Toilet construction
-
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.కోటి స్వాహా!
చింతపల్లి : మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసే బిల్లుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆన్లైన్లో లబ్ధిదారులకు బిల్లు చెల్లించినట్లుగా చూపించి.. ఏకంగా సుమారు రూ.కోటికి పైగా స్వాహా చేశారు. చింతపల్లి మండలంలో అధికారులు మరుగుదొడ్ల బిల్లుల్లో మొదటి విడత చెల్లించి.. రెండో విడతలో మొండి చేయి చూపించారు. మరి కొందరికి అసలు బిల్లులే చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు వాటిని పంచుకు తిన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసినట్లు తెలియడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రూ.6వేల చొప్పున రెండు విడతల్లో.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చింతపల్లి మండలంలోని 34 గ్రామాల్లో 3,874 మందిని మరుగుదొడ్లు లేనివారిని లబ్ధిదారులుగా గుర్తించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రూ.12 వేలను లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తుంది. మరుగుదొడ్డి నిర్మాణ దశలను ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ చేసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి వద్ద లబ్ధిదారుడిని ఉంచి ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శి, సంఘబంధం అధ్యక్షురాలు, సర్పంచ్ సంతకం చేసి పరిశీలించి రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ధ్రువీకరణ అనంతరం గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ వెసులుబాటును అవకాశంగా చేసుకుని అంతా కుమ్మకై ్క బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు తెరలేపిన అధికారులు.. మరుగుదొడ్ల బిల్లులు బిల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఉండడం ఏమిటని అధికారులను ఇటీవల కొందరు లబ్ధిదారులు నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2018 సంవత్సరంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 2019లోపే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించింది. అయితే మొదటి విడత రూ.6 వేలు లబ్ధిదారులకు ఇచ్చి, మరో రూ.6 వేలు కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్టు మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారు మరుగుదొడ్లు నిర్మించుకోకున్నా నిర్మాణం జరిగినట్లుగా ఆన్లైన్ చేసి నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. పలు గ్రామాల్లో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి సొమ్మును సైతం మింగేశారు. అసలైన లబ్ధిదారులు డబ్బుల గురించి అడిగితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు మురిగిపోయాయని చెబుతూ వస్తున్నారు. పైసా ఇవ్వలేదు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నా తల్లి పిల్లి యాదమ్మ పేరు మీద 2019లో మరుగుదొడ్డి నిర్మించుకున్నా. ఇందుకు సంబంధించి బిల్లు ఇవ్వాలని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగేళ్లు కావస్తున్నా పైసా ఇవ్వలేదు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి. – పిల్లి లింగం, చింతపల్లి బిల్లులు ఇప్పించేలా చూస్తాం మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లు అందని కొందరు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకుని బిల్లులు పొందని వారిని ఏపీఓను సంప్రదించాలని సూచించాం. బిల్లులు అందని వారికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – రాజు, ఎంపీడీఓ, చింతపల్లి బిల్లులు అందలే.. చింతపల్లి మండల కేంద్రంలోనే 180 మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు రూ.6 వేలు అందగా.. రెండో విడతకు సంబంధించి రూ.6 వేలు రావాల్సి ఉంది. కుర్మేడు గ్రామంలో 130, కుర్రంపల్లిలో 130 మందికి రెండు విడతలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. వెంకటంపేట, నసర్లపల్లి గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మించుకోని వారి పేరిట బిల్లులు స్వాహా చేయగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి మాత్రం బిల్లులు అందించలేదు. నెల్వలపల్లి, ఉప్పరపల్లి, గడియగౌరారం, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, వింజమూరు గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
వాటిని కట్టకున్నా.. నిధులు కొట్టేశారు
సాక్షి, వరంగల్: ఖానాపురం మండలంలోని మంగళవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని కార్యదర్శిని సస్పెండ్ చేశారు. పూర్తి విచారణ, వివరాలు తెలియకముందే అతడికి ఆత్మకూరు మండలంలో పోస్టింగ్ సైతం ఇచ్చేశారు. ఈ క్రమంలో మరోసారి గ్రామంలో నిధుల గోల్‌మాల్‌పై దుమారం రేగింది. మరుగుదొడ్లు నిర్మించుకోకుండానే బిల్లులు కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఫోర్జరీ సంతకాలతో బిల్లులు కాజేసిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మించకున్నా బిల్లులు.. గతంలో మంగళవారిపేట పంచాయతీ కార్యదర్శిగా శ్రీధర్ పని చేశారు. అయితే, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో మే 4న ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు కొట్టేశారనే ఆరోపణలు గత రెండు రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు చేయకున్నా బిల్లులు ఎలా సాధ్యమయ్యాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుండగా.. తమకేమీ తెలియకుండానే ఇలా జరిగిందంటూ ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 50 మరుగుదొడ్లు మంజూరు కాగా, ఇందులో అసలు నిర్మించుకోని వారికి బిల్లులు వచ్చాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి మాత్రం సగం బిల్లులు, కొంత మందికి రెండుసార్లు బిల్లులు మంజూరయ్యాయి. పూర్తిగా కట్టుకున్న వారిలో కొంత మందికి మాత్రమే బిల్లులు రావడంతో ఇందులో ఎవరి హస్తం ఉందని, బిల్లులు ఎవరు కాజేసారో తెలియాల్సిందేననంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. రూ.6 లక్షలు డ్రా.. బిల్లుల విషయమై పాలకవర్గ సభ్యులు మాత్రం గతంలో పని చేసిన కార్యదర్శిపైనే ఆరోపణలు చేస్తున్నారు. నిధుల గోల్మాల్ విషయంలో అసలేం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్చార్జ్ కార్యదర్శి ఆధ్వర్యంలో బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇందులో పాత కార్యదర్శి తమ సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు రూ.6 లక్షలు కాజేసి నర్సంపేటకు చెందిన నలుగురి ఖాతాల్లో జమచేసినట్లు సర్పంచ్ లావుడ్య రమేష్‌నాయక్, ఉప సర్పంచ్ ఉపేందర్ గుర్తించారు. ఈ మేరకు ఫోర్జరీగా గుర్తించిన చెక్కులను జిరాక్స్ తీయించి ఎంపీడీఓ సుమణవాణికి ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే, సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సైకి సైతం ఫిర్యాదు చేశారు. కాగా, మరుగుదొడ్ల బిల్లులపై విచారణ జరిపి కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. -
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.440 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం రూ.440 కోట్లతో ప్రత్యేక నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేయించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విజయవాడలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేలా పాఠశాలల్లో విద్యార్థినులకు, మహిళా టీచర్లకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ కూడా ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతారని.. వారి కోసం ఇంతలా ఆలోచించిన ప్రభుత్వాలు గతంలో లేవన్నారు. బుక్స్, బ్యాగ్స్, షూస్, డ్రస్, గ్రీన్ బోర్డు, కాంపౌండ్ వాల్స్, లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మంచినీరు, మధ్యాహ్న భోజనం.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని సీఎం స్వయంగా పరిశీలించడం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1,000 టాయిలెట్ల నిర్వహణకు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి ఆయాకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం అందిస్తామని మంత్రి ఆదిమూలపు చెప్పారు. -
