Union Budget 2022
-
కోవిడ్ అనంతర ఆర్థిక స్థిరత్వమే బడ్జెట్ లక్ష్యం
చెన్నై: భారత్ ఆర్థిక వ్యవస్థలో కోవిడ్–19 అనంతర స్థిరత్వమే 2022–23 వార్షిక బడ్జెట్ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021–22 వార్షిక బడ్జెట్‌ను కూడా ఇదే విధమైన లక్ష్యంతో రూపొందించడం జరిగిందనీ, దానికి కొనసాగింపే 2022–23 వార్షిక బడ్జెట్ అని ఆమె తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో జరిగిన ఒక సమావేశంలో ఆర్థిక మంత్రి మంగళవారం ప్రసంగించారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి 1వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కొనసాగింపు. కోవిడ్–19 మహమ్మారి నుండి ఆర్థిక పునరుజ్జీవనం, స్థిరత్వం లక్ష్యంగా రూపొందిన బడ్జెట్ ఇది. ’ఇండియా (యట్) 100’ చొరవలో భాగంగా వ్యవసాయం వంటి వివిధ రంగాలకు సాంకేతికత సౌలభ్యత పెంచడం, వైద్యం, విద్య వంటి వాటిలో డిజిటల్ ప్రోగ్రామ్‌లను విస్తరించడం వంటి అంశాల ద్వారా బడ్జెట్ భవిష్యత్ చర్యలను చేపట్టింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తుంది. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ పురోగతిపై దృష్టి సారిస్తుంది. ఆర్థికశాఖ సీనియర్ అధికారులుసహా ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్, జీఆర్టీ జ్యువెలరీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ అనంత పద్మనాభన్, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్‌గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్‌లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
సైన్యం ఆధునికీకరణ సరే! నిధులెక్కడ?
ఈశాన్య, వాయువ్య సరిహద్దుల్లో అణ్వాయుధ ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్లతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనూ తాజా కేంద్రబడ్జెట్లో రక్షణ రంగ కేటాయింపులు తగ్గిపోవడం గమనార్హం. రక్షణరంగానికి కనీసమాత్రంగానే కేటాయింపులు పెంచుతుండటం వల్ల సైనిక బలగాల ఆధునికీకరణపై ఆర్మీ ఆశలు చెదిరిపోయాయి. పైగా సైన్యం ఆధునికీకరణకు మూలధనం కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. భారత సాయుధ బలగాలు భారీ స్థాయిలో నిధులు కావాలని చేసిన డిమాండుకూ, కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో రక్షణ రంగానికి సాపేక్షికంగా చేసిన తక్కువ కేటాయింపులకూ మధ్య ఎన్నడూ లేనంత అంతరం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీంతో భారత సైన్యం నిర్వహణా సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కానుంది. భారత రక్షణ బడ్జెట్ మరోసారి చేదు వాస్తవాన్ని బయటపెట్టింది. భారత సాయుధ బలగాలు భారీ స్థాయిలో నిధులు కావాలని చేసిన డిమాండుకూ, కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో రక్షణ రంగానికి సాపేక్షికంగా చేసిన తక్కువ కేటాయింపులకూ మధ్య ఎన్నడూ లేనంత అంతరం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గత వార్షిక బడ్జెట్లకు లాగే, 2022–23 వార్షిక బడ్జెట్లోనూ రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపును అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కువగా పెంచారు. ఆర్థికమాంద్య పరిస్థితుల్లో ద్రవ్యపరమైన వాస్తవాలను అర్థం చేసుకుంటూనే, వన రుల కొరత భారాన్ని అధిగమించడానికి సాధారణంగా కేటాయించే బడ్జెట్ కంటే ఇదేమీ పెద్ద మొత్తం కాదనే చెప్పాల్సి ఉంటుంది. మొత్తం రక్షణ బడ్జెట్‌కు ఈ ఏడాదికి గానూ 5.25 లక్షల కోట్ల మేరకు కేటాయించారు. ఇది గత సంవత్సరం కంటే ఎక్కువే. కానీ స్థూల దేశీయోత్పత్తి పరంగా చూస్తే ఇది తక్కువే. గత ఏడాదిలోని 2.15 శాతంతో పోలిస్తే ఈ ఏడాది కేటాయింపులు 2.04 శాతానికి పడిపోయాయి. కేంద్రప్రభుత్వ మొత్తం వ్యయంలో రక్షణ రంగ వాటా 13.73 శాతం నుంచి 13.31 శాతానికి దిగజారిపోయింది. ఈశాన్య, వాయవ్య సరిహద్దుల్లో అణ్వాయుధ ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్ రెండు దేశాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనూ రక్షణ రంగ కేటాయింపులు తగ్గిపోవడం గమనార్హం. 2020లో 15వ ఫైనాన్స్ కమిషన్‌కి సమర్పించిన రక్షణ శాఖ సొంత అంచనాల ప్రకారం చూస్తే, 2023 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ 2.81 లక్షల కోట్లకు పెరగాల్సి ఉంది. ఈ మొత్తంలో సగం లేదా 1.62 లక్షల కోట్లను మూల ధనంపై వెచ్చించాలి. దీన్ని సైనికబలగాల ఆధునికీకరణకు, సైనిక చర్యల సామర్థ్య పెంపుదల కోసం వెచ్చిం చాల్సి ఉంది. రక్షణ రంగ బడ్జెట్ ప్రధాన సవాళ్లలో ఒకటి సైనిక బల గాల వేతనాల బిల్లు పెరుగుతూనే ఉండటం. దీంతో నిర్వహణాత్మక ఖర్చులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేకపోతున్నారు. సైనిక బలగాల వేతనాల బిల్లు 2001 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెవెన్యూ బడ్జెట్లో 36.81 శాతం మేరకు ఉండగా, 2023 బడ్జెట్ నాటికి ఇది 66.94 శాతానికి లేదా రూ. 1,49,403 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపయింది. త్రివిధ దళాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉంటున్న ఆర్మీకి చెందిన వేతనాల బిల్లు కూడా బాగా పెరిగింది. 2001 ఆర్థిక సంవత్సరంలో ఆర్మీ వేతనాలు మొత్తం రక్షణరంగ రెవెన్యూ బడ్జెట్లో 40.36 శాతం మేరకు ఉండగా, రెండు దశాబ్దాల తర్వాత అది 70.78 శాతానికి అంటే రూ.1,16,707 కోట్లకు పెరిగింది. తద్భిన్నంగా, సైనిక బలగాల వేతనాల పెంపు ఇలా పెరిగి నప్పటికీ, సైనికుల స్టోర్ బడ్జెట్... అంటే రేషన్లు, దుస్తులు, రక్షణ పరికరాల స్పేర్ పార్టులు, మందుగుండు సామగ్రి, భారతీయ సైన్యం సమర్థతను బలపర్చే ఇతర చిల్లర ఖర్చులపై వ్యయం బాగా పడిపోయింది. ఈ 20 ఏళ్లలో త్రివిధ బలగాలకు అయ్యే ఈ వ్యయం 43.65 శాతం నుంచి 16.18 శాతానికి పడిపోయింది. దీంతోపాటు భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణానికి కీలకమైన మౌలిక వసతుల కోసం కేటాయించే బడ్జెట్ బాగా తగ్గిపోయింది. ఈ రెండింటిపై వెచ్చించే ఖర్చు కూడా దాదాపు సగానికి పడిపోయింది. అంకెల్లో చెప్పాలంటే, 2001 నాటికి ఇది 9.62 శాతం ఉండగా, 2023 నాటికి 5.7 శాతానికి పడిపోయింది. అంటే కేవలం రూ.12,728 కోట్లకు ఈ వ్యయం పడిపోయింది. ఫైనాన్స్ కమిషన్, రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికను బట్టి ఈ లోటు తీవ్రత స్థాయిని అంచనా వేయవచ్చు. 2021 నుంచి 2026 సంవత్సరాలకు గానూ సైనిక బలగాల రెవెన్యూ వ్యయం 6.97 లక్షల కోట్ల వరకు తగ్గనుందని తెలుస్తోంది. దీంతో భారత సైన్యం నిర్వహణా సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కానుంది. 2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో చైనా ప్రజావిముక్తి సైన్యంతో మొదలైన ఘర్షణ ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్న సమయంలో భారత సైనిక బలగాల అప్రమత్తత ద్విగుణీకృతం కావలసి ఉంది. ఈ సమయంలో సైన్యం నిర్వహణాత్మక వ్యయానికి కావలసిన వనరు లను ఇంకా పెంచాలి. కానీ ఈ అయిదేళ్ల కాలానికి గాను ఈ వ్యయం తగ్గుముఖం పట్టనుండటం గమనార్హం. బలగాలు, వేతనాలకు సంబంధించిన అంశాలకు ఇప్పుడు ఆర్థికంగా మరింత ప్రాధాన్యం ఉంది. ఇవి పెన్షన్ చెల్లింపుతో అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. సైనిక బలగాల వేతనాలు, పింఛన్లకు అయ్యే ఖర్చు 2001 సంవత్స రంలో రూ. 12 వేల కోట్లు కాగా, 2023 ఆర్థిక సంవత్సరానికి ఇది అమాంతంగా రూ. 1.19 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే ద్రవ్యపరమైన చిక్కులు సైనికబలగాల వ్యయాన్ని అడ్డు కుంటున్నాయి. గత 20 ఏళ్లలో సైనిక బలగాల వ్యయం రూ.17,926 కోట్లనుంచి 8.5 రెట్లు పెరిగి రూ.1.52 లక్షల కోట్లకు చేరింది. కేపిటల్ బడ్జెట్ 85 నుంచి 90 శాతంకి అమాంతంగా పెరిగినప్పటికీ దాంట్లో ఎక్కువ భాగం ముందే కట్టుబడిన చెల్లింపులకు, ముందస్తుగా కొనుగోలు చేసిన రక్షణ సామగ్రికి సరిపోతుండటంతో కొత్త పరికరాల కొనుగోలుకు తక్కువ నిధులు మాత్రమే లభ్యమవుతుండటం గమ నార్హం. భారత ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెప్టినెంట్ జనరల్ శరత్ చంద్, 2018లో రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రక్షణరంగానికి కనీసమాత్రంగానే కేటాయింపులు పెంచుతుండటం వల్ల సైనిక బలగాల ఆధునికీకరణపై ఆర్మీ ఆశలు చెదిరిపోయాయని పేర్కొన్నారు. నిశితంగా పరిశీలిస్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రసంగంలో ఇలాంటి ప్రాథమిక సమస్యలను కనీసం ప్రస్తావించలేదు. తాజా బడ్జెట్లో ప్రజాకర్షక నిర్ణయాలే పతాక శీర్షికలకు ఎక్కాయి తప్పితే ఇలాంటి కీలక అంశాలు చర్చకు రాలేదు. ఆర్థకమంత్రి రెండు ప్రకటనలు చేశారు. తాజా రక్షణ రంగ బడ్జెట్లో 68 శాతం దేశీయ రక్షణ పరికరాల సేకరణకు రిజర్వ్ చేస్తున్నా మన్నారు. ఇది 2021లో 58 శాతం మాత్రమే. ఇకపోతే రీసెర్చ్, డెవలప్మెంట్ బడ్జెట్లో 25 శాతాన్ని (డీఆర్డీఓకి కేటాయించిన మూలధన బడ్డెట్ రూ. 11,981 కోట్లలో ఇది కొంత భాగం) ఇప్పుడు సైనిక పరికరాల రూపకల్పనలో పాలు పంచుకునే స్థానిక పరిశ్రమ కోసం, స్టార్టప్‌ల కోసం అట్టిపెట్టారు. ఈ రెండు నిర్ణయాలూ భారత రక్షణ పరిశ్రమకు, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీకి మంచివార్తే కానీ రక్షణ రంగ ఆధునికీకరణకు నిధుల కొరత అనే మొత్తం సమస్యను ఇవి పరిష్కరించలేవు. అయితే బడ్జెట్లో ఆర్థిక పదజాలాల డాంబికాన్ని అలా పక్కన పెడితే, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కి గత బడ్జెట్లో రూ. 2,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 3,500 కోట్లకు పెంచారు. అలాగే ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కి రూ. 2,650 కోట్ల నుంచి, రూ. 4,246.37 కోట్లకు పెంచారు. అయితే ఈ పెంపుదల ఎంతో ముందే చేయాల్సి ఉంది. దేశ సరిహద్దు, తీరప్రాంత మౌలిక సదు పాయాల కల్పనను ఇది వేగవంతం చేస్తుంది. గత బడ్జెట్లలో వీటిని ఫుట్నోట్లలో మాత్రమే ప్రస్తావించిన విషయం గుర్తించాలి. చివరగా, 2023 సంవత్సరం రక్షణ బడ్జెట్ కాస్త ఎక్కువ తక్కువగా గత బడ్జెట్లకు అనుగుణంగానే ఉంటోంది. కానీ రక్షణ రంగ మూలధన, రెవెన్యూ వ్యయం కొరతకు సంబంధించిన ప్రాథమిక సమస్యల పరిష్కారంలో తాజా బడ్జెట్ కూడా మరోసారి విఫలమైంది. ఈ బడ్జెట్లో కూడా సమగ్రమైన, రక్షణ రంగ ఫైనాన్షియల్ ప్రణాళికకు అవసరమైన రోడ్ మ్యాప్ లోపించిందని పలువురు సైనిక విశ్లేషకులు, రిటైరైన, సర్వీసులో ఉన్న సైనికాధికారులు పేర్కొన్నారు. ప్రత్యేకించి డీఆర్డీఓ, ఇండియన్ కోస్ట్‌గార్డ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తదితర కీలక సంస్థలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ఈ బడ్జెట్లోనూ కనిపించలేదని వారన్నారు. 2018లో ఏర్పర్చిన అత్యున్నత స్థాయి రక్షణ ప్రణాళిక కమిటీ ఈ కర్తవ్యాలను నెరవేర్చాలని ఆదేశించింది కానీ అది కూడా చెత్తబుట్టలో కలిసిపోయిందనే చెప్పాలి. – అమిత్ కోషిష్, రక్షణ శాఖ మాజీ ఆర్థిక సలహాదారు – రాహుల్ బేడీ, సీనియర్ జర్నలిస్టు -
స్థిరాస్తులపై కొత్త నిబంధనలు..అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు..
