అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన ఉపన్యాసాలు, రచనలు ఆలోచనాత్మకాలు, విజ్ఞాన సర్వస్వాలు! – కొల్లు వెంకటేశ్వరరావు, ఖమ్మం (జూన్ 14న కేకే రంగనాథాచార్యుల జయంతి) -
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్‌లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి
స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్’ పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం) ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్ కపూర్ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. – డాక్టర్ పి.సి. సాయిబాబు, రీడర్ ఇన్ కామర్స్(విశ్రాంత) (మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి) -
కథాకథన చక్రవర్తి
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో ‘సంభాషణలు’ కథను వి(క)నిపి స్తాయి. దృశ్యమానమైన భాషాపర బంధాలు ఆయన ప్రత్యేకత. బహు గ్రంథ చదువరి. తెలుగు సాహిత్య జగత్తులో ‘శ్రీపాద’ ఏ వర్గా నికి ‘సరిపడని’ వారు. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలినవారు విడివిడిగా తీసుకొని తమ రచనా అజెండాలుగా చేసుకున్నారు. కానీ... శ్రీపాద వాటిని విడివిడిగా చూడలేదు. వేదగిరి రాంబాబు ‘తెలుగు జాతి, భాషల పట్ల అభిమానంతో సాహిత్య సహకారంతో, విశిష్ట సేవల్ని అందించిన అద్వితీయమూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి’ అంటారు. శ్రీపాద 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. 1891 ఏప్రిల్ 23న తూర్పు గోదావరి అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. 1961 ఫిబ్రవరి 25న రాజమండ్రిలో మరణించారు. తన అత్త కూతురునే వివాహం చేసుకున్నారు. ఆమె పేరు ‘సీత’. తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి ‘మహాలక్ష్మి సోదెమ్మ’. వైదిక విద్యలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి, స్మార్తం పూర్తి చేసి, తన పెద్దన్న దగ్గర రఘువంశ పాఠం నేర్చారు. తర్వాత సంస్కృత పాఠం కోసం గుంటూరు సీతారామశాస్త్రి దగ్గరకు ఊరు విడిచి ‘వల్లూరు’ వెళ్ళారు. ‘తెనుగులో మంచి పాండిత్యం సంపాదించాలి’ అని నిశ్చయించుకొన్న శ్రీపాద పట్టుదల తెలుగు అభిమానులకు షడ్రసోపేత సాహితి విందును అందించింది. ఆయన తన కథల్లో వినిపించే ‘సంస్కరణవాదం’ తెలుగు కథకు సువాసన లద్దింది. ఆయన కథల్లో శ్రీశ్రీ, చలం, విశ్వనాథ వంటివారి ‘వాదాల’ను పాఠకులు చూస్తారు. శ్రీపాద కథల్లో వివిధ సందర్భాల్లోని సంభాషణలు గమనిస్తే ఆయన స్త్రీల విషయంలో ఎంత బలీయమైన అభి ప్రాయంతో తన రచనల్లో ఆయా పాత్రలను చిత్రించారో అర్థమవుతుంది. శ్రీపాద రాసిన 75 చిన్న కథల్లో ప్రతీదీ సమాజ దర్పణంగానే నిలిచింది. ‘కలుపు మొక్కలు’, ‘గులాబి అత్తరు’, ‘అరికాళ్ళ క్రింద మంటలు’, ‘ఇలాంటి తవ్వాయి వస్తే’, ‘గుర్రప్పందేలు’, ‘గూడు మారిన కొత్తరికం’, ‘విమానం ఎక్కబోతూనూ’, ‘తాపి మేస్త్రీ’, ‘రామదీక్షితులు బి.ఎ.’, ‘పుల్లంపేట జరీచీర’, ‘జూనియర్ కాదు’, ‘అల్లుడు’, ‘రామలక్ష్మి’ ఇలా ప్రతీ కథకూ దాని గొప్పతనం దానిదే అని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనుసు, మెదడు విశాలమవుతాయి. మల్లాది రామకృష్ణశాస్త్రి ‘తెలుగు వాళ్ళకి మాత్రమే శ్రీపాద వారి కథలు చదివే అదృష్ట ముంద’న్నారు. గొప్ప సత్యమిది. ‘వైదిక పరిభాష’, ‘ఆయుర్వేద యోగ వైద్య ముక్తావళి’ లాంటి వైద్య గ్రంథాలు; భాషకి సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాశారు. ‘ప్రేమపాశం’, ‘నిగళ బంధనం’, ‘రాజ రాజు’, ‘కలం పోటు’ వంటి నాటకాలు, నాటికలు రాసారు. రామాయణం, మహాభారతాలను సహితం తనదైన దృక్కోణం నుంచి రస్మాతకంగా తీర్చిది ద్దారు. ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆయన తన అత్మ కథను ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’గా రాశారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రికను నిర్వహించారు. ‘గిడుగు’ లాగానే భాషావాది. అనేక ‘అష్టా వధానాలు’ చేశారు. 1956లో కనకాభిషేకం కూడా అందుకున్నారు. (క్లిక్: ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం) ‘మనసు ఫౌండేషన్’ వారు శ్రీపాద వారి సర్వ లభ్య రచలనూ నాలుగు సంపుటాలుగా వెలువరించి తెలుగు పాఠకలోకానికి మేలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. - భమిడిపాటి గౌరీశంకర్ వ్యాసకర్త కథా రచయిత (ఏప్రిల్ 23న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి) -
‘విమర్శ’ సామాజిక బాధ్యతగా...
సాహిత్య విమర్శను తన సామాజిక బాధ్యతగా గుర్తెరిగి నిబద్ధతా నిజాయితీలతో వ్యవహరించిన డా. కడియాల రామమోహన్ రాయ్ గుంటూరులో ఏప్రిల్ 6న తుది శ్వాస విడిచారు. కొన్ని వందల సాహిత్యవ్యాసాలు, ఆరువందల పైచిలుకు గ్రంథ సమీక్షలు, శతాధిక రేడియో ప్రసంగాలు రామమోహన్ రాయ్ నిరంతర సాహిత్య కృషికి అద్దం పడతాయి. వీరు రాసిన ‘తెలుగు కవితా వికాసం’, ‘కృష్ణశాస్త్రి కవితా వైభవం’, ‘20వ శతాబ్ది తెలుగు కవిత్వం’, ‘గుంటూరి శేషేంద్ర శర్మ’, ‘ఉత్తరాంధ్ర నవలా వికాసం’, ‘కృష్ణశాస్త్రి కవితావైభవం’, ‘పదమూడు ఉత్తమ కథలు’, ‘శ్రీశ్రీ రచనల ప్రభావం’ వంటి గ్రంథాలు ఆంధ్ర పాఠకులు మరువలేరు. 1983లో వీరు సమర్పించిన ‘తెలుగు సాహిత్యంలో కృషీవల జీవనం’ అన్న గ్రంథానికి నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రసాదించింది. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ విమర్శ పురస్కారం పొందారు. ఆయన 1944 ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి కడియాల భద్రయ్య, తల్లి కమల. తండ్రి నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి కావడం వల్ల ఆయన ప్రభావం రామమోహన్ రాయ్‌పై పడింది. గుంటూరు హిందూ కళాశాలలో బీఏ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు) చదివారు. గుంటూరు జేకేసీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. వీరికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వారి ఉత్తమ విమర్శక పురస్కారం, 2017లో నవ్యాంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి భాషా పురస్కారం, 2018లో అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శా పురస్కారం లభించాయి. (చదవండి: ప్రజాస్వామ్యమే అంబేడ్కర్ భావసారం) రాయ్ రాసిన ‘మన తెలుగు నవలలు’ తెలుగు నవలా ప్రియులకు కరదీపికగా నిలుస్తుంది. ‘తెలుగు సాహిత్యంలో రైతు జీవితం’, ‘ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్య వికాసం’, ‘వెయ్యేళ్ల తెలుగు పద్య వికాసం – సమగ్ర పరిశోధన’, ‘మన తెలుగు నాటకాలు – నాటికలు’ వంటి గ్రంథాలు ఇంకా ప్రచురణకు నోచుకోలేదు. 78 సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా సాహిత్య సభల్లో పాల్గొని అనర్గళంగా ప్రసంగించేవారు. రామమోహన్ రాయ్ మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. (చదవండి: ఎంవీఆర్..ఆయనే ఒక చరిత్ర) – డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు -
కళ్లు తెరిపించే కథా రచయిత్రి
సమకాలీన తెలుగు సాహిత్యంలో రచయిత్రిగా పి.సత్యవతి స్థానం ప్రత్యేకమైనది. కథలు, నవలలు, సాహిత్య సమీక్ష వ్యాసాలు వ్రాశారు. అనువాదాలు కూడా చేశారు. ఏ ప్రక్రియ చేపట్టినా, స్త్రీ జీవితమే ప్రధానంగా రచనలు చేస్తూ వచ్చారు. ఆమె వ్రాసిన ‘ఇల్లలకగానే’ కథ తెలుగు కథాసాహిత్యంలోనే మైలురాయిగా నిలిచిపోతుంది. రచయిత్రిగా పలు అవార్డులు, సత్కారాలు పొందిన పి.సత్యవతికి ఇటీవల ‘కువెంపు జాతీయ పురస్కారం’ లభించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పాఠకుల కోసం ఆమెను ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూ... పి. సత్యవతి ప్రధానంగా కథా రచయిత్రి. నవలలు వ్రాశారు. అనువాదాలు చేశారు. సాహిత్య సమీక్షా వ్యాసాలు ప్రచురించారు. ప్రక్రియ ఏదైనా స్త్రీ జీవితమే అన్నిటికీ కేంద్రబిందువు. కుటుంబం మొదలుకొని ప్రపంచీకరణ సంస్కృతి వరకు స్త్రీల జీవితాన్ని హింసామయం చేస్తున్న వ్యవస్థలను గుర్తించి గురిచూడటమే ఆమె సాహిత్యతత్వం. తల్లి చదువుకోటానికి లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తీసుకొచ్చే అలవాటు, తండ్రి శిక్షణ హైస్కూల్ చదువులనాటికే ఆమెలో సాహిత్య అధ్యయన ఆసక్తులు స్థిరపడటానికి కారణం అయ్యాయి. మాలతీ చందూర్, కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి రచయితలను ఇష్టంగా చదువుకొన్నారు. హైదరాబాద్‌లో మేనమామగారింట ఉండి చదువుకొన్న కాలంలో ఇంగ్లీష్ సాహిత్య అధ్యయనం పెరిగింది. నిరంతర అధ్యయనం వల్ల ఏర్పడిన కొత్త చూపు, తన జీవితంతో సహా చుట్టూ జీవితాలను నిశితంగా పరిశీలించే గుణం వల్ల సాంద్రమైన అనుభవ కోణం ఆమె కథా బలం. జీవితం, ఘటనలు, మనుషులు, ప్రవృత్తులు, ప్రవర్తనలు, పరిణామాలు ఒత్తిడి పెడితే తప్ప వ్రాయని రచయిత కనుక ఆమె కథలలో గాఢత ఉంటుంది. జీవితాన్ని ప్రేమించే మనిషి కనుక కథను నిర్మించటంలో, నిర్వహించటంలో సున్నితత్వం ఉంటుంది. జీవితం ఎంత కష్టభూయిష్టం అయింది అయినప్పటికీ మంచికి దానిని మార్చుకొనే చేవ పొందటానికి మనుషులు ఎవరి పరిధిలో వాళ్ళు ప్రయత్నపరులు కావాలనే సందేశాన్ని ఇస్తుంటాయి అవి. ఇరవైఏళ్ల వయసులో ప్రారంభమైన సత్యవతి సాహితీ సృజన శక్తుల విన్యాసం షష్టిపూర్తి వేళ కూడా నవయౌవన ఆరోగ్యంతో తళతళ లాడుతూనే ఉంది. అప్పటికి ఎనిమిదేళ్లుగా మహిళా జనజీవన సమస్యల అధ్యయన, ఆచరణ మార్గంలో నడుస్తున్న నేను 1990 ఇల్లలకగానే కథ చదివి సహజంగానే సత్యవతి గారితో ప్రేమలో పడ్డాను. ఆ తరువాత మంచి స్నేహితులమూ అయ్యాము. స్త్రీ తనను తాను తెలుసుకొని తనను తాను నిర్వచించుకొనే స్వీయ సత్తా సంపాదించు కొనాలనే విషయం పట్ల అవగాహన కలిగించటానికి ఎన్ని సభలలో , ఎన్ని తరగతి గదులలో ఇల్లలకగానే కథను పాఠంగా చెప్పానో లెక్కలేదు. తెలుగు కథా సాహిత్యంలో అది ఒక మాగ్నమ్ ఓపస్. ఈ కథకు ముప్ఫయి ఏళ్ల ముందు ముప్ఫయి ఏళ్ల తరువాత సత్యవతి కథా ప్రపంచం విస్తరించి ఉంది. ప్రతిష్ఠాత్మక కువెంపు జాతీయ పురస్కారం అందుకొంటున్నవేళ ‘సాక్షి’ పక్షాన ఆమెతో స్నేహ సంభాషణ నాకు సంతోషకరం. సత్యవతిగారూ నమస్కారమండీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితం మీది. ఈ కృషికి గాను మీరు ఇదివరకు ఎన్నో పురస్కారాలను అందుకొన్నారు. ఇప్పుడు కువెంపు జాతీయ పురస్కారం వరించిన సందర్భంలో మీ అనుభూతి ఏమిటి? చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా కువెంపు గారు సంచరిచిన ప్రదేశం చూడడం, అక్కడి గాలి పీల్చడం నా కొచ్చిన అద్భుతమైన అవకాశంగా భావిస్తునాను. ఒక గొప్ప కవి పేరుమీద పురస్కారం అందుకోడం చాలా ఆనందం కదా! వ్యక్తిగతం అంతా రాజకీయమే అన్న స్త్రీవాద సూత్రం తెలిసి రాసినట్లు ఉంటాయి మీ కథలు. స్త్రీవాదం మీ కథల చోదకశక్తి ఎప్పటినుండి అయింది? ఎలా? ముందు నుంచి నేను స్త్రీ కేంద్రక కథలే ఎక్కువ వ్రాశాను. నాకు తెలిసిన, నేను చూసిన స్త్రీల అనుభవాలు కథలుగా రాశాను. అయితే స్త్రీవాదం నాకు సిద్ధాంతంగా తెలిసి వచ్చింది మాత్రం ఆంధ్ర దేశంలో అంటే తెలుగు లో స్త్రీ వాద సాహిత్యం ఒక అలలాగా వచ్చిన 80 వ దశకంలోనే. నేను ఆ కవితలనీ కథలనూ చదివి స్త్రీవాద సిద్ధాంతాలను అధ్యయనం చెయ్యడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నేను స్త్రీల జీవితాల మీద దృష్టి పెట్టాను. సమస్యల మూలాలను తెలుసుకోడం మొదలు పెట్టాను. స్త్రీల జీవితాన్ని హక్కుల స్పృహతో కథా వస్తువును చేయటానికి మిమ్మల్ని ప్రభావితం చేసినది స్త్రీవాదమే కదా! స్త్రీవాదంతో మీ పరిచయం ఎప్పటినుండి? అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? ఇందాక చెప్పినట్లు స్త్రీ వాదంతో నా పరిచయం అధ్యయనం 80ల తరువాతే. అయితే 90లో నేను ద సెకండ్ సెక్స్ చదివాను. ఆ తరువాత వరుసగా సెకండ్ వేవ్ ఫెమినిజంలో ప్రఖ్యాతమైన పుస్తకాలు కొనుక్కుని చదివాను. సెకండ్ సెక్స్ చాలా ప్రభావవంతమైన పుస్తకం. ఇప్పుడు ఫెమినిజం ఆ స్థాయిలన్నీ గడిచింది. ఇంటర్ సెక్షనాలిటీ మొదలైన అంశాలన్నీ ముందుకొచ్చాయి. ఏది ఏమైనా హక్కులతో పాటు తనను గురించిన బాధ్యత కూడా తను తీసుకోగల స్థాయికి స్త్రీలు ఎదగడానికి పోరాడాలి. తనను తను ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఇల్లలకగానే కథ ద సెకండ్ సెక్స్ చదివాక వ్రాశారా? సెకండ్ సెక్స్ ప్రభావవంతమైన పుస్తకం అన్నారు. ఆ ప్రభావశీలత గురించి కాస్త వివరిస్తారా? ఈ కథ నిజానికి చదవక ముందు వ్రాసినదే. అనేకమంది స్త్రీలను చూసి వ్రాసినది. 90లో వచ్చింది. మీ కథలలో స్త్రీవాదానికి ప్రాతినిధ్య కథలు ఏవని మీరనుకొంటారు? ఇల్లలకగానే, సూపర్ మామ్ సిండ్రోం, దమయంతి కూతురు, గాంధారి రాగం ఇట్లా ... మధ్యతరగతి స్త్రీ కేంద్రంగా భిన్న వ్యాసార్ధాలతో గీసిన చైతన్య వృత్తాలు మీ కథలు అనిపిస్తుంది. ఆ దృష్ట్యా వాటిలో మీరు ఉత్తమం అనుకొనేవి ఏవి? నేను నాకు తెలిసిన జీవితాలనే నాకున్న పరిధి మేరకే వ్రాశాను. స్థల కాలాలకు అతీతంగా వ్రాయలేదు. పాఠకులు ఎక్కువగా కనెక్ట్ అయిన కథే నాకూ బాగా నచ్చిన కథ. ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేను. ఎవరి కథలు వారికి ముద్దు కదా? మీ కథలు కొన్నిటిలో శ్రామిక వర్గ స్త్రీల జీవితాలు కనిపిస్తాయి. వాటికి అవి స్వతంత్రాలా లేక మధ్యతరగతి స్త్రీల జీవిత సాపేక్షతలో భాగమా? వాటికి అవి ప్రత్యేకమే. స్వర్ణ అనే అమ్మాయి ప్రధాన పాత్రగా వ్రాసిన కథలన్నీ శ్రామిక వర్గానికి చెందినవే . సమాజంలో ఒక వర్గం ఎప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు సాగకుండా వుంటుంది. అనేక పథకాలు వున్నా ఆ వర్గపు ఆడపిల్లల జీవితం మెరుగు పడటం లేదు. అందుకు కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. కొన్ని అంటే, సీపురు, సప్తవర్ణ సమ్మిశ్రితం లాంటివి మధ్యతరగతి జీవిత సాపేక్షతలో భాగం కావచ్చు. మీరు ఏడు నవలలు వ్రాశారు కదా? వాటిలో గొడుగు నవలను తప్ప మరి దేనినీ మీరు ఓన్ చేసుకోరు అన్న మాట ఎక్కడో చదివాను. అది నిజమేనా? ఎందువల్ల? కాస్త వివరిస్తారా? ఆ నవలలన్నీ 90ల ముందువి. నవలా రచన గురించి ఏ మాత్రం తెలుసుకోని సందర్భం... వాటిని ఇంకా బాగా వ్రాయొచ్చు అనిపిస్తుంది. గొడుగు నవల కూడా 1990 కి ముందుదే కదా! అవును. 