Union Budget 2020
-
‘పన్ను’ పరిష్కారాలకు ‘వివాద్ సే విశ్వాస్’
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సాయపడేందుకే వివాదాల పరిష్కార పథకం ‘వివాద్ సే విశ్వాస్’ను బడ్జెట్లో ప్రకటించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘‘ఈ పథకం పన్ను వివాదాల్ని పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పన్ను చెల్లింపుదారులు.. కేసుల పరిష్కారానికి ఎంతో సమయాన్ని, డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఈ పథకం వాటిని ఆదా చేస్తుంది’’ అని తెలియజేస్తూ.. ‘డైరెక్ట్ ట్యాక్సెస్ వివాద్ సే విశ్వాస్, 2020’ బిల్లును సోమవారం పార్లమెంట్లో మంత్రి ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ పథకం..? ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కమిషనర్, అప్పీల్స్, ఆదాయపన్ను శాఖ.. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్.. హైకోర్టు.. సుప్రీంకోర్టు వంటి పలు అప్పిలేట్ వేదికల వద్ద 4,83,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9 లక్షల కోట్లు రావాల్సి ఉంది. వీటిలో అధిక భాగాన్ని ఈ ఏడాది మార్చి చివరికి పరిష్కరించి, పన్నుల ఆదాయం పెంచుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. ఈ పథకంలో కింద... వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించినట్లయితే వారికి ఎలాంటి జరిమానాలూ ఉండవు. పైపెచ్చు క్షమాభిక్ష కల్పిస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆ వివాదానికి సంబంధించి చట్టపరమైన విచారణలు లేకుండా రక్షణ పొందొచ్చు. ఎవరికి వర్తిస్తుంది.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన డిమాండ్ నోటీసులను వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లిన వారు.. 2020 మార్చి 31 నాటికి బకాయిలను చెల్లిస్తే చాలు. దానిపై వడ్డీ, పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేస్తుంది. గడువు నాటికి చెల్లించలేకపోతే, మార్చి తర్వాత జూన్ 30 వరకు మరో విడత గడువు లభిస్తుంది. కానీ, మార్చి 31లోపు చెల్లించాల్సిన దానితో పోలిస్తే ఆ తర్వాత 10 శాతం అదనంగా చెల్లించాలి. 2020 జనవరి 31 నాటికి పలు అప్పిలేట్ ఫోరమ్‌ల వద్ద నమోదై, అపరిష్కృతంగా ఉన్న కేసులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పన్ను చెల్లింపులు రూ.5 కోట్లలోపు ఉన్న సోదా కేసులకే ఇది వర్తిస్తుంది. ఎంత మేర చెల్లించాలి..? సోదా కేసులు: ఆదాయ పన్ను, వడ్డీ, పెనాల్టీల రూపంలో చెల్లించాల్సిన మొత్తానికి మరో 25 శాతం కలిపి మొత్తం 125 శాతాన్ని మార్చి చివరి నాటికి చెల్లించడం ద్వారా వివాదాలను తొలగించుకోవచ్చు. మార్చిలోపు సాధ్యం కాకపోతే, తర్వాత జూన్ 31 నాటికి 135 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సోదా జరగని కేసులు: పన్ను, పెనాల్టీ, వడ్డీ రేటుపై వివాదం ఉంటే... ఆ మొత్తాన్ని (100 శాతాన్ని) మార్చి చివరిలోపు చెల్లించడం ద్వారా వివాదాన్ని మాఫీ చేసుకోవచ్చు. ఈ గడువు దాటితే జూన్ చివరికి 110 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఆదాయపన్ను కింద రూ.1,00,000 చెల్లించగా.. ఆదాయపన్ను శాఖ మాత్రం చెల్లించాల్సిన పన్ను ఆదాయం రూ.1,50,000గా తేల్చి, దీనికి రూ.20,000 వడ్డీ కింద, రూ.1,00,000 పెనాల్టీ కింద చెల్లించాలని డిమాండ్ చేసి ఉంటే.. అప్పుడు వివాదంలో ఉన్న మొత్తం రూ.1,70,000 అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ పన్ను చెల్లింపుదారు అప్పీల్ కోసం దాఖలు చేసి ఉంటే.. ఈ కేసులో కేవలం రూ.50,000ను మార్చి చివరికి చెల్లించడం ద్వారా మాఫీ చేసుకోవచ్చు. మార్చి తర్వాత అయితే 10% అదనంగా రూ.55,000 చెల్లించాల్సి ఉంటుంది. ♦ ఇక కేవలం పెనాల్టీ, వడ్డీ రేటుపైనే వివాదం ఉన్నట్టయితే, చెల్లించాల్సిన మొత్తంలో మార్చి ఆఖరు నాటికి కనీసం 25% చెల్లిస్తే చాలు. ఆ తర్వాత జూన్‌లోపు అయితే చెల్లించాల్సిన మొత్తం 30 శాతం అవుతుంది. ఇవన్నీ కూడా పన్ను చెల్లింపుదారులు అప్పీలు దాఖలు చేసిన కేసులకే వర్తిస్తాయి. ఒకవేళ ఆదాయపన్ను శాఖే అప్పీల్‌కు వెళ్లి ఉంటే, చెల్లించాల్సిన మొత్తం ఇంత కంటే తక్కువగా ఉంటుంది. అందరికీ ఈ పథకం వర్తించదండోయ్.. ఈ ప్రతిపాదిత పథకం కొన్ని వివాదాలకు వర్తించదు. పన్ను చెల్లింపుదారుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరంభమై ఉన్నా...సోదాలు జరిగి, రూ.5 కోట్లకు పైగా విలువైన స్వాధీనాలు చోటు చేసుకున్నా... బయటకు వెల్లడించని విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు కలిగి ఉన్న కేసులైనా... భారతీయ శిక్షాస్మృతి, మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్నా... అటువంటి వారు ఈ పథకం కింద వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉండదు. -
‘ఏ రాష్ట్రానికీ తగ్గించలేదు’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రానికీ నిధులు తగ్గించలేదని, ఏ రాష్ట్రాన్ని కూడా చిన్నచూపు చూడాలన్న ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటాను 42% నుంచి 41 శాతానికి తగ్గించింది తాము కాదని, ఆర్థిక సంఘం సిఫారసు మేరకే నిధులు కేటాయించామని చెప్పారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గిన కారణంగా ఆ నిధులను అన్ని రాష్ట్రా లకూ పంచామని, అదే విధంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరగడంతో వాటికి నిధుల కేటాయింపునకుగాను పన్నుల వాటా తగ్గించాలన్న ఆర్థిక సం ఘం సిఫారసునే అమలు చేశామ న్నారు. కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాలతో సమావేశ మయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్ విలే కరుల సమావేశంలో మాట్లాడారు. పన్నుల వాటా తగ్గించలేదు... ‘2011 జనాభా లెక్కల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. ఆర్థిక సంఘం వచ్చే ఏడాదికి సంబంధించిన సిఫారసులు మాత్రమే చేసింది. మరో నాలుగేళ్లకుగాను త్వరలోనే సిఫారసులు ఇస్తుంది’ అని నిర్మలా సీతారామన్ వివరించారు. రాష్ట్రాలకు తాము సహకరించడం లేదనేది సరికాదని, పన్నుల వాటా కేంద్రం తగ్గించలేదని చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలు విన్నా...! కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ నాయకులు మాట్లా డింది తాను విన్నానని, ఓ మంత్రి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇచ్చింది అనడం సరికాదని, అది తమ హక్కు అని వ్యాఖ్యానించడం తన దృష్టికి వచ్చిందని నిర్మలా సీతారామన్ పరోక్షంగా కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దేశ ప్రగతి కోసం ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదని, అన్ని రాష్ట్రాలూ తమ వంతు కృషి చేస్తున్నాయన్నారు. కేంద్రానికి చెల్లించే పన్నుల్లో తెలంగాణ వాటా ప్రశంసనీయమని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే కేంద్రం ఇచ్చింది అనే పదం చెప్పడానికి పార్లమెంటు అనుమతి ఉందని, ఇచ్చింది అనే పదం సరైంది కాదనే భావన ఉంటే ఆ విషయం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయాలని, ఇచ్చింది అనే పదం అన్‌పార్లమెంటరీ అని స్పీకర్‌ను చెప్పమనాలని సూచించారు. అలా చేయకుండా మీరు ఇచ్చారంటారేంటి? మేం మా వాటా ఇస్తున్నాం కదా... అని అనడం ఒక రకంగా అనిపించిందని నిర్మల వ్యాఖ్యానించారు. సమాఖ్య స్ఫూర్తే ప్రధాని ఉద్దేశం... ఏ రాష్ట్రాన్నీ తగ్గించి చూడాలన్నది తమ ఉద్దేశం కాదని, సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలతో సహకారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని నిర్మలా సీతారామన్ వివరించారు. 2019–20 బడ్జెట్‌తో పోలిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క పథకానికీ నిధులు తగ్గించలేదని ఆమె చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల డిమాండ్‌ను బట్టి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో కొత్త విధానాన్ని తీసుకువచ్చామని, రాయితీలు లేని స్పష్టమైన, సులభతరమైన పన్ను రేటు తగ్గింపే కేంద్రం ఉద్దేశమని చెప్పారు. అయితే ఏ విధానంలో పన్ను చెల్లించాలన్నది చెల్లింపుదారుల ఇష్టమని, ఫలానా విధానం ద్వారానే ఐటీ చెల్లించాలని తాము ఒత్తిడి చేయబోమని స్పష్టం చేశారు. జీఎస్టీ పరిహారం అందరికీ నిలిపేశాం... జీఎస్టీ పరిహారం నిధులు ఒక్క తెలంగాణకే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ నిలిపివేశామని నిర్మలా చెప్పారు. జీఎస్టీ చట్టం ప్రకారం పరిహారం నిధులను వసూలైన పరిహారం సెస్ నుంచే చెల్లించాల్సి ఉందని, ఇప్పటివరకు తమకు వచ్చిన సెస్ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపిణీ చేశామని, అదనంగా చెల్లించేందుకు తమ వద్ద సెస్ నిల్వ లేదని వివరించారు. సెస్ వసూళ్లను బట్టి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, రూ. 2 వేల నోట్లు రద్దవుతున్నాయన్న విషయం తన దృష్టికి రాలేదని నిర్మల చెప్పారు. తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ సిఫార్సు వాస్తవమే... తెలంగాణకు స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఏ పద్దు ద్వారా చెల్లించాలి, గతంలో ఈ పద్ధతి ఉందా... చెల్లింపులకు వీలవుతుందా అనే అంశాలను పరిశీలించాలని తిరిగి ఆర్థిక సంఘానికే ఈ ప్రతిపాదన పంపినట్లు నిర్మల చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే రైల్వే పనులు నిలిచిపోయాయన్న వాదనలో నిజం లేదని, తాము నిధులు ఇస్తున్నామని, స్థానిక సమస్యల కారణంగానే రైల్వే పనులు నిలిచిపోయి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఫలానా పని ఆగిపోయిందని తన దృష్టికి తెస్తే రైల్వే శాఖకు పంపుతామని చెప్పారు. బడ్జెట్‌పై ఇప్పటివరకు పర్యటించిన మూడు నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ ఎక్కువగా ఐటీ చెల్లింపు విధానం, ఐటీ వివాదాల పరిష్కారం లాంటి అంశాలపైనే పారిశ్రామిక వర్గాలు వివరాలు అడుగుతున్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా నిర్మల చెప్పారు. నాది ‘టూటా బూటా’ హిందీ విలేకరుల సమావేశంలో భాగంగా ఓ హిందీ విలేకరి, మరో తెలుగు విలేకరి కలిపి అడిగిన ప్రశ్నకు నిర్మల ఆంగ్లం, తెలుగులో జవాబిచ్చారు. ఆ తర్వాత హిందీ విలేకరిని ఉద్దేశించి ‘మీకు హిందీలో చెప్పలేదు కదా...! నాది టూటా బూటా హిందీ.... అందుకే చెప్పలేదు’ అంటూ చమత్కరించారు. అయితే విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబులు దాటవేశారు. కేంద్ర ఆర్థిక విధానాల వల్లే తెలంగాణ నష్టపోతోందని, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిలిచిపోయాయని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది కదా అని ప్రశ్నించగా, తాను సమాధానం చెప్పదల్చుకోలేదని నిర్మల పేర్కొన్నారు. రాష్ట్ర విభజన హామీలకు అనుగుణంగా నిధుల కేటాయింపు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నిధుల కోసం నీతీ ఆయోగ్ సిఫారసులు తదితర ప్రశ్నలకు కూడా ఆమె చిరునవ్వుతోనే సమాధానమిచ్చారు. తెలంగాణకు నిధులు 128 శాతం పెరిగాయి.. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వని విధంగా తెలంగాణకు కేంద్రం నిధుల కేటాయింపు చేస్తోందని కేంద్ర వ్యయ శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ చెప్పారు. 2010–15 వరకు రాష్ట్రానికి మొత్తం రూ. 46,747 కోట్ల పన్నులు, గ్రాంట్లు, ఇతర రూపాల్లో ఇవ్వగా 2015–20 వరకు అది రూ. 1,06,606 కోట్లకు పెరిగిందన్నారు. అలాగే ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి రాష్ట్రం తీసుకొనే అప్పుల పరిమితిని కూడా 3 నుంచి 3.5 శాతానికి పెంచామన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌భూషణ్ పాండే తదితరులు పాల్గొన్నారు. చదవండి : బడ్జెట్ గురించి అందరికీ తెలియాలి -
బడ్జెట్ గురించి అందరికీ తెలియాలి