స్థిరాస్తి వ్యవహారాల మీద టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్)కి సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మొన్నటి బడ్జెట్లో తాజా ప్రతిపాదనల సారాంశం మీకోసం.. ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్ వర్తిస్తుంది. ఇక నుం చి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు (వ్యవసాయ భూమిని మినహాయించి) ఆ విలువ రూ. 50,00,000 దాటితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం మీద 1 శాతం టీడీఎస్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ప్రతి ఫలం విషయంలో ఇదే రూలు ఉంది.. అమ్మకపు విలువ ఎక్కువ? స్టాంపు డ్యూటీ విలువ ఎక్కు వ? ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని ప్రతిఫలంగా పరిగణిస్తారు. ఇప్పుడు టీడీఎస్‌కి ఈ నిబంధన తెచ్చారు. సాధారణంగా బయట మన కు కనిపించేది.. స్టాంప్ డ్యూటీ విలువ తక్కువ ఉంటుంది. నిజంగా ఇచ్చే ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా బ్లాక్, వైట్ వ్యవహారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం అంచనా. ఉదాహరణగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ. 60,00,000కు కొన్నారనుకుందాం. కానీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే స్టాంపు డ్యూటీ రూ. 72,00,000 అనుకోండి.. పాత రూల్స్ ప్రకారం రూ. 60,00,000 మీద టీడీఎస్ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం రూ. 72,00,000 మీద 1 శాతం చొప్పున టీడీఎస్ చేయాలి. దీనివల్ల టీడీఎస్ మొత్తం పెరుగుతుంది. అంతే కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ఎక్కువ మొత్తాన్నే పరిగణిస్తారు. ప్రతిఫలం ఎక్కువ, మూలధన లాభం .. ఫలితంగా పన్ను ఎక్కువ వసూలు చేయవచ్చు. ఇది రెసిడెంట్లకు మాత్రమే వర్తిస్తుంది. విలువ రూ. 50,00,000 దాటితేనే వర్తిస్తుంది. అమ్మకపు విలువ, స్టాంపు డ్యూటీ విలువ.. ఈ రెండూ రూ. 50,00,000 కన్నా తక్కువ ఉంటే టీడీఎస్ ప్రశ్న ఉండదు. విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ రూల్స్ వర్తిస్తాయి. దీని వల్ల ఎక్కువ పన్ను ఖజానాలోకి వచ్చి పడుతుంది. కొన్న వ్యక్తి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే, ఈ జమ .. అమ్మే వ్యక్తి స్వంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్‌ను పరిగణనలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్ మొత్తం రిఫండ్ రూపంలో వస్తుంది. అలా వచ్చే వరకు, గవర్నమెంటు ఖజానాలో ఉంటుంది. రిఫండు వచ్చాక సరే సరి. అంటే, ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీఎస్ వసూలు చేసి అసెస్మెంట్ తర్వాత వెనక్కు ఇస్తుంది. మొదటి నుంచి ఇదే పాలసీ.. పన్ను వసూళ్లను టీడీఎస్ రూపంలో ఆదిలోనే వసూలు చేయటం ఆనవాయితీ. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి; కె.వి.ఎన్‌లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
తిండి పెట్టిన వాళ్లకే మొండి చెయ్యి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే చర్యలు బొత్తిగా లేకపోవడం దేశ ప్రజల్ని నిశ్చేష్టుల్ని చేసింది. కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకొన్నది వ్యవసాయ రంగమే. ఈ వాస్తవాన్ని కేంద్రం ఎందుకు విస్మరించిందో అర్థం కాదు. కరోనా దెబ్బకు మిగతా రంగాలు చతికిల పడ్డాయి. రెండేళ్లు దాటినా నేటికీ పలు రంగాలు కోలుకోలేదు. కానీ, వ్యవసాయరంగం మాత్రం యావత్ దేశాన్ని ఆదుకొంది. ప్రజలకు కష్టకాలంలో పట్టెడన్నం పెట్టింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది. తల్లిలా అందర్నీ ఆదుకొన్న వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో మరింత ఊతం ఇచ్చే చర్యలు ఉంటాయని వేసుకున్న అంచనాలు పూర్తిగా తారు మారయ్యాయి. బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 2021–22లో కేటాయించిన 3.92% నిధులను ఈసారి (2022–23) 3.84%కు కుదించడం శోచనీయం. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చడం, స్టార్టప్‌లపై దృష్టి పెంచడం ఆహ్వానించదగిన చర్యలే. కానీ, కీలకమైన మార్పులు చేయకుండా అరకొర చర్యలతో సరిపెడితే ఉపయోగం ఏముంటుంది? ఆశించిన ఫలితాలెలా వస్తాయి? వరి, గోధుమల సేకరణకు కనీస మద్దతు ధరలు అందించ డంతో పాటు అన్ని పంటలకు కూడా రైతు సంఘాలు కోరినట్లుగా చట్టబద్దమైన మద్దతు ధరలు అందించడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచి ఉండాల్సింది. ఇప్పటివరకు మొత్తం ఆహార ధాన్యాలలో కేంద్రం సేక రించింది 35 శాతమే. ఒక అంచనా ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలోని రైతాంగం వద్ద 65 శాతం ఆహారధాన్యాలను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, కేంద్రం వైఖరి చూస్తోంటే... వరి, గోధుమ మినహా మిగతా పంటలను ప్రైవేటు వ్యాపారులకే అప్పజెప్పేటట్లు కనిపిస్తోంది. ఇక, దేశంలో తృణ ధాన్యాల వాడకం పెరిగిన నేపథ్యంలో 2023వ సంవత్సరాన్ని ‘తృణ ధాన్యాల సంవత్సరం’గా ప్రకటించడాన్ని ఆహ్వానించాల్సిందే. రైతాంగానికి లాభసాటి ధరలు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటా యించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నప్పటికీ... ఈ బడ్జె ట్లో కూడా వాటికి నిధులు కేటాయించలేదు. 2022–23ను కేవలం తృణధాన్యాల సంవత్సరంగా నామకరణం చేయడం వల్ల రైతులకు ఒరిగే లాభమేమిటి? ఇక, రసాయనాల వాడకాన్ని నిరుత్సాహపర్చడానికి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామని బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ అందుకు నిర్దిష్టమైన ప్రతిపాదనలు బడ్జెట్లో కనపడటంలేదు. స్వయంగా ప్రధానమంత్రి ప్రతి పాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో అనాలోచిత చర్య. ఉదాహరణకు ‘పరం పరాగత్ కృషి యోజన’ను ‘రాష్ట్రీయ కృషి యోజన’లో విలీనం చేశారు. మొత్తం 27 పథకాలను 7 పథకాలుగా మార్చారు. సహకార రంగానికి ప్రోత్సాహం ఇస్తామని చెప్పి... దేశంలో విశిష్ట చరిత్ర, ప్రాముఖ్యం ఉన్న పాల ఉత్పత్తి సహకార సంఘాలకు ఇస్తున్న కొన్ని రాయితీలను ఎత్తేయడానికి ఏకంగా పథకాలనే రద్దు చేయడం శోచనీయం. మూడునాలుగేళ్ల క్రితం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పథకంగా అభివర్ణించిన ఫసల్ బీమా పథకం అసలు ఉన్నదో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకంలో మార్పులు తెచ్చి రైతులకు ప్రయోజనం కలిగేలా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ బడ్జెట్లో నిరాశ కలిగించిన మరో ప్రధానమైన అంశం రైతులకు స్వల్పకాలిక రుణాలపై ఇచ్చే రాయితీ గురించిన ప్రస్తావన లేకపోవడం! ‘మార్పు చేసిన వడ్డీ రాయితీ పథకం’ అంటూ ఓ కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ పథకం విధివిధానాలేమిటో భవిష్యత్తులో చూడాల్సి ఉంది. రైతులు, రైతాంగ సంస్థలు జాతీయ స్థాయిలో ఏడాదిపాటు ఉద్యమించి కేంద్రం మెడలు వంచి మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చేసినందుకు గాను వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకొన్నట్లుగా ఉందిగానీ, సానుకూల ప్రోత్సాహకాలు కనిపించటంలేదు. రైతులు ఏం పాపం చేశారు? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తిండి గింజలు పండించి దేశ ప్రజల ఆకలి తీర్చడమేనా? వ్యవసాయ సంక్షోభాన్ని నివారించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కేంద్ర బడ్జెట్ లేదు. అయితే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కొన్ని రాష్ట్రాలు రైతులను ఆదుకోవడానికి చేపట్టిన ప్రోత్సాహ కాలే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాయి అనే విషయం కాదన లేని వాస్తవం. కేంద్ర సహకారం తోడై ఉంటే పరిస్థితి మరింత మెరుగై ఉండేది. వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఏపీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి అన్యాయం చేసింది. కరోనాకు ఎదురునిలిచి రైతన్న దేశానికి తిండిపెట్టాడు. అటువంటి మెతుకు దాతకు బడ్జెట్ నిరాశను మిగిల్చింది. వ్యవసాయం, అను బంధ రంగాలకు నిధులను కుదించడం శోచనీయం. స్వయంగా ప్రధాని ప్రతిపాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో విమర్శనార్హమైన అంశం. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
ఏపీకి 18 ఈ-పోక్సో కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం, పోక్సో చట్టం కేసుల సత్వర పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌కు 18 ఈ–పోక్సో కోర్టులు కేటాయించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. వీటిలో 10 ప్రస్తుతం పనిచేస్తున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ మూడు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిచేయ తలపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులకు సాగరమాలలో భాగంగా ఆర్థికసాయం ఇవ్వడం లేదని కేంద్ర నౌకాయన మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ మూడు నాన్–మేజర్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోర్టుల్లో ఏఐ జస్టిస్ డెలివరీ సిస్టమ్ సామర్థ్యం పెంచడానికి సాంకేతికతతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవశ్యకతను గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు తెలిపారు. ఈ–కోర్టు రెండో దశ ప్రస్తుతం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, వంగా గీతావిశ్వనా«థ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భర్తీకాని 1,425 పీజీ సీట్లు 2020–21లో 1,425 మెడికల్ పీజీ సీట్లు భర్తీకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా చెప్పారు. వీటిలో 1,365 బ్రాడ్–స్పెషాలిటీ సీట్లు, 60 డిప్లొమా సీట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏపీలో 12,859 మంది ఔషధ మొక్కల సాగు ఆంధ్రప్రదేశ్‌లో 12,859 మంది రైతులు ఔషధ మొక్కలు సాగుచేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా ఆయా రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌లో నర్సింగ్ కళాశాల మంగళగిరి ఎయిమ్స్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాల ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాగా,దేశవ్యాప్తంగా మంగళగిరి సహా 13 ఎయిమ్స్‌ల్లో 7,500 పడకలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఉచిత వ్యాక్సిన్‌కు రూ.27,945.14 కోట్లు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించడానికి 2021–22లో రూ.35 వేల కోట్లు కేటాయించగా ఫిబ్రవరి 7 నాటికి రూ.27,945.14 కోట్లు వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. 2022–23 బడ్జెట్లో కూడా వ్యాక్సినేషన్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల సంఖ్య పెంచే ప్రతిపాదన లేదు కేంద్ర మంత్రుల సంఖ్య పెంచడానికి రాజ్యాంగాన్ని సవరించే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజుజు.. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