1978 లో వచ్చింది. గొడుగు కూడా ఇప్పుడు వ్రాస్తే ఇంకొంచెం మంచిగా వ్రాయగలనేమో! అప్పటికి ఆ వస్తువు, ఆ జీవితం నేను దగ్గరగా చూసినది కనుక ఆ నవలన్నా అందులో ప్రధాన పాత్ర అన్నా నాకు చాలా ఇష్టం. స్త్రీల జీవితాలలోని అసంతృప్తుల ఒత్తిడి , వాటి నుండి విముక్తికి వెతుక్కొనే దోవలు, వేసే తప్పటడుగులు, అన్నీ తెలిసి పరువు కోసం నిలుపుకొనే కాపురాలు ఎన్నో ఉన్నాయి. అవి కావ్యవస్తువు కాలేకపోయాయి. గొడుగు నవలలో దానిని చూపించగలిగాను. 1990ల తరువాత కూడా దాని ప్రాసంగికత వుంది అనిపిస్తుంది. అప్ప టికీ ఇప్పటికీ స్త్రీలు కొంచమైనా మారారు. సమాజంలో కూడా మార్పు వచ్చింది. నాకు క్లుప్తత అలవాటు. అందుకే కథ వ్రాయడం సులువు. నవల వ్రాయలేను. మీరు ఇస్మత్ చుగ్తాయ్, ఒక హిజ్రా ఆత్మకథ వంటి అనేక అనువాదాలు చేశారు. ప్రపంచ వ్యాపిత స్త్రీవాద సిద్ధాంతకర్తలను తెలుగువాళ్ళకు సరళ సుందరంగా పరిచయం చేశారు. సాహిత్య విమర్శలు వ్రాశారు. ఇలా భిన్నప్రక్రియలలో అభినివేశం మీ ఆంగ్ల అధ్యాపక వృత్తి లక్షణమా కాక నిర్దిష్ట సాహిత్య ప్రయోజన లక్షితమా ? అనువాదాలు ఇష్టపడి చేశాను. ఆంగ్ల అధ్యాపక వృత్తికీ నా సాహిత్య సృజనకీ సంబంధం లేదు. మొదటినుంచీ నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం. నేను నా మేనమామ ఇంట్లో వుండి చదువుకున్నాను. ఆయన ఇంగ్లీష్ అధ్యాపకుడు. మంచి చదువరి. అప్పటినుంచీ నేను ఇంగ్లీష్ నవలలు అవీ ఎక్కువ చదివేదాన్ని. స్త్రీవాద సాహిత్య గ్రంథాలు చదినప్పుడు అవి మన పాఠకులకి పరిచయం చెయ్యాలనిపించింది. భూమిక పత్రికలో వరుసగా వ్రాశాను. సరళంగా చెబితేనే అర్థం అవుతాయని ఆ ప్రత్యేకమైన పరిభాష వాడలేదు. మీరు స్త్రీవాద సిద్ధాంత రచనలు పరిచయం చేయటమే కాదు. తెలుగులో కథలు నవలలు వ్రాసిన స్త్రీలను పరిచయం చేస్తూ వ్యాసాలు కూడా వ్రాసారు.ఇదంతా ‘సిస్టర్ హుడ్’ భావన ను ఆచరణాత్మకం చేయటం అనవచ్చా? మీ కథలలో కూడా అది అంతర్భాగమే కదా! అవును. స్త్రీలమధ్య సహకారం స్నేహం వుండాలని నా ఆకాంక్ష. స్త్రీల మధ్యే కాదు, స్త్రీ పురుషుల మధ్య కూడా. పతిభక్తి కథలో మతం, ఆచారాలు స్త్రీల మీద ఎంత బరువై కూర్చుంటున్నాయో అలవోకగా చెప్పారు. జెండర్ అణచివేతలో కులం, మతం వహిస్తున్న పాత్ర గురించి కాస్త వివరిస్తారా? ఈ కోణం నుండి వ్రాయవలసిన కథల గురించి కూడా సూచించండి. ఇళ్ళల్లో సంప్రదాయపరంగా జరిగే క్రతువుల గురించి కూడా స్త్రీలే భారం వహించాలి. సంప్రదాయాలంటూ ఇంకా వాళ్ళమీద అనేక బాధాకరమైన ఆచారాలు రుద్దుతున్నారు. ఇందులో స్త్రీలు కూడా పాత్ర వహించడం చూస్తే వాళ్ళ మెదళ్ళు ఎంతగా నియంత్రించబడ్డాయో అర్థమౌతుంది. ఈ మధ్య ప్రవచనాల పేరిట మతపరమైన నమ్మకాలని బాగా ఎక్కిస్తున్నారనిపిస్తున్నది. స్త్రీలు, అందునా మధ్య తరగతి, ఆపై తరగతి స్త్రీలు చేసే వేడుకలు, బాగా ఖర్చుపెట్టి చేసే పెళ్ళిళ్ళూ, అలంకరణలు చూసినప్పుడు, జాతకాలూ జ్యోతిష్యాల వెనక పడుతున్నప్పుడు ఇన్ని వ్రాసిన, ఇంత పోరాడిన అన్ని తరాల స్త్రీల కష్టం తలచుకుంటే బాధ అనిపిస్తుంది. ఈ మాయ నుంచి ఎలా బయట పడతారా అనిపిస్తుంది. మాయపొరలు చీల్చేందుకు ఎన్ని కథలైనా రావాల్సే ఉంది. సత్యవతిగారూ పితృస్వామ్య మాయ దగ్గరనుండి, ప్రపంచీకరణ మాయను, వస్తువినిమయ మాయను, హిందుత్వ మాయను బద్దలు కొట్టటానికి నిరంతర కథా దీప ధారులైన మీతో ఈ సంభాషణ ఎంతో బాగుందండి. మీ సమయాన్ని ‘సాక్షి’ పాఠకుల కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. - కాత్యాయనీ విద్మహే -
‘శప్తభూమి’కి సాహిత్య అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు ఈ గౌరవం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను బుధవారం ప్రకటించింది. 7 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 లఘు కథలు, 4 వ్యాసాలు, ఒక నాన్ ఫిక్షన్, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక బయోగ్రఫీని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు అకాడెమీ తెలిపింది. 23 భారతీయ భాషలలో జ్యూరీ సభ్యులు సిఫారసు చేసిన రచనలను అకాడెమీ కార్యనిర్వాహక బోర్డు ఆమోదించి అవార్డులను ప్రకటించింది. తెలుగులో కేతు విశ్వనాథరెడ్డి, శీలా వీర్రాజు, డాక్టర్ వి.చినవీరభద్రుడు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. బండి నారాయణస్వామి రాయలసీమ రచయితగా గుర్తింపు పొందారు. శప్తభూమి అంటే శాపగ్రస్త ప్రదేశమని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా, గడ్డం మోహన్‌రావు రాసిన ‘కొంగవాలు కత్తి’నవలకు అకాడెమీ యువ పురస్కార్ లభించింది. ‘తాత మాట వరాల మూట’రచనకు గాను బెలగం భీమేశ్వరరావుకు అకాడెమీ ‘బాల సాహిత్య పురస్కారం’ప్రకటించింది. ధరూర్ పుస్తకం, నంది కిశోర్ కవిత కాంగ్రెస్ నేత, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద కిశోర్ ఆచార్య తదితర 23 మంది రచయితలున్నారు. థరూర్ ఆంగ్లంలో రాసిన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్’పుస్తకం, నందకిశోర్ ఆచార్య హిందీలో రాసిన ‘చలాతే హుయే ఆప్నే కో’కవితకు ఈ పురస్కారం లభించింది. విజేతలకు వచ్చే ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తామ్ర పత్రంతోపాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుడిగా, రచయితగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఆయన చేసిన రచనలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని అన్నారు. -
జ్ఞాపకాల బుల్లెట్
ఎన్నిసార్లో కామాయీ, తల్లీ, చిన్న తమ్ముడూ ఆ చెరువొడ్డున కూర్చుని వణ్ణం తిన్నారు. అదంతా జ్ఞాపకమొచ్చింది. వాళ్ళమ్మా, తమ్ముడూ, వణ్ణమూ, మెరపకాయల కారమూ, కాల్చిన రొయ్యిలూ అన్నీ జ్ఞాపకమొచ్చాయి. కంకిపాటి కామాయికి ఇన్ఫెంట్రీలో ఇచ్చిన పేరు ప్రయివేటు సిపాయి నంబరు 58310 అని. ఆ చుట్టుగోడలో వున్న కంతలోంచి దూరి ఇవతల పడ్డాడు. బోర్ల నుంచి వెల్లకిల తిరిగాడు. ఆ వెధవ మణిపూరు రోడ్డు – కొండలూ, గుట్టలూ, పైగా ఎనిమీ కట్టే అడ్డుగోడలూ! సూర్యుని కిరణాలు కామాయి బుగ్గల మీద తాండవిస్తుంటే ఆ చలికాలంలో వాడికి హాయిగా వున్నది. వాడనుకోవడం – ఆ గోడ కంతలోంచి దూరి హాయిగా ఇవతల పడ్డానని. ‘‘ఆ! యేడిసినట్టుంది. గౌహటీ నుంచి బయల్దేరి నవుగామ్ కొచ్చాం. ఆడనుంచి మణిపూరెళుతుండాం. నా కాలికేదో తగిలి నేనీడ పడ్డాను. యారయినా యింటే నవ్వుతారు. లేచీ మిగతావోళ్ళను కలుసుకోవాల. ఆళ్ళీపాటి కవతల కొండమీదకి పోయుంటారు’’ అనుకున్నాడు కామాయి. చేతులూ కాళ్ళూ కదలడం లేదు. లేవాలని ఎంతో ప్రయత్నించాడు. దుఢీలున మహా భయం వేసింది వాడికి. సూర్యకిరణా లాగిపోయాయన్నట్లుగా వాడి శరీరమంతా చల్లబడడ మారంభించేసరికి వాడికి మహా గాభరా వేసింది. ‘‘అరే దేముడా! ఓ యాల నేనూ ఓ యాల నేనూ; కాదు కాదు’’ అని మళ్ళీ శాంతపడ్డాడు. ‘‘ఆ పడ్డంలో యెక్కడో బెణికింది గామోసు, అందుకనే లేవలేక పోతుండా’’ అనుకున్నాడు. కొంచెం సేపటికి వాడి శరీరంలో ఉన్న చల్లదనం పోయింది. సూర్యకిరణాల వేడికి మళ్ళీ హాయి పొందుతున్నాడు కామాయి. అదంతా అసలు సీఓ తప్పు. లేకపోతే ఏమిటి మరి? వాళ్ళందర్నీ సెలవ కిండ్లకు పంపిస్తానన్నాడు. వారం రోజులైనా కాలేదు, యేక్షన్లోకి పోవాలన్నాడు. ఇండ్ల మీద ప్రాణాలు పెట్టుకున్నవాళ్ళు ఎట్లా ఆ వెధవ మణిపూరు రోడ్డు మీద బార్బుడు వైరు వెనక పాకులాడుతూ పోతారు? ఆ పనిమీద మనసెలా వుంటుంది? న్యాయం కాదు. ఆ మొదటి కొండ పక్కనుంచి ఆ గ్రామం గుండా గోడల సందుల్లో బోర్లపడి పాకులాడుతూ పోయినప్పుడంత కష్టంగా లేదు. అప్పుడు ముందర బోడిరాము డుండేవాడు. వాడి తలకాయి చూసుకుంటూ పాకాడు కామాయి. పాపం చాలా మంచివాడు బోడిరాముడు. ఎన్ని బాంబులు పడుతున్నా వాడి యాసలో వాడు ఏవేవో చమత్కారాలాడుతూ ఆ వున్నవాళ్ళ ధైర్యం పోకుండా చూసేవాడు. అదైపోయింది. అసలు నాటకం – లేచి ఆ చుట్టూ గోడ పక్కనుంచి పాకులాడుతూ పోవాలని ఆర్డరొచ్చింది. కామాయి వెంటనే ఎదుట చూడంగానే గోడలో మనిషి దూరేంత కంత వుంది. మహా అదృష్టవంతుణ్ణనుకున్నాడు. దూరి అవతలకు పోతే ఫస్టు అనుకున్నాడు. అక్కడ్నుంచీ పాకటం ఉండదనుకున్నాడు. వాడి కోసమే ప్రత్యేకం, ఆ కంత ఉందనుకున్నాడు. దభాలున దూకాడు. అయితే కాళ్ళమీద లేవాల్సింది మొఖం బోర్లా పడ్డాడు – ఆ యెత్తు నుంచి! ఆశ్చర్యం! ఆ దూకబోయే ముందర ఓసారి చుట్టూ చూశాడు. కంకిపాటి చెరువల్లే ఓ చెరువూ, అక్కడ మోస్తరే ఓ వరిపొలం కనబడ్డాయి. ఆశ్చర్యం సుమా! ప్రపంచంలో రెండుచోట్ల ఒకే మాదిరుండడం. ఎన్నిసార్లో కామాయీ, తల్లీ, చిన్న తమ్ముడూ ఆ చెరువొడ్డున కూర్చుని వణ్ణం తిన్నారు. అదంతా జ్ఞాపకమొచ్చింది. వాళ్ళమ్మా, తమ్ముడూ, వణ్ణమూ, మెరపకాయల కారమూ, కాల్చిన రొయ్యిలూ అన్నీ జ్ఞాపకమొచ్చాయి. పాపం ఎన్నిసార్లు వాళ్ళమ్మ ఎండలో ఆ పొలంలో చమటలు కమ్ముతూ పని చేయలేదు? నిజం – అదంతా కళ్ళకు కట్టినట్లు కనపడ్డాది వాడికి – ఆ గొంతుకలు కూడా వినబడ్డాయి. నిజంగా ఆ గొంతుకలు వినబడ్డాయి. తమ్ముడు చెట్టెక్కాడు. ‘‘రేయి నీ జిమ్మ తియ్యా! ఆ వున్న ఒక్క గంతా సింపుకుంటావు. దిగి రాయేంరా!’’ అనేది అమ్మ. కామాయి చెర్లో చేపలు పడుతుంటే ‘‘రాయేంరా! ఈ మట్టి తియ్యాలి రారా!’’ అనేది. వాళ్ళు ముగ్గురే! ఆ గ్రామంలో ఇంకా వున్నారు గాని వీళ్ళ ముగ్గురికీ వీళ్ళు ముగ్గురే అన్నట్లుండేది. అప్పుడే – అప్పుడే సుబ్బిని కలిశాడు కామాయి. సుబ్బిని కలిసిం తర్వాత మారాడు. అప్పట్నుంచీ అమ్మా కాదు, తమ్ముడూ కాదు – ప్రపంచమంతా సుబ్బే! సుబ్బి ఇప్పుడుంటే ఎంతిచ్చుకోడు? ఆ నున్నగా, నల్లగా చంపలమీదానిస్తే ఏమివ్వడు? పక్కన పడుకుంటే చాలు – ఆ గుండెలో వేత్తున్న నొప్పంతా పోతుంది. ఆ గుండెలో నొప్పి, మొఖం మీద మంటా వాడ్ని ముందుకు లాక్కెళ్ళుతున్నాయి – సుబ్బిని కలుసుకోడానికి. అవును సీఓ లీవిస్తానన్నాడు. వెళ్ళి సుబ్బిని పెండ్లాడవచ్చు. సుబ్బి పెండ్లాడుతుందా? కంకిపాటి సుబ్బి అవుతుందా? అయితే ఆ పొలం పక్కన, ఆ చెరువొడ్డున, ఆ వేపచెట్టు పక్కనున్న గడ్డివామి మద్దెన పడుకున్నప్పుడాడిన మాటలు మాటాడుతుందా? మళ్ళీ వొకసారి లేవడానికి ప్రయత్నించాడు కామాయి. ఉహు! ఏ అవయవమూ కదల్దే! పోనీలే. కదలకపోతే నేమాయె. ఇప్పుడు కదిల్తేనేం, కదలకపోతేనేం. అంతా అయిపోయినట్లుంది. ఏమిటా చీకటి? గ్రహణం పట్టిందా? గ్రహణంలో కదలకూడనివాళ్ళు గర్భిణీ స్త్రీలు. తాను సిపాయి. ఎందుకు కదలకూడదూ? మూతి బిగించి లేవబోయాడు. కదలలా! వాడికే నవ్వొచ్చింది. మెడ ఓ వైపు తిప్పాడు. ఆ చెరువు వొంక చూశాడు – నవ్వుతూ. శవాలను వెతుక్కుంటూ గాయపడ్డవాళ్ళను మోసుకెళ్ళే పార్టీ ఒకటక్కడికి వచ్చింది. వాళ్ళ లీడరు అటూ ఇటూ చూసి కామాయిని కనిపెట్టాడు. దగ్గరకు పోయాడు. చచ్చి చాలా సేపయిందనుకున్నాడు. ముఖం చూశాడు. ఆ వేపు చెరువును చూస్తునట్లుగా వుంది. పెదిమల మీద చిర్నవ్వుంది. లీడరు కామాయి బ్లవుజు విప్పాడు. మెళ్ళో ఉన్న రెండు ఐడెంటిటీ డిస్కులు చూశాడు. చదివాడు. కంకిపాటి కామాయి – నంబరు 58310 అని వుంది. ఎదురుగా కొండ వేపు చూశాడు. కామాయి పుర్రెలో వున్న గుండు దెబ్బ చూశాడు. ‘‘ఈడీ కంతలోంచి ఈతలికి సూసేసరికాదెబ్బ తగిలుంటుందిరా. ఇంటికి ఐడెంటిటీ తీస్కోండి. ఆ తర్వాత ఏదైనా వస్తుంది!’’ అని తక్కిన వాళ్ళతో అన్నాడు. శవం నక్కల పాలైంది. శిష్టా ఉమామహేశ్వరరావు కథ ‘పడిపోయిన సిపాయి’ ఇది. తెలుగులో సైన్యం నేపథ్యంలో రచనలు చేసిన అరుదైన రచయిత శిష్టా. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేశారాయన. ‘సిపాయి కథలు’ కథాసంపుటి. వీటి ప్రచురణ 1946–1948. ఆకాశవాణి కథలు మరో సంపుటి. కథకుడిగా కన్నా కవిగా ఎక్కువ చర్చల్లోకి వచ్చాడు. విష్ణు ధనువు, నవమి చిలుక ఆయన కవితాసంపుటాలు. అతి నవీనుల్లో నవీనుడు అనీ, కవిత్వంలో రౌడీవేషం అనీ, వ్యక్తిగత జీవితంలో అరాచకుడు అనీ అనిపించుకున్నాడు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితకు శిష్టా కవిత ‘మారో మారో మారో’ ప్రేరణ అని శ్రీశ్రీయే చెప్పుకున్నారు. శిష్టా జనన మరణ తేదీల్లో (1909–1953) కొంత సంశయాలు ఉన్నప్పటికీ చిన్న వయసులోనే మరణించాడన్నది మాత్రం విషాదకరంగా నిస్సంశయం. -
మానవాన్వేషి.. పాఠక కవి
‘‘అంతర్మథనంలో స్పందించిన నాలుగు రచనల్నీ, గాలిపటాల్లా ఎగరేసి, కాలాన్నీ మామతాన్నీ తట్టుకొని ఎన్ని నిలుస్తవో అన్నదే గమనించాలి ప్రతి పదాన్నీ పాదాన్నీ కాలం వస్త్రకాయితం పడుతుంది’’ – సి.వి.కృష్ణారావు ‘కల్పన’ లోంచి. మృత్యువంచులోని కొస వెలుతురుని కూడా జీవ శ్వాసగా బంధించి అక్షరాల్లోకి వంపుకున్న కవి ఆయన. సత్యనిష్ట కలిగిన కవి. ఆయన రాసిన ప్రతి వాక్యమూ ఆచరణలోంచి, స్వీయానుభవం లోనుంచి పలికిన జీవ కవిత్వం. సాధారణంగా అగుపడే ఆయన కవిత్వమంతా అసాధారణ అనుభవాల చిక్కదనాన్ని ప్రసారం చేసింది. తన వ్యక్తిత్వానికీ, కవిత్వానికీ మధ్య సరిహద్దు రేఖను ఆయన ఎప్పుడో చెరిపివేసుకొని జీవించాడు. ‘వైతరణి’, ‘మాది మీ వూరే మహరాజ కుమారా’, ‘అవిశ్రాంతం’, ‘కిల్లారి’ కవిత్వ సంకలనాలలో తను ఆకాంక్షించిన మానవీయ అస్తిత్వ అన్వేషణ, ఆచరణ దృష్టే పాఠకుల అంతరంగాలను ఆర్ధ్రపరుస్తుంది. స్వభావరీత్యా.. శాంత స్వభావి. సమాజం లోని అన్ని రకాల సామాజిక, సాంఘిక అసమానతల పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంటుంది ఆయన కవిత్వంలో. అయితే, ఆయన ఉగ్రత్వం.. శాంతత్వంలోకి మారువేషం వేసుకొని వచ్చి మనల్ని అస్థిరపరుస్తుంది. ఇదే కృష్ణారావుగారి కవిత్వంలోని ప్రత్యేకత. కృష్ణారావుగారు 1926లో నల్లగొండ జిల్లా రేవూరు గ్రామంలో జన్మించిన తెలంగాణ తొలితరం కవుల్లోని విశిష్ట కవి. లోకంలోని అనేకానేక ప్రశ్నలకు కృష్ణారావుగారి వంటి వారి దగ్గర ఒకటో రెండో సమాధానాలు మాత్రమే ఉంటాయి. అవి అనేక ప్రశ్నలను బ్యాలెన్స్ చెయ్యగలిగినవే అయి ఉంటాయి. రాబోయే తరాల ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పగలిగిన బతుకు సత్తా కలిగినవే అయి ఉంటాయి. జీవితం తాలూకు దెబ్బల్ని తట్టుకొని, దెబ్బదెబ్బకూ బలాన్ని పుంజుకొని బతికిన కవి యోధుడు తను. ఆయనను అందరూ వెన్నెల కృష్ణారావుగారంటారు. నేను కవిగా 1990లో నా దారిని వెతుక్కుంటూ ‘నెలనెలా వెన్నెల’లోకి ప్రవేశించాను. ఇందులో సభ్యత్వమూ సభ్యత్వ రుసుములూ ఉండవు. కవులకూ, పాఠకులకూ ఎజెండాల ఆంక్షలుం డవు. అక్కడ ఏ జెండాల రంగులు పొంగులు ఉండవు. ఏ కవికయినా వారి వారి స్వీయ మానసిక ఎజెండాల రాజకీయాల దృష్టి ఉండొచ్చు. అది తమ కవిత్వాన్ని సాంద్రపరిచి, సునిశితం చేయ గలిగితే చాలు. అక్కడి పాఠకమ్మన్యులు మనసారా అక్కున చేర్చుకుంటారు. అదీ నెలనెలా వెన్నెల ప్రత్యేకత. అటువంటి వేదికకు నిర్వాహకుడు, సేవకుడూ కృష్ణారావుగారు. 