సాక్షి, హైదరాబాద్ : కేంద్రం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి ప్రతి భారతీయుడికి తెలియాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ రూపకల్పనతో పాటు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మార్పుచేర్పుల కోసం నిపుణులు, ఆర్థికవేత్తల సలహాలు సూచనలు తీసుకోవడం ఎంత ముఖ్యమో బడ్జెట్‌పై సామాన్యుడికి అవగాహన ఉండటం కూడా అంతే ముఖ్య మని, అదే ప్రధాని మోదీ ఉద్దేశమని ఆమె వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆమె వాణిజ్య, పరిశ్రమ వర్గాలు, బ్యాంకర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, విద్యారంగ నిపుణులు, విధాన రూపకర్తలతో సమావేశమై కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సమాలోచనలు జరిపారు. పలు రంగాల ప్రతినిధుల సందేహాలకు ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సమాధానమిచ్చారు. అంతకు ముందు ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ తయారీలో ముందుకెళ్లాల్సి ఉంటుం దన్నారు. బడ్జెట్ రూపకల్పన కోసం గత జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 8 నెలల పాటు సుదీర్ఘ కసరత్తు చేశామని తెలిపారు. ఆర్థిక శాఖ లోని ప్రతి కార్యదర్శి శాఖల వారీగా కసరత్తు చేశారని, అన్ని వర్గాలు, అన్ని శాఖలు, అన్ని విభాగాలను సంప్రదించి కేటాయింపులు జరిపామన్నారు. ఎంఎస్ఎంఈ కోసం పోరాడుతున్నా.. బడ్జెట్‌పై సమావేశంలో భాగంగా ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధిపై ఈ బడ్జెట్లో దృష్టి పెట్టలేదని, తమకు లాబీ చేసే శక్తి లేనందునే అలా చేశారా? అని ప్రశ్నించగా ఆ ప్రతినిధి వాదనను నిర్మల కొట్టిపారేశారు. తాను ఎంఎస్ఎంఈ కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. చదవండి : ‘ఏ రాష్ట్రానికీ తగ్గించలేదు’ -
'ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు'
-
త్వరలోనే తెలంగాణకు ఆ నిధులు ఇస్తాం: నిర్మల
సాక్షి, హైదరాబాద్ : 2020-21కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాదాపూర్‌లోని హోటల్ ట్రైడెంట్ లో బడ్జెట్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ.. 'బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరుతో పాటు అన్ని నగరాల్లో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల్ని కలవడం మొదలుపెట్టాం. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించాం. ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి చూడాలన్నది మా ఉద్దేశం కాదు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం.. మోదీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణతో కూడా కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గించాలా, పెంచాలా అనేది రాష్ట్రాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. (రుణాల ఫిర్యాదులకు ప్రత్యేక సెంటర్: నిర్మలా సీతారామన్) జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను సరిగా ఇవ్వలేకపోయాం. దీనికి కారణం అనుకున్న స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడమే. డిసెంబర్ లో జీఎస్టీ మీటింగ్ కు ముందు రెండు నెలల వాటాను ఇచ్చాము. ఇప్పటి వరకు ఇవ్వాల్సిన వాటాలను ఖచ్చితంగా రెండు విడతల్లో అందిస్తాం. ఇది ఇప్పుడు చెప్పడం కాదు జీఎస్టీ కౌన్సిల్ లోనే చెప్పాము. నేను కూడా రాష్ట్ర నేతలు మాట్లాడిన వాటిని విన్నాను. ఈసారి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువయ్యాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించాము. అదనంగా ఒక శాతాన్ని యూటీలకు కేటాయించాము. కేంద్రం నుంచి వచ్చే ఎలాంటి నిధులను మేం తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదు అనేది సరికాదు. ఏ ఒక్క రాష్ట్రాన్ని చిన్న చూపు చూడాలి అని మాకు లేదు. తెలంగాణకి 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవం. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయము. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. త్వరలోనే ఈ నిధులు ఇస్తాం. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామని' తెలిపారు. (బడ్జెట్లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం) -
వ్యవసాయంపై మళ్లీ శీతకన్ను
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాలకంటే వినియోగ డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడమే ప్రధాన కారణమని ఆర్థికరంగ నిపుణులు చాలావరకు ఏకాభిప్రాయానికి వస్తున్నారు. పైగా దేశ స్థూల దేశీయోత్పత్తి 5 శాతంకంటే తక్కువకు పతనమైన నేపథ్యంలో గ్రామీణ జనాభాకు మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించాల్సి ఉంది. కానీ 2020 బడ్జెట్ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ‘కోల్పోయిన మంచి అవకాశం’ గానే మిగిలిపోయిందనిపిస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పలేదంటే వ్యవసాయంపై పాలకుల శీతకన్ను ఇంకా కొనసాగుతోందనే చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020 కేంద్రబడ్జెట్ ముక్కుసూటిగా చెప్పాలంటే ఒక కోల్పోయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. గ్రామీణ వ్యయంలో పతనం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోయి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా దేశ స్థూల దేశీయోత్పత్తే (జీడీపీ) 5 శాతం కంటే తక్కువగా పతనమైపోయిన సమయంలో గ్రామీణ జనాభా చేతుల్లోకి మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. మన వ్యవసాయంలో ఇప్పటికీ దేశంలోని 70 శాతం గృహాలు పాలు పంచుకుంటున్నందున ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయాలంటే గ్రామీణుల చేతుల్లో మరింత అధికంగా డబ్బు పంపిణీ చేయడం అత్యుత్తమమైన మార్గం. గ్రామీణ వినియోగం ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయిన తరుణంలో పల్లెసీమల్లో ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించడం అత్యవసరం. భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాల కంటే దేశీయ కారణాలే ప్రధానమన్నది అందరికీ తెలిసిన విషయమే. అవేమిటంటే డిమాండ్ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడం. ఈ దుస్థితినుంచి బయటపడాలంటే వ్యవసాయదారులకు, కూలీలకు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో మరింత డబ్బు అందేలా చూడటమే మార్గమని చాలామంది ఆర్థికవేత్తలు ఇప్పుడు సూచిస్తున్నారు. జనాభాలోని 60 శాతం మంది అధోజగత్ సహోదరుల చేతుల్లో మొత్తం జాతీయ సంపదలో 4.8 శాతం వాటా మాత్రమే ఉంటున్న స్థితిలో ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచడం అనేది ఒక ఆదర్శపూరితమైన పంథా అవుతుంది. పీఎమ్–కిసాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరొక రూ.1.50 లక్షల కోట్ల డబ్బును కేటాయించాలని నేను ఇప్పటికే చాలాసార్లు సూచించి ఉన్నాను. అంటే నెలకు దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి మరొక రూ. 1,500ల డబ్బు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో అందుతుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అందిస్తున్న వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ. 12,000కు రెట్టింపు చేస్తుందని నేను భావించాను. దీనికి అదనంగా జాతీయ పనికి ఆహార పథకం కింద బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుతం ఉన్న రూ. 70,000 కోట్లను కనీసం లక్ష కోట్ల రూపాయలకు పెంచినట్లయితే అది ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపిస్తుంది. పైగా వ్యవసాయ కూలీలు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా పాలకులు గమనించాల్సి ఉండింది. కానీ ప్రధానమంత్రి కిసాన్ ప«థకాన్ని, జాతీయ పనికి ఆహార పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారు. ఈ రెండు పథకాలకు బడ్జెట్లో ఇతోధికంగా నిధులు కేటాయించి ఉంటే గ్రామీణ వినియోగంలో డిమాండును సృష్టించడం సాధ్యమయ్యేది. ఇది దానికదిగా గ్రామీణ వినియోగాన్ని పెంచి అధిక ఆర్థిక వృద్ధి రేటుకు దోహదపడేది. కానీ దురదృష్టవశాత్తూ వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్లో గణనీ యంగా కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పినట్లు లేదు. ఈసారి వ్యవసాయరంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ. 2.83 లక్షల కోట్లు. అయితే గత సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన రూ. 2.68 లక్షల కోట్ల అంచనాతో పోలిస్తే తాజా కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల లేనట్లే. వ్యవసాయ రుణాల కల్పనకు మాత్రం గత సంవత్సరంలో కేటాయించిన రూ.13.5 లక్షల కోట్లతో పోలిస్తే ఈ దఫా కాస్త ఎక్కువగా అంటే రూ. 15 లక్షల కోట్ల మేరకు పెంచడం ముదావహం. అయితే ఈరోజుకీ దేశంలోని చిన్న, సన్నకారు రైతుల్లో దాదాపు 41 శాతంమందికి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులనుంచి వ్యవసాయ రుణాలు అందడం లేదని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఏమిటంటే ఇప్పుడు రైతులకు కావలసింది మరింత రుణం కాదు. వారికి అధిక ఆదాయాన్ని కల్పించడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. నిజం చెప్పాలంటే ఆహార సబ్సిడీకి బడ్జెట్ కేటాయింపులు గత సంవత్సరంలోని రూ.1.84 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం 1.15 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించివేయడం దారుణం. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ కార్యకలాపాలనుంచి మొత్తంగా వైదొలగాలనే ఉద్దేశంతో ఉందా అని పలు సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు వ్యవసాయ గ్రూపులు ఈ అంశంపై తమ ఆందోళనను చాటి చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే వ్యవసాయ మార్కెట్లను సరళీకరించడం గురించి మాట్లాడారు. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆహార సబ్సిడీలపై ఎన్డీఏ ప్రభుత్వం కోత విధించబోతోందన్న భయాందోళనలు వ్యవసాయదారుల్లో, రైతు సంఘాల్లో పెరిగిపోయాయి. దీనికి తగినట్లుగానే వ్యవసాయ మదుపులు, ధరల కమిషన్ (సీఏసీపీ) బహిరంగ మార్కెట్లో ధాన్య సేకరణ విధానాన్ని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఇప్పటికే దేశ ధాన్యాగారాలుగా పేరొందిన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ధాన్య సేకరణను గణనీయంగా తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ ఇప్పటికే ధాన్య సేకరణలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టాలను తదనుగుణంగా సవరించింది కూడా. అలాగే ప్రైవేట్ మండీలను కూడా ప్రారంభించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం కడుతోంది. ఆకాంక్షల భారత్‌లో భాగంగా దేశీయ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ వ్యవసాయం వైపుగా మార్చేందుకు రోడ్ మ్యాప్ అందించడం గురించి ఆర్థిక మంత్రి 16 సూత్రాల కార్యాచరణపై మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన త్రీ మోడల్ చట్టాలను అమలుపర్చిన రాష్ట్రాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఈ మూడు మోడల్ చట్టాలకు భూమి కౌలు చట్టం, మార్కెట్ సరళీకరణ, కాంట్రాక్టు వ్యవసాయంతో నేరుగా సంబంధం ఉందని గమనించాలి. వ్యవసాయరంగంలో పోటీ తత్వాన్ని పెంచాల్సిన అవసరముం దని ఆర్థిక మంత్రి చెబుతూ, 2025 నాటికి పాల ప్రాసెసింగ్‌ను రెట్టింపు చేసే పథకాలను కొన్నింటిని పేర్కొన్నారు. అలాగే 2025 నాటికి దేశీయ మత్స్య ఉత్పత్తిని 2 కోట్ల టన్నులకు పెంచడం, కమోడిటీ ట్రేడింగ్‌ని ప్రోత్సహించడానికి ఈ–నామ్‌తో వేర్‌హౌసింగ్ రిసిప్టులపై ఫైనాన్స్‌ని ప్రోత్సహించడం గురించి కూడా నిర్మల ప్రతిపాదనలుచేశారు. త్వరగా పాడైపోయే సరకులను రవాణా చేయడానికి కిసాన్ రెయిల్, కిసాన్ ఉడాన్‌ను ప్రారంభించడం వల్ల వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. 16 సూత్రాల కార్యాచరణ పథకం గురించి ఆమె చెప్పిన అంశాలు మునుపటి బడ్జెట్లలో కూడా ప్రస్తావించారు, చర్చించారు కానీ ఈ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినట్లు కనిపించడం లేదు. భవిష్యత్తులో వ్యవసాయరంగం పయనించాల్సిన దిశ కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించడం కచ్చితంగా సరైనదే కానీ ఈ మార్గాన్ని ఎంత సమర్థంగా రూపొందిస్తారు అనేది ముందుగా స్పష్టం కావాలి. ఇప్పటికే మన వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన చాలా సంస్కరణలు అమెరికా, యూరోపియన్ యూనియన్ల నుంచి అరువు తెచ్చుకున్నవే. అయితే ఇలా అరువు తెచ్చుకున్న విధానాలు ప్రభావవంతమైనవే అయినట్లయితే అమెరికా, ఈయూలో కూడా వ్యవసాయరంగం ఎందుకు దుస్థితికి గురవుతోందన్నది ఆలోచించాల్సిన విషయం.అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు ఆ దేశంలోని పట్టణ కేంద్రాల్లో జరుగుతున్న ఆత్మహత్యల కంటే 45 శాతం అధికంగా నమోదవుతున్నాయి. పైగా, 1960ల నుంచి అమెరికాలో నిజ వ్యవసాయ ఆదాయం పెరుగుదల క్రమంగా పతనమవుతూ వచ్చింది. అందుచేత పాశ్చాత్య నమూనాలను అనుకరించడం కంటే గ్రామీణ సౌభాగ్యాన్ని, సంపదను పెంచిపోషించేలా మన వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