పామాయిల్ సాగు ప్రోత్సాహానికి రూ.11 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్ఎంఈవో బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ఏపీలో 40 ఎఫ్‌సీఐ వేర్‌హౌస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్సీఐకు చెందిన సొంత, అద్దె గోదాములు 40 ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఎఫ్‌సీఐ, రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న వేర్‌హౌస్‌లు సెంట్రల్‌పూల్ స్టాక్‌కు సరిపోతాయని చెప్పారు. ఏపీ ప్రతిపాదనలకు అనుమతి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై)లో ఏపీ పంపిన ప్రతిపాదనలను అనుమతించామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రూ.657.11 కోట్ల పనులకు అనుమతించి ఇప్పటివరకు రూ.108.95 కోట్లు విడుదల చేశామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, ఓడరేవుల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతోపాటు ఫిష్ రిటైల్ హబ్ తదితర పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. పీపీపీ పద్ధతిలో ఎంవీయూలు పశువుల సంరక్షణ నిమిత్తం సేవలు నేరుగా రైతుల ఇంటివద్దే అందించేలా మొబైల్ వెటర్నరీ యూనిట్లను (ఎంవీయూలను) పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో తీసుకొచ్చినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలను, ఏజెన్సీలు (కోఆపరేటివ్, మిల్క్ యూనియన్లు) మానవ వనరులను ఏర్పాటు చేస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లబ్ధిదారుల్ని పెంచాలని ఏపీ కోరింది జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)లో లబ్ధిదారుల సంఖ్యను గ్రామీణ ప్రాంతంలో 75, పట్టణ ప్రాంతంలో 50 శాతానికి పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 2011 జనాభా లెక్కలననుసరించి ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 60.96 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41.14 శాతం లబ్ధిదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. -
ఇది మనుషులు పట్టని అభివృద్ధి
రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. ఢిల్లీ సర్కార్ బడ్జెట్ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. కేంద్రంలో కూడా సబ్‌ప్లాన్ హెడ్ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్లో ప్లాన్, నాన్‌ప్లాన్ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్లపైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాగ్ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్ లెక్కల్లో లేవని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన సబ్‌ప్లాన్ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో సబ్‌ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్‌కు మార్గంవేసే బడ్జెట్ అని చెప్పారు. భవిష్యత్ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్‌లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది: విజయసాయిరెడ్డి
-
ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. చర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్ఛార్జ్ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. 2010-2015 మధ్య ఏపీ షేర్ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
భారత్ డిజిటల్ రూపాయి
-
అన్ని వర్గాలకు జరిగేలా బడ్జెట్లో కేటాయింపులు: కేంద్ర మంత్రి
-
వట్టి శుష్క వాగ్దానాల బడ్జెట్
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉపద్రవాలను దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకాశాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటాయించిన నిధులు పేదలను, కార్మికులను, వలస కూలీలను వంచించాయనే చెప్పాలి. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలకులు దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మరోసారి చిదిమివేశారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 కేంద్ర బడ్జెట్ పూర్తిగా దిశారహితం గానూ, పేదలకు, రైతులకు వ్యతిరేకం గానూ రూపొందింది. ఇది ఆర్థికరంగంలో బీజేపీ పాలకుల వైఫల్యంపై శ్వేతపత్రం మాత్రమే. గత కొన్నేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపయిందంటూ కేంద్రప్రభుత్వం ఊదరగొడు తోంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల పెరిగిన ఆదాయంపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న 100 విశ్వనగరాల పురోగతి మాట ఏమిటి? బడ్జెట్లో చూపించిన కేటాయింపులు కొత్త సీసాలో పోసిన పాత సారా తప్ప మరేమీ కాదంటే అది అసందర్భ వ్యాఖ్య కాదు. కరోనా మహమ్మారి ద్వారా కలిగిన నష్టాలను పూరించ డానికి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు సహాయాన్ని అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించు కుంది. కానీ, దీనికి ప్రత్యామ్నాయంగా 2023 మార్చి వరకు చిన్న కార్పొరేషన్లకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. అయితే ద్రవ్య సమస్యల్లో ఇప్పటికే కూరుకు పోయిన చిన్న సంస్థలు క్రెడిట్ స్కోర్‌ని మెయిన్‌టెయిన్ చేసే స్థితిలో లేవన్న ఇంగితజ్ఞానం ప్రదర్శించడంలోనూ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు నిజంగా చేయవలసింది ఏమిటంటే చిన్న తరహా సంస్థలను ప్రోత్స హించడమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 14 నుంచి 15 శాతంగా ఉంటోంది. ఈ తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచగలిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్‌గా పనిచేస్తుంది. వ్యవసాయ పనుల్లో విస్తృతంగా పాల్గొం టున్న రైతులు తమ రాబడికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కనీస మద్దతు ధర పథకాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక్క పదం కూడా తాజా బడ్జెట్ ప్రతిపాదనలో కనిపించదు. గ్రామీణ భారతావనికి ఘోరమైన అన్యాయం చేయడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం సాధించింది. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా ఈ తాజా కేంద్ర బడ్జెట్లో కేటాయిం చలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే మరి. గంగానది పొడవునా రసాయన రహిత స్వచ్ఛ వ్యవ సాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ ఛత్తీస్‌గఢ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనికి పూను కున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతుల ఖాతాలకు బదలాయించాలని నిర్ణయించింది.. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నదానికి కొనసాగింపు మాత్ర మేనని చెప్పాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఇప్పటికే కనీస మద్దతు ధరను రైతుల ఖాతాకు నేరుగా బదిలీ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గరి దారి ఏమిటంటే ప్రత్యక్ష నగదు బదిలీని అమలుపర్చటమే! ఈవిధంగానే కరోనా మహమ్మారి కాలం పొడవునా ఆర్థిక మాంద్యం నుంచి చత్తీస్‌గఢ్ తన్ను తాను కాపాడుకోగలిగింది. కేంద్రప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని విస్తరిస్తున్నట్లు చెబుతూ వచ్చింది కానీ బడ్జెట్లో దీని ప్రస్తావన కూడా తేలేదు. పసలేని వాగ్దానాలను చేయ డంలో నరేంద్ర మోదీ నేతృత్వం లోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాటుదేలి పోయింది. ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసం గంలో ఏడు చోదక శక్తుల గురించి మాట్లాడారు. అవేమిటంటే – రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జల మార్గాలు, నిర్మాణ రంగం. వీటితో ఆర్థికవ్యవస్థను ముంద డుగు వేయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. కానీ వీటికి సరిపడా నిధుల కేటాయింపు బడ్జెట్లో కనిపించలేదు. ఎంత వెచ్చిస్తారనే సంఖ్యలనూ పేర్కొనలేదు. గతంలోని కొన్ని బడ్జెట్లను మనం పరిశీలించినట్లయితే, పెద్ద పెద్ద బులెటిన్లను ప్రకటించారు. సమర్థ మౌలిక వసతుల మిషన్, జాతీయ వ్యాప్తంగా డిజిటల్ వెల్ బీయింగ్ మిషన్ వంటివి వీటిలో కొన్ని. కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం ఊహించినంత పరిమాణంలో లేదు. పోతే, ప్రధాని గతిశక్తి పథకం మార్గంలో మౌలిక వసతులపై వ్యయాన్ని పెంచుతారా అంటే అదీ స్పష్టం కావడం లేదు. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉప ద్రవాలను మన దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకా శాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రాధాన్యం ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్లో కేటా యించిన నిధులు భారత ప్రజలను ప్రత్యేకించి పేదలను, కార్మికులను, వలస కూలీలను, మహమ్మారి కాలంలో పూర్తిగా మూతపడిన ఆర్థిక సంస్థలను వంచించాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ‘పనికి ఆహార పథకా’నికి నిధుల కేటాయింపును పెంచలేదు. ఎప్పటిలాగే ఇది ఎన్నికల సంవత్సరంలో మాత్రమే పట్టించుకునే అంశంగా ఉండిపోయింది. దీంతో అసలే కరోనా దెబ్బతో జీవితాలు అతలాకుతలమైన పేదప్రజలపై పిడుగు పాటు తప్పదు. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి వస్తూత్పత్తితో లింక్ చేసిన ప్రోత్సాహక పథకం ద్వారా, కొత్తగా 60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు కానీ దీనికి సంబంధించిన గణాంకాలు కానీ, ఎలా ఉద్యోగాలను çసృష్టిస్తా రన్న ఎరుక కానీ బడ్జెట్లో కనిపించలేదు. కేంద్రప్రభుత్వం ఉపాధి కల్పనపై ఎలాంటి నమూనా ఇవ్వనందున నిరు ద్యోగితకు వ్యతిరేకంగా రోడ్లమీదికి వస్తున్న లక్షలాది మంది యువతకు ఇది పూర్తిగా నిరాశపరిచే అంశమే అవుతుంది. నిరుద్యోగ పరిస్థితులతో ఎలా వ్యవహరించాలనే విషయమై కేంద్రం మా ఛత్తీస్‌గఢ్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మా రాష్ట్ర నిరుద్యోగితా రేటు దేశ సగటు నిరుద్యోగ రేటు కన్నా తక్కువగా ఉందని నివేదికలు ఇప్పటికే తేటతెల్లం చేశాయి కూడా! ఆర్థిక వ్యవస్థను నిధుల లేమి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది కాబట్టే కొనుగోలుదారుకు సాధికారత కల్పించాలని కేంద్రం కోరుకుంటోంది. కానీ ఈ భావన కూడా ఇప్పుడు డిమాండ్ లేని సరకుగా మారిపోయింది. ప్రభుత్వం ఏమి చేస్తోందో అంతుబట్టడం లేదు. వేళ్లమీద లెక్కబెట్టగల కార్పొ రేట్లకు సంపద ధారపోయడం కంటే కేంద్ర ప్రభుత్వాధికారులు అధిక జనాభా చేతుల్లోకి డబ్బు వచ్చిపడేలా ప్రత్యామ్నాయ లక్ష్యాలను ఇకనైనా రూపొందించుకోవాలి. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందనే చెప్పాలి. కంపెనీలపై పన్నును 18 నుంచి 15 శాతానికి తగ్గించారు కానీ అదే సమ యంలో ఆదాయ పన్ను విభాగంలో వేతన జీవులకు ఎలాంటి ఊరటనూ అందించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తాజా కేంద్ర బడ్జెట్ ఒక దిశా దశా లేని శుష్క వాగ్దానాల బడ్జెట్. మధ్య తరగతికి మొండిచెయ్యి చూపిన బడ్జెట్. అంతకుమించి నిరు పేదల మాడు పగలగొట్టిన బడ్జెట్! భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి –కాంగ్రెస్ నాయకుడు -
పురోగతికి ఇది బూస్టర్ బడ్జెట్
ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని కూడా మించి భారత్ గత రెండేళ్లుగా సత్ఫలితాలను పొందగలుగుతోందంటే కారణం– దేశాన్ని నడిపిస్తున్నవారి దృఢత్వం. బడ్జెట్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్ప ర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధిపథంలోకి వేగవంతం చేసే భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. కరోనా ప్రభావ పర్యవసానాల నుంచి దేశాన్ని ముందుగానే భద్రతా వలయంలోకి తప్పిం చడం, అభివృద్ధిని కుంటపడ నివ్వని విధంగా స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అనే రెండు అంశాలపై తాజా కేంద్ర బడ్జెట్ చక్కని సమతుల్యతను పాటిం చింది. కరోనా తన అనూహ్యమైన ఉత్పరివర్తనలతో ప్రపంచ దేశా లతో పాటు భారత్‌నీ లాక్డౌన్లోకి నెట్టేసిన నేపథ్యంలో మిగతా దేశాల మాదిరిగానే మనమూ ఈ విపత్తువంటి పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు అనుగుణంగా రెండు వార్షిక బడ్జెట్లకు, మధ్యమధ్య కొన్ని చిన్నతరహా బడ్జెట్లకు రూపకల్పన చేసుకున్నాం. సహజంగానే ఈ అత్యయిక స్థితిలో సంపన్న దేశాలు తమ బడ్జెట్లలో భారీ ఉద్దీపన ప్రణాళికలను ఏర్పరచుకున్నాయి. భారత్ కూడా అదే బాటలో ఆర్థికపరమైన స్థిర నిర్ణయాలకు మొగ్గు చూపింది. రెండేళ్లు గడిచినా నెమ్మదించని కరోనా... సంపన్న దేశా లను సైతం అప్పుల పాలు చేసింది. యావత్ ప్రపంచ పురోగతి మార్గాలు మూసుకుపోయాయి. ద్రవ్యోల్బణం ఆయా దేశాలను వరదలా ముంచెత్తింది. అదే సమయంలో భారత్... ప్రపంచం లోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఈ ఏడాది 9.2 శాతం స్థూల జాతీయోత్పత్తిని సాధించే దిశగా పయని స్తోంది. కఠినమైన ఈ ఆర్థిక సంక్షోభ సమయంలోనూ బడ్జెట్ లోని ఉద్దీపనల ప్రణాళికల లక్ష్యాన్ని మించి కూడా సత్ఫలితా లను భారత్ పొందగలుగుతోందంటే కారణం... దేశాన్ని నడిపి స్తున్నవారి దృఢత్వం, వారి తిరుగులేని అధినాయక ఆర్థిక దిశా నిర్దేశకత్వమే! గత రెండేళ్లుగా భారత్ అనుసరిస్తూ వస్తున్న చురుకైన విధానాల రూపకల్పన, వస్తు సేవల సరఫరాలను పెంపొందిం చేలా తీసుకువచ్చిన సంస్కరణలు వర్తమాన ఆర్థిక స్థితికి పటిష్ఠ మైన పునాదిని అందించాయి. 2047 నాటికి వందేళ్ల స్వాతంత్య్రం వైపు భారతదేశాన్ని తీసుకెళ్లే పాతికేళ్ల ‘అమృత కాల’ జవ, జీవనయాన మార్గాన్ని సుగమం చేశాయి. ఆర్థిక అవ రోధాలను, అంతరాయాలను వినూత్న ఆవిష్కరణలతో నెగ్గుకు వచ్చేందుకు భారత ప్రధాని దర్శించిన ‘ఆత్మనిర్భర భారత్’ ప్రపంచ దేశాలకు కూడా దారి చూపగలిగినంతటి శక్తిమంత మైనది. ఈ దార్శనికతకు కొనసాగింపుగానే భారత సమ్మిళిత, స్థిరాభివృద్ధి కోసం 2022–23 బడ్జెట్‌కు సూత్రకల్పన జరిగింది. ఇందులో భావి భారత నిర్మాణానికి పునాది స్తంభాలుగా కనిపి స్తున్న కొన్ని ముఖ్యాంశాలను నేను ఇక్కడ ప్రస్తావించదలిచాను. ఒక పార్టీ నాయకుడిగా కాక, ప్రజాహితాన్ని ఆశించే ఒక పరిశీల కుడిగా బడ్జెట్లోనే నేను నాలుగు అంశాలను తరచి చూశాను. మొదటిది – మూలధన వ్యయం. భారతదేశ మధ్యకాలిక వృద్ధిని ప్రగతిపథంలో పైపైకి పురోగమింపజేసే శక్తి.. నిరంత రాయంగా కొనసాగే స్థిరత్వమే. ఆ స్థిరత్వాన్ని కల్పించే మౌలిక సదుపాయాల వ్యయానికి గత ఏడాది బడ్జెట్లో జరిగిన భారీ కేటాయింపులు తాజా బడ్జెట్లో గణనీయంగా అపూర్వ రీతిలో రూ. 7.5 లక్షల కోట్లు అయి, 35.4 శాతం పెరిగాయి. ఇదే ఊపులో గతిశక్తి బృహత్ ప్రణాళికలో ఒక భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే 1.5 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది. అనుసంధాన పరిధిలోకి వచ్చే విద్య, రక్షణ, వాణిజ్య రంగాలపైన కూడా గతిశక్తి సానుకూల ప్రభావం, ప్రయోజనం ఉంటాయి. రెండవది – డిజిటైజేషన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంభ వించగల మార్పులు, పరిణామాలకు అనుగుణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని పునఃపరిశీలించుకునేందుకు అవసర మైన ముఖ్యమైన పనిని తాజా బడ్జెట్ నిర్దేశించుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ కరెన్సీతో బలోపేతం చేసే ఈ అద్భుతమైన ఆలోచన మోదీ ప్రగతిశీల భావజాలం నుంచి ఆవిర్భవించిందే! దీంతో భారత్ ప్రపంచంలోనే డిజిటల్ కరెన్సీ కలిగిన అతి పెద్ద దేశాలలో ఒకటిగా అవతరించినట్లయింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు డిజిటల్ కరెన్సీ గట్టి రక్షణను ఇస్తుంది. ఆన్లైన్ మోసాల నుంచి భద్రతనిస్తుంది. మనీ లాండరింగ్‌ను నిరోధిస్తుంది. మూడవది – పన్ను ఆదాయాల రాబడిని పెంచే నిర్ణ యాలు. గడిచిన ఏడాదిలో ప్రతినెలా కూడా వస్తుసేవల పన్ను వసూళ్లు (జీఎస్టీ) రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఒక్క జనవరిలోనే మునుపెన్నడూ లేనంత అత్యధికంగా వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి! ఫలితంగా ద్రవ్యోల్బణం నెమ్మదిగానే అయినా కచ్చితంగా దారికి వస్తుంది. నాల్గవది, వ్యక్తులను ఆర్థికంగా శక్తిమంతులను చేయడం. వారికి సాధికారతను కలిగించడం. నిర్ణయాధికార బలాన్ని చేకూర్చడం. బడ్జెట్లోని సామాజిక రక్షణను పునర్వచించిన విలక్షణమైన గుణం ఇది. పి.ఎం. ఆవాస్ యోజన, పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి వంటి కీలకమైన పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు స్పష్టమైన వ్యత్యాసంతో పెరిగాయి. అత్యంత ప్రజావశ్యక ‘హర్ ఘర్ నల్ సే జల్’ పథకం కింద 3 కోట్ల 50 లక్షల ఇళ్లకు తాగు నీటిని అందించేందుకు కేంద్ర 60 వేల కోట్ల రూపాయలను ప్రత్యేకించింది. దేశంలో వివిధ ప్రాంతాలను కలిపే విధంగా 25 వేల కి.మీ. జాతీయ రహదారుల నిర్మా ణానికి ప్రాధాన్యం ఇచ్చింది. ‘ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సా హాక’ ప్రణాళికతో 60 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించ బోతోంది. మహమ్మారి నీడ పడిన ప్రతి రంగానికి, ప్రతి విభా గానికి వెలుగును ప్రసరింపజేసేందుకు ఉద్దేశించిన ఈ బడ్జెట్... రైతులకు నేరుగా కూ. 2.37 లక్షల కోట్ల కనీస మద్దతు ధరను చెల్లించబోతోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభి వృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న అత్యవసర రుణ సహాయ వ్యవస్థను పరిపుష్టం చేసి, ఆ పరిశ్రమల పనితీరును వేగవంతం చేసే పథ కాన్ని ప్రవేశపెట్టనుంది. అంకుర సంస్థలకు పన్ను మినహా యింపులను విస్తృతం చేస్తోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా, లెక్కల ఎక్కువ తక్కువల నుంచి నిరాశాపూరితమైన అర్థతాత్పర్యాలను ఎత్తి చూపినా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. రానున్న పాతికేళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర గమనాన్ని అభివృద్ధి పథంలోకి వేగవంతం చేసే సమీప భవిష్యత్ ప్రణాళికే ఈ బడ్జెట్. ముందే చెప్పినట్లు కరోనా ప్రభావాల నుంచి జాతికి రక్షణ వలయాన్ని ఏర్పరుస్తూ, అదే సమయంలో స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేలా ఒక చక్కటి సమతుల్యాన్ని పాటిస్తూ రూపొందిన బడ్జెట్ ఇది. ప్రపంచ దేశాలలో భారత్ మహాశక్తిగా ఎదిగే పరివర్తన క్రమాన్ని మోదీ పాలనలోనే దేశ ప్రజల చూడబోతున్నారు. ఈ పరివర్తన.. మౌలిక సదుపాయాలు, డిజిటైజేషన్, మూలధన పెట్టుబడులు, వాణిజ్య స్నేహశీలతల చక్రాలపై, ఇంకా.. కోటీ ముప్పై లక్షల మంది ప్రజల స్ఫూర్తి సామర్థ్యాలపై సాగబోతోందని బడ్జెట్ సారాంశం తెలియ జేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలన వ్యవహారశైలిలోని దృఢత్వం, భావిభారత లక్ష్యాలపై పట్టు, భారత్ ఎంత గడ్డు స్థితినైనా ఎదుర్కోగలదని ఆయన ఇస్తున్న ధీమా, అర్థంలేని విమర్శలతో విలువైన చట్టసభల సమయాన్ని, ప్రజాధనాన్ని వృ«థా పరిచే ప్రతిపక్షాల కుటిలయత్నాలకు గట్టి సమాధానం బడ్జెట్లో ప్రతిఫలించాయి. జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రి –బీజేపీ నాయకుడు -
ద్రవ్యలోటును దాటితేనే సంక్షేమం
నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి చాలా దేశాలు ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగాలంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2022–23 ఆర్థిక సంవత్సరం తాలూకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని మౌలిక ఆకాంక్షలు దేశ ప్రజలలో అప్ప టికే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ప్రాధాన్యతాంశాల గురించిన పలు రకాల ఒత్తిడులు ఉన్నాయి. వీటిలో కీలకమైనవి: 1. సంవత్సర కాలం పైబడి సాగిన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్లు. 2. కోవిడ్ రెండో వేవ్ కాలంలో కోల్పోయిన తన ప్రాధాన్యాన్ని తిరిగి ఎంతోకొంత పొంద వలసిన ఆగత్యం ప్రధాని మోదీకి ఉండటం. 3. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక, నిజానికి ఉన్న ఉద్యోగాలే ఊడిపోయిన స్థితి. రికార్డు స్థాయి నిరు ద్యోగానికి ఎంతో కొంత ఆచరణాత్మక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత. 4.కోవిడ్ ముందరి 2018 జనవరి–మార్చి కాలం నుంచే పతనమవుతూ, కోవిడ్ కాలంలో అగాథంలోకి పడిపోయిన స్థూల జాతీయోత్పత్తి గణాంకాన్ని తిరిగి నిలబెట్టగలగడం. 5. యూపీఏ ప్రభుత్వ పతనానికి ఒక ప్రధాన కారణమైన ద్రవ్యోల్బణం నేడు మరల తీవ్రస్థాయిలో పెరుగుతున్న స్థితి. దీనికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని మరింత తగ్గించడం వంటి పరిష్కారాల ఆవశ్యకత. 6. కోవిడ్ కాలంలో భారీ సంఖ్యలో ఉపాధిని కోల్పోయిన, అప్పుల పాలైన, పేదరికంలోకి జారిపోయిన కోట్లాదిమంది మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే అవసరం. స్థూలంగా మింట్ సి ఓటర్ సర్వేలో బడ్జెట్ నుంచి ప్రజలు కోరుకుంటున్న అంశాలుగా ఈ నాలుగు ప్రస్ఫుటమైనాయి. (ఎ) విద్యా వైద్యానికి కేటాయింపును భారీగా పెంచడం. (బి) నిరుద్యోగ భృతి వంటి అంశంపై దృష్టి పెట్టడం. (సి) దేశంలో రైతాంగ వర్గానికి చెందనివారు కూడా కోరుకుంటున్న విధంగా రైతు అనుకూల విధానాలు. (డి) సంక్షేమ రాజ్యాన్ని భారీగా విస్తరించాలన్న ఆకాంక్షకు రూపాన్ని ఇవ్వటం. ముందుగా రైతు ఉద్యమ నేపథ్యంలో ముందుకు వచ్చిన రైతాంగ ఎజెండా బడ్జెట్లో ఎలా ప్రతిఫలించిందో చూద్దాం. సంవ త్సరం పాటు ఉద్యమం నడిపి ఇరకాటంలో పెట్టిన రైతాంగం పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి చూపిందనే ఆరోపణ ఉంది. పంటల సేకరణను అన్ని పంటలకూ విస్తరించి, లబ్ధిదారుల సంఖ్యను పెంచా లనే రైతుల కోరికకు భిన్నంగా... పంటల సేకరణకు కేటాయించిన మొత్తాన్ని 2021–22 బడ్జెట్లోని 2.48 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం 2.37 లక్షల కోట్లకు తగ్గించారు. పంటల సేకరణ తాలూకు లబ్ధిదారుల సంఖ్యను గతేడాదిలోని 1.97 కోట్ల మంది నుంచి 1.63 కోట్ల మందికి కుదించారు... అదీ కథ! ఎరువులపై ఇచ్చే సబ్సిడీ 2021–22 బడ్జెట్ తాలూకు 1,40,122 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 1,05,222 కోట్లకు అంటే 25 శాతం మేరకు తగ్గింది. మరో పక్క గ్రామీణ పేదలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉపాధి పథకానికి 73 వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇది 74 వేల కోట్లు (అదనపు కేటాయింపులతో ఈ మొత్తం లక్ష కోట్ల మేరకు చేరుకుంది.) ఉపాధి హామీ చట్ట ప్రకారం, గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, వారు పని చేయాలని కోరుకుంటే, సంవత్సరానికి కనీసం వంద పని దినాలకు హామీ ఇవ్వాలి. కానీ చాలా ఏళ్లుగా ఈ పథకానికి కేటా యింపులు తగినంతగా లేవు. దీనివల్ల 2020 ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పని దినాలు 34.76 మాత్రమే. 2021 ఆర్థిక సంవత్సరంలో అవి మరింతగా దిగజారి 27.16కు పరిమితమయ్యాయి. అంతకు ముందటి కాలంలో ఇవి సగటున 42గా ఉన్నాయి. ఉపాధి పనులకు ఏర్పడ్డ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ పథకం సంతృప్తికర అమలు కోసం 2.64 లక్షల కోట్ల రూపాయలు అవసరమని ఒక ప్రఖ్యాత సంస్థ లెక్కించింది. స్థూలంగా 2013–2019 మధ్యకాలంలో సాగుబడి ద్వారా రైతుల ఆదాయం తగ్గిపోయింది. ఒక రైతు కుటుంబానికి వారి ఆదాయంలో 48 శాతంగా ఉన్న సాగుబడి ఆదాయ వాటా ప్రస్తుతం 37 శాతానికి తగ్గింది. పేద ప్రజలకిచ్చే ఆహార సబ్సిడీపై కోత పడ్డది. 2,86,469 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత బడ్జెట్లో 2,06,831 కోట్లకు తగ్గింది. ప్రపంచ క్షుద్బాధ సూచీలో 2021 సంవత్సరానికి మొత్తం 116 దేశాలలో భారతదేశం ర్యాంకు 94 నుంచి 101కి దిగజారింది. కోవిడ్ కాలంలో మరింత తీవ్రమైన ఆకలి సమస్యను ఈ ఆహార సబ్సిడీల కోత మరింత పెంచుతుంది. దీన్ని మరింత జఠిలం చేస్తూ ధరలు పెరుగుతున్నాయి. దీని వెనుక అంతర్జాతీయంగా కమోడి టీల ధరల పెరుగుదల, దేశీయంగా విపరీతమైన పన్నుల భారం వలన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఎస్మా వంటి చట్టాల రద్దు వలన పట్టపగ్గాలు లేని వ్యాపారస్తులు, దళారుల చేతివాటం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కావడం వలన ధరలపై నియంత్రణ ఉంచ గల సమాంతర వ్యవస్థ దెబ్బతినడం వంటివి అన్నీ ఉన్నాయి. ఈ కారణాలలో మొదటిదాన్ని వదిలేస్తే, మిగతావన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకాలే. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అడ్డు రావడం వలన గత రెండు నెలలుగా నిలిచిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎన్నికల తరువాత పైకి ఎగసేందుకు సిద్ధంగానే ఉంది. ఈ నిర్వాకం చాలద న్నట్లు, ఈ మధ్య కాలంలో జీఎస్టీ శ్లాబులలో మార్పు చేస్తామంటూ ప్రస్తుతం 0 శాతం జీఎస్టీ ఉన్న కొన్ని సరుకులపై పన్నును విధించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా, నిరుద్యోగం దేశ ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగా లిస్తామనే హామీని తుంగలో తొక్కి... రానున్న కాలంలో 60 లక్షల ఉద్యోగాలంటూ కొత్త పల్లవిని అందుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చుతున్న బీజేపీ ప్రభుత్వం, నగర ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకం కావాలనే డిమాండ్‌కు సహజంగానే అనుకూలంగా స్పందించలేదు. ఈ మొత్తం క్రమంలో దేశ స్థూల జాతీయోత్పత్తి దిగజారింది. అనేకమంది అంతర్జాతీయ ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం, భారతదేశపు జీడీపీ గణాంకాలను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో మోదీ ఘనంగా ప్రకటించిన జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్ళడం అనేది వట్టి నీటిమూటే కాగలదు. పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వంటి నిర్ణయాలకు తోడుగా కోవిడ్ వల్ల దిగజారిన పరిస్థితులను పునరుజ్జీవింప జేసేందుకు ఆర్థిక ఉద్దీపన ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ప్రపంచమంతటా కూడా వామపక్ష ఆలోచనా విధానం బల పడుతోంది. ఫలితంగానే మింట్ సి ఓటర్ సర్వేలో మన దేశ ప్రజలు కూడా విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వాల పాత్ర పెరగాలనీ, సంక్షేమ రాజ్య దిశగా ఆర్థిక వ్యవస్థ మళ్ళాలనీ, రైతులను మార్కెట్ విధానాల పేరిట కార్పొరేట్లకు బలి చేయడం తగదనీ, నిరుద్యోగులను వారి తలరాతకు వారిని వదిలేయరాదనీ కోరుకున్నారు. ఇదంతా జరగా లంటే ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఉదారంగా ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టరాదనే ‘ద్రవ్యలోటు’ సిద్ధాంతానికి చరమగీతం పాడాలి. ప్రపంచవ్యాప్తంగా 1980ల ముందరిలా ద్రవ్యలోటు పట్ల పట్టింపులేని, సంక్షేమ రాజ్యాల దిశగా ఆర్థిక రథం మళ్లాలి. ఈ దిశగా, అమెరికా, యూరోప్ దేశాలూ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా కొంత ప్రయత్నం మొదలైంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం ద్రవ్య లోటును పట్టించుకోకుండా (14% పైగా ఉంది) ప్రజల కొనుగోలు శక్తిని, మార్కెట్ డిమాండ్‌ను పెంచేందుకు భారీ వ్యయాలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్, చైనా కూడా అదే పని చేస్తున్నాయి. అంటే ఈ దేశాలు ప్రజలకు నాలుగు దశాబ్దాలపాటు నష్టం చేసిన నయా ఉదారవాద విధానాలను వదిలేసి ముందుకు సాగేందుకు యత్నిస్తున్నాయి. వ్యాసకర్త ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు ‘ 98661 79615 -
హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ కోసం కేంద్రం ఈసారి రూ.70 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తొలిదశ విస్తరణ పనులను చేపట్టనున్నారు. రానున్న రెండేళ్లలో చర్లపల్లి టర్మినల్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ఈసారి కేంద్ర బడ్జెట్లో కొత్త రైళ్లు, లైన్లు, ఇతరత్రా ప్రాజెక్టుల కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. గతంలోనే ప్రతిపాదించిన చర్లపల్లికి మాత్రం ఈసారి నిధులను కేటాయించారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ.10 లక్షలు కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం తెలిపారు. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. చర్లపల్లి విస్తరణ ఇలా.. ► మొదటి దశలో రూ.54.58 కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నారు. రెండు సబ్‌వేలు, 3 ర్యాంప్‌లు, 6 చోట్ల మెట్ల మార్గాలను నిర్మిస్తారు. 5 చోట్ల బ్రిడ్జి పనులతో పాటు, 2 హైలెవల్ ఐలాండ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనున్నారు. ► ఇప్పుడున్న అన్ని ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు, పొడవు పెంచుతారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించనున్నారు. మురుగునీటి కాల్వలు, ఇతర పనులను పూర్తి చేస్తారు. (క్లిక్: ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం) రెండో దశలో... ► సుమారు రూ.62.67 కోట్ల పనులను చేపట్టనున్న పనుల్లో భాగంగా చర్లపల్లి స్టేషన్ ప్రాంగణం విస్తరణ,సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్, స్టేషన్ నిర్వహణ షెడ్, తదితర పనులు చేపడతారు. ► 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులు (వాటిలో 3 సబ్‌వేల కోసం, 6 ప్లాట్‌ఫామ్‌లపైన ఏర్పాటు చేస్తారు). కొత్తగా 4 పిట్లైన్లను నిర్మించనున్నారు. పార్శిల్ షెడ్, బయో టాయిలెట్, తదితర పనులు రెండో దశలో పూర్తి చేయనున్నారు. చర్లపల్లి స్టేషన్ విస్తరణ వల్ల ప్రతి రోజు కనీసం 100 రైళ్లను నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. (చదవండి: హైదరాబాద్ మెట్రోకు వైరస్ బ్రేక్) ఎంఎంటీఎస్‌కు నిధుల కొరత.. మరోవైపు రక్షణశాఖ పరిధిలో ఉన్న మౌలాలీ– సనత్‌నగర్ మార్గంలోని 5 కిలోమీటర్లు మినహాయించి ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయిందని జనరల్ మేనేజర్ తెలిపారు. నిధుల కొరత వల్ల రైళ్ల కొనుగోళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.129 కోట్లు మాత్రమే అందాయని, మరో రూ.760 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. పెండింగ్ నిధుల కోసం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లబోదన్నారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు కోసం దక్షిణమధ్య రైల్వే రూ.330 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల కొరతే కారణమని అధికారులు స్పష్టం చేశారు. (క్లిక్: సికింద్రాబాద్ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్) -