మరుగుదొడ్ల నిర్మాణం.. టీడీపీ అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగు తమ్ముళ్లు గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి. మరుగుదొడ్లు కట్టుకోవడానికి రుణం కోసం వెళ్లిన వారికి ఇప్పటికే మీ పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందంటూ అధికారులు ఇస్తున్న సమాధానంతో వారు కంగుతింటున్నారు. గత ప్రభుత్వ హయాంలో బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారుస్తున్నామంటూ హడావుడి చేసి జిల్లా వ్యాప్తంగా వేలాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి మరుగుదొడ్లు కట్టకుండానే కట్టినట్లు లెక్కలు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. అటువంటి ఘటనే మరొకటి ఇటీవల వెలుగు చూసింది. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెం గ్రామంలో 2018లో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మరుగుదొడ్ల నిర్మాణంలో సుమారు రూ.40 లక్షల మేర దుర్వినియోగం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (చదవండి: ‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..) అయ్యపరాజుగూడెం గ్రామానికి చెందిన పలువురు కొంత కాలంగా గ్రామ సచివాలయానికి వెళ్లి తాము మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పరిశీలించగా.. వారి పేర్లతో 2018లోనే మరుగుదొడ్ల కోసం రుణం తీసుకున్నట్లు ఉంది. దీంతో వారు మీపేరు మీద మరుగుదొడ్డి తీసుకున్నట్లుగా ఉంది. అసలు తాము మరుగుదొడ్డి ఇంటి వద్ద నిర్మించుకోకుండా ఎలా బిల్లులు చేశారు. కనీసం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయరా అని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. (చదవండి: ఆ వదంతులు అవాస్తవం: రామసుబ్బారెడ్డి) గ్రామ టీడీపీ నేత చేతివాటం 2018లో గ్రామంలో సుమారు 266 మరుగుదొడ్ల నిర్మాణానికి ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు పి.శ్రీనివాసరావు ఓ తాపీ మేస్త్రి పేరుతో కాంట్రాక్టు పొందారు. ఒక్కో మరుగుదొడ్డి కోసం రూ.15 వేలు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఆ సమయంలో గ్రామంలో లేనివారు, చనిపోయినవారు, మరుగుదొడ్డి నిర్మించుకోని వారి ఆధార్ కార్డుల నంబర్లను తీసుకుని వారి పేర్లు మీద మరుగుదొడ్లు నిర్మించినట్లుగా నగదును డ్రా చేసినట్లు సమాచారం. ఇది అప్పట్లో ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పర్యవేక్షణలో జరిగాయి. ఈ నిర్మాణాల గురించి పట్టించుకోకుండా దొడ్లు కట్టించిన తెలుగుదేశం నాయకుడి మాటే వేదవాక్కుగా దొంగ సంతకాలు చేసి ఇచ్చిన లిస్ట్ ఆధారంగా అధికారులు బిల్లులు చెల్లించేశారు. మొత్తం 266 మరుగుదొడ్లలో రెండు వందలకుపైగా మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసినట్టు సమాచారం. దీనిపై పూర్తి వివరాలను సచివాలయ ఉద్యోగులు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించిన సదరు నేతను నిలదీస్తే తనకు సంబంధం లేదని, ఏం చేస్తారని బెదిరిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్వాకం వల్ల ఇప్పుడు తాము మరుగుదొడ్డి నిర్మించుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని గ్రామస్తులు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానన్నారు. మరుగుదొడ్డి నిర్మించినట్టు రికార్డుల్లో ఉంది మరుగుదొడ్డి నిర్మించుకుందామని గ్రామ సచివాలయానికి వెళ్లి నాపేరు అన్లైన్లో నమోదు చేయించుకోవడానికి దరఖాస్తు ఇచ్చాను. కంప్యూటర్లో నాపేరును నమోదు చేస్తుంటే మరుగుదొడ్డికి రుణం నేను గతంలో తీసుకున్నట్లు ఉంది. నాపేరు మీద మరుగుదొడ్డి డబ్బులు ఎవరు తీసుకున్నారని సచివాలయంలో అడగ్గా మరుగుదొడ్లు కాంట్రాక్టు చేసిన పిల్లల శ్రీను తీసుకున్నారని చెప్పారు. – చీదరాల కృష్ణకుమారి, అయ్యపరాజుగూడెం నిర్మించకుండానే డబ్బులు కాజేశారు నాకు మరుగుదొడ్డి నిర్మిస్తానని చెప్పి పిల్లల శ్రీను అనే వ్యక్తి ఆధార్ కార్డు తీసుకున్నాడు. అ తరువాత వచ్చి నీ కార్డు అన్లైన్ కావటం లేదు దొడ్డి రాదని చెప్పారు. తీరా ఈ ప్రభుత్వంలో మరుగుదొడ్డి నిర్మించుకుందామని సచివాలయానికి వెళ్లి అడిగితే ఆధార్ నంబరు కొట్టి చూస్తే మరుగదొడ్డి కట్టినట్లుగా నాపేరు మీద రూ.15 వేలు నగదు తీసుకున్నట్లుగా ఉంది. – యర్రా జయమ్మ, అయ్యపరాజుగూడెం ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం అవకతవకలు విషయం ఇప్పటి వరకు నాదృష్టికి రాలేదు. లబ్ధిదారులు ఫిర్యాదుచేస్తే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, ఎంపీడీఓ, లింగపాలెం -
‘చెప్పుకోలేని బాధకు’..చలించిపోయారు..
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి.. టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. వాళ్లది చెప్పుకోలేని బాధ... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్‌లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్‌లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు. Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A — Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019 -
ఓడీఎఫ్ సాధ్యమేనా.?
సాక్షి, ఆదిలాబాద్ : పల్లెల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దానిని ఆచరణలో సాధ్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి సారించిన ప్రభుత్వాలు మూడేళ్లలో జిల్లాలో 73శాతం మార్పు తీసుకొచ్చాయి. మిగతా 27 శాతం ప్రగతి సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రం)గా ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఓడీఎఫ్‌గా ప్రకటించబడుతాయి. దీంతో జిల్లాలోని 13పాత మండలాల పరిధిలోని 589 గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. అంటే మన జిల్లాలోని గ్రామాలన్నీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలని దానర్థం. జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు ఇంకా పక్షం రోజులే మిగిలింది. ఇందుకు అధికారులు గత నెల రోజులుగా తీరిక లేకుండా శ్రమిస్తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలతో మమేకమవుతున్నారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నా.. ఎందుకు పూర్తి కావడం లేదనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు. జిల్లాలో నిర్మాణాలు ఇలా.. 2017లో నిర్వహించిన సర్వే ప్రకారం 1,08,758 నివాస గృహాలు ఉన్నాయి. ఇందులో 39,092 నివాసాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్హెచ్ఎల్) ఉన్నట్లు తేలింది. మిగతా 69,666 ఇళ్లకు లేవని అధికారులు తేల్చారు. దీని ప్రకారం జిల్లాలో 69,666 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. అదే ఏడాదిలో మరుగుదొడ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో మరో 10,292 మంది నిర్మించుకున్నారు. మిగతా 59,374 మంది నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే సొంత డబ్బులతో మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడం, కార్యాలయాలకు తిరిగి తిరిగి వేసారిపోవడం లాంటివి జరిగాయి. అంత పూర్తి అయినా.. ఆన్లైన్లో ఫొటోలను అప్లోడ్ చేయకపోవడంతో బిల్లులు ఆగిపోయిన సంఘటనలున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న ప్రజలు మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ముందుకు రాలేదని అధికారులు అప్పట్లోనే గుర్తించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో గత మూడేళ్ల క్రితం జిల్లాలో స్వచ్చభారత్ కింద 59,374 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవకాశం కల్పించింది. ఇందుకు రూ.40.78 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటి వరకు 29,905 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 25,808 మరుగుదొడ్లు వివిధ స్థాయిలో నిర్మాణాల్లో ఉండగా, 3661 నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. పక్షం రోజుల్లో ‘లక్ష్యం సాధ్యమేనా’.? జిల్లాలో ఏ ఒక్క ఇంటిలో మరుగుదొడ్డి లేదని చెప్పేందుకు వీలులేకుండా అధికారులు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ ఇది వరకే పలుసార్లు ఆయా మండలాలను ఎంపీడీవోలను ఆదేశించారు. గతేడాది గ్రామాలను ఓడీఎఫ్‌గా చేసిన ఎంపీడీవోలకు, సర్పంచ్‌లకు, అధికారులకు గాందీ జయంతి రోజున అవార్డులు, నగదు బహుమతులు అందజేసినా మార్పు కన్పించలేదు. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 28 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇందుకు పక్షం రోజులే గడువుంది. ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం నుంచి స్వచ్ఛతకు సరిపడా నిధులు రాక నిర్మాణాలు వెనుకబడిపోయాయని అధికారులు పేర్కొనగా ప్రస్తుతం నిర్మించుకున్న వాటికి బిల్లులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. (ఓడీఎఫ్) జిల్లాగా తీర్చి దిద్దేందుకు రూ.40.78 కోట్లు అవసరం ఉందని అంచనా వేయగా, ప్రభుత్వం నుంచి రూ.16.20 కోట్లు విడుదల కావడంతో అప్పట్లో నిర్మాణాల్లో జాప్యం జరిగింది. కానీ ప్రస్తుతం సరిపడా నిధులు అందుబాటులో ఉన్న ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో నిర్మాణాలను వేగవంతం చేసేలా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, యువత, మిగతా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓడీఎఫ్‌గా ప్రకటిస్తే.. జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో మల విసర్జనకు ఆరు బయటకు వెళ్తున్నదీ.. లేనిదీ.. పరిశీలన చేసేందుకు గ్రామానికో ‘స్వచ్ఛగ్రహీ’ని నియమించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. ఇంటింటికి వెళ్లి పరిశీలించినందుకు ఒక్కో ఇంటికి రూ.25 చొప్పున స్వచ్ఛగ్రహీలకు కేంద్రం అందజేయనుంది. దీంతో పాటు మరుగుదొడ్డికి మరమ్మతులు చేసుకునేలా, మరుగుదొడ్డి విస్తరణ పనులు చేయించగలిగేలా ప్రజలను చైతన్యపరిస్తే స్వచ్ఛగ్రహీలకు ప్రభుత్వం నగదు పురస్కారం ఇవ్వనుంది. గోబర్‌గ్యాస్ వంటి ప్లాంట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తే రూ.200 ప్రొత్సాహంగా అందజేయనుంది. ఇవే కాకుండా పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీల్లో పరిశుభ్రంగా ఉండేలా చూడడం, ఓడీఎఫ్ రోజును అమలు చేయడం, అంకితభావంతో పని చేసే స్వచ్ఛగ్రహీలకు సత్కరాలు, అవార్డులు ఇవ్వనుంది. స్వచ్ఛగ్రహీ ఉద్యోగం శాశ్వతం కాకపోయిన ఇంటిలో మరుగుదొడ్డి ఉన్న యువతను మాత్రమే ఎంపిక చేసుకునేలా రాష్ట్రాలను ఆదేశించింది. -