90వ దశకంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపుగా తెరమీదికి వస్తున్నాయి. అంతే బలంగా మరొక వైపు, తెలుగు సాహిత్యంలో ముఠాల, మఠాల మాఫియా బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. కొత్తగా కవిత్వం రాస్తూ బలపడుతున్న కవులను రాజకీయ, అరాజకీయ, స్వరాజకీయ ఎత్తుగడ లతో భయపెట్టేవాళ్లు. కొత్త కవుల్ని.. హైదరాబాద్‌లో ‘రాంపురి చాకుల (సిద్ధాంతాల పేరుతో) వంటి విన్యాసాలతో పొడిచి చంపుతూన్న సంద ర్భం. సరిగ్గా అటువంటి అయోమయంలో నెలనెలా వెన్నెలతో చల్లగా సాయంకాలాల ఇరానీ హోటళ్ల సగం కప్పు జిందగీతనంతో నెనరుగల నాయ నగా, సహృదయుడిగా కొత్త కవుల వేదికతో తెర మీదికి వచ్చారు కృష్ణారావుగారు. అప్పుడు ‘నెలనెలా వెన్నె ల’ది ఉత్తమమైన ఛీజ్ఛ్టీ్చటy ఛిౌn్టటజీbu్టజీౌn అని కూడా నాకు తెలిసి వచ్చింది. దళిత, స్త్రీవాద, బహుజన, మైనార్టీ ప్రాంతీయ అస్తిత్వాలు వేళ్లూనుకొని విస్తరిం చడానికి నెలనెలా వెన్నెలలోని ప్రజా స్వామ్యం ఎంతో దోహదపడింది. ఆయా కవుల తొలి సంకలనాల ఆరంగేట్ర స్థలమ య్యింది. సభల్లో ఛాయ, బిస్కెట్ ‘తెహ జీబ్’ని సాంప్రదాయంగా ముందుకు తెచ్చారు. పైసల ప్రస్తావనే ఉండేది కాదు. ఆయన డిమాండ్ అంతా కవులను కొత్త కవితలు పట్టుకుని రమ్మ నడమే. తను కొత్త కవిత రాయగానే వెంటనే పట్టుకు వచ్చి వినిపించేవారు. ఆయన పాఠకులకు శక్తినీ, సహనాన్నీ ఇవ్వగలిగిన సాహిత్య తత్వ విజ్ఞత ఉన్న గొప్ప మనిషి. తరతరాలు గుర్తుండి పోయే కవి. (ఆదివారం కనుమూసిన ప్రముఖ కవి సి.వి.కృష్ణారావు స్మృతిలో..) – సిద్ధార్థ, ప్రముఖ కవి -
అనుభూతి కవితకు.. చెరిగిన చిరునామా
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి తీరంతో చెరగని చెలిమి పెనవేసుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇక లేరన్న వార్త తెలిసి తూర్పు గోదావరి జిల్లా సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలుగు కవితారంగంలో అనుభూతి కవిత్వానికి చిరునామా చెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. సాహితీరంగంలో లబ్ధప్రతిష్టుడైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మన జిల్లాలోని రామచంద్రపురం పట్టణంలోని రత్నంపేటలో 1944 మే 29న జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రామచంద్రపురంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేశారు. ఆయన మంచి కవి, రచయిత, మహాపండింతుడు. శ్రీకాంతశర్మ ఇక్కడే పుట్టినప్పటికీ విద్యాభ్యాసం కాకినాడ, హైదరాబాద్‌లలో జరిగింది. ఉద్యోగ ప్రస్థానం విజయవాడ, హైదరాబాద్ నగరాలకే పరిమితమైనా, గోదావరి ఆయన హృదయంలో తిష్ట వేసుకున్నదని చెప్పడానికి ఆయన స్వీయచరిత్రే నిలువెత్తు సాక్ష్యం. ఆయన ఇక లేరన్న వార్తను సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని కవి పండితులు నమ్మలేకపోతున్నారు. యానాంతో ప్రత్యేక అనుబంధం యానాం: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటని ప్రముఖ కవి దాట్ల దేవదానంరాజు పేర్కొన్నారు. సాహిత్య సమావేశాలకు యానాం వచ్చిన ప్రతిసారీ మంచి ఆహార నియమాలు పాటించేందుకు తన ఇంటికి వచ్చి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది శిఖామణి పురస్కారం పొందిన ఆయన తన ‘కథల గోదారి’కి ‘జీవధార’ పేరుతో ముందుమాట రాసి ఆశీర్వదించారని అన్నారు. ఆయన రచించిన లలిత గీతాలు అందరినీ ఆకట్టుకుంటాయని, అలాగే ఆయన రాసిన ‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా..’ అనే దేశభక్తి గీతం నేటికీ విద్యార్థుల నోట మార్మోగుతూనే ఉంటుందని అన్నారు. ఆయన రచనలు భావికవులకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సినీగీతాల స్థాయి పెంచారు తెలుగు సినీగీతాలకు ఒక స్థాయి, గౌరవాన్ని కలిగించిన గీతాలు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి జాలువారాయి. కృష్ణావతారం, నెలవంక, రెండుజెళ్ల సీత వంటి చిత్రాలకు ఆయన అద్భుతమైన గీతాలను అల్లారు. ఆయన తండ్రి హనుమచ్ఛాస్త్రి విద్వత్కవి. సతీమణి జానకీబాల కూడా చేయి తిరిగిన కవయిత్రి. – డాక్టర్ పీవీబీ సంజీవరావు, వ్యవస్థాపకుడు, తెలుగు సారస్వత పరిషత్ అనుభూతి ప్రేరకంగా రాసేవారు మిత్రుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మరణంతో ఆధునిక తెలుగు కవిత్వంలో అనుభూతి వాదం చిరునామా చెరిగిపోయింది. తాను రాసింది వచన కవిత అయినా, గేయమైనా అనుభూతి ప్రేరకంగా ఉండేలా శ్రద్ధ తీసుకునేవాడు. అనేక విలువైన వ్యాసాల ద్వారా శుభ్రమైన వచన రచయితగా కూడా గుర్తింపు పొందాడు. కవిగా, కథకునిగా, నవలాకారునిగా సినీ గేయ రచయితగా, పత్రికా సంపాదకునిగా, ఆకాశవాణి ప్రయోక్తగా శ్రీకాంతశర్మ బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – అదృష్ట దీపక్, సినీ గేయ రచయిత, కవి, విమర్శకుడు, రామచంద్రపురం స్వీయచరిత్రలో నా పేరు ప్రస్తావించడం నా అదృష్టం మహాకవులు మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, మల్లంపల్లి శరభేశ్వరశర్మలను కలవడానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రాజమహేంద్రవరానికి వస్తూండేవారు. గౌతమీ గ్రంథాలయంపై ఆయన ఆకాశవాణిలో శబ్దప్రసారం చేశారు. ఆయన కవి, కథా, గేయ రచయిత. ఆయన తండ్రి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి పెద్దతరానికి చెందిన విద్వత్కవి. ప్రాచీన కావ్యాల్లో కూడా ఇంద్రగంటికి అభినివేశం ఉండేది. ఈ విషయంలో ఆయనను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒకసారి ఆయనకు ఫోన్ చేశాను. ‘స్వీయచరిత్రలో మీ ప్రస్తావన గురించి రాస్తున్నప్పుడు మీరు ఫోన్ చేయడం ఆనందదాయకం, ఆశ్చర్యదాయకం’ అని ఆయన నాతో అన్నారు. నాతోపాటు ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు పేరును కూడా ఆయన స్వీయచరిత్రలో ప్రస్తావించడం రాజమహేంద్రిపై ఆయనకుగల అభిమానానికి తార్కాణం. ఆయన రచించిన ‘శిలామురళి’ అనుభూతి కవిత్వంలో మేలుబంతి. ఆయన లేని లోటు తీరనిదే! – సన్నిధానం నరసింహశర్మ, ప్రాణహిత కవి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. లలిత గీతాలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, ఆకాశవాణి నాటికలు, నాటకాలు.. ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఇంద్రగంటిది అందె వేసిన చేయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కళాగౌతమి ప్రార్థిస్తోంది. – డాక్టర్ బీవీఎస్ మూర్తి, కళాగౌతమి వ్యవస్థాపకుడు, రాజమహేంద్రవరం -
ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (75) గురువారం తెల్లవారుఝామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనలేని లోటు సాహిత్య లోకానికి తీరనిదంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ శ్రీకాంతశర్మ తనయుడన్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మే 29 ,1944 న జన్మించారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరిన తదనంతరం కాలంలో ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. అనేక లలిత గేయాలు కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలనురచించారు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు- గోపాలరావు(1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశారు. ఇటీవలి కాలంలో సమ్మోహనం సినిమాలో ‘మనసైనదేదో’ అనే రొమాంటిక్ సాంగ్ ఆయన కలం నుంచి జాలువారినదే. సీఎం జగన్ సంతాపం ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఒక గొప్ప సాహితీవేత్త, పత్రికా సంపాదకుడు, కవి, పండితుడిని తెలుగుజాతి కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
తెలుగు కథపై చెదరని ‘ఛాయ’
అబ్బూరి ఛాయాదేవిగారు వెళ్లిపోయారు. ఆమె నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే మాటలిక ఎన్నటికీ వినపడవు అనుకుంటే చాలా విచారంగా ఉంది. కానీ, జీవించటంలోనూ, మరణించటంలోనూ తన మార్గాన్ని తాను ఎంచుకున్న మనిషి. మనం విచారించటాన్ని ఆమె ఇష్టపడరు. ఏదో ఒక జోక్ వేసి నవ్విస్తారు. తెలుగు సాహిత్యంలో, అందునా స్త్రీవాద సాహిత్యంలో ఆమె చెరగని సంతకం. ఆమె వ్యక్తిత్వం, మేథస్సు, హాస్య చతురత, సునిశిత దృష్టి, సాహిత్య కళారంగాల పట్ల ఆమెకున్న గాఢానురక్తి–ఇవన్నీ ఆమెను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెడతాయి. 1933 అక్టోబర్ 3న రాజమండ్రిలో జన్మించిన ఛాయాదేవిగారు తన పందొమ్మిదవ ఏట మొదటి కథ ‘అనుబంధం’ రాశారు. ఆ తర్వాత మరెన్నో కథల పంట పండించారు. చిన్నతనంలో కట్టుబాట్లతో కూడిన సంప్రదాయ జీవిత నేపథ్యం ఆమెది. ఆ నేపథ్యపు నీడ నుంచి తప్పించుకుని ఒక స్వతంత్ర ఆలోచనాపరురాలిగా తనను తాను మలచుకునేందుకు ఆమె తనదైన ఒక మార్గాన్ని, ఒక జీవన శైలిని అలవరచుకున్నారు. నిజాం కాలేజీలో చదివారు. అబ్బూరి రామ కృష్టారావుగారి అబ్బాయి అబ్బూరి వరద రాజేశ్వరరావుగారితో వివాహం జరిగాక లైబ్రరీ సైన్స్‌మీద ఆసక్తి కలిగిందేమో–ఆ చదువూ చదివి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో డిప్యూటీ లైబ్రేరియన్‌గా పనిచేశారు. పని చేయటమంటే ఛాయాదేవిగారి పద్ధతిలోనే. పర్ఫెక్ట్గా. తను చేసే ఏ పనైనా శ్రద్ధగా, దాని గురించిన పూర్తి అవగాహనతో, కళాత్మకంగా చేయడం ఆమె పద్ధతి. ఆ లైబ్రరీలో తన అనుభవాల గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆమె నవ్వుతూ సింపుల్‌గా చెబుతుంటే ఇంత సాదా సీదాగా కనిపించే ఈమె ఎంత మేథావో కదా అనిపిస్తుంది. 1982లో ఢిల్లీలో ఆ ఉద్యోగం వదలి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు దంపతులిద్దరూ. అప్పటికే ఛాయాదేవిగారు చరిత్రలో నిలిచి పోయే సాహిత్య కృషి చేశారు. 1954లోనే ‘కవిత’ అనే పేరుతో కవిత్వం కోసం పెట్టిన పత్రికలకు సంపాదకత్వం వహించారు. అది రెండు సంచికలే వచ్చినా.. అటువంటి పత్రికలకు ఒక ఒరవడి పెట్టింది. ‘అనగా అనగా’ అంటూ పిల్లల కోసం ప్రపంచ దేశాల జానపద కథలను సంకలనం చేశారు. 1956లో ‘మోడర్న్ తెలుగు పొయెట్రీ’ ఆంగ్లానువాద సంకలనానికి సంపాదకురాలిగా ఉన్నారు. ఈ మధ్యలో కథలు రాస్తూనే ఉన్నారు. వారిల్లు ఒక సాహితీ చర్చా కేంద్రంగా, నాటకరంగ కార్యగోష్టిశాల వలే నడుస్తూ ఉండేది. పెద్ద రచయితలందరూ ఆమె ఆతిథ్యం స్వీకరించినవారే. ఆమె వారి గురించి చెప్పే హాస్య కథలు రికార్డు చేయడానికి ఆమె అనుమతించలేదుగానీ, అదొక మంచి చరిత్ర పుస్తకమయ్యేది. ఆమె కథా సంకలనం చాలా ఆలస్యంగా 1991లో వచ్చింది. ‘బోన్సాయ్ బతుకులు’ 1974లో ఆమె రాశారు. అప్పటికీ స్త్రీవాదం, విమెన్స్ స్టడీస్, జండర్ దృక్పథం గురించి మాటలు కూడా మొదలు కాలేదు. కానీ స్త్రీల శక్తులన్నిటినీ బోన్సాయ్ మొక్కల్లా కత్తిరించి కుంచింప చేస్తున్నారని, అందంగా వుంటే, ఇంట్లో సురక్షితంగా పెరిగితే చాలని కుటుంబం చేసే అదుపు వల్ల పెద్ద వృక్షంలా ఎదిగి నలుగురికి నీడనివ్వగల స్త్రీ తానే పరాధీన అయిపోతోందని చెప్పి ఎంత కనువిప్పు కలిగించారో. 1991లో ‘అబ్బూరి ఛాయాదేవి కథలు’ పేరుతో కథా సంకలనం వచ్చాక అది స్త్రీలు తప్పనిసరిగా చదవాల్సిన కథ అయ్యింది. అనేక భాషల్లోకి అనువాదమైంది. కళాశాలల్లో పాఠ్యభాగమైంది. మన రాష్ట్రంలోనే కాదు. కర్ణాటకలో కూడా. జండర్ గురించి అర్థం చేయించాలంటే ఆ ఒక్క కథ చదివిస్తే చాలు. ‘సుఖాంతం’ కథ జనప్రియమైన కథ అయింది. ఆ కథ కూడా స్త్రీల అనంతమైన ఇంటిచాకిరి గురించే. నిద్రకు కరువైన జీవితాల గురించిన వేదన కథంతా పరుచుకుని, సుఖ నిద్ర కోసం శాశ్వత నిద్రనాశ్రయించిన ఒక స్త్రీ మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. చాలా కథలు సున్నితమైన హాస్యంతో చురకలు పెడతాయి. ఉద్యోగ ధర్మం, భార్యా ధర్మం మధ్య నలిగే స్త్రీలు, ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గురై సతమతమవుతూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడే స్త్రీలు–ఇలా అనేకానేకమంది మధ్యతరగతి స్త్రీలు, వారి ఆరాటాలు మనకు అర్థమవుతాయి. స్వతంత్ర జీవన కాంక్ష స్త్రీలలో బలంగా ఉం టుంది. దానిని సంహరించే వ్యతిరేక శక్తులతో వారు జీవితాంతం ఏదో ఒక రకమైన పోరాటం చేయవలసే ఉంటుంది. సంసారాలు నిలబెట్టుకుంటూనే, బాంధవ్యాలను తెగగొట్టుకోకుండానే, సున్నితంగానే నిలబడాలి పోరాటంలో. ఇది చాలా కష్టం. ఏదో ఒక ఆయుధం పుచ్చుకుని ప్రత్యక్షంగా కదనరంగంలోకి దూకడమే సులువు.. విజయమో, వీర స్వర్గమో తెలిసిపోతుంది. మధ్యతరగతి స్త్రీలు అస్వతంత్రత, స్వతంత్రతల మధ్య బంతిలా తిరుగుతూ, కిందపడిపోకుండా, ఎవరి చేతికీ చిక్కకుండా తమను తాము కాపాడుకునే సాము గారడీ చాలా కష్టం. ఆ కష్టాలను తన సున్నితమైన శైలిలో మనల్ని ఎక్కువ కష్టపెట్టకుండా రాస్తారు అబ్బూరి ఛాయాదేవి. ‘తన మార్గం’ కథ చూడండి. వృద్ధాప్యంలో ఎంత ఆనందముంటుందో తెలుస్తుంది. ఒంటరిగా పార్కుకెళ్లి పిడతకింది పప్పు కొనుక్కు తినడంలో జీవితపు రుచి ఎలా ఊరుతుందో అర్థమవుతుంది. ‘పరిధి దాటిన వేళ’ కథలో కూడా అంతే–ఒక వయసు మళ్లిన స్త్రీ మందులు కొనుక్కొచ్చుకుందామని, దగ్గరే కదాని ఎవరితో చెప్పకుండా బైటికి వెళ్లటం కుటుంబంలో ఎంత అలజడికి కారణమవుతుందో రాశారామె. ఏ వయసు పరిధులు, లక్ష్మణరేఖలు ఆ వయసుకి ఎలా ఆపరేట్ అవుతాయో,అదంతా ఎంత సహజంగా జరి గిపోతుందో ఆమె కథలు చదివితే అర్థమైపోతాయి. కథలు రాయటంతోనే తన సాహిత్య పాత్రను పరిమితం చేసుకోలేదావిడ. ఒక సాహితీ కార్యకర్తగా ఎన్నో