విజయసాయి రెడ్డి పనితీరుకు ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పనితీరును రాజ్యసభ ప్రశంసించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రశంసనీయమైన రీతిలో క్రియాశీల పాత్ర నిర్వహించారని రాజ్యసభ సెక్రెటేరియట్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు గల అవకాశాలను రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా చాలా చక్కగా విజయసాయిరెడ్డి వినియోగించుకున్నారు. (‘రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్‌ను సవరించాలి’) విజయసాయి రెడ్డి తొమ్మిది సార్లు అవకాశాన్ని వినియోగించుకుని చర్చల్లో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని కనబరిచినట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, మౌఖిక ప్రశ్నలకు నాలుగు అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. ఇవి కాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా, సాధారణ బడ్జెట్‌పైనా చర్చలో కూడా సాయిరెడ్డి పాల్గొని ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకు రావడంతో పాటుగా పలు నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. కాగా రాజ్యసభ సమావేశాల్లో 155 మంది సభ్యులు జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, బడ్జెట్‌పై చర్చ, బిల్లులపై మాట్లాడారు. (‘ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం’) -
తగ్గిన కేంద్ర పన్నుల వాటా.. రాష్ట్ర బడ్జెట్‌పై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక మాంద్యం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడులు, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల నేపథ్యంలో ఈసారి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెలలో ప్రవేశపెడతారని భావిస్తున్న 2020–21 వార్షిక బడ్జెట్ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేయడంతో కచ్చితమైన ఖర్చులు, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు అవసరమైన నిధులను ప్రతిపాదించాలంటే భూములపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడి తీసుకొనే అప్పులకుతోడు బడ్జెట్లో భూముల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందన్న దానిపైనే వార్షిక బడ్జెట్ అంచనాలు ఆధారపడతాయనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు అన్ని రకాల భూములపై వివరాల సేకరణను రెవెన్యూ శాఖ ముమ్మరం చేయడంతో భూముల అమ్మకాల విషయంలో ప్రభుత్వం అనుసరించబోయే విధానం చర్చనీయాంశమవుతోంది. రాబడులు ఈసారీ అంతంత మాత్రమే... గత మూడేళ్ల వార్షిక రాబడులను పరిశీలిస్తే ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఆదాయం లేదని బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. రాబడులకుతోడు అప్పులు కలిపినా బడ్జెట్ అంచనాల్లో 90 శాతం మేర నిధుల సమీకరణ జరగడం లేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1.13 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం రూ. 88,711 కోట్లు మాత్రమే వచ్చింది. దీనికి అదనంగా రూ. 26,738 కోట్లను ప్రభుత్వం అప్పుల రూపంలో సమకూర్చుకుంది. 2018–19 సంవత్సరానికిగాను రూ. 1.30 లక్షల కోట్ల ఆదాయ అంచనాకు రూ. 1.01 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఆ ఏడాది రూ. 26,949 కోట్లను అప్పుల రూపంలో తీసుకురాగా మొత్తం ప్రతిపాదిత వార్షిక బడ్జెట్లో 92 శాతం నిధులే వచ్చాయి. ఇక ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే రూ. 1.13 లక్షల కోట్ల అంచనాకుగాను మూడో త్రైమాసికం ముగిసిన డిసెంబర్ నాటికి రూ. 71,187 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దీనికి అప్పులు రూ. 21,715 కోట్లను కలిపితే డిసెంబర్ వరకు రావాల్సిన నిధుల్లో 90.74 శాతం నిధులు మాత్రమే సమకూరాయి. ఇక చివరి త్రైమాసికం విషయానికి వస్తే 2017–18లో చివరి మూడు నెలల ఆదాయం రూ. 29 వేల కోట్లు రాగా 2018–19లో రూ. 33,500 కోట్ల వరకు వచ్చింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే అంచనాలో 63 శాతం మేరకు ఆదాయం వచ్చింది. చివరి మూడు నెలల్లో పన్నుల రూపంలో రూ. 20 వేల కోట్లు, అప్పుల రూపంలో మరో రూ. 10 వేల కోట్లు... వెరసి రూ. 30 వేల కోట్ల వరకు నిధులు సమకూరుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూడేళ్ల రాబడులు, అప్పులను అంచనా వేస్తే వచ్చే ఏడాది కూడా రాబడులు (అప్పలు కాకుండా) రూ. లక్ష కోట్లు దాటే పరిస్థితులు కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం మరో ఆరునెలలపాటు కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదలతో 2020–21 సంవత్సరానికి కూడా రాబడులు అంతంత మాత్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో తయారీ, ఫార్మా రంగాల్లో వినియోగించే చైనా ఉత్పత్తులు తగ్గిపోతే వచ్చే ఏడాది పన్నులకు నష్టం వాటిల్లుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో స్థిరత్వం కనిపిస్తుండగా లిక్కర్ ధరలు పెంచడంతో కొంత మేరకు నిధులు సమకూరుతాయనే అంచనాలున్నాయి. ఇక జీఎస్టీ విషయంలో కేంద్రం అనుసరించే వైఖరి, ఇచ్చే పరిహారం ఏ మేరకు ఉంటాయన్నది కూడా సందేహమే కావడంతో ఆ పన్నులపైనా ఆశలు పెట్టుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వచ్చే ఏడాది నెట్టుకురావడానికి భూముల అమ్మకాలపై ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2020–21 బడ్జెట్ రూ. 1.55 లక్షల కోట్లు? 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.46 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించింది. ఈసారి 8 శాతం వృద్ధి అంచనాతో 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1.55 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఇరిగేషన్‌కు రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ. 6 వేల కోట్లకుపైగా కేటాయింపులు చూపినా అప్పులతో కలిపి ఈ ఏడాది డిసెంబర్ వరకు రూ. 18 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఈ అంచనాల నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా రూ. 20 వేల కోట్ల వరకు వ్యయం అవసరమవుతుందని సాగునీటి శాఖ వర్గాలంటున్నాయి. రుణమాఫీకి రూ. 18 వేల కోట్లు కేటాయించే చాన్స్ ఈసారి 2018 ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనే చర్చ జరుగుతోంది. రుణమాఫీకి రూ. 24 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని బ్యాంకుల నుంచి వచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో పెట్టిన రూ. 6 వేల కోట్లకు తోడు వచ్చే ఏడాది బడ్జెట్లో రూ. 18 వేల కోట్లు రుణమాఫీకి కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించడంతో అదనంగా చేరిన 12 లక్షల మందికి కూడా పింఛన్లు ఇవ్వాల్సి ఉన్నందున గతేడాది కంటే రూ. 2,500 కోట్లు అదనంగా.. అంటే రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. దీంతోపాటు రైతుబంధు పథకం కోసం రూ. 12 వేల కోట్లు, జీతభత్యాలకు రూ. 23–25 వేల కోట్లు, సబ్సిడీలకు రూ. 9 వేల కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ. 15 వేల కోట్లు అవసరం అవుతాయి. వాటితోపాటు రైతు బీమా, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ, కల్యాణ లక్ష్మికి కలిపి రూ. 8 వేల కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. విద్యుత్ రాయితీల రూపంలో మరో రూ. 9 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమాలకు రూ. 12 వేల కోట్లు, విద్యకు రూ. 10 వేల కోట్లు, హోంశాఖకు రూ. 5 వేల కోట్ల అనివార్య కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది అదనంగా పట్టణ ప్రగతి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అవి కూడా రూ. 1,500 కోట్ల వరకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిపి రూ. 1.55 లక్షల కోట్ల వరకు ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలకు అవకాశం ఉందనేది ఆర్థిక శాఖ వర్గాల అంచనాగా కనిపిస్తోంది. ఇందులో కొన్ని ఖర్చులు తగ్గించుకున్నా ఇతర అవసరాలకు నిధులు కావాల్సి వస్తుందని, మొత్తం మీద ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశముందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతరం పూడ్చేదెలా? బడ్జెట్ ప్రతిపాదనలు, వాస్తవిక ఆదాయం మధ్య అంతరాన్ని ఎలా పూడ్చుకోవాలన్నదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌గా మారనుంది. ఇందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం అనుమతించిన మేరకు అప్పులు తేవడంతోపాటు భూముల అమ్మకాలే ప్రధాన వనరుగా మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా భూమి లెక్క తేల్చే పనిలో బిజీగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, అటవీ, ఇతర భూముల వివరాలు ఇప్పటికే ఉన్నప్పటికీ అమ్మకానికి అనువుగా ఉన్న భూముల లెక్కను రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని విలువైన భూములను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉంది. ఇజ్జత్‌నగర్‌లో 36 ఎకరాలు, తెల్లాపూర్‌లో 46 ఎకరాలు, హైటెక్స్ సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్లో 8 ఎకరాలు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ. 3 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. వాటికితోడు సుప్రీంకోర్టులో కేసులు క్లియర్ అయిన కోకాపేటలో 146 ఎకరాలు అమ్మితే రూ. 4,380 కోట్లు, పుప్పాలగూడలోని 198 ఎకరాలకు రూ. 7 వేల కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. అలాగే మేడ్చల్, శంషాబాద్, రాజేంద్రనగర్‌ల పరిధిలోని ఎవాక్యూ భూములు అమ్మకానికి పెడితే రూ. వేల కోట్ల ఆదాయం రానుంది. వాటన్నింటితోపాటు అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించి పేదలను నుంచి తీసుకొని వాటిని అమ్మితే ఎలా ఉంటుందన్న దానిపై బ్లూప్రింట్ తయారవుతోంది. అందులో భాగంగానే శంషాబాద్ మండలంలోని ఆరు గ్రామాల్లో లెక్కకడితే రూ. 5,745 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తేలింది. దీనికితోడు ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఓ ప్రణాళిక ప్రకారం వెళితే రూ. 25–50 వేల కోట్ల వరకు భూముల అమ్మకాల ద్వారా సమీకరించుకునే అవకాశాలున్నా ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే పెద్ద ఎత్తున భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, వచ్చే ఏడాదికి అవసరమయ్యే వరకు ప్రతిపాదనలు చేసి ఆ తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొనే యోచనలో ఉందని తెలుస్తోంది. -
అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద సంఖ్యలతో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం గతేడాది ఏకంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేసే ప్రతిపాదన ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనాల కారణంగా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. 2017 ఏప్రిల్‌లో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. ఎల్ఐసీ లిస్టింగ్‌తో పారదర్శకత .. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరగగలదని ఠాకూర్ చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన చేశారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాలు ఉన్నాయి. అటు రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో గతేడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ చెప్పారు. తాజాగా రుణ పునర్వ్యవస్థీకరణ వ్యవధిని వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. -
మీ ‘పన్ను’ దారేది?
ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన పన్ను రేట్లతో అయోమయంలో పడేశారు. ప్రస్తుత పన్ను విధానం లేదా నూతన పన్ను విధానంలో తమకు అనుకూలమైన విధానంలోనే రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్నును కొంత మేరకు తగ్గిస్తూ నూతన పన్ను రేట్లను మంత్రి ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగడం లేదా నూతన విధానానికి మారడం పన్ను చెల్లింపుదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మరి నూతన పన్ను విధానానికి మారిపోవాలా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగాలా..? అని ప్రశ్నిస్తే.. అది ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. తమ ఆదాయాన్ని బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పాత, కొత్త విధానంలో పన్ను భారంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ కథనం ఇది. రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నూతన పన్ను విధానంలో రూ.78,000ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇది నిజమే. కానీ, ఎవరికి ఈ ప్రయోజనం నిజంగా అంటే.. ఎటువంటి మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారికే నూతన పన్ను విధానంతో ప్రయోజనమని క్లుప్తంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయపన్ను విధానంలో ఎన్నో మినహాయింపులు(ఎగ్జంప్షన్), తగ్గింపులు(డిడక్షన్) ఉన్నాయి. అయితే, కొందరు కొన్ని రకాల మినహాయింపులనే వినియోగించుకుంటుంటే, కొందరు అయితే అస్సలు ఏ ప్రయోజనాన్ని కూడా వాడుకోకుండా రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇలా ఏ డిడక్షన్, ఎగ్జంప్షన్ వినియోగించుకోని వారికి నూతన పన్ను రేట్లు ప్రయోజనకరం. అలాగే, తీసివేతలు, మినహాయింపుల గందరగోళాన్ని అర్థం చేసుకోలేని వారు నూతన విధానానికి మారిపోవచ్చు. లేదు, చట్ట పరిధిలో అన్ని మినహాయింపులు, తగ్గింపులను ఉపయోగించుకుంటానంటే ప్రస్తుత విధానంలోనే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ‘‘ఇదొక మంచి నిర్ణయం. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్టయింది’’ అని ట్యాక్స్‌స్పానర్ సహ వ్యవస్థాపకుడు సుధీర్ కౌశిక్ పేర్కొన్నారు. ‘‘హౌస్ రెంట్ అలవెన్స్, సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందుతున్న వారికి నూతన పన్ను విధానానికి మారిపోవడం ప్రయోజనకరం కాదు’’ అని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ ట్యాక్స్ లీడర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. చాప్టర్ 6ఏ పరిధిలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80సీసీడీ మినహాయింపులు రూ.2,50,000ను పూర్తిగా వినియోగించుకున్నట్టు అయితే రూ.7,50,000 వరకు ఆదాయం ఉన్న వారూ ప్రస్తుత విధానంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన వారు చాప్టర్ 6ఏకు అదనంగా సెక్షన్ 24 కింద ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2,00,000పై, స్టాండర్డ్ డిడక్షన్ 50,000ను కూడా వినియోగించుకుంటే అప్పుడు మొత్తం రూ.10,00,000 ఆదాయం ఉన్నప్పటికీ చెల్లించాల్సిన పన్ను బాధ్యత సున్నాయే అవుతుంది. ఇక సెక్షన్ 80టీటీఏ కింద డిపాజిట్లపై వడ్డీ రూ.10,000 వరకు మినహాయింపు కూడా ఉంది. నూతన పన్ను విధానానికి మారితే జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులతోపాటు ఎల్‌టీఏ తరహా మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది. నూతన విధానంలోనూ ఎన్పీఎస్(రిటైర్మెంట్ సాధనం) పై పన్ను ఆదా చేసుకునే ఒక అవకాశాన్ని కొనసాగించారు. అది వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులు కాకుండా.. ఉద్యోగుల తరఫున కంపెనీలు ఎన్పీఎస్కు జమ చేసే చందాలకు సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను ఆదా ప్రయోజనం వర్తిస్తుంది. మూలవేతనం, కరువు భత్యం (డీఏ)పై వార్షికంగా 10% ఎన్పీఎస్ చందాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వార్షిక మూలవేతనం, కరువు భత్యం రూ.5 లక్షలు ఉందనుకుంటే ఇందులో 10% రూ.50,000పై పన్ను చెల్లించక్కర్లేదు. ఎన్పీఎస్ అయినా లేదా ఈపీఎఫ్ అయినా ఉద్యోగ సంస్థ చేసే చందా లకు ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఒక ఉద్యోగి తరఫున సంస్థ వార్షికంగా రూ.7.5 లక్షలకు మించి జమ చేస్తే అప్పుడు పన్ను పడుతుంది. ఒక్కసారి మారిపోతే..? ప్రస్తుత విధానంలో కొనసాగొచ్చు లేదా నూతన విధానానికి మారిపోవచ్చన్న వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఏటేటా ఉంటుందా..? లేక ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే అందులోనే మరుసటి ఏడాది నుంచి రిటర్నులు దాఖలు చేయాలా..? అన్న సందేహం రావచ్చు. ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకపోతే, గడిచిన ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై రిటర్నులు ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. ఇతర కేసుల్లో అయితే, ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే ఆ తర్వాత నుంచి అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది’’ అని బడ్జెట్ మెమొరాండం స్పష్టం చేస్తోంది. ‘‘ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఏ పన్ను విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు. పన్ను మినహాయింపులు, తగ్గింపులతో రిటర్నులు దాఖలు చేయవచ్చు లేదా నూతన విధానంలో తక్కువ పన్ను రేట్ల ప్రకారం రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు మినహాయింపులు, తగ్గింపులను వినియోగించుకుని ప్రస్తుత విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టయితే అప్పుడు పాత విధానంలోనే కొనసాగినట్టవుతుంది. తర్వాతి సంవత్సరాల్లోనూ నూతన విధానానికి మారే అవకాశం ఉండదు’’ అని ట్యాక్స్‌మన్ డాట్ కామ్ డీజీఎం వాధ్వా తెలిపారు. వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత విధానం లేక నూతన ప్రతిపాదిత విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారునికి ఈ రెండింటిలో ఎందులో కొనసాగాలన్న ఆప్షన్ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఏ విధానంలో ఎంత భారం రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారు ► స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80సీ సాధనాల్లో రూ.1,50,000 పెట్టుబడులతోపాటు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 ను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మొత్తం రూ.2,50,000 ఆదాయంపై మినహాయింపులు పొందొచ్చు. ఎన్పీఎస్ లేకపోతే సెక్షన్ 80డీ కింద తన కుటుంబానికి, తల్లిదండ్రులకు చెల్లిస్తున్న వైద్య బీమా ప్రీమియంను మినహాయింపుగా చూపించుకున్నా సరిపోతుంది. మొత్తం ఆదాయం రూ.7,50,000 నుంచి మినహాయింపులు రూ.2.5 లక్షలను తీసివేయగా మిగిలిన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 అవుతుంది. పన్ను వర్తించే ఆదాయం మినహాయింపుల తర్వాత రూ.5లక్షలు దాటనందున సెక్షన్ 87ఏ కింద పన్ను చెల్లించకుండా రిబేటు పొందొచ్చు. ► కొత్త విధానంలో ఈ మినహాయింపులు లేవుకనుక.. మొదటి రూ.2,50,001 –5,00,000పై 5% కింద రూ.12,500, తర్వాతి రూ.2.5 లక్షలపై 10% పన్ను రేటు ప్రకారం రూ.25,000.. మొత్తం రూ.37,500 పన్ను చెల్లించాలి. ► ఒకవేళ పాత విధానంలోనే కొనసాగుతూ కొన్ని మినహాయింపులనే క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయని వారు, సెక్షన్ 80సీ కింద రూ.150,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80డీ కింద వైద్య బీమా ప్రీమియంను మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అలా రూ.2,00,000ను మినహాయింపుగా చూపించుకున్నారనుకుంటే.. మిగిలిన రూ.50,000పై ప్రస్తుత విధానంలో 20 శాతం పన్ను రేటు ప్రకారం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రస్తుత విధానమే బెస్ట్. ► ఒకవేళ సెక్షన్ 80సీ కింద కేవలం రూ.1,00,000 మాత్రమే వినియోగించుకుని, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000ను కూడా క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.1,00,000 అవుతుంది. దీనిపై 20% అంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ ప్రయోజనమే. ► సెక్షన్ 80సీ కింద రూ.50,000 వరకూ పెట్టుబడులు ఉంటే, దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 కలుపుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం రూ.12,000 వరకు చెల్లిస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ విధంగా చూస్తే కనీస మినహాయింపులు రూ.1,00,000–1,50,000 వరకు ఎక్కువ మందికి ఉంటుంటాయి. వీరికి ప్రస్తుత విధానమే లాభకరం. రూ.10 లక్షల ఆదాయం విషయంలో... ► వీరు కూడా స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ, 80సీసీడీ కింద పూర్తిగా రూ.3,00,000ను వినియోగించుకుంటే అప్పుడు రూ.2,00,000 మొత్తంపై ప్రస్తుత విధానంలో 20 శాతం కింద రూ.40,000 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే ఆ విధంగా మరో రూ.2,00,000పైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించాల్సిన పన్ను సున్నాయే అవుతుంది. ఇప్పటి వరకు ఇల్లు సమకూర్చుకోని వారు రుణంపై ఇంటిని తీసుకోవడం ద్వారా ఈ ఆదాయ వర్గాల వారు ఏటా రూ.40,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► అదే నూతన విధానంలో రూ.2,50,001–5,00,000పై 5 శాతం కింద రూ.12,500, 5,00,001–7,50,000 ఆదాయంపై 10 శాతం ప్రకారం రూ.25,000వేలు, తర్వాత రూ.2,50,000పై 15 శాతం పన్ను రేటు ప్రకారం రూ.37,500 మొత్తం రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత విధానంలో కనీసం సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80డీ, స్టాండర్డ్ డిడక్షన్లు వినియోగించుకున్నా నూతన విధానంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లిస్తే చాలు. ► ప్రస్తుత విధానంలో ఏ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారు, అదే సమయంలో సెక్షన్ 80సీలో కేవలం రూ.లక్ష వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు వీరు రూ.4,00,000పై ప్రస్తుత విధానంలోనే 20 శాతం పన్ను రేటుపై రూ.80,000 చెల్లించాల్సి వస్తుంది. కనుక వీరికి కొత్త విధానం బెటర్. ► ఒకవేళ ఇంటి రుణం లేని వారికి హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలి. హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు మూడు విధానాలున్నాయి. వేతనంలో భాగంగా ఉద్యోగి పొందుతున్న వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం.. లేదా మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50%, అదే నాన్ మెట్రో ప్రాంతాల్లోని వారి మూల వేతనంలో 40%.. లేదా మీరు వార్షికంగా చెల్లించిన అద్దె నుంచి మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ఈ మూడింటింలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ► 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు తమ పెట్టుబడులను అన్నింటినీ లిస్ట్ చేసుకుని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. -
అనుసంధానం.. అటకెక్కినట్లే!