మరుగుదొడ్లు నిర్మించకపోతే ప్రభుత్వ పథకాలు కట్
సాక్షి, నర్సాపూర్: మరుగుదొడ్లు నిర్మించకపోయినా, నిర్మించిన వాటిని వాడకపోయినా వారికి ప్రభుత్వం పథకాలు నిలిపివేస్తామని చేస్తామని డీపీవో హనోక్ తెలిపారు. గురువారం చిలప్‌చెడ్ మండలంలోని సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకోని పలు కుటుంబాల కరెంట్, నల్లా కనెక్షన్లు తొలగించారు. ఈ సందర్భంగా డీపీవో హనూక్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛత విషయంలో సోమక్కపేట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ అట్టడుగు స్థాయిలో ఉందని ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీలో మొత్తం 430 మరుగుదొడ్ల నిర్మాణాలకు గానూ కేవలం 350 మాత్రమే పూర్తయ్యాయని, ఎన్నిసార్లు అధికారులు స్వచ్ఛత గురించి అవగాహన కల్పించినా గ్రామస్తులు మారకపోవడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఉమ్మడి సోమక్కపేట్ నుంచి కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన సామ్లా తండా, రహీంగూడ గ్రామాలలో సైతం మరుగుదొడ్లు పరిశీలించి, నిర్మించుకోని పలు కుటుంబాలకు విద్యుత్, నల్లా కనెక్షన్లు తొలగించడంతో పాటు ప్రభుత్వ పథకాలైన రేషన్, పింఛన్ తదితర వాటిని కూడా తొలగిస్తామన్నారు. అదే విధంగా మరుగుదొడ్లు వెంటనే నిర్మించుకున్న వారికి కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దేవయ్య, ఎంపీడీఓ కోటిలింగం, ఏపీవో శ్యాంకుమార్, మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శులు, సామ్లా తండా సర్పంచ్ భిక్షపతి నాయకులు లక్ష్మణ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి మరుగుదొడ్డితో లింక్
సాక్షి, నల్లగొండ : మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే జూలై నుంచి సంక్షేమ పథకాలు కట్ అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకం కింద గ్రామీణ ప్రాంతంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు మరుగుదొడ్డి నిర్మించాలని 2014 సంవత్సరంలో పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.12వేలు చెల్లిస్తారు. అయితే పథకం ఈనెల చివరి నాటికి పూర్తవుతుంది. దాంతో ఆ తర్వాత నిర్మించుకున్న మరుగుదొడ్డికి కేంద్ర నిధులు అందే అవకాశం లేదు. ఆ స్కీం సమయం పూర్తవుతున్నందున ఈలోపు నిర్మించుకుంటేనే ఇటు మరుగుదొడ్డి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఈనెల 30లోపు ఎవరైతే మరుగుదొడ్లు మంజూరై నిర్మాణం చేసుకోకుండా ఉంటారో వారికి రేషన్ కట్ చేయడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ రుణాలను నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మలవిసర్జన గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఇంకా మరుగుదొడ్డి నిర్మించుకోకుండా బహిర్భూమికి వెళ్తున్నారు. సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా ఇంకా బహిర్భూమికి బయటికి వెళ్లడాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసి ప్రతి కుటుంబంలో మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అందుకు రెండు ప్రభుత్వాలు నూటికి నూరు శాతం ఉచితంగా లబ్ధిదారునికి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు డబ్బులు మంజూరు చేస్తున్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు చెల్లిస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60శాతం కింద రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాకింద రూ.4800 చెల్లిస్తున్నాయి. లబ్ధిదారునికి పూర్తిగా ఉచితంగానే నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. 2014లో పథకం ప్రారంభం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకాన్ని 2014 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. మొదట నీటి పారుదల, పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత దాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 95601 మరుగుదొడ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటివరకు 76309 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఇంకా 18847 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా పూర్తికాని నిర్మాణాలు ఐదేళ్లుగా పథకం కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు పదేపదే సమావేశాలు, సమీక్షలు నిర్వహించి చెప్తున్నప్పటికీ నిర్మాణాల్లో మాత్రం జాప్యం ఆగలేదు. ఇప్పటికే పూర్తి కావాల్సిన మరుగుదొడ్లు ఇంకా కొన్ని నిర్మాణ దశల్లోనే ఉన్నాయి. దీంతో ఇచ్చిన గడువుకూడా దగ్గర పడుతుండడంతో కలెక్టర్ గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్మాణంలో వెనుకబడిన మండలాలు జిల్లాలో అత్యధికంగా అనుముల మండలంలో 2580 మరుగుదొడ్లు నిర్మాణంలో వెనుకబడి పోగా దేవరకొండ మండలంలో 2242, కనగల్ మండలంలో 1270, నిడమనూర్ మండలంలో 1698, పెద్దవూర మండలంలో 2653, త్రిపురారం మండలంలో 1441, వేములపల్లి మండలంలో వెయ్యి మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే చిట్యాల, దామరచర్ల మండలాలు నూటికి నూరుశాతం పూర్తి చేయగా, గుడిపల్లి మండలంలో ఒక్క మరుగుదొడ్డి పెండింగ్‌లో ఉంది. గుర్రంపోడులో పది, మిర్యాలగూడలో 35, నకిరేకల్‌లో 15, నార్కట్‌పల్లిలో 2, శాలిగౌరారంలో 25 మరుగుదొడ్లు మాత్రమే పెండింగ్‌లో ఉండగా 100 నుంచి వెయ్యిలోపు పెండింగ్‌లో ఉన్నాయి. -
స్వచ్ఛత పనుల జోరు
సాక్షి, పెంట్లవెల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఊరురా.. మరుగుదొడ్ల నిర్మాణం జోరందుకుంది. గ్రామాల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం కోసం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడంతో వీటి నిర్మాణాలను వేగవంతంగా నిర్మించేందుకు అధికారుల సైతం ఉత్సాహం చూపుతున్నారు. 3600 మరుగుదొడ్లు మంజూరు మండలంలోని జటప్రోల్, పెంట్లవెల్లి, కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవస్వామినగర్ గ్రామాలలో ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మహిళలు స్వచ్ఛభారత్ నేపథ్యంలో ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నారు. మండలంలో 10గ్రామ పంచాయతీలకు 3,600 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందులో 1500పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆసక్తి చూపుతున్న ప్రజలు ప్రతి గ్రామంలో అధికారులు పర్యటించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఊరూరా తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పారు. కొన్నిచోట్ల వాటిని కఠినం చేస్తూ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పడంతో స్వచ్ఛతపై అవగాహన పెంచుకున్నారు. గతంలో ఎవరో ఒకరు మాత్రమే నిర్మించుకునే వారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకుంటున్నారని అధికారులు అంటున్నారు. చెక్కుల పంపిణీ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి, రెండో విడుతల చెక్కులను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘం అధ్యక్షురాలుతో చెక్కుపై సంతాకం పెట్టించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి ప్రభుత్వం అందించే రూ.12వేల ప్రోత్సాహకం సమయానికి అందుతుంది. మండలంలో 1500లకు పైగానే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకా 2,100 నిర్మాణ దశలో ఉన్నాయి. స్వచ్ఛత పాటిస్తాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు ఇచ్చే పథకం ఎంతో బాగుంది. ప్రభుత్వ నిధులకు తోడు మరికొంత వ్యయం చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. స్వచ్ఛత పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. – శివయ్య, మంచాలకట్ట -
15 రోజులే మిగిలింది ..