రైల్వే ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న కొత్త లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్ ప్రాజెక్టులకు 2022–23 కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈ బడ్జెట్లో కేంద్రం రూ.7,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన రూ.5,812 కోట్ల కంటే ఇది 21 శాతం ఎక్కువ. ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబించాయి. 2022–23 బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు ► నడికుడి – శ్రీకాళహస్తి కొత్త లైన్‌కు రూ.1,501 కోట్లు కేటాయించింది. 309 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ. 2,289 కోట్లతో 2011–12లో చేపట్టారు. తగినన్ని నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు 46 కి.మీ. పనులే పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► కోటిపల్లి–నరసాపూర్ కొత్త లైన్‌కు కేంద్రం రూ.358 కోట్లు కేటాయించింది. 57 కి.మీ. ఈ లైన్‌ను రూ.2,120 కోట్లతో 2000–01లో ప్రారంభించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు వేగంగా సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు తాజా బడ్జెట్లో ఎక్కువ నిధులిచ్చింది. ► కడప – బెంగళూరు కొత్త లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాయలసీమను కర్ణాటకతో మరింతగా అనుసంధానిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.2,706 కోట్లతో చేపట్టే 255 కి.మీ. కొత్త లైన్‌కు 2008–09లో ఆమోదం లభించింది. ఏపీ పరిధిలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే మొదటి దశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుత బడ్జెట్లో రూ.289 కోట్లు కేటాయింపుతో మిగిలిన పనులు జోరందుకోనున్నాయి. ► 221 కిలోమీటర్ల విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నరసాపూర్–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో రూ.1,681 కోట్లు కేటాయించడం విశేషం. 2011–12లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు తగినన్ని నిధుల్లేక నత్తనడకన సాగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నాలతో గత రెండు బడ్జెట్లలో ఎక్కువ నిధులిచ్చారు. దీంతో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 144 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇప్పుడు భారీగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ► విజయవాడ– గూడూరు మూడో లైన్‌కు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. 288 కి.మీ. మేర నిర్మించే మూడో లైన్లో ఇప్పటికి 55 కి.మీ. మేరే పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈసారి ఎక్కువ నిధులు కేటాయించారు. ► రాష్ట్రం నుంచి దేశ రాజధానికి వెళ్లే కీలకమైన విజయవాడ– కాజీపేట మార్గంలో మూడో లైన్‌కు రూ.592 కోట్లు కేటాయించారు. రూ.1,953 కోట్లతో 220 కి.మీ. నిర్మించే ఈ లైన్లో నిధులు లేక ఇప్పటివరకు 17.5 కి.మీ. పనులే పూర్తి చేశారు. తాజా కేటాయింపులతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► రూ.3,631 కోట్లతో 401 కి.మీ. గుంటూరు – గుంతకల్ డబ్లింగ్‌ను 2016–17లో ఆమోదించారు. అరకొర నిధులతో ఇప్పటి వరకు 92 కి.మీ. పనులే చేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.803 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నాయి. ► గుత్తి–ధర్మవరం డబ్లింగ్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. రూ.714 కోట్లతో 91 కి.మీ. ఈ ప్రాజెక్టును 2015–16లో ఆమోదించారు. ఇప్పటివరకు 57 కి.మీ. పనులు పూర్తయ్యాయి. ► దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు రైల్వే స్టేషన్లలో బైపాస్ లైన్ల కోసం రూ.407.47 కోట్లు కేటాయించారు. వాటిలో విజయవాడ, రేణిగుంట, గుత్తి, తెలంగాణలో కాజీపేట, వాడి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ► చిత్తూరు జిల్లా పాకాల – అనంతపురం జిల్లా ధర్మవరం మార్గం విద్యుదీకరణకు రూ.131 కోట్లు, కర్నూలు జిల్లా నంద్యాల – వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మార్గంలో విద్యుద్దీకరణకు రూ.51 కోట్లు కేటాయించారు. ► కర్నూలులో మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.58 కోట్లు కేటాయించారు. ► తిరుపతి రైల్వే స్టేషన్లో దక్షిణ ముఖద్వారం పనులకు రూ.3 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.6.5 కోట్లు కేటాయించారు. ప్రత్యేక జోన్ లేకపోవడంతో ఏపీకి తీవ్ర నష్టం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లేకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మరోసారి సుస్పష్టమైంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పూర్తిగా ఒడిశాకే ప్రాధాన్యమిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేసిందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో మొత్తం 12 కొత్త లైన్ల పనులకు నిధులు కేటాయిస్తే వాటిలో ఏపీ పరిధిలోని నౌపడ–గుణుపూర్– తెరుబలి లైన్ ఒక్కటే ఉంది. అది కూడా 20 శాతమే ఏపీలో ఉంటుంది. 80 శాతం ఒడిశాలోనే ఉంటుంది. ఆ లైన్‌కు కూడా కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఇక ఈ జోన్ పరిధిలో 28 డబ్లింగ్ పనులకు నిధులివ్వగా, ఏపీ పరిధిలోనివి నాలుగే ఉన్నాయి. వాటిలో కూడా అత్యధిక భాగం ఒడిశాకు ప్రయోజనం కలిగించేవే. ఒడిశాలోని టిట్లాఘర్ – ఏపీలోని విజయనగరం మూడోలైన్‌కు రూ.961 కోట్లు కేటాయించారు. కొత్తవలస–ఒడిశాలోని కోరాపుట్ డబ్లింగ్ పనులకు రూ.348.94 కోట్లు ఇచ్చారు. ఒడిశాలోని ఖుర్దారోడ్, ఏపీలోని విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు కలిపి రూ.4.18 కోట్లు కేటాయించారు. ఒడిశాలోని భద్రక్ –ఏపీ లోని విజయనగరం మూడోలైన్ మిగులు పనులకు రూ.కోటి మాత్రమే కేటాయించారు. ప్రత్యేక జోన్ ప్రకటించి ఉంటే ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చి ఉండేవని నిపుణులు చెబుతున్నారు. -
బడ్జెట్ సమావేశాలు: శుక్రవారానికి రాజ్యసభ వాయిదా
TIME: 15:00 ► శక్రవారం ఉదయం 10 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. ► కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గతంలో 'యువరాజు' లాగా ప్రవర్తించేవాడని, ఇప్పుడు తానే ను భారతదేశానికి 'రాజు' అని భావిస్తున్నాడని చురకలంటించారు. ► లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సరైన పార్లమెంటరీ విధానాన్ని అనుసరించడం లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం కాంగ్రెస్ సభ్యుడు, ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తాను మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ మరో ఎంపీకి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంతో.. స్పీకర్ స్పందిస్తూ అనుమతి ఇవ్వడానికి మీరు ఎవరు? మీరు అనుమతి ఇవ్వలేరు, అది నా హక్కు అని స్పష్టం చేశారు. ► ఏపీలో ప్రషాద్ (PRASHAD) పథకంలో అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు ఉన్నాయయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు వాటిని ఈ పథకంలో చేర్చామని మంత్రి పేర్కొన్నారు. అమరావతికి 2015-16లో రూ.27.77 కోట్లతో పర్యాటక గమ్యస్థానం కింద అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. శ్రీశైలం ఆలయాభివృద్ధి కోసం రూ.37.88 కోట్ల ఖర్చు చేశామని పేర్కొన్నారు. ► లోక్‌సభలో విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశానికి సంబంధించిన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కొత్త రైల్వే జోన్ ఏర్పటుపై డీపీఆర్ అందిందని ఆయన పేర్కొన్నారు. ► రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ మోపీదేవి వెంకటరమణ ఏపీలో ఆక్వా టూరిజం అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ.. ఏపీలోని కాకినాడ, నెల్లూరులో ఆక్వా టూరిజం అభివృద్ధి చేస్తున్నామని సమాధానం ఇచ్చారు. ► పెగాసస్ అంశంపై పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై వచ్చిన ప్రివిలేజ్ మోషన్లను పరిశీలిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ► రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. హైకోర్టులు, సుప్రీంకోర్టులలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తుల్లో తొలిసారిగా నలుగురు మహిళా న్యాయమూర్తులు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ముగ్గురిని నియమించారని తెలిపారు. హైకోర్టుల్లోని 1098 మంది న్యాయమూర్తుల్లో, 83 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. ► చాలా విరామం తర్వాత బుధవారం రాజ్యసభ అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందని చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని బుధవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
కొనసాగిన బడ్జెట్ జోష్