సాక్షి, హైదరాబాద్ : లభ్యత జలాలు అధికంగా ఉన్న నదీ ప్రాం తాల నుంచి నీటి కొరతతో అల్లాడుతున్న నదులకు అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం అటకెక్కించినట్లే కనబడుతోంది. నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యమిస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్రం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో దీని ప్రస్తావననే విస్మరించింది. నదుల అనుసంధాన ప్రక్రియకు నిధుల కేటాయింపుపై కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్ర జలశక్తి శాఖకు కేటాయించిన బడ్జెట్లోనూ ఈ అంశాన్ని పేర్కొనలేదు. దీంతో అసలు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఆసక్తి కేంద్రానికి ఉందా.. అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆశలపై నీళ్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా నదుల అనుసంధానానికి 30 రకాల ప్రణాళికలను కేంద్రం రచించింది. ఇందులో ఇప్పటికే కెన్–బెట్వా, దామనగంగ–పింజాల్, పార్–తాపి–నర్మద, పార్‌బటి –కలిసింధ్–చంబల్, మహానది–గోదావరి, గోదావరి–కృష్ణా–కావేరి (గ్రాండ్ ఆనకట్) నదుల అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేసింది. నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే రాష్ట్రాల్లో ప ర్యటించి చర్చలు జరిపింది. మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల ఆమోదం మేరకు కెన్–బెట్వా నదుల అనుసంధానాన్ని చేపట్టేందుకు కేంద్రం సిద్ధ మైంది. అయితే ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణకు మేలు చేసే గోదావరి–కావేరి అనుసంధానంపైనా స్పష్టత లేదు. గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) కొత్తగా జనంపేట నుంచి నీటిని తరలించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్నీ తెలంగాణ తిరస్కరించడంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి(గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. దీని ద్వారా రాష్ట్ర పరిధిలో కనిష్టంగా 18 నుంచి 20లక్షల ఎకరాల మేర సాగు జరుగుతుందని చెబుతోంది. దీనిపై ఇప్పటివరకు ఎన్డబ్ల్యూఏ ఎటూ తేల్చలేదు. ఇచ్చంపల్లి వీలు కాకుంటే తుపాకులగూడెం నుంచి గోదావరి నీటి ని తరలించే ప్రతిపాదనకు తెలంగాణ సమ్మతి తెలుపుతున్నా ఎన్‌డబ్ల్యూడీఏ నుంచి స్పందన లేదు. ఒకవైపు అనుసంధాన మార్గాలపై ఇంతవరకూ స్పష్టత లేకపోగా మరోవైపు కేంద్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో అనుసంధాన ప్రక్రియ ఇప్పట్లో ముందుకెళ్లడం కష్టసాధ్యంగానే ఉంది. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తన ప్రసంగంలో జల రవాణాకు వీలుగా ఈ ఏడాది దుభ్రి–సాధియా జల మార్గానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి 890 కిలోమీటర్ల జలమార్గాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇది మినహా నదుల అనుసంధాన ప్రస్తావన లేకపోవడం దీనికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. -
ఇది జాలి లేని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అసమర్థమైందే గాక... పేదల వ్యతిరేకమైందని, జాలిలేనిదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ధ్వజమెత్తారు. వారం రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలకూ నిధులు తక్కువగా కేటాయిం చడం దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మఫ్కమ్ ఝా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ‘కేంద్ర బడ్జెట్.. ఆర్థిక పరిస్థితి’’అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూ ముంగిట్లోకి చేరిందని, ఈ విషయాన్ని అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు. బడ్జెట్లో దేశ ఆర్థిక స్థితి ఏమిటన్నది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పలేకపోయారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని అమలుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు 8.2%గా ఉన్న స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో చేరేందుకు డిమాండ్ లేమి ఒక కారణమైతే... పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం రెండో కారణమని చిదంబరం అన్నారు. గత కొన్నేళ్లలో ఆటోమొబైల్ రంగంలోనే 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, 296 వర్క్‌షాపులు మూతపడ్డాయన్నారు. ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జీఎస్టీ, డీఆర్ఐ వంటి సంస్థల్లో తక్కువ స్థాయి అధికారులకూ విచక్షణాధికారాలు కట్టబెట్టడంతో కంపెనీలు వేధింపులు ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, సామాజిక కార్యకర్త డాక్టర్ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలు మరింత పేదరికంలోకి.. గతేడాది బడ్జెట్లో అంచనాలు... పెట్టిన ఖర్చుల్లో భారీ అంతరం ఉందని, పన్ను వసూళ్లలో రూ.లక్ష కోట్ల వరకూ తగ్గుదల ఉంటే.. పెట్టిన ఖర్చు కూడా రూ.లక్ష కోట్ల వరకూ తక్కువగా ఉండటాన్ని మాజీ ఆర్థిక మంత్రి వివరించారు. కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ వసూళ్లు రూ.లక్షల కోట్లు తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందనేందుకు ప్రత్యక్ష సాక్ష్యాలని చిదంబరం తెలిపారు. వ్యవసాయానికి, ఆహార సబ్సిడీ నిధుల్లో కోత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని పేదలు మరింత పేదరికంలోకి చేరే ప్రమాదముందని హెచ్చరించారు. -
బడ్జెట్లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం
ముంబై: తాజాగా తాను సమర్పించిన బడ్జెట్లో వివేకంతో, జాగ్రత్తతో కూడిన ప్రోత్సాహక చర్యలను ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలో పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘దశాబ్ద కనిష్టానికి వృద్ధి రేటు క్షీణించిన సమయంలో కొన్ని నియోజకవర్గాలు బడ్జెట్లో భారీ ప్రకటనలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు గుర్తించాం. గతంలో ప్రోత్సాహకాలకు సంబంధించిన అనుభవం ఆధారంగా మేము.. తగినంత జాగ్రత్తతో, వివేకంతోనే బడ్జెట్లో వ్యవహరించాం. స్థూల ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుని.. వినియోగం పెంచేందుకు, దీర్ఘకాలం పాటు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఆస్తుల కల్పనకు తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం’’ అని సీతారామన్ వివరించారు. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై పని జరుగుతోంది.. వివాదాస్పద ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుపై ఆర్థిక శాఖా పని కొనసాగిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ముందుకు తిరిగి ఎప్పుడు వస్తుందన్నది స్పష్టంగా చెప్పలేనన్నారు. సంక్షోభంలో ఉన్న బ్యాంకులను ఒడ్డెక్కించేందుకు డిపాజిటర్ల డబ్బులను కూడా వినియోగించుకోవచ్చన్న వివాదాస్పద క్లాజులు బిల్లులో ఉండడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడం వల్ల గతంలో ఈ బిల్లును సభ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. -
పతన ఆర్థిక వ్యవస్థ పట్టదా?
2020 బడ్జెట్ ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. ఈ బడ్జెట్లోనూ కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. నిర్మలా సీతారామన్ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. అరుణ్ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆర్థికమంత్రి ముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్ అనే చెప్పాల్సి ఉంటుంది. సుప్రసిద్ధ బ్రిటన్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ 50 ఏళ్ల క్రితం.. రాజకీయాల్లో ఒక వారం రోజులు అంటే చాలా ఎక్కువ కాలం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో వారం రోజులే అధికం అనుకుంటే బడ్జెట్ విషయంలో వారం రోజులంటే మరీ ఎక్కువ కాలం అనే చెప్పాలి. ఫిబ్రవరి1న కేంద్ర బడ్జెట్‌ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించినప్పుడు చాలామంది తక్షణ స్పందనలు వ్యక్తీకరించారు. కానీ ఫిబ్రవరి 1న మనం చేసిన చాలా సరళ నిర్ధారణల విషయంలో వారం రోజుల తర్వాత, అనిశ్చితి నెలకొంది. దీంతో బడ్జెట్‌పై రెండో అభిప్రాయం ప్రకటిం చడం మొదలెడుతున్నాం. ఒకవిషయం మాత్రం మారలేదు. బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ నిర్మల బద్దలు గొట్టేశారు. ఆర్థిక మంత్రి 2 గంటల 45 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ప్పుడు కొంతమంది మంత్రులు నిద్రపోయారు కూడా. ఇప్పుడు సమస్య ఏమిటంటే అంత సుదీర్ఘ ప్రయత్నంలో విషయ గాఢత ఏమైనా ఉందా అన్నదే. అంత సుదీర్ఘ ప్రసంగం తర్వాత ఏర్పడిన ఉల్లాస స్థితిలో మనం ప్రతి విషయంలోనూ ముఖవిలువను మాత్రమే తీసుకుంటాం. కానీ కొంత సమయం తర్వాత వాస్తవంగా బడ్జెట్ పూర్తి భిన్నంగా ఉందని గ్రహిస్తాం. 2020 బడ్జెట్లో ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. ఆర్థికమంత్రిని కాస్త సంప్రదాయకంగానే ఉండాలని, ఆర్థికవ్యవస్థ కుంగుబాటు సహజంగానే దాని ముగింపును చేరుకునేంతవరకు (అంటే మళ్లీ పుంజుకోవడం ప్రారంభమయ్యేంతవరకు) వేచి చూడాలని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పతనబాట పట్టాక కొంతకాలం శిక్షను అనుభవించాక, సహజంగానే అది కోలుకుంటుందని ఆర్థిక శాస్త్రం మనకు పాఠం చెబుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ తన అత్యంత పతనస్థాయికి చేరుకుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాటను చేపడుతుందనే భావన ఉంటోంది. మోదీ ప్రభుత్వ ఆశ కూడా అదేననిపిస్తోంది. 2019 అక్టోబర్ నుంచే మీడియా, విభిన్న భావాలు కలిగిన ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా 2020 బడ్జెట్ బిగ్ బ్యాంగ్ బడ్జెట్‌గా ఉంటుం దని, ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యం వచ్చి చేరుతుందని, భారీ సంక్షేమ పథకాలు మొదలై ప్రజల చేతుల్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని కలలు కన్నారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ తాజా బడ్జెట్లో కనిపించలేదు. ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు దాంట్లోకి భారీగా డబ్బును పంపించడం ద్వారా లేక డబ్బును అధికంగా ముద్రించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని ఆర్థిక సిద్ధాంతం తెలుపుతోంది. ఇది వినియోగదారుల్లో డిమాండును సృష్టించి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడుపుతుంది. కానీ 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో ప్రజల చేతుల్లోని డబ్బు, సహజసిద్ధమైన వారి డిమాండ్ శక్తి మటుమాయమైపోయింది. లక్షలాదిమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు, చిన్నచిన్న వ్యాపారాలు మూసివేతకు గురయ్యాయి. రైతులు పండించిన పంటకు తగిన డబ్బులు రాలేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక కల్లోలం చెలరేగింది, ఆరోజు చమురు ధరలు తగ్గిన కారణంగానే ఆర్థిక వ్యవస్థ తనకు తానుగా కోలుకుని తీవ్ర కుంగుబాటు బారినుంచి తప్పించుకుంది. కానీ ఆనాటి పెద్దనోట్ల రద్దు దుష్ఫలితాలు ఇప్పటికీ దేశం అనుభవిస్తూనే ఉంది. పైగా జీడీపీ సాధారణ వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. అంటే జీడీపీ వృద్ధి ప్లస్ ద్రవ్యోల్బణ రేటు అనీ ఆమె ప్రకటన అర్థం తప్ప జీడీపీ వాస్తవ వృద్ధి కాదని అర్థం. 2016 నవంబర్ 8 నాటి పెద్దనోట్ల రద్దు ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. చాలామంది ప్రజల, ఆర్థిక వేత్తల అంచనాలను ఈ బడ్జెట్ అందుకోనప్పటికీ బడ్జెట్లోని కొన్ని సానుకూల అంశాలను ఎత్తిపట్టాల్సి ఉంటుంది. 1. పన్ను వివాదాల కేసులు: దేశంలో 4.86 లక్షల పన్ను వివాదాలపై కేసులు కొనసాగుతున్నాయని ఆర్థికమంత్రి చెప్పారు. అంటే ఈ వివాదాల్లో దాదాపు రూ. 