పనులు చేశారు. అలా చేస్తున్నానని ఎవరికీ అనిపించనివ్వకుండా చేశారు. అది ఆమె మార్గం. ఆమె పద్ధతి. సాహిత్య ఎకాడమీకి ఒక కథా సంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకొచ్చి ఇచ్చారు. ఎన్నో సాహితీ సభలలో మంచి ఉపన్యాసాలు చేశారు. కొన్నేళ్లపాటు ఛాయాదేవిగారు లేకుండా జరిగిన సాహితీ సభలు అరుదు. ఐతే వేదిక మీద తప్ప సభలో కూర్చునేతత్వం కాదు ఆమెది. ప్రతి సభకూ హుందాగా వచ్చేవారు. ఆ సభకు గౌరవం తెచ్చే వారు. ‘ఉదయం’ వార పత్రికలో, ‘భూమిక’ మాసపత్రికలో కాలమ్స్ రాశారు. తన తండ్రిగారి గురించిన వస్తువుతో ‘మృత్యుంజయ’ రాశారు. అనేక సాహితీ వ్యాసాలు రాశారు. ఆమె మంచి కళాకారిణి. పనికిరానివని పక్కనపడేసే వస్తువులతో బొమ్మలు చేయటం ఆమె ప్రత్యేక విద్య. ఎంత కళాత్మకంగా ఉండేవో అవి. ఇంట్లో వాడకుండా ఉన్న చాటలో భారతంలోని వ్యక్తుల్ని నిలిపి ‘చాట భారతం’ చేశారు. స్నేహితులకు, పరిచయస్తులకు, పిల్లలకు వాటిని కానుకగా ఇచ్చేవారు. ఆ విద్య గురించి ‘బొమ్మలు చేయడం’ అనే పుస్తకం ప్రచురించారు. ఆమె జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని బాగా అర్థం చేసుకుని ఆచరించారు. ఆయన వివిధ సందర్భాలలో చేసే ప్రసంగాలలో స్త్రీలకు ఉపయోగపడే విషయాలను తీసుకుని ‘స్త్రీల జీవితాలు–జిడ్డు కృష్ణమూర్తి’అనే పుస్తకం రాశారు. ఆ తత్వం, జీవితంపట్ల ఆపేక్షతో కూడిన నిర్లి్లప్తత ఆమెకు బాగా పట్టుబ డ్డాయి. వరద రాజేశ్వరరావుగారు 1992లో అను కుంటా మరణించారు. 1986 నుంచీ ఆమె నేనూ మంచి స్నేహితులమయ్యాం. నేను వెళ్లేసరికి సాయం త్రం ఏడుదాటింది. ఆయనను తీసుకెళ్లారు. ఛాయాదేవిగారు ఎలా ఉన్నారో, ఆమె దుఃఖంలో ఉంటారు, ఎలా ఓదార్చాలి అనుకుంటూ వెళ్లాను. ఆమె మామూలుగా చిరునవ్వుతో వచ్చి కూర్చుని ఆ రోజు అదంతా ఎలా జరిగిందో అతి మామూలుగా తన ధోరణిలో చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. మర ణాన్ని, అందునా ఆప్తుల మరణాన్ని అలా ధైర్యంగా, హుందాగా ఎదుర్కొని ఎదుటివారి మనసులను తేలికజేయగల సాహసియైన స్త్రీని నేను నా జీవితంలో మొదటిసారి చూశాను. ఆ సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను. ఆ విషయంలో ఆమె ఆలోచనల లోతుని అర్థం చేసుకోలేని వాళ్ల ప్రవర్తన గురించి ఆమె ఒక హాస్య కథ కూడా రాశారు. సంవత్సరన్నరలో ఆమె ఎంతో శ్రమపడి, తన సమయాన్నంతా, హృదయాన్నంతా పెట్టి వరద రాజేశ్వరరావుగారి సమస్త రచనల సంకలనం ‘వరద స్మృతి’ ఎంతో అందంగా ముద్రించారు. సహచరుడిపట్ల ప్రేమను ఆయనను చిరంజీవిగా చేసే పనిలో ఆమె వ్యక్తం చేశారు. ఆ పుస్తకం అనేక విషయాలలో విలువైనది. సాహిత్య చరిత్రలో ముఖ్యమైనది. ఆమె ఆ పనికి పూనుకోకపోతే చాలా లోటు మిగిలేది. తన తోటి రచయిత్రులతో, తనకంటే చిన్నవారితో ఆమె కలిసిపోయే తీరు అపూర్వం. తనకు నచ్చిన కథల గురించి ఆయా రచయిత్రులతో మాట్లాడి ఆనంద పెట్టేవారు. ఆమె నుంచి ఎంత నేర్చుకున్నా ఆమె మరణాన్ని నిర్లిప్తంగా తీసుకోలేక పోతున్నాను. చాలా వెలితిగా ఉంది. దానిని పూరించుకోటానికి ఆమె చూపిన మార్గం ఉందనే ధీమా. ఆమె చేసిన కృషికి తగిన గుర్తింపు కూడా వచ్చిందనే అనిపిస్తుంది. అనేక అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. అజోవిభో కందాళం వారి అవార్డు వచ్చినప్పుడు బాపట్లలో రచయిత్రులం ఎంతోమందిమి వెళ్లి ప్రేమాభిమానాలతో మాట్లా డాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆమె అందుకున్న సందర్భంలో అస్మిత ఏర్పాటు చేసిన సభకు ఎంతమందో వచ్చి సంతోషపడ్డారు. రచయిత్రులమైతే ఆ అవార్డు మాకే వచ్చినంత సంతోషించాం. ఇంతమంది హృదయాల్లో ఇంత ప్రేమ నింపి, స్త్రీల జీవితాలకు వెలుగు చూపే కథలు రాసి, సాహిత్య చరిత్రలో నిలిచే పుస్తకాలను కూర్చి ప్రచురించిన అబ్బూరి ఛాయాదేవి గారు ఎక్కడికి వెళ్తారు? తెలుగు సాహిత్యంతో సహజీవనం చేస్తున్నారు. ఓల్గా వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సుప్రసిద్ధ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఛాయాదేవి భౌతికకాయాన్ని కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్‌లో ఉంచారు. తెలుగులో అరుదైన కథలు రాసిన సాహిత్యవేత్తగా గుర్తింపు పొందిన ఛాయాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13వ తేదీన జన్మించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వరరావు సతీమణి ఛాయాదేవి. 1960 దశకంలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైబ్రేరియన్‌గా ఆమె పనిచేశారు. స్త్రీల జీవితాల్లోని దృక్కోణాలను కథల్లో ఛాయాదేవి ఆవిష్కరించారు. బోన్సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. బోన్సాయ్ బ్రతుకు కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో పెట్టింది. ఆమె రాసిన 'తన మార్గం' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం, 1996లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్నారు. ఛాయాదేవి మరణం పట్ల సాహిత్యాభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. -
తెలుగు రచయితలకు సాహిత్య అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ /పార్వతీపురం: కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఈ ఏడాదికి గాను బాల సాహిత్య పురస్కారాలు, యువ పురస్కారాలు ప్రకటించింది. పురస్కార గ్రహీతల ఎంపికకు అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బోర్డు అగర్తలాలో ఆమోదముద్ర వేసింది. ఇద్దరు తెలుగు రచయితలు అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు. డాక్టర్ గడ్డం మోహన్‌రావుకు ‘కొంగవాలు కత్తి’ తెలుగు నవలా రచనకు గాను సాహిత్య అకాడమీ యువ పురస్కారం–2019 లభించింది. ‘తాత మాట వరాల మూట’ కథా సంపుటి రచించిన బెలగం భీమేశ్వరరావును బాల సాహిత్య పురస్కారం దక్కింది. చిందు ‘కళ’కు అక్షర రూపమిచ్చిన గడ్డం నల్గొండ జిల్లాకు చెందిన గడ్డం మోహన్‌రావు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. చిందు భాగవతం కళాకారుల జీవితాలకు అక్షర రూపం ఇస్తూ మోహన్‌రావు కొంగవాలు కత్తి, చిందు జాంబవ పురాణం, నేను చిందేస్తే.. అనే మూడు పుస్తకాలను రచించారు. అంతరించిపోతున్న చిందు కళను, ఈ కళను వృత్తిగా స్వీకరించిన వారి జీవితాలను ఈ పుస్తకాల ద్వారా భావితరాలకు పరిచయం చేశారు. బాల సాహిత్యంలో ‘భీముడు’: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన భీమేశ్వరరావు నాలుగు దశాబ్దాలుగా బాల సాహిత్యంపై విశేష కృషి చేస్తున్నారు. ఈయన గతంలో మంచిపల్లి సత్యవతి స్మారక బాల సాహిత్య పురస్కారం, డాక్టర్ ఎన్.మంగాదేవి బాల సాహిత్య పురస్కారం, విజ్ఞాన వివర్థిని బాల సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బాల సాహిత్య కీర్తి పురస్కారాలను అందుకున్నారు. భీమేశ్వరరావు రచించిన కొన్ని రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలుగా చేర్చింది. పురస్కారాన్ని అందుకున్న కృష్ణారావు ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కృష్ణారావు అనువదించిన ‘గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు’ కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది. శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కృష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు. భీమేశ్వరరావు, గడ్డం మోహన్‌రావు -