ముంబై: బడ్జెట్ మరుసటి రోజూ మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్–2022పై పలువురు విశ్లేషకులు సానుకూలంగా స్పందించడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఆర్థిక రికవరీ వేగం మరింత పుంజుకునేందుకు మౌలికరంగానికి పెద్దపీట వేయడంతో పాటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారీ మూలధన వ్యయాన్ని కేటాయించడాన్ని స్టాక్ మార్కెట్ స్వాగతించిందని ట్రేడర్లు పేర్కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 696 పాయింట్లు పెరిగి 59,558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 17,780 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడో లాభాల ముగింపు. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభించింది. బడ్జెట్ రోజున స్తబ్ధుగా ట్రేడైన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు.., తర్వాత కోలుకొని మార్కెట్ ముగిసే దాకా ర్యాలీని కొనసాగించాయి. ఒక దశలో సెన్సెక్స్ 757 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మధ్య, చిన్న తరహా షేర్లకు భారీగా డిమాండ్ లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఒకటిన్నర శాతం చొప్పున లాభపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆరంభ లాభాలను కోల్పోయి ఒక పైసా స్వల్ప లాభంతో 74.83 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.184 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.426 కోట్ల షేర్లను కొన్నారు. కార్పొరేట్లు మెరుగైన ఆదాయాలను ప్రకటన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా లునార్ కొత్త ఏడాది సందర్భంగా ఈ దేశ మార్కెట్‌తో పాటు హాంగ్‌కాంగ్, కొరియా స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ స్టాక్ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడింది. యూరప్ మార్కెట్లూ రాణించాయి. ‘‘కేంద్రం బడ్జెట్‌పై ఆశావాదంతో మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. రానున్న రోజుల్లో మార్కెట్‌కు ప్రపంచ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి. ఒపెక్ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. సానుకూలతలు ఎన్ని నెలకొన్నప్పటికీ.., నిఫ్టీ పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతోంది. సాంకేతికంగా 18,000–18,300 శ్రేణిలో కీలక ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు రాణించే అవకాశం ఉంది’’ జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ తెలిపారు. మూడు రోజుల్లో రూ.9.57 లక్షల కోట్ల సంపద గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 2,358 పాయింట్లు ర్యాలీ చేయడంతో రూ.9.57 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సూచీల ఒకశాతం లాభంతో బుధవారం ఒక్కరోజే రూ.2.67 కోట్లు ఇన్వెస్టర్ల సొంతమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.270 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రుణాన్ని ఈక్విటీ రూపంలో మార్చే ప్రణాళికను ఉపసంహరించుకోవడంతో టాటా టెటిసర్వీసెస్ షేరు 5 శాతం లాభపడి రూ.149 వద్ద స్థిరపడింది. ► కేర్ రేటింగ్ సంస్థ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో వోడాఫోన్ ఐడియా షేరు ఏడు శాతం లాభపడి రూ.11 వద్ద స్థిరపడింది. ► మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏడు శాతం దిగివచ్చి 18.65 వద్ద స్థిరపడింది. -
వచ్చే 25 ఏళ్ల వృద్ధికి బడ్జెట్ పునాదులు
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్ వచ్చే 25 సంవత్సరాలకు వృద్ధికి పునాదులు వేసిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతికి కీలకమైన ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి కేంద్ర బడ్జెట్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. కరోనా వైరెస్‌తో అతలాకుతలం అయిన ఎకానమీ పురోగతికి 2022–23 వార్షిక బడ్జెట్ దోహదపడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో నెలకొన్న సంక్లిష్ట ప్రక్రియను సరళతరం చేయడం జరిగిందని, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రక్రియ మరింత క్రమబద్ధీకరిణ జరుగుతుందని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సముపార్జనకు సంబంధించి శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే 2047లో భారత్ సమోన్నత స్థితి లక్ష్యంగా 2022–23 బడ్జెట్ రూపకల్పన జరిగిందని అన్నారు. అప్పటికి భారత్ అన్ని సాంకేతిక విభాగాల్లో అగ్ర స్థానంలో ఉంటుందని, వృద్ధి ప్రయోజనాలు ప్రజలందరికీ ప్రత్యేకించి నిరుపేదలకూ అందుబాటులోకి వస్తాయని రాజీవ్ కుమార్ తెలిపారు. మౌలిక పరిశ్రమల నుంచి అభివృద్ధిలోకి వస్తున్న రంగాల వరకూ పటిష్ట పురోగతి, సాంకేతికాభివృద్ధి తాజా బడ్జెట్ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. పన్ను కోతల రూపంలో మధ్య తరగతికి ఎటువంటి ప్రయోజనాలూ కల్పించలేదన్న విమర్శకు సమాధానమిస్తూ ఈ విషయంలో ప్రస్తుత రేట్లు సజావుగానే ఉన్నాయని రాజీవ్ కుమార్ అన్నారు. -
కొత్త సెజ్ చట్టంతో బహుళ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్లకు సంబంధించి ప్రస్తుత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టంతో వ్యవస్థలో అన్ని అనుమతులు, విధి విధానాలు, కార్యకలాపాలు సింగిల్ విండో కింద జరుగుతాయని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక రంగం పురోగతికి కొత్త చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. సెజ్‌లను నియంత్రించే ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్(డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలను భాగస్వాములు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత సెజ్ యాక్ట్‌ను 2006లో తీసుకువచ్చారు. ఎగుమతుల పెరుగుదల, మౌలిక రంగం పురోగతి, ఉపాధి కల్పన ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, పన్ను ప్రోత్సాహకాల తొలగింపు వంటి చర్యల తర్వాత ఈ జోన్ల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త చట్టంతో తిరిగి సెస్‌లకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని, దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. సెజ్ 2.0 ముసాయిదా యాక్ట్ తయారీ పక్రియలో ఉందని, వచ్చే కొద్ది నెలల్లో ప్రస్తుత సెజ్ యాక్ట్ స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సెజ్‌ల వాటా కావడం గమనార్హం. -
‘ఆత్మనిర్భర్’ పునాదిపై దేశ నిర్మాణం
న్యూఢిల్లీ: దేశంలోని పేద, మధ్య తరగతితోపాటు యువతకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించిన దేశంగా నిలవడం చాలా ముఖ్యమని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో ‘ఆత్మనిర్భర్ అర్థవ్యవస్థ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. కోవిడ్–19 అనంతరం నూతన ప్రపంచం ఆవిష్కృతం కానుందని, ఆ దిశగా ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. భారత్ పట్ల ప్రపంచ దేశాల ధోరణిలో పెద్ద మార్పు రాబోతోందని వెల్లడించారు. భారత్‌ను బలమైన, సాధికార దేశంగా చూడాలని ప్రపంచం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల యువతకు ఎన్సీసీ శిక్షణ ‘భవ్యమైన గ్రామాల కార్యక్రమం’తో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లోని సరిహద్దు గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని అన్నారు. అలాంటి ప్రాంతాల్లోని యువతకు నేషనల్ క్యాడెట్ కారŠప్స్(ఎన్సీసీ) శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, వారు సైనిక దళాల్లో చేరేందుకు ఈ శిక్షణ తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ కోణాన్ని పక్కనపెడితే, 2022–23 కేంద్ర బడ్జెట్‌ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. పేదల కోసం మరో 80 లక్షల ఇళ్లు 80 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి తాజా బడ్జెట్లో రూ.48,000 కోట్లు కేటాయించామన్నారు. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇది కూడా ఒక మార్గమేనని చెప్పారు. పవిత్ర గంగా నది తీరం వెంట 2,500 కిలోమీటర్ల మేర సహజ వ్యవసాయ నడవా(కారిడార్)ను బడ్జెట్లో ప్రతిపాదించినట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి అప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. 5జీ టెక్నాలజీ రాకతో కొత్త యుగంలోకి అడుగు పెట్టబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో వరి పండించే రైతులు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కింద రూ.1.5 లక్షల కోట్లు పొందనున్నారని వెల్లడించారు. సమతుల్య అభివృద్ధి కావాలి గత ఏడేళ్లుగా తాము తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగానే ఉంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏడేనిమిదేళ్ల క్రితం భారత్ జీడీపీ రూ.1.10 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు రూ.2.3 లక్షల కోట్లకు ఎగబాకిందని గుర్తుచేశారు. సామాజిక న్యాయాన్ని సాధించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, అందుకోసమే నిరంతరం పని చేస్తున్నామని వివరించారు. దేశ సంక్షేమానికి సామాజిక న్యాయం తరహాలోనే సమతుల్య అభివృద్ధి చాలా కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
పాతవే.. పట్టాలెక్కాయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రైల్వేకు సంబంధించి రాష్ట్రానికి గతేడాది కంటే మెరుగ్గా నిధులు అందబోతున్నాయి. రైల్వే ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని తెలంగాణ ప్రాంతానికి ఈసారి రూ.3,048 కోట్లు ప్రతిపాదించారు. ఇది గతేడాది కేటాయింపులకన్నా 26 శాతం ఎక్కువ కావటం విశేషం. గత బడ్జెట్లో జోన్ మొత్తానికి కలిపి రూ.7,222 కోట్లు, ఇందులో రాష్ట్రానికి రూ.2,420 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో రైల్వేకు నిధుల కేటాయింపు వివరాలను వెల్లడించే పింక్‌బుక్‌ను పార్లమెంటులో బుధవారం పొద్దుపోయిన తర్వాత ప్రవేశపెట్టారు. ఆ వివరాలను రైల్వే శాఖ రాత్రి వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల వివరాల సమగ్ర సమాచారం గురువారం అధికారికంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించనున్నారు. పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం కొన్నేళ్లుగా కొత్త రైళ్లను మోదీ సర్కారు పెద్దగా ప్రకటించకున్నా ప్రాజెక్టులకు కొంత సంతృప్తికరంగానే నిధులు కేటాయిస్తోంది. ఈసారీ అదే పంథాను కొనసాగించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తే తర్వాత ఇచ్చే నిధులు వేటికీ న్యాయం చేయలేమని ప్రధాని చెప్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చింది. వీటితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రాజెక్టులు పూర్తి కానుండగా మరికొన్ని వేగంగా పనులు జరుపుకొనేందుకు వీలుపడనుంది. బుధవారం రాత్రి వరకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. మునీరాబాద్–మహబూబ్‌నగర్: రూ.210 కోట్లు ఇది 1997–98లో మంజూరైంది. నిడివి 243 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,723 కోట్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 66 కిలోమీటర్లు ఉంది. దీనికయ్యే వ్యయం రూ.452 కోట్లు. గత బడ్జెట్లో రూ.149 కోట్లు కేటాయించారు. దేవరకద్ర–మక్తల్ మధ్య లైన్ అందుబాటులోకి రాగా కృష్ణా–మక్తల్ మధ్య చివరి దశలో ఉన్నాయి. భద్రాచలం–సత్తుపల్లి: రూ.162 కోట్లు ఈ ప్రాజెక్టు 2010–11లో మంజూరైంది. నిడివి 54 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.704 కోట్లు, సింగరేణితో కలిసి బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా రైల్వే ఈ పనులు చేస్తోంది. భద్రాచలం–చుండ్రుగొండ మధ్య 25 కిలోమీటర్లు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.267 కోట్లు కేటాయించారు. వాటితో పనులు వేగంగా సాగుతున్నాయి. తుది దశకు చేరుకున్నాయి. కాజీపేట–బల్లార్షా మూడోలైన్: రూ.548 కోట్లు ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. నిడివి 202 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. పోత్కపల్లి–కొలనూర్ మధ్య, వీరూరు–మానిక్‌ఘర్ సెక్షన్ల మధ్య పనులు పూర్తయ్యాయి. గత బడ్జెట్లో రూ.475 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికి 50 కిలోమీటర్ల పనులు పూర్తికాగా మిగతా సెక్షన్లలో పనులు పనులు వేగంగా సాగుతున్నాయి. అక్కన్నపేట–మెదక్: రూ.41 కోట్లు 2012–13లో మంజూరైన ఈ ప్రాజెక్టు నిడివి 17 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.118 కోట్లు. ఇందులో సగం ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాలి. గత బడ్జెట్లో రైల్వే రూ.83.6 కోట్లు కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం పనులు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రం వాటా నిధులు పెండింగ్‌లో ఉండటంతో వాటి కోసం రైల్వే అడుగుతోంది. ఈసారి పెద్దగా నిధులు కేటాయించే అవకాశం లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.160 కోట్లు ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరైంది. నిడివి 151 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భరించనుండగా ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. భూ సేకరణ వ్యయం తెలంగాణదే. ఇప్పటికే 50 కిలోమీటర్ల లైన్ పనులు పూర్తయ్యాయి. ఇందులో మనోహరాబాద్–గజ్వేల్ వరకు 32 కిలోమీటర్ల మేర పనులకు గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్ క్లియరెన్స్ వచ్చింది. మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి. గత బడ్జెట్లో దీనికి రైల్వే రూ.325 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కుకునూరు పల్లి వద్ద ట్రాక్ పరిచే పనులు జరుగుతున్నాయి. చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్: రూ.69 కోట్లు ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.110 కోట్లకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులు అప్పగించటంతో 6 ప్లాట్ ఫామ్స్, 5 పిట్ లైన్స్ పనులు జరుగుతున్నాయి. గత బడ్జెట్లో కూ.50 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర వాటా ఇస్తేనే ఎంఎంటీఎస్–2 దశ ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే–రాష్ట్ర ప్రభుత్వం మధ్య పేచీ నెలకొంది. ఇది నగరంలో కీలకమైంది. ఎంఎంటీఎస్ మొదటి దశ విజయవంతం కావటంతో 2012–13లో ఈ ప్రాజెక్టు మంజూరైంది. అంచనా వ్యయం రూ.817 కోట్లు. మూడో వంతు రూ.450 కోట్లకు గాను రాష్ట్రప్రభుత్వం దశలవారీగా> రూ.130 కోట్లనే విడుదల చేసింది. తాము ఖర్చు చేయాల్సిన దానికన్నా ఎక్కువగా రైల్వే ఇప్పటికే వ్యయం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇస్తేనే పనులు ముందుకు సాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత బడ్జెట్లో రూ.10 కోట్లే కేటాయించింది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాష్ట్రం నిధులివ్వక పనులు సాగట్లేదు. రాష్ట్రం బకాయి పడటంతో తాజా బడ్జెట్లో కేంద్రం నిధులివ్వలేదని సమాచారం. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ సంగతేంటి? కీలకమైన కాజీపేట పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి రైల్వేకు అధికారికంగా భూ బదలాయింపు జరగలేదు. అది జరిగితేగాని పనులు చేపట్టలేనని రైల్వే ఇప్పటికే చెప్పింది. భూ బదలాయింపులో రాష్ట్రం చొరవ చూపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు జరిగే అవకాశముంది. గత బడ్జెట్లో నామమాత్రంగా రూ. 2 కోట్లే దీనికి మంజూరయ్యాయి. ఈసారీ ప్రతిష్టంభన నెలకొంది. కాజీపేట–విజయవాడ మూడోలైన్: రూ.590 కోట్లు ఈ ప్రాజెక్టు(2012–13) నిడివి 219 కి.మీ. అంచనా వ్యయం రూ.1,857 కోట్లు. విజయవాడ–కొండపల్లి మధ్య పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగతాచోట్ల జరుగుతున్నాయి. గత బడ్జెట్లో రూ.333 కోట్లు మంజూరయ్యాయి. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్: రూ.150 కోట్లు ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. నిడివి 85 కిమీ. అంచనా వ్యయం రూ.774 కోట్లు. షాద్‌నగర్–గొల్లపల్లి మధ్య పూర్తి కాగా, గొల్లపల్లి–మహబూబ్‌నగర్ మధ్య త్వరలో పూర్తి కానున్నాయి. గత బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? నెహ్రూ.. ఇందిర.. రాజీవ్ 1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్‌ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ బడ్జెట్‌ను సమర్పించారు. తెల్లారింది లేవండోయ్.. 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. రైల్వేను కలిపేశారు.. 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్‌ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొదటి బడ్జెట్‌కు 162 ఏళ్లు.. మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్‌నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. -
ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్..
స్వతంత్ర భారతంలో 76 ఏళ్లుగా ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ కొన్ని బడ్జెట్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆయా సందర్భాలుగానీ, బడ్జెట్లలో చేర్చే కీలక అంశాలుగానీ దీనికి కారణం. అలాంటి బడ్జెట్లు ఏమిటో చూద్దామా? బ్లాక్ బడ్జెట్ 197374లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్‌రావు చవాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘బ్లాక్ బడ్జెట్’గా వ్యవహరిస్తారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. 550 కోట్ల ఆర్థిక లోటుతో ఆ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి లెక్కల్లో ఈ మొత్తం తక్కువే అనిపిస్తున్నా.. నాటి పరిస్థితుల ప్రకారం.. భారీ లోటు అన్నమాట. క్యారట్ – స్టిక్ ఓ వైపు తాయిలాలు ఇస్తూనే.. మరోవైపు బెత్తంతో అన్నింటినీ నియంత్రణలోకి తెచ్చుకునే లక్ష్యంతో 1986లో కాంగ్రెస్ ఆర్థిక మంత్రి వీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌నే ‘క్యారట్ అండ్ స్టిక్ బడ్జెట్’గా పిలుస్తారు. దేశంలో లైసెన్స్‌రాజ్ వ్యవస్థకు మంగళం పాడేదిశగా చర్యలు ఈ బడ్జెట్లోనే మొదలయ్యాయి. అంతేకాదు పన్నులపై మళ్లీ పన్నులు పడుతూ పెరిగిపోయే భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ‘మోడిఫైడ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ క్రెడిట్’ను అమల్లోకి తెచ్చారు. అదే సమయంలో స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారు, పన్నులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ప్రగతి బడ్జెట్ ఒక రకంగా ఆధునిక భారతదేశ చరిత్రనే మార్చినదిగా చెప్పుకొనేది 1991 బడ్జెట్. మన దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉండి, రోజువారీ వ్యవహారాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితుల్లో.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మక సంస్కరణలతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లైసెన్స్‌రాజ్ వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడుతూ.. స్వేచ్ఛాయుత వ్యాపారానికి దారులు తెరిచారు. ఎగుమతులను పెంచేందుకు భారీగా పన్నులు తగ్గించారు. కలల బడ్జెట్ వ్యాపారస్తుల నుంచి సామాన్యుల వరకు కలలుగనేది పన్నుల తగ్గింపు, సులువుగా వ్యాపార, వాణిజ్యాలు చేసుకునే అవకాశమే. అలా అందరి ఆశలు తీర్చినది 1997–98 బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఆదాయపన్నులో మార్పులు చేశారు. గరిష్ట శ్లాబును 40శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలకు పన్నును 35 శాతానికి తగ్గించారు. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే పథకాన్ని ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 40 శాతానికి తగ్గించి, ఎగుమతులు–దిగుమతులు ఊపందుకోవడానికి బాటలు వేశారు. ‘మిలీనియం’ ఐటీరంగంలో ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే కీలకమైన స్థానంలో ఉంది. అలాంటి సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చినదే 2000లో యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన ‘మిలీనియం బడ్జెట్’. అందులో సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కంప్యూటర్లు, సంబంధిత ఉపకరణాలపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. ‘రోల్‌బ్యాక్’ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైనా ప్రతిపాదన చేసిందంటే.. దాదాపుగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టేనని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటిది యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన 2002–03 బడ్జెట్లోని చాలా అంశాలపై.. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని ప్రతిపాదనలనైతే మొత్తంగా వెనక్కి తీసుకుంది. అందుకే ఈ బడ్జెట్‌ను ‘రోల్‌బ్యాక్ బడ్జెట్’గా పిలుస్తుంటారు. – సాక్షి సెంట్రల్ డెస్క్