15 లక్షల కోట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇలా కేసుల రూపంలో స్తంభనకు గురైన భారీ సంపదను తప్పకుండా వెలికి తీసుకురావాలని ఆమె చెప్పారు. పన్ను కేసులు పరిష్కారమైతే ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం ఆమేరకు లాభపడతారు. భారీగా ఇరుక్కుపోయిన ఈ ఆదాయాన్ని వెలికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆర్థిక అవార్డులు, వివాదాలతో కూడిన కేసును పరిష్కరించాలనుకుంటే మరిన్ని ఆరోపణలు, న్యాయమూర్తుల పేర్లకు మరకలంటించడం చేస్తారని దానికి బదులుగా ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో 50 శాతం రాయితీని కల్పించే విషయం ఆలోచిస్తోందని ఆర్థికమంత్రి చెప్పారు. 2. భారతీయ విద్యాసంస్థల్లో విదేశీ మదుపులను అనుమతించడం చాలా సానుకూలతను కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాల నాణ్యతను ఇది పెంచుతుంది. దీనివల్ల భారతదేశంలో విదేశీ విద్యార్థులు కూడా చదువుకునే అవకాశాలను పెంచుతుంది. ఈరోజు అమెరికాలో 10 లక్షల మంది, చైనాలో 5 లక్షలమంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రంగంలో భారత్ కూడా పోటీపడాల్సిన అవసరముంది. 3. ప్రభుత్వ ఆసుపత్రులతో వైద్య కళాశాలలను అనుసంధానిం చడం. ప్రస్తుతం ప్రతి వైద్య కళాశాలకు కనీసం 750 పడకల పెద్ద ఆసుపత్రి అనుసంధానమై ఉండాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం కావాలని తాజా బడ్జెట్ పేర్కొంది. దీనికి ఆర్థిక సహాయం కూడా అవసరం. దేశంలో మరిన్ని వైద్య కళాశాలల అవసరం ఉంది కాబట్టి ఈ చర్య తప్పక దోహదం చేస్తుంది. 4. ఆరోగ్యరంగానికి గరిష్టంగా నిధులు పెంచారు. గత సంవత్సరం ఈ రంగానికి రూ. 65,000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 67,500 కోట్లకు పెంచారు. ప్రజల వినియోగ డిమాండును ఇది తప్పకుండా పెంచుతుంది. 5. భారతదేశంలో బహిరంగ మలవిసర్జన ప్రపంచంలోనే అత్యధికం కాబట్టి పారిశుధ్య కల్పన అనేది దేశంలో అత్యంత ప్రధానమైన సంక్షేమ చర్య, ఆరోగ్య పథకంగా ఉంటోంది. ఈ రంగానికి తాజా బడ్జెట్లో గణనీయంగా నిధులు పెంచారు. గతేడాది పారిశుధ్యానికి రూ. 9,600 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 12,300 కోట్లకు పెంచారు. అంటే 28 శాతం పెరుగుదల అన్నమాట. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేసి పబ్లిక్ టాయ్లెట్లను అధికంగా నిర్మించాల్సిన అవసరముంది. గత ఆరు బడ్జెట్ల ద్వారా నరేంద్రమోదీ చాలా ఆశాభంగం కలిగించారు. మోదీ విదేశీ వ్యవహారాలు, రక్షణ, అంతర్గత భద్రత, స్వచ్ఛభారత్ వంటి అనేక పథకాలను సమర్థవంతంగా నిర్వహించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నందున మరింత మంచి బడ్జెట్‌ను దేశం కోరుకుంటోంది. కాని తాజా బడ్జెట్ కేటాయింపులు చూస్తే జరుగుతున్న పరిణామాలను అలాగే కొనసాగనిద్దాం అనే ధోరణే కనబడుతోంది కానీ నది మధ్యలో ఉన్న బోటును షేక్ చేసే దృక్పథాన్ని ఇది ప్రదర్శించడం లేదు. ప్రస్తుత బడ్జెట్ పరిస్థితి నాకు ఫ్రెంచ్ రచయిత జీన్ అల్ఫాన్స్ కార్ 130 ఏళ్ల క్రితం చెప్పిన మాటలను గుర్తుకు తెస్తోంది. పరిస్థితులు ఎంత అధికంగా మారితే, అంత ఎక్కువగా అవి అలాగే కొనసాగుతుంటాయి అని తన వ్యాఖ్య. దీనికనుగుణంగానే గత ఆరు బడ్జెట్లు యధావిధిగా కొనసాగుతూ వచ్చాయి. మార్పు అన్నదే కనిపించలేదు. ఈ ఆరేళ్లలో ఏమీ జరగని నేపథ్యంలో.. త్వరలోగానీ, తర్వాత కానీ అలాంటి అద్భుతమైన బడ్జెట్ ఏనాటికైనా వస్తుందా అనే సమస్య తలెత్తక మానదు. అరుణ్ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. నిర్మలా సీతారామన్ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆమెముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావువిశ్లేషణ -
బడుగులకు ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమిటి?
బ్రిటిష్‌వారి తోడ్పాటుతో దళితులకు, బలహీనవర్గాలకు అంబేడ్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్య స్కాలర్షిప్లు రూపొందించారు. కానీ 70 ఏళ్ల తర్వాత కూడా నేటి పాలకుల విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని ఎంత మాత్రం తొలగించే స్థితిలో లేవు. ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువులకు గత నాలుగేళ్ళుగా రెండు కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు, పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం. ‘‘సామాజిక అన్యాయం, ఇతర దోపిడీ విధానాల నుంచి బలహీన వర్గాలను ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలను, తెగలను రక్షించడానికీ, విద్య, ఆర్థిక రంగాల్లో వారిని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అందుకుగాను ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి’’ అంటూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–46 నిర్దేశిస్తున్నది. భారత రాజ్యాంగంలోని నాలుగో భాగమైన ఆదేశిక సూత్రాలలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలలో ఈ వర్గాల వారిని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనర్థం సమాజ ప్రగతికీ, సమాజ పురోగమనానికీ వేసే ప్రతి అడుగులో అట్టడుగున పడినలిగే వర్గం ఒకటుంటుందని గమనంతో వ్యవహరించడం ప్రభుత్వాల బాధ్యత అని నొక్కి చెప్పడమే. అదే విధంగా ఆర్టికల్–38 కూడా మరొక రకమైన ఆదేశాలను ఇచ్చింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని సాధించడానికి అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు కృషిచేయాలని, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని కూడా ఆర్టికల్ – 38 ఆదేశిస్తున్నది. అంటే ప్రాంతాల మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో నిధుల కేటాయింపుల్లో వ్యత్యాసం చూపకూడదని దాని అర్థం. ఈ అంశాల్లో ఎటువంటి వివక్షా తగదని చెప్పడమే. అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల మధ్య వ్యత్యాసాలను పెంచుతున్నాయ్ కానీ తగ్గించడం లేదు. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో దీని ప్రభావం స్పష్టంగా కనపడుతున్నది. ప్రభుత్వాలకు నాయకత్వం వహించే నాయకులు మాట్లాడే మాటలకన్నా, వారు బడ్జెట్ కేటాయింపుల్లో చూపెడుతున్న విషయాలు అసలు అక్షరసత్యాలు. ఎన్ని రకాల మాటలు మాట్లాడినా చివరకు వారి చిత్తశుద్ధి తేలేది బడ్జెట్ వడ్డనలోనే అనేది సత్యం. ముందుగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికీ, వారి అభివృద్ధికీ కేటాయించిన నిధులను పరిశీలిస్తే, ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఈ రెండు వర్గాలకు కూడా విద్యాభివృద్ధిపైనే నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే వాటిపైన పెడుతున్న ఖర్చును చూస్తే మనకు అసలు విషయం తెలుస్తుంది. ఇందులో పెద్ద కేటాయింపులు పోస్ట్–మెట్రిక్ స్కాలర్‌షిప్‌లే. పదవ తరగతిపైన విద్యనభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరూ ఈ స్కాలర్‌షిప్‌ల వల్లనే చదువగలుగుతున్నారు. ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కేటాయింపులు చూస్తే, 2017–18లో రూ. 3,414 కోట్లు ఖర్చు చేస్తే, 2019–20లో రూ. 2,926.82 కోట్లు కేటాయించారు. అది 2020–21 సంవత్సరానికి వచ్చేసరికి రూ. 2,987 కోట్లు కేటాయిం చారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీల సంక్షేమం కోసం ప్రత్యేకించి కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరం రూ. 7,154 కోట్లు. ఇందులో రూ. 2,987 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లే. అయితే ఈ కేటాయింపులు ఇప్పుడు ఎస్సీ కుటుంబాల్లోని విద్యార్థుల విద్యావకాశాలను ఏవిధంగానూ తీర్చలేవు. అందువల్ల రాష్ట్రప్రభుత్వాల మీద భారం పడుతున్నది. దీనితోపాటు, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయె¯Œ్స ప్రభుత్వం, రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లు ప్రవేశపెట్టడం వల్ల ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరిశోధక విద్యనభ్యసించారు. కానీ గత కొన్నేళ్లుగా కేటాయింపులు బాగా తగ్గిపోయాయి. 2019–20లో రూ.360 కోట్లు ఉంటే, ప్రస్తుత సంవత్సరం రూ. 300 కోట్లకు తగ్గించారు. దీనివల్ల రీసెర్చ్ వైపు వెళ్లడానికి ఇష్టపడే విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. విదేశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా ఎటువంటి ప్రోత్సాహం లేదు. గత సంవత్సరం రూ. 20 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం అదే అంకెను యథావిధిగా కొనసాగించారు. 2018–19లో దీనికోసం రూ. 15 కోట్లు కేటాయించి రూ. 5.97 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్సీలలోని బాల బాలికల హాస్టల్స్ నిర్మాణం, నిర్వహణకు అందించే మొత్తాలు కూడా ఆశ్చర్యకరంగా తగ్గిపోతున్నాయి. 2017–18 సంవత్సరంలో రూ. 74.91 కోట్లు ఖర్చు చేస్తే, 2018–19లో రూ. 160.5 కోట్లు కేటాయించి దానిని రూ. 36.56 కోట్లకు కుదించి ఖర్చు చేయడం ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమో అర్థం అవుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో ఒక ముఖ్యమైన వ్యాఖ్యను మనం చూశాం. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలలో పారిశుధ్య కార్మికులను ఇక వినియోగించేది లేదని ప్రకటించారు. కానీ అందుకోసం ఆమె ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. పదిహేనేళ్ళ క్రితం పారిశుద్ధ్య కార్మికుల వ్యవస్థను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చారు. కానీ దాని అమలు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటికీ ఇంకా ఒక లక్ష మంది వరకు మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఒకవేళ ఆర్థికమంత్రి ప్రకటన నిజం కావాలనుకుంటే అందుకు వారి పునరావాసానికి తగు చర్యలు తీసుకోవాలి. తగిన కార్యక్రమాలు రూపొం దించాలి. అందుకు గాను బడ్జెట్ కావాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం గత కొంతకాలంగా చేస్తోన్న కేటాయింపులు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లక్ష మందికి పునరావాసం కల్పించడానికి దాదాపు రూ. 220 కోట్లు కావాలి. కానీ ఈ సంవత్సరం కేటాయిం చింది రూ. 110 కోట్లు మాత్రమే. ఎస్టీ విద్యార్థులు కళాశాల విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడానికి ఇస్తున్న స్కాలర్షిప్ కింద 2019–20లో రూ. 19.5 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ.8 కోట్లకు కుదించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఎస్టీలకు గత సంవత్సరం రూ. 440 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత సంవత్సరం దానిని రూ. 400 కోట్లకు కుదించారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు కూడా 1,826 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు కేటాయించి చేతులు దులుపుకున్నారు. మొత్తం ఆదివాసీల విద్య కోసం గత సంవత్సరం రూ. 2,266 కోట్లు ఉంటే ఈ సంవత్సరం నామమాత్రంగా రూ. 2,300 కోట్లకు కోత కోశారు. ఎస్టీ విద్యార్థుల విదేశాల చదువులకు గత నాలుగేళ్ళుగా రూ.2 కోట్లను మాత్రమే కేటాయిస్తున్నారు. 2 కోట్ల రూపాయల మొత్తంతో ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటారో ఆ బడ్జెట్ రూపొందించిన వారే జవాబు చెప్పాలి. ఒక్కొక్క కోర్సుకి కనీసం 20 నుంచి 25 లక్షల ఫీజు ఉంటుందని అంచనా. ఇలా ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడంలేదు. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి కేంద్రం అందించే నిధుల దగ్గర ఖాళీస్థలం కనిపించడం చూస్తే ఈ ప్రభుత్వ వనవాసి కళ్యాణం ఎంత అద్భుతంగా ఉందో అర్థం అవుతుంది. హిందువుల సెంటిమెంట్‌తో రాజకీయంగా బలపడాలని చూస్తున్న ప్రభుత్వం, వారిపట్ల చూపుతున్న శ్రద్ధ చాలా నిరాశను కలుగజేస్తున్నది. జాతీయ స్కాలర్‌షిప్‌ల కేటాయింపులు అంటే రీసెర్చ్ స్కాలర్స్ కోసం గత సంవత్సరం రూ. 