సాక్షి,నవాబుపేట: మరుగదొడ్లు వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్ విధించినా.. గ్రామాల్లో ఇంకా నత్త నడకన వాటి నిర్మాణం సాగుతుంది. దీంతో మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అది ఆచరణలో లేక పోవటం శోచనీయం. కేవలం రెండు, మూడు గ్రామాలు మినహయిస్తే మిగతా వాటిలో చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి725 మరుగుదొడ్లు ప్రారంభమే కాలేదు. కాగా అమ్మపూర్, కొండాపూర్, ఇప్పటూర్, పోమాల్, కొల్లూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు ని ర్మించాల్సి ఉంది. కాగా లబ్ధిదారులు మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించి మార్కవుట్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఏర్పడింది. దీంతో మార్చి టార్గెట్ పూర్తి కావటం కష్టంగానే మారింది. కాగా మొత్తం 3432 మరుగుదొడ్లు మార్చిలో పూర్తిచేయాలని ఉండగా 1350 పూర్తయ్యాయి. నవాబుపేటలో 307, లోకిరేవులో 235, కూచూర్లో230, ఖానాపూర్‌లో 134, కాకర్జాలలో 250, హజిలాపూర్‌లో 188, చౌడూర్‌లో 122, గురుకుంటలో 188, కాకర్లపహడ్లో 128, కారుకొండలో 184, తీగలపల్లిలో130 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో మహిళా మేస్త్రీలు.. మండలంలో ప్రత్యేకంగా 25 మంది మహిళా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ప్రత్యేకంగా 5 రోజులు శిక్షణ ఇచ్చి, మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
దేన్నీ వదల్లేదు.. మొత్తం మింగేశారు
సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం): తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఐదేళ్లలో అందినకాడికి అవినీతి సొమ్మును వెనకేసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పాలకుల జేబులు నింపేందుకే అన్నట్లు వ్యవహరించారు. నీరు–చెట్టు, నీటికుంటలు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ ఇలా అన్ని పథకాలకు అవినీతి మరకలు అంటించారు. ప్రజలను అమాయకులను చేసి వారికి అందాల్సిన నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పెద్దారవీడు మండలంలోని ఒక్క మద్దలకట్ట పంచాయతీలోనే మరుగు దొడ్ల పేరుతో రూ. 27,15,500 సొమ్మును కాజేశారు. సగం సగం పనులు చేయించుకున్న లబ్ధిదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఖాతాల్లో నగదు జమ అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరగుదొడ్ల పథకం టీడీపీ అవినీతికి ఓ మచ్చు తునక. లబ్ధిదారులకు తెలియకుండానే వారికి రావాల్సిన నగదును దొడ్డిదారిన నాయకులు తమ అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. మండలంలోని మద్దలకట్ట గ్రామంలో లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 538 మందికి మరుగుదొడ్లు నమోదయ్యాయి. అధికారులు కూడా ధ్రువీకరించడంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించారు. కొంత మంది లబ్ధిదారులు గుంతలు తీయగా మరోకొంత మంది రింగులు, గోడల వరకు నిర్మాణం పూర్తి చేశారు. కానీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. అవి దారిమారి నాయకుల ఖాతాల్లో జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితులు ఏడాదిగా అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం విశేషం. ఎవరెవరు ఎంత దోచుకున్నారంటే..! మద్దలకట్ట పంచాయతీలో 181 మంది లబ్ధిదారుల పేరుతో - రూ. 27,15,500 అవినీతి యమా దాసయ్య 53 మందివి - రూ. 7,88,000 పత్తి శ్రీనివాసరావు 65 మందివి - రూ.9,88,500 ఔకు వెంకటేశ్వర్లు (ఎంపీటీసీ సభ్యుడు) 31మందివి - రూ. 4,70,000 ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మందివి - రూ. 1,80,000 దొడ్డా భాస్కరరెడ్డి 20 మందివి - రూ. 2,89,000 అంతా అవినీతిపరుల ఖాతాల్లోకి మద్దలకట్ట పంచాయతీలో 538 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వాటిలో 181 మంది లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణ నిధులు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కాజేశారు. మద్దలకట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దొడ్డా భాస్కరరెడ్డి 20 మంది రూ 2,89,000, చాట్లమడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు యమా దాసయ్య 53 మంది రూ 7,88,000 , మాచరాజుకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పత్తి శ్రీనివాసరావు 65 మంది రూ 9,88,500, చాట్లమడ గ్రామానికి చెందిన మద్దలకట్ట ఎంపీటీసీ సభ్యులు ఔకు వెంకటేశ్వర్లు 31 మంది రూ 4,70,000, చట్టమిట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మంది రూ. 1,80,000 నిధులను వారి సొంత బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. కొంత మంది తమ బ్యాంక్ ఖాతాలలో నిధులు జమకాలేదన్న కారణంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణాలను మధ్యలోనే అపివేసినప్పటికీ అదికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేసి, నిధులను తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి బిల్లులు ఇప్పించాలని లబ్దిదారులు కోరుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సైతం అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. బిల్లు ఇప్పించండి మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తీసి రింగులు వేశాను. బిల్లుల గురించి అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదు. మొత్తం 48 మంది గుంతలు, రింగులు, గోడలు నిర్మించాం. జనవరిలో జరిగిన జన్మభూమి గ్రాభసభలో కూడా ఫిర్యాదు చేశాం. స్థానిక టీడీపీ నాయకులు దొడ్డా భాస్కరరెడ్డి, యమా దాసయ్య, పత్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఔకు వెంటేశ్వర్లు, ఏర్వ రామాంజనేయరెడ్డి, అధికారులు కలిసి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు చేయించుకొని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసుకున్నారు. మాకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ ఇవ్వలేదు. – జడ్డా దానియేలు, మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీ -
మరుగుదొడ్లలో అవినీతి కంపు
సాక్షి, రొద్దం: అవినీతి కాదేదీ అనర్హమంటున్నారు అధికార పార్టీ నాయకులు. ఏకంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివరాల్లోకెళితే..మండలంలోని 19 గ్రామ పంచాయితీల్లోని 63 గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 8700 మరుగుదొడ్లు మంజూరు కాగా 6,533 నిర్మాణాలను 2016 నుంచి 2019 ఫిబ్రవరి వరకూ విడతల వారీగా పూర్తి చేశారు. ఇందుకోసం రూ.9.78 కోట్ల చెల్లింపులు జరిగాయి. మరుగుదొడ్డి కట్టకుండానే బిల్లు.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను అధికార పార్టీ నాయకులే చేయించారు. పెద్దగువ్వలపల్లి, నాగిరెడ్డిపల్లి, చిన్నమంతూరు తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ చిన్నప్పయ్య పనులు చేశారు. మిగతా పంచాయతీల్లో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో పనులు పూర్తి చేశారు. చాలా చోట్ల మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పునాదులు తీసి వాటిని పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి బిల్లులు దిగమింగినట్లు తెలుస్తోంది. ఇక పాతవాటికి కూడా బిల్లులు చేసినట్లు సమాచారం. ఒకే తలుపును మరుగుదొడ్లకు పెట్టి డబ్బు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా అవినీతి జరిగినట్లు సమాచారం. పెద్దగువ్వలపల్లి గ్రామంలోనే దాదాపు రూ.40 లక్షల దాకా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. బోగస్ బిల్లులు చేయడానికి ఒప్పుకోని ఒక ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్‌ను జెడ్పీటీసీ బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. నాణ్యతకు పాతర.. మరుగుదొడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకమైన ఇటుకలు వాడడంతోపాటు సిమెంట్ తగిన పాళ్లలో వాడలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక చాలావాటికి రింగులే ఇవ్వలేదు. నిర్మాణాలు నాసిరకంగా ఉండడంతో లబ్ధిదారులు వాటిని వినియోగించడానికి కూడా భయపడుతున్నట్లు సమాచారం. -
మరుగుదొడ్ల నిధులు గోల్మాల్!
గుంటూరు, వడ్లమూడివారిపాలెం(రొంపిచర్ల): ఇప్పటివరకు మండలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య లోలోన రగులుతున్న విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రచ్చకెక్కి కుమ్ములాటలకు దారితీస్తున్నాయి. మండలంలోని వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో జరిగిన అవినీతి మంగళవారం గుప్పుమంది. ఈ గ్రామంలో నాలుగున్నరేళ్లలో 400 మంది వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. నిర్మించిన మరుగుదొడ్లన్నింటికీ నిధులు విడుదలైనప్పటికీ, ఆ మొత్తం లబ్ధిదారులకు ఇప్పటివరకు నగదు చేరలేదు. దీంతో కొందరు టీడీపీ నాయకులే మరుగుదొడ్లు ఎవరెవరికి వచ్చాయి, నిధులు ఎంతవరకు విడుదలయ్యాయనే సమాచారాన్ని సేకరించారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వెనుకబడిన వర్గాల వారు పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం తమకు మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు రాలేదని గ్రామంలోని ఒక నాయకుడిని సంప్రదించారు. ఆ నాయకుడు దీనిపై ఆరాలు తీస్తుండగా నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్న వారు ఆ నాయకుడితో వాదనకు దిగటంతో పాటు దాడికి కూడా పాల్పడ్డారు. ఇప్పటివరకు 400 మరుగుదొడ్లు నిర్మించగా, అందులో 150 మందికి మాత్రమే నిధులు చేరాయి. మిగతా 250 మందికి మరుగుదొడ్లకు సంబంధించిన నిధులు అందలేదు. అయితే కొంతమంది రూ.2వేలు ఇచ్చారని, రూ.3వేలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంమీద వడ్లమూడివారిపాలెం గ్రామంలో మరుగుదొడ్లలో రూ.30 లక్షల వరకు నిధులు గోల్మాల్ అయినట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామంలో చోటుచేసుకున్న ఉద్రిక్త వాతావరణం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. మరుగుదొడ్ల నిధులు అందని లబ్ధిదారులకు త్వరలో ఆ నిధులు అందేటట్టు చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన మీదట కేసు నమోదుకాకుండా ఇరువర్గాల వారు రాజీపడినట్టు సమాచారం. -
బహిర్భూమికి వెళ్లి యువకుడి మృతి..