నవలా రాణి ఇక లేరు
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ/ కాజ (కూచిపూడి): సాహితీ సుమం నేలరాలింది. 2 దశాబ్దాల పాటు ఆధునిక తెలుగు నవలా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి, తన రచనలతో నవలా ప్రేమికులను ఉర్రూతలూగించిన సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తె వద్ద ఉన్న ఆమె శుక్రవారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఆమె భర్త యద్దనపూడి నరసింహారావు కొంతకాలం క్రితమే చనిపోయారు. కూతురు శైలజ, అల్లుడు రవి, మనవడు హర్ష కాలిఫోర్నియాలో ఉంటున్నారు. పంజగుట్టలో నివాసం ఉంటున్న సులోచనారాణి గత ఫిబ్రవరి 12వ తేదీన కుమార్తె వద్దకు వెళ్లారు. రెండు, మూడురోజుల్లో హైదరాబాద్ రానున్నట్లు ఈ నెల 16వ తేదీన పనిమనిషి రత్నమ్మకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఆ తరువాత రెండురోజులకే శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కాలిఫోర్నియాలోనే ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు. ఆమె మృతి వార్త తెలిసి సాహితీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు యద్దనపూడి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఆణిముత్యం సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో నెమలికంటి వెంకట చలపతిరావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. కాజ హైస్కూల్లోనే ఎస్ఎల్సీ వరకు చదివారు. అనంతరం జుజ్జూరు గ్రామానికి చెందిన యద్దన పూడి నరసింహారావుతో వివాహమై హైదరాబాద్ తరలివెళ్లారు. అనంతర కాలంలో నవలా రచయిత్రిగా ఎదిగారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు దాదాపు 80 నవలలు రాసి తెలుగు సాహితీలోకంలో ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె మృతితో స్వగ్రామం కాజలో విషాదం నెలకొంది. స్వర్ణోత్సవం జరుపుకున్న సెక్రెటరీ 1966లో ఆమె రాసిన సెక్రటరీ నవల ఓ మధుర కావ్యంలా నిలిచి 2016లో స్వర్ణోత్సవం జరుపు కుంది. ఇప్పటిదాకా 100కు పైగా ముద్రణలు పొంది లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. జీవితంలో ప్రతి అబ్బాయి రాజశేఖరంలా, ప్రతి అమ్మాయి ఆత్మాభిమానం కలిగిన ఒక జయంతిలా ఉండాలను కొనేవిధంగా ఎంతో గొప్పగా ఆ నవలను యద్ధనపూడి చిత్రీకరించారు. ఈ నవల సినిమాగా కూడా వెలువడి ప్రేక్షకులను కట్టిపడేసింది. మరో నవల ‘మీనా’ పత్రికలో ధారావాహికగా వచ్చింది. ఆ నవలకు పేరును పాఠకులే నిర్ణయించారు. 1973లో విజయ నిర్మల దర్శకత్వం వహించడమే కాకుండా తానే హీరోయిన్గా నటించి తీసిన ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించింది. లక్షలుగా మారిన అక్షరాలు తెలుగు నవలా సాహిత్యాన్ని శాసిం చిన యద్దనపూడి అక్షరం.. లక్షలై పబ్లిషర్స్, సినీ నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. సినీ నటులు అక్కినేని, వాణిశ్రీ, శోభన్‌బాబులు అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడింది. ఆమె రచించిన నవలలన్నీ దాదాపు విజయవాడలోనే ముద్రితమయ్యాయి. నవభారత్, నవోదయ, అరుణా పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో సంస్థలు వాటిని ప్రచురించాయి. 2015 సంవత్సరంలో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో తుళ్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్యమంత్రి చేతుల మీదుగా హంస పురస్కారం అందుకున్నారు. మహిళల ఆత్మాభిమానానికి ప్రతిబింబం యద్ధనపూడి సాహితీ ప్రస్థానం చిత్ర నళినీయం అనే కథతో ప్రారంభమైంది. ఆమె తొలిరచనలు ముక్కామల నాగభూషణం సారథ్యంలో నడిచిన ప్రగతి అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. పక్కా పల్లెటూరిలో పుట్టిన ఓ సగటు అమ్మాయి...తను రాసిన తొలి కథకు ఆంధ్రపత్రిక నుంచి 15 రూపాయలు పారితోషికం వస్తే మురిసిపోయిన పదహారేళ్ల పడుచుపిల్ల... తదనంతర కాలంలో కోట్లాదిమంది తెలుగు ప్రజల అభిమాన రచయిత్రిగా ఎదిగింది. ఆమె నవలా నాయికలు ఆత్మాభిమానం కల మధ్యతరగతి మహిళలు. ఒక పరిపూర్ణమైన, స్వతంత్ర వ్యక్తిత్వం గల మహిళలను ఆమె ఆవిష్కరించారు. వారి మనస్తత్వాన్ని, ఆలోచనలు, ఆకాంక్షలను, వారిలోని సంఘర్షణను తన నవలల్లో సమున్నతంగా తీర్చిదిద్దారు. పత్రికల్లో నవలలు సీరియళ్లుగా వెలువడుతున్న రోజుల్లో మహిళలంతా ఒక చోట గుంపుగా చేరి ఆ వారం సీరియల్‌ను ఒకరు చదువుతుంటే మిగతావాళ్లు చుట్టూ చేరి వినేవారంటే అతిశయోక్తి కాదు. ప్రతిభావంతమైన శైలి, మధ్యతరగతి జీవితాన్ని, కుటుంబ సంబంధాలను ప్రతిబింబించే కథనాలు మహిళలనే కాదు.. యావత్ తెలుగు సాహితీలోకాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 1970 నుంచి 1990 వరకు సులోచనారాణి సాహిత్యం బాగా ప్రభావితం చేసింది. సెక్రటరీ, మీనా, జీవన తరంగాలు, అమ్మానాన్న, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విజేత, ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ,జై జవాన్, కాంచనగంగ, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, ప్రేమ పీఠం, బహుమతి, మౌన పోరాటం, మౌనభాష్యం, శ్వేత గులాబి తదితర మరెన్నో నవలలు తెలుగు పాఠకులు మరిచిపోలేని జీవన దృశ్యాలు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం యద్దనపూడి సులోచనారాణి మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతివృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకతను, సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, యద్దనపూడి సులోచనారాణి ఆకస్మిక మృతి బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. యద్దనపూడి మృతికి వైఎస్ జగన్ సంతాపం యద్దనపూడి సులోచనారాణి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. యద్దనపూడి తెలుగు పాఠక లోకాన్ని, నవలా రంగాన్ని దశాబ్దాల పాటు ప్రభావితం చేశారని జగన్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. తీరని లోటు: ఎమెస్కో విజయ్ కుమార్ మానవ సంబంధాలను, మానవ వైరుధ్యాలను సున్నితంగా చిత్రించిన గొప్ప రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. ఆమె మరణం తెలుగు సాహితీ లోకానికి, ప్రత్యేకించి ఎమెస్కోకు తీరని లోటు. ఆమె గొప్ప కరుణామయి: వంశీ రామరాజు వంశీ సంస్థతో యద్దనపూడి సులోచనరాణిది విడదీయరాని అనుబంధం. ఆమె గొప్ప కరుణామయి. అనాథలకు, వృద్ధులకు ఎంతో సాయం చేసేవారు. ప్రముఖుల సంతాపం యద్దనపూడి మృతి పట్ల తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ రచయిత్రి వాసా ప్రభావతి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.