70 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 52 కోట్ల 50 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ఇటీవల చేర్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాటా కూడా ఉంది. బీసీల విదేశీ చదువులకోసం గత సంవత్సరం రూ. 26 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 35 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తావించిన పథకాలలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్య స్కాలర్షిప్లు బాబా సాహెబ్ అంబేడ్కర్ చొరవతో స్వాతంత్య్రానికి ముందే 1944లో ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లోనే అంబేడ్కర్ బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదించి ఇటువంటి పథకాలను రూపొందించారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎంత మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న వెనుకబాటుతనాన్ని తొలగించే స్థితిలో లేవు. కానీ ఇవే ప్రభుత్వాలు ధనిక రైతులకు పారిశ్రామిక వేత్తలకు, వేలకోట్ల అధిపతులకు ఉపకరించే ఎన్నో సబ్సిడీలను అందిస్తూండటం గమనార్హం. ఇప్పటికీ 40 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదంటే, హిందువుల పట్ల, హిందూ సెంటిమెంట్‌తో రాజకీయాలు నడుపుతోన్న పార్టీకీ, ప్రభుత్వానికీ ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు రాజ్యాంగంలో పేర్కొన్న ఎన్నో విషయాలను విస్మరిస్తుంటే ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం నిర్దేశించిన సూత్రాలను కనీసం పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇది ఎంతమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తినికానీ, రాజ్యాంగబద్ధ పాలనను కానీ అనుసరిస్తున్నట్టుగా భావించలేం. ఇది ముమ్మాటికీ దళిత, బలహీన వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. దళితులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలను కాలరాయడమే తప్ప మరొకటి కాదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
జంట నగరాల నుంచి 11 ప్రైవేట్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలందజేయనున్నాయి. మరోవైపు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు మధ్య తేజాస్ రైలు ప్రవేశపెట్టనున్నారు. చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయించగా, ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.40 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు కేంద్రం ఈ బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు కేటాయించడం గమనార్హం. మొత్తంగా గత నాలుగైదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేరకు నిధులు కేటాయించడం మినహా ఈ సారి ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించలేదు. (కిసాన్ రైలు) ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు... ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్‌రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ట్రాక్‌ల ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ, రైళ్ల భద్రత,లొకోపైలెట్లు, గార్డులు, సిబ్బంది వంటివి మాత్రమే రైల్వే పరిధిలో ఉంటాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, ఆన్‌బోర్డు సేవలు,రైళ్ల పరిశుభ్రత, వైఫై సేవలు వంటివి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. ఎయిర్‌లైన్స్ పలు ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతున్నట్లుగానే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ రైళ్లు నడువనున్నాయి. టిక్కెట్ల రిజర్వేషన్లు ఆన్లైన్ పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణ పై ఇంకా స్పష్టత రాలేదని జీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారమన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరం నుంచి వివిధ మార్గాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టర్మినల్ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి-శ్రీకాకుళం, చర్లపల్లి-వారణాసి, చర్లపల్లి-పన్వేల్, లింగంపల్లి-తిరుపతి,సికింద్రాబాద్-గౌహతి, చర్లపల్లి-చెన్నై, చర్లపల్లి- షాలిమార్, విజయవాడ-విశాఖ, తిరుపతి-విశాఖ, తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. (బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!) అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు, ఔరంగాబాద్-పన్వేల్ మధ్య తేజాస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్లలో కొన్ని డైలీ ఎక్స్‌ప్రెస్‌లుగాను, మరి కొన్ని వారానికి రెండు సార్లు చొప్పున తిరుగుతాయి. కొన్ని రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు గా నడుపుతారు.ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే దశలవారీగా వీటిని పట్టాలెక్కేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు చర్లపల్లి-వారణాసి లింగంపల్లి-తిరుపతి చర్లపల్లి-పర్వేలి విజయవాడ-విశాఖపట్టణం చర్లపల్లి-శాలిమార్ ఔరంగబాద్-పన్వెలి సికింద్రాబాద్-గౌహతి చర్లపల్లి-చెన్నయ్ గుంటూరు-లింగంపల్లి ఈ రూట్లలో తేజస్ రైళ్లు వచ్చే అవకాశం గుంటూరు-లింగంపల్లి ఔరంగబాద్-పన్వెలి చర్లపల్లి-శ్రీకాకుళం -
మెప్పించని విన్యాసం
ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, మందగమనంతో అది అందరినీ భయపెడుతున్న వేళ... వృద్ధి రేటు పల్టీలు కొడుతూ, ద్రవ్యోల్బణం పైపైకి పోతున్న వేళ బడ్జెట్ విన్యాసం కత్తి మీది సాము. ఖజానా రాబడి తగ్గుతూ ఎంచుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన నిధుల సమీకరణకు సమస్యలెదురైనప్పుడు అందరినీ మెప్పించేలా బడ్జెట్ ప్రతిపాదనలుండటం అసాధ్యం. మెప్పిం చడం మాట అటుంచి ఇప్పుడున్న సంక్షోభం పేట్రేగకుండా చూస్తే అదే పదివేలు. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి పాదనలు అందుకనుగుణంగా ఉన్నట్టు తోచదు. వినిమయాన్ని పెంచడానికి మధ్యతరగతి చేతుల్లో డబ్బులుండేలా చూడాలి. ఉపాధి అవకాశాలు పెరిగితే వారికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయం పన్నుల రూపంలో పెద్దగా పోనప్పుడు వారు తమ అవసరాల కోసం ఖర్చు పెట్ట గలుగుతారు. అయితే ఈ క్రమంలో ఖజానా పెద్దగా నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తుంది. పన్ను వసూళ్లు తగ్గకుండావున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక ప్రజల కొనుగోలు శక్తి పెంచి విని మయం బాగుండేలా తీసుకునే చర్యలకూ, ఖజానా దండిగా నిండటానికి చేసే ప్రయత్నాలకూ మధ్య వైరుధ్యం ఉంటుంది. దీన్నెంత ఒడుపుగా చేయగలుగుతారన్న దాన్నిబట్టే ఆర్థికమంత్రి చాకచక్యం వెల్లడవుతుంది. మిగిలినవాటి మాటెలావున్నా ప్రతి బడ్జెట్‌కు ముందూ మధ్యతరగతి ఆశగా ఎదురు చూసేది ఆదాయం పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థికమంత్రి కనికరించి గడిచిన సంవత్సరంకన్నా పన్ను భారం మరింత తగ్గిస్తే బాగుండునని మధ్యతరగతి జీవులు ఆశిస్తారు. ఆ విషయంలో ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఈసారి నిర్మలా సీతారామన్ ఆదాయం పన్ను వసూలుకు సంబం ధించి రెండు రకాల విధానాలు ప్రతిపాదించారు. ఇప్పుడున్న మూడు శ్లాబ్‌లను యధాతథంగా కొనసాగిస్తూ, దాంతోపాటు ఏడు కొత్త శ్లాబ్‌లు ప్రకటించారు. కొత్త శ్లాబుల్ని ఎంచుకుంటే కొన్ని మినహాయింపులు ఎగిరిపోతాయని ఆమె చావు కబురు చల్లగా చెప్పడంతో అందరూ నీరసపడ్డారు. ఇంతకూ కేంద్ర ఆర్థికమంత్రి చేసిందల్లా ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛ వేతన జీవులకివ్వడమే. రెండూ కత్తులే. ఏ కత్తి మెత్తగా తెగుతుందో ఎవరికి వారు తేల్చుకోవాల్సివుంటుంది. నిపుణులు చెబు తున్నదాన్నిబట్టి ఈ చర్య వల్ల ఆదాయం పన్ను గణన, రిటర్న్‌ల దాఖలు ఎంతో సంక్లిష్టంగా మారాయి. కొత్త శ్లాబుల్లోకి మారదల్చుకున్నవారికి నిరాకరిస్తున్న మినహాయింపులు హేతుబద్ధంగా అనిపించడం లేదు. రూ. 15 లక్షల వార్షిక ఆదాయం ఉండేవారికి పాత విధానంలో రూ. 2,73,000 ఆదాయం పన్ను చెల్లించాల్సివస్తే... కొత్త విధానం ప్రకారం రూ. 1,95,000 చెల్లిస్తే సరిపోతుంది. అంటే కొత్త విధానంలో రూ. 78,000 మిగులుతుంది. కానీ అదే సమయంలో వారు గృహ రుణంపై చెల్లించే వడ్డీ, బీమా ప్రీమియంలు, పిల్లల చదువులకయ్యే ఫీజులు, పీపీఎఫ్ వంటివాటిపై ఇప్పు డున్న మినహాయింపులన్నీ కోల్పోతారు. ఇవే కాదు... 80జీ కింద విరాళాలపై ఉండే మినహాయింపు, 80 జీజీ కింద నెలకు రూ. 5,000 వరకూ ఉండే మినహాయింపు మాయమవుతాయి. ఇలా దాదాపు 70కి పైగా మినహాయింపులను తొలగించారు. అయితే మున్ముందు సమీక్షించి మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంగతలా వుంచితే... గృహ నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వర్త మానంలో ఇలా మినహాయింపులు తొలగించడం ఆ రంగానికి చేటు కలిగించదా? అలాగే బీమా ప్రీమియంలు చెల్లించేవారికిచ్చే మినహాయింపులు కూడా కొత్త విధానంలో కనుమరుగయ్యాయి. ఆదాయం పన్ను మినహాయింపు కోసం అధిక శాతంమంది ఆశ్రయించేది బీమా ప్రీమియంలు చెల్లించడం. ఆ మినహాయింపు కాస్తా ఎత్తేస్తే, ఎవరైనా బీమా జోలికి వెళ్తారా? అది ఆ వ్యాపారంపై ప్రభావం చూపదా? ఉన్నంతలో సాగురంగానికీ, గ్రామీణ రంగానికీ కేటాయింపులు మెరుగ్గానే ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచడం మంచి చర్యే. జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)లోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రానికి ఎల్ఐసీలో పది శాతం వాటావుంది. ఇందులో ఏమేరకు విక్ర యిస్తారో చూడాలి. దండిగా లాభాలు ఆర్జిస్తున్న ఎల్ఐసీలో ప్రైవేటీకరణకు వీలుకల్పించే ఈ చర్య అమలు అంత సులభం కాదు. దీన్ని ప్రతిఘటిస్తామని బీమా ఉద్యోగులు హెచ్చరించారు. కేంద్రం నిధులు సమకూరిస్తే తప్ప నడిచే అవకాశం లేని సంస్థలను వదిలిపెట్టి నిక్షేపంలా ఉండే సంస్థలను ప్రైవేటు పరం చేయడమేమిటన్నది వారి ప్రశ్న. ఎల్ఐసీ ఏ రోజూ ఆర్థికంగా ఇబ్బందుల్లోపడలేదు. ప్రభుత్వాన్ని ప్రాధేయపడలేదు. సరిగదా... నష్టాల్లో మునిగిన అనేక పబ్లిక్ రంగ సంస్థల్ని బతికిం చడానికి దాని నిధులే అక్కరకొస్తున్నాయి. బీమా రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించినా, ప్రజలు ఎల్ఐసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఆ సంస్థే అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో కేంద్రం పునరాలోచించడం ఉత్తమం. వివిధ మౌలిక సదుపాయ రంగ ప్రాజెక్టులకు అవస రమైన నిధులు సమీకరిస్తూనే, ద్రవ్యలోటు రాకుండా చూడటానికి ఎల్ఐసీలోనూ, ఐడీబీఐలోనూ ఉన్న వాటాలను కేంద్రం విక్రయించదల్చుకుంది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ. 90,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది ఏమేరకు సాధ్యమో చూడాల్సివుంది. అయితే ద్రవ్య లోటును నిర్దేశించిన పరిమితికి లోబడివుండేలా చూడాలన్న లక్ష్యంలో సంక్షేమ పథకాలకు కోత పడకుండా చూడటం ముఖ్యం. బడ్జెట్ గణాంకాలు గమనిస్తే ముగుస్తున్న సంవత్సరంలో ఆహార సబ్సిడీలో రూ. 75,532 కోట్లు, గ్రామీణ ఉపాధిలో రూ. 9,502 కోట్లు కోతపడ్డాయి. ప్రజల్లో వినిమయాన్ని పెంచి, డిమాండ్ పెరిగేలా చేసినప్పుడే తయారీ రంగం కోలుకుంటుంది. అందు కవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటేనే వృద్ధి రేటు నిర్మలా సీతారామన్ ఆశించినట్టు 10 శాతానికి చేరుతుంది. -