గౌతంనగర్: ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే సదరు వ్యక్తికి సమాజంలో ఉండే గుర్తింపే వేరు. పైగా దేశ రక్షణలో పాలుపంచుకునే కొలువంటే ఇంకా గౌరవం. అందుకోసమే ఆ యువకులు భరతమాత రక్షణ సేవలో తరించాలని, ఆర్మీలో కొలువు సంపాదించాలని సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా ఇక్కడ మాత్రం కనీస ఏర్పాట్లు లేక ఎముకలు కొరికే చలిలో అల్లాడుతున్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం వచ్చిన యువకుల బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మౌలాలిలోని ఆర్ఫీఎస్ సెంటర్లో ఈ నెల 28 నుంచి ఆర్మీలో జేడీ, టైలర్, చెఫ్ కమ్యూనిటీ, స్పెషల్ చెఫ్, వాషర్మెన్, హెయిర్ డ్రెస్సెస్, మెస్ కీపర్ తదితర ఉద్యోగాల నియామకం కోసం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ ఎంపికలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా 10 వేల మందికి పైగా తరలివచ్చారు. వీరిలో 4,350 మందిని మాత్రం పరీక్షకు అనుమతిచ్చారు. సుమారు 6 వేల మంది రోడ్లపైనే ఉన్నారు. మంగళవారం రాజస్థాన్, మహారాష్ట్ర, అభ్యర్థుల ఎంపిక చేపట్టగా 2,945 మంది వచ్చారు. బుధవారం తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, డయ్యూ, డామన్, లక్షదీప్, మేఘాలయ, పుదుచేర్చి ప్రాంతాల నుంచి 4 వేల మందికి పైగా హాజరయ్యారు. అయితే, అన్ని రాష్ట్రాలకు కలిసి 85 పోస్టులు మాత్రమే ఉండగా.. మొత్తం 20 వేల మందికి పైగా యువకులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో యువకులు వస్తారని ఆర్మీ అధికారులు అంచనా వేయకపోవడం గమనార్హం. యువకులకు ఉచితంగా భోజనం పెడుతున్న మన క్యాటరింగ్ ప్రతినిధులు యువకుడు మరణించినా మేల్కోని యంత్రాంగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకుల కోసం టాయిలెట్లు, బాత్రూమ్లు ఏర్పాటు చేయాలనే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా బహిర్భుమికి వెళ్లిన వనపర్తి జిల్లా యువకుడు అరవింద్ విద్యుదాఘాతానికి బలైన విషయం తెలిసిందే. అయినా సరే మేల్కోని అధికారులు తాత్కాలికంగా మూడు మొబైల్ టైయిలెట్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వేల మంది యువకులకు రెండు మూడు బాత్రూమ్లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలియాలి. ఇక వచ్చిన వారికి అనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదు. ఇప్పటికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువకులు చలిలో వణుకుతూ రాత్రివేళ రోడ్ల మీదనే పడుకుంటున్నారు. తమ గోడు పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ యువకుల బాధలు చూడలేక ‘మన క్యాటరింగ్’ నిర్వాహకులు సెంటర్ సమీపంలో తాగునీరు, అల్పాహారం, భోజనం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఎన్నో కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసే ప్రభుత్వం, అధికారులు ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకులకు కనీస ఏర్పాట్లు చేయకపోవడాన్ని పలు విమర్శలకు తావిస్తోంది. పట్టించుకునే వారు లేరు ఆర్మీ సెలక్షన్స్ కోసం కర్ణాటక నుంచి ఒక రోజు ముందే మౌలాలి జేటీఎస్ సమీపంలోని ఆర్పీఎస్కు చేరుకున్నాం. రాత్రి పడుకోవడానికి కనీస వసతి లేదు. చలిలో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించాం. మా గోడు పట్టించుకునేవారు లేరు.– విటల్, అరుణ్ నాయక్ (కర్ణాటక) -
అలాంటి ఇళ్లలో మీరుంటారా..?
ఒంగోలు టూటౌన్ :‘బాత్ రూములు, టాయిలెట్స్ లేకుండా మీరు ఉంటున్నారా..? మనం ఉంటున్నామా చెప్పండి.. మరి అలాంటి భవనాన్ని ఎందుకు అద్దెకు తీసుకున్నారు. బయటకు వెళ్లాలంటే పిల్ల్లలు ఎంత భయపడతారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా’ అంటూ గిద్దలూరు మండలంలోని క్రిష్టింశెట్టిపల్లె గిరిజన సంక్షేమశాఖ వసతి గృహ అధికారిపై జిల్లా డీటీడబ్ల్యూఓ మండిపడ్డారు. వెంటనే ఆ భవనాన్ని మార్చాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పిల్లలను మన పిల్లలుగా చూడాలని హితవు పలికారు. స్థానిక ప్రగతి భవనంలోని గిరిజన సంక్షేమశాఖ, వెల్ఫేర్ కార్యాలయంలో వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలతో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వెంకట సుధాకర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ వార్డెన్, గురుకుల పాఠశాలల హెచ్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వివరాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా వసతిగృహాల్లో ఎంత మంది పిల్లలు ఉంటున్నారనే విషయంపై చర్చించారు. తక్కువగా ఉంటే పిల్లలను ఎందుకు చేర్పించలేకపోయారంటూ ప్రశ్నించారు. ఎక్కువ మంది వార్డెన్లు వర్కర్స్ లేరని, గతంలో పనిచేసిన వర్కర్స్కు జీతాలు ఇవ్వాల్సి ఉందని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు రూములకు నిధులు మంజూరైనా చాలా ప్రాంతాల్లో ఇంత వరకు పనులు ప్రారంభించలేదని తెలిపారు. మార్కాపురం వసతి గృహంలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, అయితే వర్కర్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని వసతిగృహం హెచ్‌డబ్ల్యూఓ తెలిపారు. గిద్దలూరు బాయ్స్ హాస్టల్ కట్టలేదని సమీక్ష దృష్టికి వార్డెన్ తీసుకువచ్చారు. వసతి గృహాల్లో పిల్లలను పెంచమని అడుగుతుంటే సౌకర్యాలు లేవని చెబుతారేంటని అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఉన్న రెండు కళాశాల వసతి గృహాల్లో తక్కువ మంది పిల్లలు ఉండటంపై వార్డెన్లను నిలదీశారు. వందమంది పిల్లలకు అవకాశం కల్పిస్తుంటే 40 నుంచి 50 మంది పిల్లలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఈ సారి సమావేశానికి కల్లా ఒక్కో వసతి గృహంలో 80 మంది పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేయడంతో పాటు ప్రసార మాద్యమాల్లో ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో వసతి గృహాలను తనిఖీ చేస్తామన్నారు. మంచి ఫలితాలు సాధించాలి.. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను బాగా చదివించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనానికి 3,533 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అవ్వగా, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు 900 రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లలో ఇంకా 242 మంది పిల్లల దరఖాస్తులకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉపకార వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి సమీక్షా సమావేశం నాటికి ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉండకూడదని సంబంధిత సెక్షన్ ఉద్యోగిని హెచ్చరించారు. ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ అధికారి జోజయ్య, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘స్వచ్ఛందంగా’ మెక్కేశారు!
ఆలూరు: మరుగుదొడ్ల నిర్మాణంలో హాలహర్వి మండలంలో జరిగిన అవినీతి బయటపడి కొద్ది రోజలు డవక ముందే హొళగుంద మండలం కూడా అదేబాట పట్టింది. థర్డ్‌పార్టీ ముసుగులో కొందరు అధికార పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసి నిజమైన లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండానే.. హొళగుంద మండలంలో స్వచ్ఛ భారత్ కింద మండలానికి 4,500 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైతే అందులో హొళగుంద గ్రామానికి 2 వేలు మంజూరయ్యాయి. అయితే కొందరు అధికార పార్టీ నేతలు థర్డ్‌పార్టీ ముసుగులో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు మింగేసినట్లు సమాచారం. బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండా థర్డ్‌పార్టీలుగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ఖాతాల్లో జమ అయ్యేలా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండానే బిల్లులకు ఓకే చెసినట్లు తెలుస్తోంది. దీంతో నిజమైన లబ్ధిదారులు బిల్లులు అందక బలైపోతున్నారు. ఇదిలా ఉండగా తమ పేరు మీద మరుగుదొడ్డి కట్టినట్లు, బిల్లులు కూడా మంజూరైనట్లు లబ్ధిదారులకు తెలియకపోవడం గమనార్హం. ఇలా ఒక్క హొళగుందలోనే వందలాది మరుగుదొడ్లకు సంబంధించి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా వాడుకున్నారంటే.. ఇంతకు ముందు మరుగుదొడ్డి కట్టుకున్న వారు, అసలు కట్టని వారి పేర్లను తెలుసుకొని ఇళ్ల వద్దకు వెళ్లి ఏవేవో చెప్పి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను సేకరించారు. వారికి తెలియకుండా లబ్ధిదారులుగా చేర్చి మరుగుదొడ్లు మంజూరు చేయించి పక్కా ప్రణాళికతో నిధులు కాజేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మరుగుదొడ్డికి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంది. అయితే అక్రమార్కులు టెక్నాలజీని ఉపయోగించి దొంగ రికార్డులు సృష్టించి భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అక్రమాలు బయట పడుతుండడంతో అక్రమార్కులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బిల్లుల డబ్బులు ఇచ్చేస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు సమాధానం ఇస్తున్నారని, గట్టిగా అడిగిన వారిని దబాయిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. చేతిలో బిల్లు పెట్టారు ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలనుకున్నాం. అయితే కొందరు వచ్చి మేము మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు చేతిలో బిల్లు కాగితం పెట్టారు. రూ.15వేలు బిల్లు కాజేశారు. దీంతో మేం మరుగుదొడ్డి నిర్మించుకునే వీల్లేకుం డాపోయింది.– శివప్ప, హొళగుంద గ్రామస్తుడు మా బిల్లు కాజేశారు మరుగుదొడ్డి నిర్మించుకుంటే బాగుంటుంది అనుకున్నాం. మొదటి మరగుదొడ్డి నిర్మించుకున్న వెంటనే బిల్లులు ఇస్తామన్నారు. అందుకని కొంత వరకు గుంతను తవ్వి రింగులు వేసుకున్నాం. తరువాత బిల్లు ఇవ్వకుండానే డబ్బు మీకుముట్టిందని చెప్పారు. దీంతో దొడ్డి నిర్మించుకోలేకపోయాం. మా డబ్బు తినేస్తారని అనుకోలేదు. బోయ నాగమ్మ, హొళగుంద -
బాలికను బలిగొన్న శౌచాలయం
కర్ణాటక, ముళబాగిలు: అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం నిర్మాణానికి ఒక నిండు ప్రాణం బలైంది. ఉజ్వల భవిత శిథిలాల కింద నలిగిపోయింది. తరగతి పాఠశాల శౌచాలయానికి వెళ్లిన సమయంలో అది కుప్పకూలి జ్యోత్స్న (13) అనే 7వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన కోలారు జిల్లా ముళబాగిలు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో జరిగింది. జ్యోత్స్న తాలూకాలోని ఎన్ బిసనహళ్లి గ్రామానికి చెందిన రైతు శంకరప్ప, విజయమ్మ దంపతుల కుమార్తె. బుధవారం ఉదయం పాఠశాలలో ప్రార్థనచేసిన అనంతరం జ్యోత్స్న శౌచాలయానికి వెళ్లింది. ఈ సమయంలో కట్టడం ఉన్నపలంగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కి చిన్నారి ఊపిరి వదిలింది. ఘటనతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఉపాధ్యాయులు, స్థానికులు బాలిక మృతదేహాన్ని కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. గత సంవత్సరమే దేవరాయ సముద్రలో ఉన్న వసతి పాఠశాలను ఇక్కడి ప్రైవేటు కట్టడంలోకి మార్చడం జరిగింది. ఈ సమయంలో శౌచాలయాలను పక్కన ఉన్న రాజకాలువ వద్ద నాసిరకంగా నిర్మించడంతోనే కుప్పకూలిందని ఆరోపణలున్నాయి. కలెక్టర్ పరిశీలన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ జె మంజునాథ్, జడ్పీ సీఈఓ సి జగదీష్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. పాఠశాలను దేవరాయ సముద్రం నుంచి ఈ కట్టడంలోకి మార్చడానికి కారణమైన ప్రిన్సిపాల్ తదితరులపైన, కట్టడం యజమానిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కీలుహొళలి గ్రామం వద్ద నూతన భవన నిర్మాణం 90 శాతం పూర్తయింది, అంతా అయ్యాక అక్కడికి మారుస్తామని కలెక్టర్ తెలిపారు. ఘటనను ఖండించి ప్రతిఘటన కట్టడం కూలి విద్యార్థిని మరణించడంతో ఇది జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించి ఎస్ఎఫ్ఐ, రైతు సంఘం తదితర సంఘాల కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదని కన్న తండ్రిపై..
వేలూరు: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించని తండ్రిపై చర్యలు తీసుకోవాలని రెండవ తరగతి చదివే విద్యార్థిని గత సోమవారం ఉదయం ఆంబూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వేలూరు జిల్లా రాజపురం వినాయకగుడి వీధికి చెందిన ఇసానుల్లా కుమార్తె హనిపా జార(7) అదే గ్రామంలోని ప్రవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతుంది. ఇంట్లో విద్యుత్ సరఫరా లేదు, మరుగుదొడ్డి లేదు. దీంతో కాలకృత్యాలకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, మరుగుదొడ్డి నిర్మించాలని పలుమార్లు తండ్రి వద్ద తెలిపినా పట్టించుకోకపోవడంతో వారి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ రామన్ వెంటనే చిన్నారి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని ఆదేశించారు. దీంతో ఆంబూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్చభారత్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మించే పనులు మంగళవారం ఉదయం ప్రారంభించారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు చిన్నారిని అభినందించారు. -
ఆరు బయటకు పరుగు తీయాల్సిందే...
విజయనగరం అర్బన్: పట్టణంలోని 39వ వార్డు పరిధిలో శాంతినగర్ ఉర్దూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలలో నేటికీ మరుగుదొడ్లు నిర్మించలేదు. అలాగే ఆరో వార్డు పరిధిలోని హుకుంపేట ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నా మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మరుగుదొడ్లు నిర్మించమని పలుమార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 102 వరకు ఉన్నాయి. మరోవైపు నిర్మించిన మరుగుదొడ్లు విద్యార్థుల సంఖ్యకు సరిపడిక... రన్నింగ్ వాటర్ సౌకర్యం లేక సుమారు 60 శాతం వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం విద్యారంగానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థంచేసుకోవచ్చు. అత్యవసరం అయితే అంతే.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,034 పాఠశాలలుండగా ఇప్పటికీ మరుగుదొడ్లు నిర్మించని పాఠశాలలు 102 వరకు ఉన్నాయి. విజయనగరం పట్టణ పరిధిలోని రెండు పాఠశాలలకు ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఆయా పాఠశాలలో ఆ రెండింటికీ విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యమంలా నిర్మించిన మరుగుదొడ్ల వ్యవహారం తూతూమంత్రంగా కనిపిస్తోంది. ఆగస్టులో నిధులు వెనక్కి వెళ్లిపోవడం నిర్మాణ పనులు ఆగిపోయాయి. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల సంఖ్య నిర్మించడం లేదు. సీతానగరం మండలం గాదిలవలస ఉన్నత పాఠశాలలో 540 మంది విద్యార్థులుండగా ఒక్క మరుగుదొడ్డి మాత్రమే నిర్మించారు. మరోవైపు దానికి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించలేదు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 60 శాతం వరకు ఉన్నాయి. అమలు కాని ఆదేశాలు.. ప్రభుత్వ పాఠశాలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ ఒలకపోస్తోంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వాహణ లోపాలను సరిదిద్దుకోవాలని ఇటీవల జిల్లాలో పర్యటించిన సుప్రీంకోర్టు బృందం సూచనలతోకూడిన ఆదేశాలిచ్చింది. అదేవిధంగా పాఠశాలల్లోని తాగునీరు, మరుగుదొడ్ల నిర్వాహణకు నెలవారీ నిధులివ్వాలని సూచించింది. అయితే ప్రభుత్వం మాత్రం పాఠశాలలను మూసివేయడానికి చూస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలు చూస్తే అనుమానాలు కలగకమానవు.నిధుల్లేక నిలిచాయి.. జిల్లాలో 43 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. మరో వంద మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. నిధులు మంజూరు కాకపోవడం వల్లే పనులు ఆగాయి. త్వరలో నిధులు విడుదలవుతాయి.వెంటనే పనులు చేపడతాం. – డాక్టర్ బీ.శ్రీనివాసరావు, పీఓ, ఎస్ఎస్ఏ -
బహిర్భూమికి వెళ్లి విద్యార్థి మృత్యువాత
కర్నూలు, పగిడ్యాల: పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కేసీ కాలువలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవనగర్ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీలు గుండెపోగు నడిపి ఈశ్వరయ్య, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శివశంకర్ నందికొట్కూరులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడైన రాఘవేంద్ర స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లిన రాఘవేంద్ర.. స్నేహితుడు బోయ పార్థుతో కలిసి సమీపంలోని కేసీ కాలువ గట్టుకు బహిర్భూమికి వెళ్లాడు. కాలకృత్యాలు ముగించుకుని కాలువలో శుభ్రం చేసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయాడు. ఇది గమనించిన స్నేహితుడు పార్థు రక్షించేందుకు చేయి అందించానని పేర్కొన్నాడు. చేయి అందుకున్న రాఘవేంద్ర తనను కూడా నీటిలోకి లాగడంతో భయాందోళనకు గురై విడిచిపెట్టగా మూడు సార్లు పైకి లేచి మునిగిపోయాడని తెలిపాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తనను గ్రామస్తులైన ముర్తుజావలి, చాకలి శ్రీనివాసులు శివాలయం వద్ద ఒడ్డుకు చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని కన్నీటి పర్యంతమయ్యాడు. పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం చెప్పగానే మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించడంతో హుటాహుటిన దేవనగర్ కాలనీవాసులు తరలివచ్చి కేసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. నందికొట్కూరు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఈశ్వరయ్య ముచ్చుమర్రి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు జలవనురుల శాఖ అధికారులతో మాట్లాడి ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదలను బంద్ చేయించారు. అనంతరం వెదురు బొంగుకు ఇనుప కొక్కాలను కట్టి కేసీ కాలువలో అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో శివాలయం వద్దనే మృతదేహం లభ్యం కావడంతో ఒడ్డుకు చేర్చారు. ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుగుదొడ్ల కొరత: పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 268 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురు 163 మంది, బాలికలు 105 మంది ఉన్నట్లు పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి వెల్లడించారు. బాలురకు రెండు, బాలికలకు తొమ్మిది మరుగుదొడ్లు ఉన్నాయి. దీంతో బాలురు మల, మూత్ర విసర్జన చేసేందుకు బయటకు వెళ్తున్నారు. ఉదయం 8.20 గంటలకే పాఠశాలకు వచ్చానని, విద్యార్థులు కేసీ కాలువకు వెళ్లిన సంగతి తనకు తెలియదని ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి తెలిపారు. పాఠశాలలో రెండు మరుగుదొడ్లు వినియోగించుకోవాలని విద్యార్థులకు చెప్పామన్నారు. కన్నీరు మున్నీరుగావిలపించిన తల్లిదండ్రులు బడికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన కుమారుడు కొన్ని నిమిషాలకే మత్యువాతకు గురికావడం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ‘‘రెక్క లు ముక్కలు చేసుకుని పెద్ద చేస్తిమి కదా నాయనా.. అంతలోనే నీకు నూరేండ్లు నిండినాయా తండ్రీ’’ అంటూ తల్లి లక్ష్మీదేవి రోదించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. -
ఆత్మశుద్ధి లేని ‘స్వచ్ఛ’ ఉద్యమమేల?
గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగి నప్పుడు మనం తన్నులాడుకోవలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. గాంధీజీ నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అందజేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. భారత రిపబ్లిక్ కాస్తా నేడు అసహన భారతంగా రూపొందింది. 2010–18 మధ్య దేశ పౌరులపై 63 వేధింపులు, హత్యలు నమో దుకాగా, కేవలం 2014 మే తర్వాతనే 61 హత్య కేసులు నమోదయ్యాయి. ఇంతటి స్థాయిలో దేశపౌరులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ హింసాకాండను కళ్లతో చూస్తూ కూడా స్పందించలేనివారిగా మిగిలి పోతున్నాం. కాగా, మరోవైపున అసలు సంఘర్షణ జరుగుతున్నది సమా జంలో అణగారిన వర్గాలతో–కుల మతాలు, వ్యక్తిగత విశ్వాసాలు కల్గి అవతల గట్టున ఉన్న అసంఖ్యాక ప్రజలతోనని గ్రహించాలి. ఈ పరి ణామం మొత్తం గాంధేయ తాత్విక దృష్టిని బలవంతంగా పక్కకు నెట్టేసిన ఫలితమే.– జస్టిస్ (రిటైర్డ్) ఎ.పి.షా: హైదరాబాద్ ‘గాంధీ మంథన్ సంవాద్’లో ప్రసంగం, 2–10–18 గాంధీజీని పాలకులు నేడు ఒక టాయిలెట్ నినాదానికి, ఓ కళ్లజోడు ఫ్రేము కిందికి దిగజార్చి మానవశ్రమలోని హుందాతనాన్ని కేవలం కక్కూసు దొడ్లకు కుదించి, ప్రచారం కోసం పాలక పెద్దలు చీపుళ్లు చేత పట్టుకుని కొద్ది నిమిషాల సేపు వీధులు ఊడుస్తున్నట్టు చూపించే నాలుగు కెమెరాలకు దిగజార్చారు.– జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, 2–10–18 గాంధీజీ విదేశాల్లో ఉండగా, దక్షిణాఫ్రికా ఫీనిక్స్ సెటిల్మెంట్ టాల్ స్టాయ్ క్షేత్రంలో, ఎరవాడ జైల్లో తానున్న చోట కక్కూసు దొడ్లను (టాయిలెట్స్) తానే శుభ్రం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. ఆయనతో పాటు భార్య కస్తూరీబాయి కూడా అదే పనిచేశారు. స్వతంత్ర భారత పాలకులెవరూ అలాంటి జీవనవిధానం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచినవారని భావించలేం. టాల్‌స్టాయ్, తోరో, రస్కిన్ బోధల ఆధా రంగా ఏర్పడినదే ఫీనిక్స్ సెటిల్మెంట్ క్షేత్రం. తర్వాత దేశంలోని జైళ్లలో, సబర్మతీ ఆశ్రమం, ఇతర ఆశ్రమాల్లో గాంధీ అనుసరించిన జీవన విధా నానికి ఆయన మార్గంలో పయనిస్తున్నామని చెప్పే రాజకీయపక్షాల నేతల తీరుకూ పోలికే లేదు. ప్రస్తుత పాలకవర్గంలోని ‘భద్రమూర్తులు’ ఎన్నికల ముందు, ఆ తర్వాత ‘చిట్కా’ విధానాలతో కాలక్షేపం చేస్తు న్నారు. దక్షిణాఫ్రికాలో, మనదేశంలో అనుసరించిన సిద్ధాంత విలువల్లో గాంధీజీ ప్రత్యేకత కనిపిస్తుంది. విదేశాల్లోనూ, ఇక్కడా కూడా సత్యా గ్రహ ఆశ్రమాల్లో కామన్ వంటశాల ఉన్నప్పుడు అస్పృశ్యత పేరిట ఆశ్ర మవాసులు కొందరు దళిత కుటుంబీకులతో కలిసి భోజనం చేయడానికి సంకోచించి, పక్కన కూర్చోవడానికి నిరాకరించిన సందర్భాల్లో గాంధీ పాత్ర చాలా గొప్పది. దళితులతో కలిసి భోంచేయడం తప్పు కాదని, పాపం కాదనీ వారికి ఆయన ‘క్లాస్’ పీకవలసివచ్చింది. అన్ని ఆశ్రమ సమావేశాల్లోనూ రెండు పూటలా అన్ని మతాలవారినీ స్వయంగా కలు పుకుని ప్రార్థనలు నిర్వహించేవారు. అలా అన్ని మతాలవారితో కలిసి భోజనాలు, భజనలు చేసేవారు. మత ఛాందసులను సైతం కలుపుకు పోవడం ద్వారా గాంధీజీ మానవ జీవితాన్ని సమానత్వ పునాదులపై నిర్మించారు. ఆ ప్రాతిపదికన అన్ని కులాలు, మతాల వారి కుల దుర హంకారాన్ని, వివక్షను ఛేదించడానికి ఆయన కృషి చేశారు. ఇంతకీ దేవుడనేవాడు ఎక్కడున్నాడంటే–‘శ్రమలో మాత్రమే’ అని ఎన్నో సంద ర్భాల్లో ఆయన చెప్పేవారు. మానవునిలోని ఆ శ్రమైక జీవన సౌంద ర్యాన్ని ఆయన గుర్తించినందునే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కూడా స్వేచ్ఛగా పాల్గొనగలిగారు. ప్రచారం కోసమే శుద్ధి విన్యాసాలు! ఈనాటి దేశ పాలకులు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రచారం కోసమే చేపడుతున్నారు. స్వాతంత్య్రోద్యమ మౌలిక లక్ష్యాలైన సామాజిక, రాజకీయ, ఆర్థిక సమూల పరివర్తనను విస్మరించారు. ఈ నేతలు సూటూ– బూటూ వేసుకుని వీధులు శుభ్రం చేస్తున్నట్టు నడుం వంచినట్టుగా కనిపించే కెమెరా షాట్లతో సరిపెట్టుకునే విన్యాసంగా మలిచారు. అదైనా దేశవ్యాప్తంగా శ్రద్ధగా అమలు చేశారా అంటే లేదని న్యూస్ వెబ్సైట్ ‘ద వైర్’ ప్రతినిధి కబీర్ అగర్వాల్ గాంధీ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం రోజునే వివరించారు. అంతేకాదు, 2014 నుంచి ఇప్పటి వరకూ గ్రామీణ భారతంలో ‘స్వచ్ఛ భారత్’’ పేరిట తలపెట్టిన టాయిలెట్స్ నిర్మాణ పథకం అమలు జరుగుతున్న తీరును వివిధ దేశీయ, ప్రపంచ సాధికార సర్వే సంస్థలు ఎండగట్టాయి. ప్రపంచవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనకు ప్రధాన కారణం టాయ్‌లెట్ మరు గుదొడ్ల సౌకర్యాలు లేకపోవడం. ఈ సమస్యను పరిష్కరించకుండా పారి శుద్ధ్య కార్మికుల(సఫాయి కర్మచారి)ఉపాధిని దెబ్బదీస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెంచకుండా పాలకులు టాయిలెట్స్ నిర్మించడానికి ఉత్తర్వులు జారీచేయడం వల్ల ఫలితం ఉండదని జాతీయ కర్మచారీ ఆందోళన్ సంస్థ ఎన్నోసార్లు ప్రకటించింది. ఆధునిక పరికరాల సాయంతో పౌర నివాసాల్లో మురికి నీళ్లు, బురద, మానవులు విసర్జించే మలమూత్రాలను క్షణాల్లో తొలగించే యాంత్రిక పద్ధతులు ప్రవేశపెట్టా లని జాతీయ కర్మచారీ సంఘం పదేపదే కోరుతూ వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులు తమ చేతులు ఉపయోగించి ఈ పనులకు దిగకుండా పైన చెప్పిన ప్రత్యామ్నాయాన్ని తక్షణం అమల్లోకి తీసుకురావాలని ఈ సంస్థ ఏళ్ల తరబడిగా మొత్తుకుంటోంది. మురుగు కాలువల్లోకి దిగి పనిచేస్తూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. అయినా, వంద లాది మంది సఫాయీ కార్మికులు ఇలా మరణిస్తూంటే కేవలం డజన్ల కేసుల్లో మాత్రమే నష్టపరిహారం చెల్లింపు జరిగింది. ఫలితంగా 2017లో ప్రతి ఐదు రోజులకు సగటున ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు మరణిస్తున్నా డని తేలింది. పైగా పార్లమెంటు చట్టం ప్రకారం సఫాయీకర్మచారులకు జాతీయస్థాయిలో కమిషన్ ఏర్పడినా పరిస్థితుల్లో మార్పురాలేదు. గ్రామసీమల్లో జరిగింది అంతంత మాత్రమే! గ్రామ సీమల్లో టాయిలెట్ సౌకర్యాల గురించి అధికార స్థాయిలో వెలువ డుతున్న ప్రకటనలేగాని ఆచరణలో ఫలితాలు ప్రచారం జరిగినంతగా కనిపించలేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. గమ్మత్తేమంటే, ప్రభుత్వ టాయిలెట్స్ నిర్మాణ ప్రచారంలో చెప్పుకున్నట్టు దేశంలోని 28 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ కమిషన్ లెక్కల ప్రకారం కేవలం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మాత్రమే కర్మచారుల మృతి వార్తలు నమోదయ్యాయి. పనిలో ఉన్న సఫాయీ కర్మచారులు ఎందరు చనిపోయారన్న వివరాలు ఇంగ్లిష్, హిందీ పత్రి కల్లో వచ్చినంతగా ప్రాంతీయ భాషా పత్రికల్లో రిపోర్టవుతున్న మరణాల సంఖ్య మాత్రం గణనలోకి రావడం లేదు. ఎందుకంటే, పారిశుద్ధ్య కార్మికుల ఉపాధి, పునరావాసానికి చెందిన 2013 నాటి ప్రభుత్వ లెక్కలే ఈ దుస్థితిని బహిర్గతం చేస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భౌతికంగా చేతులు ఉపయోగించి నిర్వహించే పారిశుద్ధ్య పనులపై విధించిన నిషేధం నాటికి సమయంలో దేశంలో ఉన్నవి 7,40,078 ఇళ్లు. కాగా, సామాజిక, ఆర్థికపరంగా 2011లో కుల ప్రాతిపదిక ఆధారంగా నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం చేతులు ఉపయోగించి మరుగు దొడ్లు కడిగే కర్మచారుల కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే గ్రామీణ భార తంలో ఉన్నాయి. ఈ పరిస్థితికి తోడుగా, ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఆర్భాటంగా ‘గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్’ అమలులోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లాంటి బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. అయితే, తాను దేశ ప్రధాని అయిన తరు వాత బిహార్‌లో ఎనిమిది లక్షల ఇళ్లకు టాయిలెట్లు అందించానన్న మోదీ ప్రకటనను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండిస్తూ, అందులో 6 లక్షలకు పైగా టాయిలెట్లు తాను ఏర్పాటు చేసినవేనని బహిరంగంగా ప్రకటిం చాల్సి వచ్చింది. అనేక గ్రామాల్లో ఏ మేరకు టాయిలెట్ సౌక ర్యాలను ప్రభుత్వం కల్పించిందో లెక్కలు తీసేందుకు వెళ్లిన పరిశోధనా సంస్థలు అయిదు ఉత్తర భారత రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించగా వివిధ స్థాయిల్లో పంచాయతీ అధ్యక్షుల నుంచి ప్రభుత్వ అధికారుల దాకా ఎక్కువమంది వివరాలు తెలపడానికి జంకి నోరు మెదపలేదని తేలింది. గాంధీజీని హత్య చేసి, ఉరిశిక్షపడిన నాథూరాం గాడ్సే నీడను భారత ప్రజలు మాపేసుకున్నారు గానీ, దేశ పాలనా వ్యవస్థలోని కొందరు ఈ రోజుకీ వదిలించుకోలేకపోతున్నారు. ఆ నీడ చాటునే కొందరు బీజేపీ నాయకులు ఈ రోజుకీ దాగుడుమూతలాడుతున్నారు. గాంధీని గాడ్సే హత్య చేయడాన్ని మహాత్ముడి 150వ జయంతినాడే బీజేపీ నాయకురాలు ప్రీతీ గాంధీ సమర్థించారు. కానీ, ఆ ప్రకటనను గౌరవ ప్రధాని నరేంద్రమోదీ ఖండించిన వార్తను ఇంత వరకు మనం చూడలేదు. నిజానికి గాంధీ తన బలిదానానికి మూడు మాసాల ముందే (1947 అక్టోబర్ 4న) దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ,‘‘దేశంలో హైందవ ధర్మాన్ని హిందువులే సర్వనాశనం చేస్తూ ఉండటాన్ని నేను భరించలేకపోతున్నాను. మనం అంతా ఒకే దేశం వాళ్లం. అందరం ఒక్కటే. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు, క్రైస్తవులు అందరం ఐక్యంగా ఒక్క శక్తిగా మెలిగినప్పుడు మనం తన్నులాడుకో వలసిన అవసరం లేదు’’ అని సందేశమిచ్చారు.. అందుచేత గాంధీజీ ఇంత విస్తృతమైన నిండు మనస్సుతో, ఆర్ద్రతతో, మానవత్వంతో అంద జేసిన సువిశాలమైన సందేశాన్ని ఆచరణలో పాటించకుండా ఆయన బోధనల్ని కేవలం ‘టాయిలెట్’ సమస్యకే పరిమితం చేయబోవడం అనేక వింతలలో మరొక వింత. ‘భాండశుద్ధిలేని పాకమదియేల’ అని వేమన అన్నట్టుగానే ఆత్మశుద్ధిలేని ‘స్వచ్ఛ భారత్’ ఏల అనుకోవాలి!! ఏబీకే ప్రసాద్(abkprasad2006@ahoo.co.in), సీనియర్ సంపాదకులు -
హీరోలా ప్రశ్నిస్తే ఏ పనీ జరగదు
అనంతపురం, గుంతకల్లు రూరల్: ‘ఏదైనా పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అధికారులను ప్రాధేయపడాలి. అంతేకానీ హీరోలా ప్రశ్నిస్తే పనులేమీ జరగవిక్కడ. ముందు ఆఫీస్‌లో నుంచి కాలు బయటకు పెట్టి మాట్లాడు. లేదంటే పోలీస్ కేసు పెడతా’ అంటూ గుంతకల్లు ఎంపీడీఓ శంకర్ వ్యక్తిగత మరుగుదొడ్డి లబ్ధిదారుపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకెళితే.. మొలకలపెంట గ్రామానికి చెందిన నారాయణస్వామి భార్య ఈశ్వరమ్మ పేరిట వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైంది. అయితే ఆర్థిక స్థోమత లేక పనులు మొదలుపెట్టకపోయారు. దీంతో తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీఓ శంకర్లు దగ్గరుండి వారి ఇంటి దగ్గర మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంతలో నారాయణస్వామి అన్న మృతి చెందడంతో దాదాపు 40 రోజుల పాటు పనులను నిలిపివేయాల్సి వచ్చింది. జాబితా నుంచి పేరు తొలగింపు మరోవైపు త్వరితగతిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. కొన్ని నిర్మాణాలు ప్రారంభం కాకపోయినా, మధ్యలోనే నిలిచిపోయినా వాటిని జాబితాలోంచి తొలగించి.. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు ఉన్నతాధికారులకు లెక్కలు చూపించారు. నారాయణస్వామి తన అన్న మరణానంతర కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి మరుగుదొడ్డి పనులు పూర్తి చేశాడు. బిల్లు చేయలేం.. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయినప్పటికీ బిల్లు రాకపోవడంతో నారాయణస్వామి శుక్రవారం ఎంపీడీఓను కార్యాలయంలో కలిసి సమస్యను విన్నవించుకున్నాడు. నిర్మాణం జాప్యం జరగడంతో జాబితాలోంచి పేరు తొలగించామని, ఇప్పుడు బిల్లు ఏమీ చేయలేమని ఎంపీడీఓ అసహనంతో చెప్పారు. దగ్గరుండి మీరే నిర్మాణ పనులు ప్రారంభించి.. ఇప్పుడు పేరు తొలగిస్తే ఎలా అని ప్రశ్నించిన నారాయణస్వామిపై ఎంపీడీఓ కోపోద్రిక్తులయ్యారు. నీ దిక్కున్నచోట చెప్పుకో అంటూ గద్దించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మంజూరు కాకపోతే ఏంటి పరిస్థితి అని డీలాపడిపోయిన నారాయణస్వామి ఒక అడుగు వెనక్కు తగ్గాడు. అప్పుడు ఎంపీడీఓ స్పందిస్తూ ‘ప్రాధేయపడి అడుక్కుంటేనే ఏదైనా పని జరుగుతుంది. గట్టిగా అడిగితే ఏ పనీ జరగదు’ అంటూ మందలించడంతో బాధితుడు నారాయణస్వామి కన్నీరుపెట్టుకుంటూ బయటకు నడిచాడు. -
మొబైల్ స్క్రీన్ కంటే మరుగుదొడ్డే నయం!
మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వస్తువుగా మొబైల్ ఫోన్ మారిపోయింది. మనలో చాలా మంది పొద్దున లేవగానే ఫోన్ ఎక్కడుందా అని వెతుక్కుంటాం. ఫోన్ చెక్ చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలు పెడతాం. అయితే మనం రోజూ పదులసార్లు టచ్ చేసే మన మొబైల్ స్క్రీన్‌పై టాయ్లెట్లో కంటే మూడు రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఫోన్ వినియోగదారుల్లో కనీసం 35 శాతం మంది ఎప్పుడూ తమ మొబైల్ స్క్రీన్లను ఎటువంటి లిక్విడ్లు ఉపయోగించి శుభ్రపరచలేదని ఇంగ్లండ్‌కు చెందిన ‘ఇన్య్సూరెన్స్ టూ గో’ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు స్కై.కామ్ వెబ్సైట్ పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు వాడే ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరు నెలలోపు తమ మొబైల్ స్క్రీన్లను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన మూడు ఫోన్ల స్క్రీన్లపై ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ఒక్కో స్క్రీన్‌పై సుమారుగా 84.9 యూనిట్ల క్రిములను గుర్తించారు. స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 30 యూనిట్ల క్రిములు, లాక్ బటన్‌పై 23.8 యూనిట్లు, హోమ్ బటన్‌పై సుమారుగా 10.6 యూనిట్ల క్రిములు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. టాయ్‌లెట్, ఫ్లష్‌పై 24 యూనిట్ల క్రిములు ఉంటాయి. ఆఫీసులో ఉపయోగించే కీ బోర్డులు, మౌస్లపై ఐదుశాతం క్రిములు ఉంటాయి. మొబైల్ ఫోన్ల స్క్రీన్లపై ఉన్న ఈ బ్యాక్టీరియా కారణంగా చర్మసంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు(40 శాతం), 35 సంవత్సరాల లోపు వారు 60 శాతం మంది లేచిన వెంటనే ఐదు నిమిషాల వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. అలాగే పడుకునే ఐదు నిమిషాల ముందు వరకు ఫోన్లను పరిశీలిస్తున్న వారిలోనూ 60 శాతం మంది 35 సంవత్సరాల లోపు వారే ఉన్నారు.