‘సంపద సృష్టికే బడ్జెట్ పెద్దపీట’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ వ్యయ కేటాయింపులు సంపద సృష్టించే లక్ష్యంతో చేపట్టినవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ నిధుల ప్రవాహానికి సంబంధించి బడ్జెట్‌పై అంచనాలున్నా తాము ఆచితూచి ఆస్తుల సృష్టి కోసమే వెచ్చించాలనే విధానంతో ముందుకెళ్లామని చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందని ప్రజలు అంచనాతో ఉండవచ్చని అయితే వనరులు తగినంత ఉంటే ఖర్చు చేసేందుకు తాము సిద్ధమని, గతంలో జరిగిన దుబారా వంటి పొరపాట్లను తాము తిరిగి చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం సంపద సృష్టించే కోణంలోనే వెచ్చిస్తున్నామని చెప్పుకొచ్చారు. మౌలిక రంగంలో ప్రభుత్వ నిధులు వెచ్చిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూరిన నిధులను రెవిన్యూ ఖర్చుల కోసం వెచ్చించమని వాటిని ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే మౌలిక రంగంపై వెచ్చిస్తామని వివరించారు. బడ్జెట్లో రంగాల వారీగా ముందుకు వెళ్లలేదని, అయితే ఆర్థిక వ్యవస్థను బడ్జెట్ స్థూలంగా ఆవిష్కరించిందని చెప్పుకొచ్చారు. చదవండి : బంగారు బాతును చంపేస్తారా? -
బంగారు బాతును చంపేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2020 ప్రసంగంలో ఎల్ఐసీ ఐపీవో నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధపడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూ, ప్రత్యక్ష పెట్టుబడులు అంశాలపై ఉద్యోగులు ఆందో ళన చేపట్టనున్నారు. ఎల్ఐసి మూడు ప్రధాన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలోపాల్గొననున్నాయి.ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయాల వద్ద సోమవారం భోజన విరామ సమయంలో ప్లకార్డ్సు, నినాదాలతో నిరసన తెలపనున్నారు. అలాగే మంగళవారం ఒక గంట నిరసన సమ్మె (వాక్-అవుట్) ను చేపట్టనున్నారు. దీంతోపాటు (ఫిబ్రవరి 3,4 తేదీల్లో నిరసనల అనంతరం) ఉమ్మడి ఫోరం ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెను కూడా చేపట్టాలని యోచిస్తున్నారు. ఎల్ఐసీ ఐపీవోకు (ఐపిఓ ద్వారా ప్రభుత్వం ఈక్విటీ షేర్లను విక్రయించే ఆఫర్) తాము పూర్తిగా వ్యతిరేకమనీ, మంచి లాభాలతో ఉన్న సంస్థలో వాటాలను ఎందుకు విక్రయిస్తోందని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది రూ. 2,600 కోట్ల డివిడెండ్ ఎల్ఐసీ అందజేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ రాజ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం నిధులను కోరినప్పుడల్లా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక రంగం, గృహనిర్మాణానికి నిధులు అందిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. లాభదాయకమైన ఎల్ఐసీ సంస్థను లిస్టింగ్ చేయడమంటే.. బంగారు బాతును చంపేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసీ మూడుప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం- ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ల సమాఖ్య, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థ మొత్తం శ్రామిక శక్తిలో 90 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019 మార్చి చివరి నాటికి ఎల్ఐసిలో 2.85 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌లోని తన వాటాను ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2020 ప్రసంగంలో వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంకులో వాటాను పూర్తిగా విక్రయించడం ద్వారా మొత్తం రూ. 90,000 కోట్లు సమకూరుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా రూ. 2.10 లక్షల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించాలని.. కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 100 శాతం వాటా ఉండగా.. ఐడీబీఐలో 46.5 శాతం వాటా కేంద్రం వద్దే ఉంది. చదవండి : ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం -
‘మోదీజీ.. మాయాజాల వ్యాయామం మరింత పెంచండి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. క్షీణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యాయామాన్ని మరింత పెంచితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మోదీ గతంలో విడుదల చేసిన ఓ వీడియోను జత చేస్తూ ఇచ్చిన ట్వీట్లో మోదీకి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ‘ప్రియతమ ప్రధాన మంత్రి గారూ, దయచేసి మీ రోజువారీ మాయాజాల వ్యాయామాలు (మ్యాజికల్ ఎక్సర్సైజెస్)ను మరి కాస్త పెంచండి. మీకు తెలియదు, అవి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచవచ్చు’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. (చదవండి : నిస్సారమైన బడ్జెట్: రాహుల్) కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌పై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ బడ్జెట్లో అసలు వాస్తవికతే లేదని, ఉత్తి మాటలే కనిపిస్తున్నాయని విమర్శించింది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటోందని ఆరోపిస్తోంది. ఉద్యోగాల సృష్టి, వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం గురించి ఈ బడ్జెట్ పట్టించుకోలేదని దుయ్యబట్టింది. Dear PM, Please try your magical exercise routine a few more times. You never know, it might just start the economy. #Modinomics pic.twitter.com/T9zK58ddC0 — Rahul Gandhi (@RahulGandhi) February 2, 2020 -
బడ్జెట్ ప్రభావం, ఆర్బీఐ సమీక్షపైనే దృష్టి..
ముంబై: వారాంతాన జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 988 పాయింట్లు (2.43 శాతం)నష్టపోయి 39,736 వద్ద ముగియగా.. నిఫ్టీ 300 పాయింట్లు (2.51 శాతం) కోల్పోయి 11,662 వద్దకు పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. స్టాక్ మార్కెట్ వర్గాలను నిరాశపరిచిన కారణంగా గత 11 ఏళ్లలో లేనంతటి భారీ పతనాన్ని ప్రధాన సూచీలు నమోదుచేశాయి. గడిచిన 16 నెలల్లో ఎన్నడూ లేని అత్యంత భారీ పతనం శనివారం నమోదైంది. కేంద్రం బడ్జెట్ మెప్పించలేకపోయినందున అమ్మకాల ఒత్తిడి ఈ వారంలోనూ కొనసాగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అంశాలు ప్రతికూలంగా ఉండడం, ఇదే సమయంలో బడ్జెట్ ఏ మాత్రం ఆదుకోలేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో అమ్మకాలు కొనసాగే అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. వృద్ధికి సంబంధించి చెప్పుకోదగిన చర్యలేమీ నిర్మలా సీతారామన్ ప్రకటించకపోవడం, కొత్త పన్నుల విధానం ఈక్విటీ పెట్టుబడులను నిరాశపరిచే విధంగా ఉండడం అనేవి మార్కెట్‌కు ప్రతికూల అంశాలుగా ఉన్నాయని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజన్ హజ్రా విశ్లేషించారు. బీమా రంగంపై బడ్జెట్ ప్రభావం అధికంగా ఉండనుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఆర్బీఐ పాలసీ ఆదుకునేనా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమీక్ష ఈ వారంలోనే జరగనుంది. తాజా బడ్జెట్ అంశాలు, భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ద్రవ్యపరపతి విధానాన్ని ఎంపీసీ యథాతథంగా కొనసాగించేందుకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంబంధించి ఏవైన ఆశాజనక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ఎదురుచూస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్బీఐ చేతులు కట్టేసిన కారణంగా వడ్డీ రేట్లలో మాత్రం మార్పునకు అవకాశం లేనట్లేనని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకనామిస్ట్ దీప్తి మాథ్యూ వెల్లడించారు. 700 కంపెనీల ఫలితాలు.. భారతి ఎయిర్టెల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, లుపిన్, హెచ్‌పీసీఎల్, సిప్లా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టీవీఎస్ మోటార్, ఎం అండ్ ఎం, బ్రిటానియా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఉజ్జీవన్ ల్యాబ్స్ , టాటా గ్లోబల్, అదానీ పోర్ట్స్, జెఎస్‌డబ్లు్య ఎనర్జీ, గుజరాత్ గ్యాస్, డీఎల్ఎఫ్, కాడిలా హెల్త్‌కేర్, బాష్, బాటా, ఎన్ఎండీసీ, మహానగర్ గ్యాస్, యుసీఎల్, ఎసీసీ, వోల్టాస్ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. జనవరిలో రూ.1,003 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జనవరిలో ఈక్విటీ మార్కెట్లో రూ.12,122 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్ నుంచి రూ. 11,119 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వీరి నికర పెట్టుబడి రూ.1,003 కోట్లకు పరిమితమైంది. మరోవైపు వరుసగా 5వ నెల్లోనూ భారత మార్కెట్లో వీరి పెట్టుబడి కొనసాగింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ .7,548 కోట్లు, అక్టోబర్‌లో రూ .12,368 కోట్లు, నవంబర్‌లో రూ .25,230 కోట్లు, డిసెంబర్లో రూ .7,338.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అడ్రస్ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. శంషాబాద్‌కు చెందిన టీడీపీ కౌన్సిలర్ గణేష్ గుప్తాతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. తొలిస్థానంలో టీఆర్ఎస్ ఉంటే.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఇండిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. 1200 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఫార్మ్ ఇస్తామన్న పోటీ చేసే అభ్యర్థులే లేరని అన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, పురపాలికల్లో విజయం సాధిస్తే అందులో ఎక్కువ శాతం బడుగు, బలహీనవర్గాలకే కేటాయించామని గుర్తుచేశారు. చైర్మన్, వైఎస్ చైర్మన్లలో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పొత్తుపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారని.. సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికైనా.. ఢిల్లీ ఎన్నికైనా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందని అన్నారు. అడ్డిమారిగుడ్డిదెబ్బలా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్యాయం జరిగిందని.. దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. నీతిఆయోగ్ సిఫార్సు చేసిన కేంద్రం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ కొత్త పథకాలతో అభివృద్ధిలో ముందకు వెళ్తుందన్నారు. శంషాబాద్ వరకు మెట్రో రైలు పోడిగిస్తామని తెలిపారు. శంషాబాద్‌కు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
-
ఏపీకి పన్నుల వాటాను తగ్గించారు
సాక్షి, విజయవాడ: ఐదేళ్లుగా పోలవరానికి నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నా బడ్జెట్లో నిధులు కేటాయించలేదని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపుల వల్ల 13 జిల్లాల ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు. వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించాల్సిందని అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలు బాధ్యత కేంద్రానిది.. కానీ బడ్జెట్లో వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌పై ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను కూడా తగ్గించారని పేర్కొన్నారు. ‘చిన్న రాష్ట్రాలపై సానుకూలంగా ఉండే బీజేపీ.. ఏపీకి న్యాయం చేయాలి. రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి. విమానాశ్రయాలు కేటాయించాలి. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున కేంద్రం నూతన పోర్టుల ఏర్పాటుకు సహకరించాలి. గతంలో టీడీపీ.. బీజేపీతో మిత్ర పక్షంగా ఉన్నా రాష్ట్రానికి నిధులు రాబట్టలేదు. చంద్రబాబు ఓటుకు నోటుకేసులో ఇరుక్కుని కేంద్రాన్ని నిధులు అడగలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకుని రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేశారు. ఎన్నికల ముందు బీజేపీని విమర్శించిన టీడీపీ బడ్జెట్ అంశంలో ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. చంద్రబాబు అవకాశవాద రాజకీయలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార’ని బుద్ధా నాగేశ్వరరావు మండిపడ్డారు. -
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు