Vote bank politics
-
PM Narendra Modi: పేదలను లూటీ చేసిన కాంగ్రెస్
ముంబై: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. గరీబీ హఠావో అంటూ నినాదం ఇచ్చిన ఆ పార్టీ పేదరికాన్ని నిర్మూలించకుండా పేదలను విచ్చలవిడిగా లూటీ చేసిందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు జీవితంలో పైకి ఎదగకుండా కుట్రలు చేయడమే కాంగ్రెస్ విధానమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఏనాడూ మేలు జరగలేదన్నారు. ఏదైనా మంచి జరిగితే ప్రజలు సంతోషిస్తారు గానీ కాంగ్రెస్ మాత్రం కళ్లలో నిప్పులు పోసుకుంటుందని విమర్శించారు. ఇతరులకు లబ్ధి చేకూరడం ఆ పార్టీకి ఇష్టం ఉండదన్నారు. గురువారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయిందన్నారు. ఆ పార్టీ ముమ్మాటికీ పేదల వ్యతిరేకి అని ఆరోపించారు. పేదలను ఎప్పటికీ పేదరికంలోనే ఉంచాలన్న ఎజెండాతో పని చేస్తోందన్నారు. అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత పేద ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో ఒక తరం తర్వాత మరో తరం నాయకులు పేదరిక నిర్మూలన గురించి నినాదాలు ఇవ్వడం తప్ప ఆ దిశగా వారు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. వారి బోగసు నినాదాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే... స్వరాజ్.. సురాజ్ ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఎంతోమంది ప్రజలు కూడు, గూడు, గుడ్డ కోసం పోరాటం సాగించారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడ్డారు. గత పదేళ్లలో ఈ పరిస్థితిలో తొలిసారిగా మార్పు వచ్చింది. మా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఛత్రపతి శివాజీ జన్మించిన మహారాష్ట్ర గడ్డ అంటే నాకెంతో అభిమానం. 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నా పేరు ఖరారైన తర్వాత రాయ్‌గఢ్ కోటను సందర్శించా. దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఛత్రపతి శివాజీ ఆశీస్సులు స్వీకరించా. స్వరాజ్(స్వపరిపాలన) అనే ప్రతిజ్ఞను శివాజీ మనకు అందించారు. స్వరాజ్‌తోపాటు సురాజ్(సుపరిపాలన) అనే తీర్మానాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్లాలి. రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్ ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుతంత్రాలు సాగిస్తున్నాయి. ఆర్టికల్ 370 కోసం జమ్మూకశీ్మర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. జమ్మూకశీ్మర్ మన దేశంలో అంతర్భాగం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే అక్కడ అమలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వకూడదు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. అవి దేశ ప్రయోజనాలకు, మెరిట్‌కు వ్యతిరేకమని చెబుతోంది. ఎన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ మనస్తత్వం మారడం లేదు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ యువరాజు బహిరంగంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్నచిన్న కులాల పేరిట ముక్కలు చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ఒక బీసీ నాయకుడు గత పదేళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతుండడాన్ని ఆ పార్టీ సహించలేకపోతోంది’’. అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్రపతి శంభాజీ అభిమానులకు, ఔరంగజేబ్ ఆరాధకులకు మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. -
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్‌లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్‌ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్‌లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్‌కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్‌లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్‌లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్‌గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
PM Narendra Modi: ‘ఇండియా’ కూటమి గెలిస్తే... హిందువులు రెండో తరగతి పౌరులే..
మీర్జాపూర్/దేవరియా: దేశంలో మతపరంగా మెజార్టీగా ఉన్న ప్రజలను(హిందువులు) రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పారీ్టలు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంక్‌కు మతపరంగా రిజర్వేషన్లు కట్టబెట్టడమే లక్ష్యంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు పథకం రచిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఘోసీ, దేవరియాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రతిపక్షాలు దేశంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు. వేర్వేరు కులాలు పరస్పరం కొట్టుకొనేలా చేయడమే ఇండియా కూటమి ధ్యేయంగా మారిపోయిందన్నారు. కులాలను బలహీనపర్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బహిరంగ సభల్లో మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. రాజ్యాంగాన్ని మళ్లీ రాస్తారు.. ‘‘ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రల గురించి ప్రజలను హెచ్చరించడానికే ఈ రోజు పూర్వాంచల్‌కు వచ్చా. విపక్ష కూటమికి అధికారం కట్టబెడితే మొదట రాజ్యాంగాన్ని మార్చేస్తారు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలుగా రాజ్యాంగాన్ని మళ్లీ రాస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారు. మొత్తం రిజర్వేషన్లు ముస్లింలకే కట్టబెడతారు. ముస్లింలను రాత్రికి రాత్రే ఓబీసీ కేటగిరీలో చేరుస్తారు. ఓబీసీ కేటగిరీ కింద వారికి రిజర్వేషన్లు కలి్పస్తారు. మెజార్టీ ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చేయాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? 2014 కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే చట్టాన్ని మార్చేసింది. పలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మైనార్టీ విద్యాసంస్థలుగా గుర్తించింది. దాంతో ఆయా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కడం లేదు. అక్కడ కేవలం ముస్లింలకే ప్రవేశాలు లభిస్తున్నాయి. గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల బిడ్డలకు ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా? మాడోసారీ మాదే విజయం ఒక మంచి ఇల్లు కట్టించాలంటే 10 మంది తాపీ మేస్త్రీలను నియమించుకుంటారా? అలా ఎవరూ చేయరు. ఒక్కరికే అప్పగిస్తారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు వస్తారట! ఏడాదికొకరు అధికారంలో ఉంటారట! ఇదెక్కడి చోద్యం. ఇలా జరగడం ఏక్కడైనా ఉందా? పదవి కాపాడుకోవడానికి ఆరాటపడే ప్రధానమంత్రి ఇక ప్రజలకేం చేస్తారు. దేశాన్ని బలోపేతం చేయగలరా? బలమైన దేశం కోసం బలమైన ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మాకు రెండుసార్లు అధికారం అప్పగించారు. మూడోసారి కూడా మమ్మల్ని గెలిపించబోతున్నారు. ఓడిపోయేవారికి ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలు నిర్ణయానికొచ్చారు’’ అని మోదీ స్పష్టం చేశారు. ఛాయ్ కప్పులు కడుగుతూ... బాల్యంలో ఛాయ్ కప్పులు, ప్లేట్లు కడుగుతూ, కస్టమర్లకు ఛాయ్‌లు అందిస్తూ పెరిగానని ప్రధాని మోదీ అన్నారు. ఛాయ్‌కి, తనకు మధ్య లోతైన అనుబంధం ఉందని చెప్పారు. -
ఓటు బ్యాంకు కోసం డ్యాన్సులు కూడా చేస్తారు: ప్రధాని మోదీ
పాట్నా: ఓటుబ్యాంకు ముందు ఇండియా కూటమి నేతలు అవసరమైతే డ్యాన్సులు వేస్తారని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు లాక్కుంటానంటే తాను మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. శనివారం(మే25) బిహార్‌లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు వారి ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తారని, తనకు మాత్రం రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేశారు. ‘బిహార్ ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు నేను హామీ ఇస్తున్నా. మోదీ బతికున్నంతవరకు మీ హక్కులు ఎక్కడికి పోనివ్వను.ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తామంటే ఇండియా కూటమి నేతలను చేయనివ్వండి. నాకు మాత్రం రాజ్యాంగమే ముఖ్యం. ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు. -
Viksit Bharat Sankalp Yatra: నాలుగు పెద్ద కులాలు.. పేదలు, యువత, మహిళలు, రైతులు
న్యూఢిల్లీ: గత పదేళ్ల తమ పరిపాలన ప్రజల్లో తమ ప్రభుత్వంపై అంతులేని విశ్వాసాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించాయని, ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధిని విస్మరించాయని ఆక్షేపించారు. గురువారం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన దృష్టిలో పేదలు, యువత, మహిళలు, రైతులు అనే నాలుగు పెద్ద కులాలు ఉన్నాయని, ఆ కులాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నాలుగు కులాల సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను తాను కచి్చతంగా నెరవేరుస్తాన్న సంగతి ప్రజలకు తెలుసని వెల్లడించారు. ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ సంతృప్తస్థాయిలో అందిస్తామని ప్రకటించారు. ఇందుకోసమే ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు శ్రీకారం చుట్టామని తెలపారు. భారత్ ఇక ఆగిపోదు.. అలసిపోదు ప్రజల ఆకాంక్షలు మొదలైన చోటునుంచే ‘మోదీ గ్యారంటీ’ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి ఉద్గాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని ప్రజలు తీర్మానించుకున్నారని, భారత్ ఇక ఆగిపోదు, అలసిపోదు అని తేలి్చచెప్పారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ‘డ్రోన్ దీదీ యోజన’ ప్రారంభం మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన ‘డ్రోన్ దీదీ యోజన’ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ఈ పథకం కింద 2024–25 నుంచి 2025–26 వరకు ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేస్తారు. ఆయా సంఘాలు ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకు ఇచ్చి, ఆదాయం ఆర్జించవచ్చు. మహిళలకు వారి గ్రామాల్లో గౌరవ ప్రతిష్టలు దక్కాలని తాను ఆశిస్తున్నానని మోదీ చెప్పారు. కొత్త శిఖరాలకు భారత ఆర్థిక వ్యవస్థ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, నిర్ణయాలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరిందని ప్రధానమంత్రి మోదీ వివరించారు. ఎన్నెన్నో నూతన ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గురువారం ఢిల్లీలో రోజ్‌గార్ మేళాలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు సైతం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దుబాయ్ వెళ్లిన ప్రధాని మోదీ వాతావరణ మార్పులు, వాటి ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ తన హామీలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును, సాంకతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలని ఆయన కోరారు. ఐరాస కార్యక్రమం కాప్–28లో భాగంగా శుక్రవారం జరిగే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరారు. -
ఉగ్రవాదానికి కాంగ్రెస్ వెన్నుదన్ను
సాక్షి, బళ్లారి/తుమకూరు: ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పార్టీ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందని మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, వారి ముందు సాగిలపడుతోందని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారిలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘ద కేరళ స్టోరీ’ చిత్రం గురించి ప్రస్తావించారు. సుందరమైన రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారని అన్నారు. కాంగెస్ మాత్రం ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. కేరళలో చోటుచేసుకున్న ఉగ్ర కుట్రలను ‘ద కేరళ స్టోరీ’ చిత్రం బట్టబయలు చేస్తోందని ప్రశంసించారు. కేవలం ఒక రాష్ట్రంలో ముష్కర మూకల ఆగడాలు, మోసపూరిత విధానాలపై ఈ చిత్రం నిర్మించారని పేర్కొన్నారు. దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుండడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి ఆ పార్టీ వత్తాసు పలుకుతోందని, వారితో తెరవెనుక రాజకీయ బేరసారాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అసలు నైజం ఏమిటో కర్ణాటక ప్రజలు తెలుసుకోవాలని కోరారు. కర్ణాటకను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలంటే ఇక్కడ శాంతి భద్రతలు చాలా ముఖ్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాద రహిత రాష్ట్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీకి కడుపు నొప్పి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం తుమకూరులో భారీ రోడ్డు షోలో పాల్గొన్నారు. ఆ కుట్ర శబ్దాలు వినిపించవు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉగ్రవాదం కూడా స్వభావం మార్చుకుంటోందని, స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారం, మత ఘర్షణలకు ఉగ్రవాదంతో సంబంధం ఉంటోందని మోదీ గుర్తుచేశారు. గత కొన్నేళ్లలో కొత్తరకం ఉగ్రవాదం పుట్టుకొచ్చిందన్నారు. ఈ ఉగ్రవాదంలో సమాజాన్ని గుల్లబార్చే కుట్రల శబ్దాలు వినిపించవని చెప్పారు. నిశ్శబ్దంగానే కార్యకలాపాలు సాగిపోతుంటాయని, దీనిపై కోర్టులు కూడా ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. -
కన్నడనాట రిజర్వేషన్ల రగడ
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు అందుతున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత వారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ 4 శాతాన్ని బీజేపీకి గట్టి ఓటు బ్యాంకైన వక్కలిగలు, లింగాయత్‌లకు సమానంగా పంచడంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామం విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోటాను పునరుద్ధరిస్తామంటూ హస్తం పార్టీ తాజాగా ఎన్నికల హామీ ఇచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలవారీగా విభజించిన తీరుతో తమకు అన్యాయం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు... ఏం జరిగింది? కర్ణాటకలో ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు. ‘‘మతాధారిత రిజర్వేషన్లకు రాజ్యాంగంలో చోటు లేదు. ముస్లింలకు ఇకనుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి’’అన్నారు. కాంగ్రెస్ ఏమంటోంది? ముస్లింలను ఓబీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌లు, వక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. ‘‘ముస్లింలను ఓబీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్చడం రాజ్యాంగవిరుద్ధం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ మతానికి, కులానికి చెందిన వారైనా జనరల్ కేటగిరీ అయిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులే అవుతారు. అలాంటి కోటాకు ముస్లింలను మార్చి, వారికేదో కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బీజేపీ చెప్పుకోవడం విడ్డూరం’’అంటూ మండిపడింది. తాము అధికారంలోకొస్తే వారికి 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భగ్గుమన్న బంజారాలు, ఆదివాసీలు విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 7 శాతానికి బీజేపీ సర్కారు గత డిసెంబర్లో పెంచింది. అయితే వారిలో అణగారిన ఉప కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బలవంతులైన కొన్ని ఉప కులాల వాళ్లే వాటిని అత్యధికంగా చేజిక్కించుకుంటున్నారన్న ఫిర్యాదు చాలాకాలంగా ఉంది. ఈ అసమానతలను సరిచేయాలన్న వారి చిరకాల డిమాండ్‌పై బొమ్మై ప్రభుత్వం ఇటీవలే రంగంలోకి దిగింది. 101 ఎస్సీ కులాల వారికి సమ న్యాయం చేసేందుకు అంతర్గత రిజర్వేషన్లను నిర్ణయించింది. ► ఆ మేరకు రాజ్యాంగంలోని 341(2) ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. ఎస్సీ (లెఫ్ట్)కు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఆ జాబితాలోకి మాదిగ, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలు వస్తాయి. ► ఎస్సీ (రైట్)కు 5.5 శాతం కేటాయించింది. ఆది కర్ణాటక, హోలెయా, చలవాది ఉప కులాలు దీని కిందికి వస్తాయి. బంజారా, భోవి, కొరచ, కొరమలకు 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ► మిగిలిన ఒక్క శాతం సంచార, ఆదివాసీ జాతులైన అలెమరి, ఆరె అలెమరిలకు దక్కుతుంది. ► దీన్ని బంజారా, భోవి కులాలవాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగారు. తాజాగా మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వడం అందులో భాగమే. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. -
Bandi Sanjay: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?
దళిత గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం, ఎన్నికల ముందే వారి మీద ప్రేమ కురిపిస్తున్నట్టు నటించడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య. ముందుగా దళితు డినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్, తర్వాత తానే ఆ కుర్చీలో కూర్చున్నరు. ఆ తర్వాత దళిత గిరిజనులకు మూడెకరాల సాగు భూమి స్తానని మురిపించిన్రు. అది ఇయ్యకుండా దాన్ని మరిపించడానికి ‘దళిత బంధు’ ఇస్తామన్నరు. ఇట్లా కేసీఆర్ ఏం చెప్పినా... ఆయన మాటలే తియ్యగా ఉంటయ్గానీ, ఆయన చేతలు ఎంత చేదుగా ఉంటయో ఎనిమిదేండ్లుగా యావత్ తెలంగాణ రుచి చూస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత గిరిజనుల అభివృద్ధిని పాలకులు కావాలనే విస్మరించిన్రని, దాంతో వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో మొసలి కన్నీరు కార్చింది. దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అరచేతిలోనే వైకుంఠం చూపించిన్రు. ఇదే మాటను 2018 ఎన్నికల్లో కూడా చెప్తూ ఇంకొన్ని హామీలు జత చేసిన్రు. కానీ, వాటి అమలుకు ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా కనపడవు. ప్రతి దళిత, గిరిజన కటుంబానికి మూడెక రాల భూమి ఇస్తామన్న, మొదటి సంవత్సరం పంట ఖర్చులు భరించడంతో పాటు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని టీఆర్ఎస్ తుంగలోకి తొక్కింది. రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తప్ప భూపంపిణీ కోసం ఏ బడ్జెట్లోనూ పైసా కేటాయించలేదు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన్రు. ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్య పరి ష్కారానికి అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టు కొని వచ్చి తాను కుర్చీ వేసుకొని సమస్య పరిష్క రిస్తనని ఆర్బాటం చేసిన్రు. కానీ, ఇప్పటివరకూ ఆ కుర్చీ ఎక్కడికి పోయిందో, ఆయన నిర్వహిస్తనన్న ‘ప్రజాదర్బార్’ ఎక్కడికిపోయిందో టీఆర్ఎస్ నాయకులకే తెల్వాలే. పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా ఫారెస్టు, రెవెన్యూ అధికారులను గిరిజనులపైకి ఎగదోసి టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నది. 30,40 సంవత్స రాలుగా సాగు చేసుకుంటున్న వారి నుంచి పోడు భూములు లాక్కోని నయవంచన చేస్తున్నది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో, అక్కడ అధికంగా ఉన్న గిరిజనుల ఓట్ల కోసం గిరిజనులకు భూమి హక్కు పత్రాలిస్తానని చెప్పి కేసీఆర్ ఓట్లు కాజేసిన్రు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 7 లక్షల ఎక రాల్లో పోడు భూముల సమస్య ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హక్కు పత్రాలను సైతం ప్రభుత్వం గుంజుకోవడం దారుణం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని నీరుగార్చేందుకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రణాళిక ప్రకారం ఎత్తులు వేసింది. ఈ చట్టంలోని సెక్షన్ (3), ‘11డీ’లో పేర్కొన్న మౌళిక వసతుల అభివృద్ధికి 7 శాతం నిధులు వాడుకోవచ్చు అన్న నిబంధనను ఉపయోగించుకొని సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వెచ్చించి, ఎస్సీ, ఎస్టీలకు తీవ్రద్రోహం చేసింది. ఇలా ఈ ఎనిమిదేండ్లలో దళిత గిరిజనులకు కేటాయించిన 40 వేల కోట్ల నిధులను దారి మళ్లించింది. ఇగ, 2014 నుంచి 2019 వరకు ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం 5,33,800 మంది దరఖాస్తు చేసుకోగా... ఇప్పటికీ 4,17,011 మంది రుణాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నరు. గిరిజనుల జనాభా నిష్పత్తికి అనుగుణంగా తమకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నరు. కానీ, ఆర్డినెన్స్ తీసుకు రావడం ద్వారా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా... టీఆర్ఎస్ సర్కారు మీన మేషాలు లెక్కిస్తున్నది. పది శాతం రిజర్వేషన్లు అమలులోకి రాకపోవడం వల్ల గిరిజన యువ తకు ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతున్నది. మిషన్ భగీరథ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు గిరిజన ప్రాంతాలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలన సాగిస్తున్నరు. అనేక గిరిజన గ్రామాలకు సరైన వైద్య సౌకర్యాలు లేవు. మారుమూల గిరిజన గూడేలకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఆస్పత్రులకు పోవాలంటే ఇప్పటికీ ‘డోలె’ను ఆశ్రయించాల్సిన దుఃస్థితి. ఇక, మునుగోడు నియోజకవర్గంలో శివన్న గూడెం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల గోడును టీఆర్ఎస్ పట్టించు కున్న పాపాన పోలే. జూఠా మాటలతో, గారడీ హామీలతో పరి పాలన సాగిస్తున్న దొర గడీలకు, నియంతృత్వ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డయ్. మునుగోడులో రాబోయే ప్రజా తీర్పు, భవిష్యత్‌లో బీజేపీ ప్రభుత్వానికి దారులు వేయబోతున్నది. పేదల పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత గిరిజనుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తం. దగావడ్డా దళిత గిరిజనుల దుఖ్కం తీరుస్తం. సకల జనుల తెలంగాణకు బాటలు వేస్తం. (క్లిక్ చేయండి: అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి) - బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు -
Sakshi Cartoon: ఓటు బ్యాంకును ప్రయివేట్‌కు ఇవ్వడం కుదరదు సార్!
ఓటు బ్యాంకును ప్రయివేట్‌కు ఇవ్వడం కుదరదు సార్! -
వారిది ఓటు బ్యాంకు బడ్జెట్
గోరఖ్‌పూర్: ఓటు బ్యాంకు రాజకీయాల చుట్టూ గత ప్రభుత్వాలు బడ్జెట్‌ను రూపకల్పన చేసేవని, అమలు కాని హామీలు ఇవ్వడానికి బడ్జెట్‌ను ఒక వేదికగా చేసుకునేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. దానికి భిన్నంగా తమ ప్రభుత్వం రైతులకు లాభం చేకూరేలా బడ్జెట్‌ని రూపొందించిందని చెప్పారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో చౌరీచౌరా ఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా అందులో వీర మరణం పొందినవారి గుర్తుగా గురువారం ప్రధాని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1922లో చౌరీచౌరాలో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు జులుం చేస్తే ఆగ్రహంతో ఆ కార్యకర్తలు 23 మంది పోలీసుల్ని స్టేషన్లో బంధించి నిప్పంటించారు. పోలీసులందరూ సజీవదహనం కావడంతో 19 మందిని బ్రిటన్ ప్రభుత్వం ఉరితీసింది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ తన సహాయనిరాకరణని నిలిపివేశారు. ఈ ఘటనలో ఉరికంబం ఎక్కిన వీరులకి చరిత్ర తగినంత ప్రాధాన్యం కల్పించలేదని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన దశాబ్దాల తరబడి మన దేశంలో బడ్జెట్లో అంటే ఓటు బ్యాంకును పెంచుకోవడమేనని ధ్వజమెత్తారు. యూడీఎఫ్‌పై నడ్డా నిప్పులు త్రిసూర్: కేరళలోని వామపక్ష లెఫ్ట్ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌లను పక్కనబెట్టాల్సిన సమయం దగ్గరపడిందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఈ రెండు కూటముల హయాంలో పాలన అవినీతిమయమైందని విమర్శించారు. రాష్ట్రంలో కమల వికాసానికి సహకరించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. త్రిసూర్‌లోని తెక్కింకాడు మైదాన్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలు, దళితులపై అత్యాచార కేసులు పెరిగిపోయాయన్నారు. సీఎం విజయన్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కాంగ్రెస్ విధానాలు భక్తులను వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. శబరిమల అంశంపై జరిగిన ఆందోళనల సందర్భంగా పోలీసు కేసులన్నీ బీజేపీ కార్యకర్తలపైనే నమోద య్యాయని చెప్పారు. -
వెనక్కితగ్గం
జోథ్‌పూర్/సిలిగురి/తిరువనంతపురం: పౌర సత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ప్రదర్శన లు దేశ వ్యాప్తంగా ఒక వైపు కొనసాగుతుండగా.. ఈ చట్టం అమలు విషయంలో ప్రభుత్వం అంగుళం కూడా వెనకడుగు వేయబోదని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విషయం లో ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తరచూ పాకిస్తాన్‌ను ప్రస్తావిస్తున్న ప్రధాని మోదీ భారత్ ప్రతినిధా లేక పాకిస్తాన్ రాయబారినా అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. సీఏఏ అమలు నిలిపి వేయాలంటూ తమ మాదిరిగానే అసెంబ్లీల్లో తీర్మానం చేయాలంటూ బీజేపీయేతర 11 మంది సీఎంలకు రాసిన లేఖలో కేరళ సీఎం విజయన్ కోరారు. హిందుత్వ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శుక్రవారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ఆరోపించారు. అందుకే సీఏఏపై అవగాహన కల్పిస్తున్నాం సీఏఏ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌లో అమిత్ షా సీఏఏపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతిపక్షాలు సీఏఏపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మూడు కోట్ల మంది ప్రజలకు చేరేలా 500 ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 5వ తేదీ నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు బీజేపీ తెలిపింది. బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు ప్రజాస్వామ్యం, లౌకికతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ కేరళ సీఎం పినరయి విజ యన్ వివిధ రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలకు లేఖలు రాశారు. అందరూ ఐక్యంగా ఉండి మన దేశ ప్రజాస్వామిక, లౌకిక విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ బెంగాల్, ఢిల్లీ తదితర 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘సీఏఏ’ పై సుప్రీంలో మరో పిటిషన్ సీఏఏ వల్ల పౌరులు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందంటూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మనకు పాక్‌తో పోలికా? ఘనమైన చరిత్ర, వారసత్వ సంపద కలిగిన మన దేశాన్ని పాకిస్తాన్‌తో పోల్చు తున్న ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆయన హిందుస్తాన్ ప్రతినిధా లేక పొరుగుదేశం ప్రతినిధా అని ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా సిలిగురిలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ప్రజలు పౌరసత్వం నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ‘ఘన చరిత్ర వారసత్వ సంపద కలిగిన విశాల దేశం భారత్. మోదీజీ మన దేశాన్ని పాకిస్తాన్‌తో ఎందుకు పోల్చుతున్నట్లు? మీరు భారత్ ప్రతినిధా లేక పాకిస్తాన్‌కా. ప్రతి సందర్భం లోనూ భారత్‌ను కాకుండా పాకిస్తాన్ ప్రస్తా వన ఎందుకు తెస్తున్నారు? మేం హిందుస్తా న్ను ప్రేమిస్తున్నాం. పాకిస్తాన్ మాదిరిగా ఉండాలనుకోవడం లేదు’ అని ఆమె వ్యాఖ్యా నించారు. దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ నేతలు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
ఎన్నార్సీపై చర్చించలేదు
న్యూఢిల్లీ: జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)కు సంబంధించి తన ప్రభుత్వం ఇంతవరకు కేబినెట్లో కానీ, పార్లమెంట్లో కానీ చర్చించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అస్సాంలో మాత్రం ఎన్నార్సీని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిపారని గుర్తు చేశారు. ఎన్నార్సీపై విపక్షాలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలకు, హింసాత్మక ఆందోళనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ గట్టిగా సమర్థించారు. ఆ చట్టాన్ని వ్యతిరేకించే ముందు ఆ చట్టంలోని అంశాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. భారతీయ ముస్లింలకు ఆ చట్టంతో ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులకు పౌరసత్వం కల్పించాలని గతంలో మహాత్మాగాంధీయే చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గాంధీ పేరును తమ పేరుకు తగిలించుకున్న వారు తెలుసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మూడు పొరుగు దేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వ హక్కులు కల్పించేందుకు ఉద్దేశించినదే కానీ.. ఇక్కడి వారి హక్కులను లాగేసుకునేది కాదు’ అని పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఉద్దేశాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనను గతంలో కాంగ్రెస్, టీఎంసీలు సమర్థించాయని, ఇప్పుడు ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ చట్టం అమలైతే ముస్లింలను నిర్బంధ కేంద్రా(డిటెన్షన్ సెంటర్)లకు పంపించేస్తారని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, పట్టణ నక్సలైట్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి పాటించాలని, హింసకు పాల్పడవద్దని కాంగ్రెస్, తృణమూల్, ఆప్, లెఫ్ట్ పార్టీలు సీఏఏ ఆందోళనకారులకు ఎందుకు విజ్ఙప్తి చేయడం లేదని ప్రశ్నించారు. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని పలువురు సీఎంలు చేస్తున్న ప్రకటనలపై స్పందిస్తూ.. వీరు తమ న్యాయాధికారులను సంప్రదిస్తే మంచిదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందేనని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు. ఢిల్లీలోని అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ అనంతరం, వారికి యాజమాన్య హక్కులు కల్పించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాపూర్వక సభలో గంటన్నరకు పైగా ప్రధాని ప్రసంగించారు. ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభ ఎన్నికల ప్రచార ప్రారంభంగానే కనిపించింది. శరణార్థులు వేరు.. అక్రమ వలసదారులు వేరు శరణార్థులకు, అక్రమ వలసదారులకు తేడా ఉందని, శరణార్థులు తమ వివరాలను దాచేందుకు ప్రయత్నించరని, అక్రమ వలసదారులు మాత్రం తమ వివరాలేవీ బయటపెట్టరని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము మళ్లీ విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని విరుచుకుపడ్డారు. మైనారిటీలపై పాకిస్తాన్ చూపే వివక్షను ఎండగట్టే అవకాశం వచ్చిందని, అయితే, ఇక్కడి విపక్షాల విభజన రాజకీయాల వల్ల ఆ అవకాశం కోల్పోయామని వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం ‘భిన్నత్వంలో ఏకత్వం.. భారతదేశ విశిష్టత’ అని నినదిస్తూ ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు. అభివృద్ధిలో తన ట్రాక్ రికార్డును చూడాలని, విపక్షాల టేప్ రికార్డులను వినవద్దని ముస్లింలకు సూచించారు. నిరసనల సందర్భంగా పోలీసుల తీరును ప్రధాని ప్రశంసించారు. వారెప్పుడు ప్రజలకు సహాయకారులుగానే ఉంటారన్నారు. ‘భయాందోళనలకు కారణం హోంమంత్రే’ సీఏఏపై అపోహలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. భయాందోళనలకు కారణం తాము కాదని, హోం మంత్రి అమిత్ షానేనని సమాధానమిచ్చింది. సీఏఏ తరువాత ఎన్నార్సీనేనని అమిత్ షా పార్లమెంట్‌లోనే ప్రకటించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ గుర్తు చేశారు. భారత్‌లో డిటెన్షన్ సెంటర్లు లేవని ప్రధాని చెప్పడాన్ని శర్మ తప్పుబట్టారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్లో విమర్శించారు. మోదీ సభకు భారీ భద్రత రామ్‌లీలా మైదానంలో ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభకు అధికారులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. పాత ఢిల్లీలో హింసాత్మక ఆందోళనలు జరిగిన దరియాగంజ్‌కు ఈ ప్రాంగణం ఒక కిలోమీటరు దూరంలోనే ఉండటంతో బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి. డీసీపీ ర్యాంక్ అధికారులు 20 మంది, దాదాపు వెయ్యిమంది ఢిల్లీ పోలీసులు, డ్రోన్ నిరోధక దళాలు, ఎన్ఎస్జీ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. -
హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరగనున్న హౌడీ మోదీ కార్యక్రమానికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ హాజరవడానికి అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సక్సెస్ అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. హ్యూస్టన్ ర్యాలీలో కీలక ప్రకటనకు అవకాశం ఉందంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. గురువారం కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా ప్రత్యేక విమానంలో విలేకరుల హ్యూస్టన్ ర్యాలీలో ఏదైనా ప్రకటన ఉంటుందా అన్న ప్రశ్నకు ఉండొచ్చునని బదులిచ్చారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడడంతో అమెరికా భారత్ పక్షమే వహిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులనుద్దేశించి టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న మోదీ ప్రసంగించనున్నారు. వాణిజ్య బంధాల బలోపేతమే మోదీ లక్ష్యం గత కొద్ది నెలలుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి రోబర్ట్ లైటింగర్ భారత్ ఎగుమతులపై కొన్ని ప్రయోజనాలను రద్దు చేశారు. దీనికి ప్రతిగా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచింది. ఇలాంటి సమయంలో రెండు దేశాల అధినేతలు ఒకే వేదికను పంచుకోవడం వల్ల రెండు దేశాల మ«ధ్య వాణిజ్య రంగంలో విభేదాలు సమసిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రాకతో అమెరికా సమాజ ఆర్థిక పురోగతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తోందని మోదీ భావిస్తున్నారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓటు బ్యాంకు కోసం ట్రంప్ అమెరికాలో నివసించే భారతీయులు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ట్రంప్ హాజరుకావడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ట్రంప్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హాజరవుతున్నారని భావిస్తున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆసియన్ అమెరికన్లలో అయిదో వంతు మంది భారతీయులే. అందులోనూ టెక్సాస్‌లో భారతీయుల ఓటుబ్యాంకు బలంగా ఉంది. 2 లక్షల 70 వేల మందికిపైగా ఓటర్లు టెక్సాస్‌లో ఉన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయులు సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతుగా ఉంటూ వస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంపై రాజకీయంగా రిపబ్లికన్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో డెమోక్రాట్లు పట్టుకు యత్నిస్తున్నారు. -
కాంగ్రెస్‌ది ఓటుభక్తి.. మాది దేశభక్తి
అరారియా/బునియద్పూర్: కాంగ్రెస్‌వి ఓటుభక్తి రాజకీయమయితే, తమ పార్టీది దేశభక్తి రాజకీయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కంటే ఓట్లే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల సరళిని చూశాక స్పీడ్ బ్రేకర్ దీదీ (పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని)కి కంటిమీద కునుకు కరువైందని ఎద్దేవా చేశారు. శనివారం బిహార్‌లోని అరారియా, పశ్చిమబెంగాల్లోని దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బునియద్పూర్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. ‘దేశ ప్రజలు ఓటు భక్తి, దేశభక్తి అనే రెండు రకాలైన రాజకీయాలను చూశారు. ఓటు భక్తి రాజకీయం ముంబై ఉగ్రవాదుల విషయంలో వెల్లడైంది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దారుణ ఘటనకు ఒడిగట్టిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోలేదు. పైపెచ్చు, హిందూ ఉగ్రవాదం వాదనను తెరపైకి తెచ్చి ఉగ్ర ఘటనలపై నడుస్తున్న విచారణలను పక్కదారి పట్టించింది’ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం దేశ శక్తి రాజకీయం చేస్తోందని పేర్కొన్న ప్రధాని.. ‘ఉడి ఆర్మీ బేస్ క్యాంప్‌పై దాడికి సర్జికల్ స్ట్రైక్స్‌తో, పుల్వామా ఘటనకు వైమానిక దాడులతో దీటుగా బదులిచ్చింది’ అని అన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందన్నారు. బాలాకోట్ వైమానిక దాడులపై ఆధారాలు చూపాలని అడిగే ధైర్యం వారిలో లేదన్నారు. మమతా అసలు స్వరూపం తెలిసింది పశ్చిమబెంగాల్లోని సరిహద్దు జిల్లా దక్షిణ దినాజ్‌పూర్‌లోని బునియద్పూర్లో ప్రధాని మాట్లాడుతూ..‘రాష్ట్రంలో మొదటి, రెండో విడత ఎన్నికల్లో ఓటర్ల సరళి చూశాక ‘స్పీడ్ బ్రేకర్ దీదీ’కి కంటిమీద కునుకు కరువైంది’ అని వ్యాఖ్యానించారు. ‘మొదట్లో రాష్ట్రాభివృద్ధిపై చూపే శ్రద్ధ, నిరాడంబరత, కష్టించేతత్వం చూసి మమతా బెనర్జీ ఆదర్శ మహిళని అనుకున్నా. కానీ, ఆ తర్వాత ఆమె వ్యవహార శైలి చూసి నాకున్న భ్రమలు తొలగిపోయాయి. ఆమె అసలు నైజం తెలిసింది. ఆమె ఎలాంటిదో ఇప్పుడు పిల్లలకు సైతం తెలిసిపోయింది’ అని అన్నారు. బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ టీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై స్పందిస్తూ ‘ఎన్నికల్లో ప్రచారం కోసం పొరుగు దేశస్తులను వాడుకోవడం సిగ్గుచేటు. మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే టీఎంసీ ఇలా చేస్తోంది. ఇంతకుముందెన్నడూ భారత్‌లో ఇలా జరగలేదు’ అని విమర్శించారు. సమాధానంగా ‘సాధ్వి’ని నిలిపాం హిందూ సంస్కృతిపై ఉగ్రవాది ముద్ర వేస్తారా? కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: సనాతన హిందూ సంస్కృతిపై ఉగ్రవాది ముద్ర వేసిన వారికి సరైన సమాధానం చెప్పేందుకే సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను భోపాల్ బరిలో ఉంచినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘బెయిల్‌పై ఉన్న ప్రజ్ఞాసింగ్‌కు బీజేపీ టికెట్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించే వారు అవే ప్రశ్నలను అమేథీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ను, రాయ్‌బరేలీ బరిలో ఉన్న సోనియాను ఎందుకు అడగరు? వారిపై ఎందుకు చర్చ పెట్టరు? వారు కూడా బెయిల్‌పైనే ఉన్నారు కదా? అని ప్రశ్నించారు. ‘ఒక మహిళ. అందులోనూ సాధ్వి అయిన ప్రజ్ఞాసింగ్‌ను అవమానిస్తున్నారు. భోపాల్ టికెట్ ఆమెకు ఇచ్చేసరికి గగ్గోలు పెడుతున్నారు. ఇదేం పద్ధతి?’ అని పేర్కొన్నారు. ‘నేను గుజరాత్ వాసిని. కాంగ్రెస్ పన్నాగాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సినిమా స్క్రిప్టు మాదిరిగా, వారు తమదైన శైలిలో ఒక స్క్రిప్టు తయారు చేస్తారు. వాళ్ల దృష్టిలో పోలీస్ ఎన్కౌంటర్లన్నీ బూటకమే. జడ్జి బీహెచ్ లోయా విషయంలోనూ వారిది ఇదే తీరు. ఆయన సహజంగా మరణించినా హత్యకు గురయ్యారంటూ కథనం అల్లింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసులో కోర్టు తీర్పుపై కాంగ్రెస్ హిందూ ఉగ్రవాదం అనే వాదనను తెరపైకి తెచ్చింది. ఐదువేల ఏళ్ల చరిత్ర ఉన్న, వసుధైక కుటుంబం అనే సందేశమిచ్చిన హిందూ సంస్కృతిపై ఉగ్రవాది ముద్ర వేసింది. ఇలాంటి వాటన్నిటికీ సమాధానం ఇచ్చేందుకే సాధ్విని బరిలోఉంచాం. దీని ఫలితం కాంగ్రెస్ భారీగా చెల్లించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. మాలేగావ్ పేలుడు కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మాలేగావ్ ఘటనలో ఆరుగురి మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. -
తప్పించడమే వారి ఎజెండా
సహరన్పూర్/అమ్రోహా/డెహ్రాడూన్: తనను అధికారం నుంచి తప్పించాలన్న ఏకైక ఎజెండాతో పాటు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీ, అవినీతిది విడదీయలేని అనుబంధమని ప్రధాని దుయ్యబట్టారు. అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్ ఏఎం, ఎఫ్ఏఎం అనే పేర్లను ఈడీ చార్జిషీట్లో బయటపెట్టాడన్న మోదీ.. వీటిలో ఏఎం అంటే అహ్మద్ పటేల్ అనీ, ఎఫ్ఏఎం అంటే ఫ్యామిలీ అని వివరించారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. విపక్షాల వ్యవహారశైలిని తీవ్రంగా ఎండగట్టారు. పాక్ హీరో అయ్యేందుకు పోటీపడ్డారు.. ఉగ్రమూకలకు భారత్ దీటుగా బదులిస్తే కొందరికి నిద్రపట్టడం లేదని ప్రధాని విపక్షాలకు చురకలంటించారు. ‘ఉగ్రవాదులకు వారికి అర్థమయ్యే భాషలోనే భారత్ జవాబివ్వడం కొందరికి నచ్చలేదు. మన దేశంపై ఉగ్రదాడి జరిగితే ప్రతిఘటించాలా? లేక మౌనంగా కూర్చోవాలా? ఉగ్రవాదులకు భారత్ దీటుగా బదులివ్వగానే కొందరికి నిద్రపట్టలేదు. పాకిస్తాన్ కపటబుద్ధిని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయగానే ఈ వ్యక్తులు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంతేకాదు.. పాకిస్తాన్‌కు హీరోగా మారేందుకు వారిలో వారే పోటీపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్, యూపీలో ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు లక్నో, కాశీలో బాంబులు పేలేవి. ఉగ్రదాడుల సూత్రధారులను విచారణ సంస్థలు పట్టుకున్నప్పుడు.. మాయావతి, అఖిలేశ్ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్లను వదిలేసి ప్రేమగా వ్యవహరించేవి’ అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మోదీ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తాయన్నారు. అమేథీలో ఈసారి గెలవడం కష్టమని తేలడంతోనే రాహుల్ వయనాడ్‌కు పారిపోయారని వార్తలొచ్చాయనీ, ఆయన ఎక్కడ నుంచి పోటీచేయాలో కాంగ్రెస్ ఇష్టమన్నారు. ఈ విషయంపై మాట్లాడే హక్కు బీజేపీకి ఉందన్నారు. మేం ముస్లిం కుమార్తెల(బేటీ–బేటీ) భద్రత, ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ముక్కలు ముక్కలుగా(బోటీ–బోటీ) నరుకు తామని చెబుతున్నారు. తనను ప్రతిపక్షాలు ‘మరుగుదొడ్ల చౌకీదార్’ అని పిలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. మోదీని ముక్కలుముక్కలుగా చేస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ 2014లో వ్యాఖ్యానించారు. -
ఈ–కామర్స్ నిబంధనలు సరైనవే
ముంబై: విదేశీ పెట్టుబడులున్న ఈ– కామర్స్ కంపెనీలకు సంబంధించి కేంద్రం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్ సంస్థలు కారు చౌక రేట్లతో.. స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయన్నారు. భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్ 2019 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ–కామర్స్ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, ఈ నిబంధనలు కొంత సముచితమైనవేనన్నారు. మరోవైపు, ఇందులో వ్యాపారాలకు ప్రోత్సాహాన్నిచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్ సంస్థల లాయర్ కరణ్ కల్రా వ్యాఖ్యానించారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తోందని సీనియర్ లాయర్ నిశిత్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్న ఈ–కామర్స్ కంపెనీలు.. తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫాంపై 4 లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి. ఆశావహంగా వాల్‌మార్ట్.. నిబంధనలు కఠినం చేసినప్పటికీ భారత మార్కెట్‌పై ఆశావహంగానే ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ వెల్లడించింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ ఏషియా రీజనల్ సీఈవో డర్క్ వాన్ డెన్ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు ..రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
వారసత్వ పార్టీలు.. అవకాశ కూటములు
చెన్నై / న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి పేరుతో జతకట్టేందుకు యత్నిస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విరుచుకుపడ్డారు. దేశానికి అన్నివిధాలుగా సేవ చేసేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామనీ, ఓటు బ్యాంకు, విభజన రాజకీయాలు చేసేందుకు కాదని వ్యాఖ్యానించారు. ‘మేరా బూత్–సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడులోని మైలదుతురై, శివగంగ, పెరంబలూర్, తేని, విరుధునగర్ పార్లమెంటరీ నియోజవర్గాల్లోని బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ముచ్చటించారు. సరికొత్త శిఖరాలకు అభివృద్ధి.. ‘ఓవైపు అభివృద్ధి ఎజెండాతో మేం ఉంటే, మరోవైపు వారసత్వ పార్టీలు, అవకాశవాద పొత్తులు ఉన్నాయి. అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు 2019 లోక్‌సభ ఎన్నికలు మనకు గొప్ప అవకాశం. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ స్ఫూర్తితో మనం ప్రజలకు సాధికారత కల్పించేందుకు పనిచేస్తుంటే, వారసత్వ పార్టీలు మాత్రం అవకాశవాద పొత్తులతో సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాయి. బీజేపీలో ఎదుగుదలకు ఓ కుటుంబానికి విధేయత చూపడం, గొప్ప వంశంలో పుట్టడం, ధనవంతులుగా ఉండాల్సిన పనిలేదు. కేవలం పార్టీ కోసం కష్టపడగలిగితే చాలు’ అని మోదీ తెలిపారు. విపక్షాలవి తాత్కాలిక పొత్తులే.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘‘బీజేపీ విజయం ప్రతీకూల రాజకీయాలు చేసే కొందరికి ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే వాళ్లు నన్ను, పార్టీని దూషిస్తున్నారు. మన విపక్ష మిత్రులు కూడా అయోమయంలో ఉన్నారు. అందుకే ‘మోదీ చెడ్డవాడు’ ‘ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదు’ ‘ప్రజలు బీజేపీని ఇష్టపడటం లేదు’ అని చెబుతున్నారు. కానీ మోదీ నిజంగానే చెడ్డవాడు అయితే, బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయకుంటే విపక్షాలు ఎందుకు పొత్తులు కుదుర్చుకుంటున్నాయి?’ అని ప్రశ్నించారు. కర్తార్‌పూర్ విషయంలో కాంగ్రెస్ విఫలం దేశవిభజన సమయంలో సిక్కులకు పవిత్రమైన కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారత్‌లో చేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన కర్తార్‌పూర్ కారిడార్ వల్ల వీసా అవసరం లేకుండానే భక్తులు పాకిస్తాన్‌లోని గురునానక్ అంతిమ విడిదిని సందర్శించుకోవచ్చని తెలిపారు. సిక్కుల 10వ గురువు గోబింద్ సింగ్ 350వ జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో రూ.350 విలువైన వెండి స్మారక నాణేన్ని మోదీ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గురునానక్ 550వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్‌తో పాటు పలువురు సిక్కు నేతలు హాజరయ్యారు. -
మధ్యవర్తుల ప్రభుత్వమది
డాల్టన్‌గంజ్/బరీపదా: గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపడంపోయి, రక్షణ రంగంలో మధ్యవర్తుల ఆదేశాలతో పాలన సాగించిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ నాడు ప్రభుత్వాన్ని నడిపిందో లేక తమ మిషెల్ (అగస్టా కుంభకోణంలో మధ్యవర్తి) మామ దర్బార్ నడిపిందో అర్థంకాట్లేదు’ అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. అలాగే రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందనీ, ఆ పార్టీకి రైతులంటే కేవలం ఓటు బ్యాంకేనని ఆయన ఆరోపించారు. జార్ఖండ్, ఒడిశాల్లో మోదీ శనివారం పర్యటించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. బిహార్, జార్ఖండ్‌ల సరిహద్దుల్లోని 19.6 వేల హెక్టార్ల భూమికి సాగు నీరు అందించే కోయెల్ కరో మండల్ ప్రాజెక్టు సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులకు మోదీ జార్ఖండ్‌లో పునాది రాయి వేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ‘గతంలో రైతులు అప్పులు తీసుకునేలా కాంగ్రెస్సే చేసింది. ఇప్పుడు రుణాలను మాఫీ చేస్తామంటూ తప్పుదోవ పట్టిస్తోంది. నేను కూడా వ్యవసాయదారులను ఓటు బ్యాంకుగానే పరిగణించి ఉంటే, లక్ష రూపాయల రుణమాఫీని నేనే అమలు చేసేవాణ్ని. కానీ పంట దిగుబడులను పెంచి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి రాబోయే తరాల కర్షకులకు కూడా లాభదాయకంగా ఉండే విధానాలు తీసుకొచ్చేందుకు మేం ప్రాధాన్యమిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ప్రాజెక్టు పేరులోని ‘కోయెల్’ అంటే అసలు ఇది ప్రాజెక్టు పేరా, నది పేరా, పక్షి పేరా అన్న విషయం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలిసుండకపోవచ్చని మోదీ ఎద్దేవా చేశారు. నీళ్లు, ఇతర అంశాలపై ఇరుగుపొరుగు రాష్ట్రాలు గొడవలు పడుతున్న వేళ.. జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌లు కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టడం సమాఖ్య వ్యవస్థకు మంచి ఉదాహరణ అని మోదీ ప్రశంసించారు. సైన్యంపై కుట్ర: మోదీ ఒడిశాలోని బరీపదాలో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ‘దేశ సైన్యాన్ని బలహీన పరిచేందుకు 2004–14 మధ్య కుట్ర జరిగింది. ఇప్పుడు ఆ నిజాలు బటయకొస్తుంటే కాంగ్రెస్ నేతలకు నొప్పిగా ఉంది’ అని అన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను ఇప్పుడు తమ ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తుండటంతో తమ రహస్యాలు బయటకొస్తాయని కాంగ్రెస్ పెద్దలు భయపడుతున్నారని మోదీ పేర్కొన్నారు. లోక్‌సభలో శుక్రవారం రఫేల్ ఒప్పందం వివాదంపై సమాధానమిచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఒడిశాలో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మోదీ ప్రారంభించిన, శంకుస్థాపనలు చేసిన మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.4,000 కోట్లు. -
వాళ్లవి విభజన రాజకీయాలు
అజ్మీర్: అధికారం కోసం ప్రజలను విడదీస్తూ కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతూ, అనుమానాలు పెంచుతూ ప్రజలను భయ పెడుతోందన్నారు. ఆ పార్టీకి అధికారం దక్కనివ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే చేపట్టిన ‘రాజస్తాన్ గౌరవ యాత్ర’ ముగింపు సందర్భంగా శనివారం అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కాలేదు. అధికారంలో ఉండగా ప్రభుత్వ యంత్రాంగంలోనూ చిచ్చుపెట్టింది. పర్యవసానంగా పరిపాలన దెబ్బతింది. ఓటు బ్యాంకు దృష్టితోనే నిధులు కేటాయించడంతో సమగ్ర అభివృద్ధి జరగలేదు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ఈ దుస్సంప్రదాయాన్ని కొనసాగించింది. అతికష్టంమీద, 60 ఏళ్ల తర్వాత ప్రస్తుతం వ్యవస్థ గాడినపడింది. వారికి మళ్లీ అవకాశం ఇవ్వకండి. కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఒక కుటుంబం. ఆ కుటుంబానికి భజన చేయడం ద్వారానే వారు రాజకీయాలు సాగిస్తున్నారు’ అని పేర్కొన్నా రు. ‘రెండేళ్ల క్రితం సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘సర్జికల్ స్ట్రైక్’ను సైతం కాంగ్రెస్ ప్రశ్నించింది. సైనికులను అగౌరవపరిచింది అని అన్నారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ అంశాల వారీగా ఎందుకు పోరాడటం లేదు? అబద్ధాలు చెప్తూ ప్రజల్లో అనుమానాలను పెంచడమే వారికి ఇష్టం’ అని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు రైతులందరికీ ఉచిత విద్యుత్ అందజేస్తామని రాజస్తాన్ సీఎం వసుంధర ప్రకటించారు. ఎన్నికల కమిషన్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించటానికి కొద్దిసేపటికి ముందు జరిగిన ‘రాజస్తాన్ గౌరవ యాత్ర’ ర్యాలీలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సత్వరమే నియమావళి అమల్లోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని జనరల్ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులందరికీ పరిమితికి లోబడి ఉచిత కరెంటు అందజేసే పథకాన్ని 5న ప్రారంభించామన్నారు. ఈ పథకం అన్నదాతల ఆదాయం పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గృహానికి విద్యుత్ సౌకర్యం కల్పించిందని తెలిపారు. రూ.40 వేల కోట్లతో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. విద్యుత్ సౌకర్యమే లేని గ్రామాల్లో సైతం ప్రస్తుతం 20 నుంచి 22 గంటలపాటు నిరాటంకంగా కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. -
అక్రమ వలసదారులను గుర్తిస్తాం
న్యూఢిల్లీ: తమ పార్టీకి మళ్లీ అధికారమిస్తే దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చారు. వలసదారులకు అండగా ఉంటూ కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం పార్టీ ర్యాలీ ‘పూర్వాంచల్ మహాకుంభ్’లో ఆయన మాట్లాడారు. ‘2019లో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం దేశంలో అక్రమ వలసదారుల గుర్తింపును మా పార్టీ చేపడుతుంది. అక్రమ వలసదారులు దేశానికి చెద పురుగుల్లా తయారయ్యారు. వారిపై చర్యలు తీసుకుంటే దేశభక్తులైన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, రాహుల్ బాబా, కేజ్రీవాల్ మాత్రం గగ్గోలు పెడతారు. ఎందుకంటే వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు. అక్రమ వలసలపై రాహుల్, కేజ్రీవాల్‌లు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలన్నారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైన మహా కూటమికి ఒక విధానం లేదు, నేతా లేడు. ఆ కూటమికి నాయకుడు కావాలని రాహుల్ అనుకుంటున్నారు. కానీ, శరద్ పవార్, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ అందుకు ఒప్పుకోరు’ అని అన్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ చేపట్టాల్సిన నాలుగు భారీ ర్యాలీల్లో పూర్వాంచల్ మహాకుంభ్ ఒకటి. సీఎంగా పరీకరే కొనసాగుతారు: అమిత్‌షా గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకరే కొనసాగుతారని అమిత్ షా స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వెల్లడించారు. ‘మనోహర్ పరీకరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గోవా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు స్పష్టం చేశాం’ అని తెలిపారు. ఆయనకు మెజారిటీ సభ్యుల మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నేపథ్యంలో ఆయన కొనసాగింపుపై అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. -
ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు.. ఇకనైనా మారండి
ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో వాడి, వేడి చర్చ జరిగింది. కొన్ని నాటకీయ పరిణామాలూ చోటు చేసుకున్నాయి. చర్చలో పాల్గొన్న విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పలు ప్రజా సమస్యలపై తూర్పారపట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. చౌకీదార్(కాపలాదారుడు)నని చెప్పుకునే ప్రధాని.. నిజానికి అవినీతి, అక్రమాల్లో భాగీదార్(భాగస్వామి) అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూకదాడులు, మహిళలపై హింస, రాఫెల్ ఒప్పందంలో లొసుగులు సహ పలు అంశాలను లేవనెత్తారు. చివరగా, తనపై బీజేపీకి ఎంత కోపం ఉన్నా.. తనకు మాత్రం వారిపై వీసమెత్తు ద్వేషం కూడా లేదంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అకస్మాత్తుగా ప్రధాని మోదీ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. ఆ తరువాత తన సీట్లో కూచుని సహచరుడిని చూస్తూ నవ్వుతూ రాహుల్ కన్నుగొట్టారు. విపక్ష సభ్యుల ప్రసంగాల అనంతరం చర్చకు మోదీ సమాధానమిచ్చారు. రాహుల్ సహా విపక్షాల విమర్శలకు తనదైన శైలిలో, దీటుగా బదులిచ్చారు. రాహుల్ కౌగిలింతను, కన్నుగీతనూ ప్రస్తావించారు. పనిలోపనిగా, అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ‘యూటర్న్’ పాలసీనీ సభకు తేటతెల్లం చేశారు. మోదీ ప్రసంగం అనంతరం జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వ పక్షం సునాయాసంగా గెలిచింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. న్యూఢిల్లీ: విపక్షాలపై పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల తీరును ఎండగట్టారు. అవిశ్వాసం పేరుతో నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయేని గద్దె దించేందుకు అందరూ ఏకమవుతున్నారని.. వారెన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించబోరన్నారు. ఎవరినైనా గద్దె దించే బాధ్యత 125 కోట్ల ప్రజలదేనన్నారు. 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దేశ ప్రజలనే అవమానించారన్నారు. తమవి ఓటుబ్యాంకు రాజకీయాలు కావన్న ప్రధాని.. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నారు. ప్రధాని పీఠంలో కూర్చోవాలని రాహుల్ అనుకుంటున్నారని.. దీనికి అంత తొందర అవసరం లేదని ఎద్దేవా చేశారు. విపక్షాలకు అవిశ్వాసం అవకాశం ఇకపై ఉండదని.. వీలుంటే 2024లో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీకు నా శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు. డోక్లాం, రాఫెల్ డీల్‌లపై.. భారత్–చైనాల మధ్య విభేదాలకు కారణమైన డోక్లాం వివాదం నెలకొన్న విషయంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరునూ సభా వేదిక ద్వారా మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఆయనకేమైనా సందేహాలుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కానీ చైనా రాయబారితో సమావేశమయ్యారు. ఇది దేశాన్ని అవమానించడం కాదా?’ అని మోదీ ప్రశ్నించారు. చైనా రాయబారితో మాట్లాడి రాహుల్ దేశం పరువుతీశారన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలోనూ కాంగ్రెస్ వ్యవహరించిన తీరు దారుణమని ప్రధాని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఎలా వ్యవహరించాలో కూడా వారికి తెలియదన్నారు. ‘ప్రజలు మిమ్మల్ని విసుక్కుంటున్నారు. కనీసం ఇప్పటికైనా మారండి. రాఫెల్ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం. రాజకీయ పార్టీల మధ్య కాదు.. రెండు బాధ్యతగల ప్రభుత్వాల మధ్య జరిగింది. అది కూడా పూర్తి పారదర్శకంగా. మీరు చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేయాల్సి వచ్చింది’ అని మోదీ మండిపడ్డారు. జవాన్లకూ అవమానమేనా? సర్జికల్ స్ట్రైక్స్ ఓ బూటకమని రాహుల్ వ్యాఖ్యానించడంపై ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు. ‘దేశ సైన్యాధ్యక్షుడిపై ప్రయోగించే భాష విషయంలో.. సైనికుల త్యాగాలను గుర్తించే విషయంలోనూ అవమానకరంగా మాట్లాడతారా? సర్జికల్ దాడులు అబద్ధమంటారా? ప్రాణాలకు తెగించి సరిహద్దులు కాపాడుతు న్న వారిని గౌరవించడం నేర్చుకోండి’ అని మోదీ ఘాటుగా అన్నారు. ఓటుకు నోటిచ్చి.. అవిశ్వాస తీర్మానం ఇచ్చాక తమ వద్ద సరిపోయేంత సంఖ్య ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొనడాన్ని మోదీ ఎద్దేవా చేశారు. సంఖ్యాబలం లేదన్న విలేకరులపై మీకెవరు చెప్పారంటూ జవాబిచ్చిన అహంకారాన్ని చూడండన్నారు. 1999లోనూ అవిశ్వాస తీర్మానం అనంతరం అవసరమైన బలముందని తప్పుడు లెక్కలు చెప్పి కంగుతిన్నదెవరో ప్రజలు మరిచిపోలేదన్నారు. 1971లో చరణ్ సింగ్‌కు మద్దతిస్తామని చెప్పి తర్వాత చేయిచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. దేవేగౌడ, గుజ్రాల్, ములాయం సింగ్ ఇలా ప్రముఖులందర్నీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఓటుకు నోటు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందని గుర్తుచేశారు. సౌదాగర్‌ను మాత్రం కాను! ‘చౌకీదార్‌నని చెప్పుకున్న మోదీ.. అవినీతిలో భాగీదార్ (భాగస్వామి)గా మారిపోయార’న్న రాహుల్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. తను చౌకీదార్నేనని.. రాహుల్ చెప్పినట్లుగా తను భాగీదార్ని కూడానన్నారు. దేశానికి చౌకీదార్‌గా పనిచేయడంతోపాటు.. దేశం యువత సాధిస్తున్న విజయాల్లో, రైతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో దేశాన్ని కొత్త దిశలో తీసుకెళ్లడంలో తను భాగీదార్‌నే అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా సౌదాగర్ (వ్యాపారి) ను మాత్రం కాదన్నారు. తప్పుడు వార్తనలు ప్రచారం చేసి జనాల్లో భయాందోళనలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. 2014లో ఆర్థికంగా అస్తవ్యస్తం ‘బీజేపీ అధికారంలోకి రాగానే.. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. లెక్కలు చూస్తుంటే ఒకదాని తర్వాత మరొక ఆశ్చర్యం కలిగించే అంశాలు బయటకొచ్చాయి. 2008లో మొదలైన కాంగ్రెస్ లూటీ 2014వరకు నిర్విఘ్నంగా సాగింది’ అని మోదీ వెల్లడించారు. 60 ఏళ్ల భారతంలో దేశంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) రూ.18లక్షల కోట్లుంటే.. 2008 నుంచి 2014 మధ్యలో ఈ మొత్తం రూ.52లక్షల కోట్లకు చేరిందనే విషయాన్ని మోదీ బయటపెట్టారు. తమ ప్రభుత్వం ఎన్పీఏలను సమీక్షించడంతోపాటు.. బ్యాంకింగ్ రంగానికి రూ. 2.10 లక్షల కోట్ల మూలధనాన్ని ఇచ్చిందన్నారు. దివాళా చట్టాన్ని, రుణ ఎగవేతదారుల చట్టాన్ని తీసుకొచ్చి అమలుచేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే.. బీజేపీ అధికారంలోకి రాకముందు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మోదీ విమర్శించారు. నాలుగేళ్లలోనే 18వేల గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తయిందన్నారు. పేదలు బ్యాంకు అకౌంట్లు తెరుచుకుని రూ.80వేల కోట్లు దాచుకున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమ పథకాల వల్ల దేశంలో పేదరికం తగ్గుతోందంటూ అంతర్జాతీయ సూచీలు వెల్లడిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ తో బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చనున్నామన్నారు. భీమ్ యాప్ ద్వారా 41వేల కోట్ల లావాదేవీలు జరిగి.. ప్రజలు దేశవ్యాప్తంగా ఓ సానుకూల మార్పుకు సిద్ధమవుతున్నా.. విపక్షాలకు ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. దేశానికి, ప్రపంచానికి, దేశంలోని సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంకు, కాగ్, ఎన్నికల సంఘం వంటి ఉన్నత సంస్థలకు తమపై నమ్మకముందన్న మోదీ.. పిడికెడు మందికే తమపై విశ్వాసం లేక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ప్రధాని ప్రసంగం పేలవం: రాహుల్ ప్రధాని ప్రసంగం పేలవంగా, బలహీనంగా ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు నుంచి రాహుల్ బయటకు వస్తున్నప్పుడు విలేకరులు ‘మోదీ ప్రసంగం ఎలా ఉంది?’ అని అడగ్గా రాహుల్ ‘బలహీనం’అని చెప్పారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా కూడా మోదీ ప్రసంగం ఎప్పటిలా వాగాడంబరంలా, నిజాలను దాచి ప్రజలను మభ్యపెట్టేలా ఉందన్నారు. కళ్లలోకి చూసే సాహసం చేయలేను ప్రధాని తన కళ్లలోకి చూడలేక పోతున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై మోదీ మాట్లా డుతూ.. ‘మీరు గొప్ప పేరున్న వారు (నామ్‌దార్). నేను పనివాడిని (కామ్దార్). మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూసేంత సాహసం చేయలేను. సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, చంద్ర శేఖర్, మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్, చరణ్ సింగ్, ఐకే గుజ్రాల్, ప్రణబ్ ముఖర్జీ, దేవెగౌడ తదితర నేతలంతా మీ కళ్లలో కళ్లు పెట్టి చూసేందుకు యత్నించారు. ఫలితం ఏంటో, వాళ్లకెంతటి అవమానాలు జరిగాయో అందరికీ తెలుసు. శరద్ పవార్ కూడా ఇదే యత్నం చేస్తే ఏం చేశారో తెలియదా? కళ్లలో కళ్లు పెట్టేవారిని ఎలా అవమానించారో.. ఒక కుటుం బం కోసం.. ఏం చేశారో దేశమంతటికీ తెలుసు’ అని అన్నారు. వీగిపోయిన అవిశ్వాసం లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయింది. అధికార, ప్రతిపక్షాలు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఓటింగ్ సమయంలో టీఆర్ఎస్, బీజేడీ, శివసేన సభ్యులు సభలో లేరు. ఎవరేమన్నారంటే... విభజన చట్టం హామీల్ని నెరవేర్చలేదు: కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ బాబాసాహెబ్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా ముందుకు పోతోందని ఆరోపించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏపీ పునర్విభజన చట్టం–2014లో చేర్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదు. అలాగే చట్టంలోని ఇతర కీలకమైన హామీల్ని నెరవేర్చలేదు. మోదీ ప్రభుత్వం విభజించు–పాలించు అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఎప్పుడూ అదానీలు, అంబానీల గురించి మాట్లాడే మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు సంగతేమో కానీ రైతన్నల ఆత్మహత్యలు మాత్రం భారీగా పెరిగాయి. మీకు(మోదీకి) పెద్ద మనసు లేకపోయినా ప్రజాస్వామ్యంపై చాలా పెద్దపెద్ద మాటలు చెబుతారు. విదేశాల్లో మూలుగుతున్న రూ.80 లక్షల కోట్లను తెచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? మోదీ అధికారం నుంచి దిగిపోతేనే దేశానికి మంచిరోజులు వస్తాయని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు’ అని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి పరాజయమే: టీఎంసీ నియోజకవర్గాల వారీగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీచేస్తే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత సౌగత రాయ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాయ్ లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘అధికార బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రభుత్వంపై ఎన్డీయే కూటమి నుంచి బయటికెళ్లిన మిత్రపక్షం టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, మరో మిత్రపక్షం శివసేన ఈ చర్చల్ని ఏకంగా బహిష్కరించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలనాథులు కచ్చితంగా చిత్తుగా ఓడిపోతారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల కూటమి, బీజేపీ మధ్య ద్వైపాక్షిక పోటీ మాత్రమే ఉండనుంది’ అని విమర్శించారు. తమిళనాడుపై సవతితల్లి ప్రేమ: అన్నాడీఎంకే నిధుల కేటాయింపులో తమిళనాడుపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని చర్చ సందర్భంగా అన్నాడీఎంకే నేత పి.వేణుగోపాల్ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో తమిళనాడు వాటా గణనీయంగా ఉంటోంది. కానీ ఇందుకు ప్రతిఫలంగా మాకు చాలా తక్కువ నిధులు లభిస్తున్నాయి. జనాభా నియంత్రణతో పాటు ఆర్థిక పురోగతి సాధించిన తమిళనాడును కేంద్రం శిక్షిస్తోంది. నిధుల కేటాయింపు విషయంలో మోదీ ప్రభుత్వం తమిళనాడుపై సవతితల్లి ప్రేమను చూపుతోంది. దేశంలో నదీజలాల వివాదాలను పరిష్కరించకుండా కేంద్రం డ్యామ్ భద్రతా బిల్లును తీసుకురాకూడదు’ అని వేణుగోపాల్ అన్నారు. నల్లధనం డిపాజిట్లు 50% పెరిగాయ్: సీపీఎం లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమయిందని సీపీఎం నేత మొహమ్మద్ సలీం విమర్శించారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. కానీ ఒక్క 2017లోనే స్విస్ బ్యాంక్‌లలో భారతీయుల నల్లధనం 50 శాతం మేర పెరిగింది. అప్పుడు నల్లధనం తెస్తామన్న వాళ్లు ఇప్పుడేమో అదంతా తెల్లధనమేనని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. నల్లధనం జమయింది కానీ ఎంతమొత్తం వచ్చిందో మాత్రం ఇంకా తెలియదని ఆర్థికమంత్రి సెలవిస్తారు. గత 70 ఏళ్లలో జరగని దాన్ని నాలుగేళ్లలో చేసి చూపామని బీజేపీ నేతలు ఓసారి అంటారు. మరోవైపు గత 70 ఏళ్లలో దేశం సర్వనాశనమైపోయిందని వాళ్లే చెబుతారు. అంటే గత 70 ఏళ్లలో జరిగిన వినాశనాన్ని బీజేపీ నేతలు నాలుగేళ్లలోనే చేసి చూపారా?’ అని సలీం విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు: ఎస్పీ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు, వ్యాపారులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో సంతోషంగా ఉన్నవాళ్లు ఒక్కరూ లేరు. చివరికి బీజేపీ నేతలు కూడా సంతోషంగా లేరు. తమ రాజకీయ జీవితాలు నాశనమైపోయాయని వాళ్లంతా బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. దేశంలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, నీళ్లు, రవాణా ప్రతిఒక్కటీ ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. కేంద్రం నిర్ణయాలతో నిరుద్యోగ యువతతో పాటు రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు’ అని ములాయం పేర్కొన్నారు. మూకహత్యలపై మోదీ మౌనం: ఎన్సీపీ దేశంలో మైనారిటీలు, దళితుల్ని అల్లరిమూకలు కొట్టిచంపడంపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ విమర్శించారు. ‘దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అమాయకుల్ని అల్లరిమూకలు కొట్టిచంపుతుంటే ప్రధాని మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది’ అని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను వింటున్న సోనియా గాంధీ -
బెంగాల్లో ‘సిండికేట్’ రాజ్యం
మిడ్నాపూర్/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సిం డికేట్ రాజ్యం నడుస్తోందనీ, దాని అను మతి లేకుండా రాష్ట్రంలో చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తల్ని వరుసగా హత్యచేసినా ప్రజ లు తమవెంటే నిలిచారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ దుష్పరిపాలన నుంచి బెంగాలీలు త్వరలోనే విముక్తి పొందుతారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ న్నారు. పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్‌లో సోమవారం నిర్వహించిన ‘కిసాన్ కళ్యాణ్ ర్యాలీ’లో మోదీ నిప్పులుచెరిగారు. జనగణమన గడ్డపై: ‘జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం పుట్టిన భూమిని ప్రస్తుతం రాజకీయ సిండికేట్ పాలిస్తోంది. ఈ సిండికేట్ బుజ్జగింపు, ముడుపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిండికేట్ల ద్వారా చిట్ ఫండ్లను నడుపుతూ రైతులకు దక్కాల్సిన లబ్ధిని లాగేసుకుంటోంది. చివరికి కేంద్రం పంపే నిధుల్ని సైతం వీరి అనుమతి లేకుండా ఖర్చుపెట్టడం కుదరడం లేదు’ అని మోదీ అన్నారు. తన పర్యటనను నిరసిస్తూ తృణమూల్ కార్యకర్తలు మమత ఫొటోలు, పోస్టర్లను సభలో ప్రదర్శించడంపై మోదీ స్పందిస్తూ.. ‘మేం సాధించిన విజయాలను తృణమూల్ కూడా అంగీకరిస్తోంది. అందుకే చేతులు జోడించిన సీఎం మమతా బెనర్జీ పోస్టర్లతో వాళ్లు ప్రధానికి స్వాగతం పలికారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూలిన టెంట్.. 67 మందికి గాయాలు ప్రధాని కిసాన్ కళ్యాణ్ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ టెంట్ కూలిపోవడంతో 13 మంది మహిళలు సహా 67 మంది గాయపడ్డారు. ప్రధాని ప్రసంగం సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వెంటనే స్పందించిన మోదీ బాధితులకు సాయమందించాలని పక్కనే ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అధికారుల్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు ప్రథమ చికిత్స చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మోదీ ప్రసంగం సందర్భంగా పలువురు కార్యకర్తలు టెంట్‌పైకి ఎక్కారు. చివరికి టెంట్ పైభాగంగా బరువు ఎక్కువ కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. -
దళిత యువశక్తి @ 2019
భారత జనాభాలో అయిదోవంతు ఉన్న దళితులు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నారు. కొత్త తరం దళితుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరగడంతో ఎన్నికల్లో వారే కీలక ఓటు బ్యాంకు కానున్నారు. 2.3 కోట్ల మంది యువ దళిత ఓటర్లు తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దేశం మొత్తమ్మీద ఉన్న దళిత జనాభాలో వీరే 19 శాతం ఉన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వారి సంఖ్య అత్యధికంగా ఉంది. 1991–2011 మధ్య కాలంలో భారత జనాభా పెరుగుదల రేటు కంటే దళిత జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈ సారి యువ దళిత ఓటర్ల సంఖ్య పెరిగింది. అలాగే ఈ కొత్త తరం ఓటర్లలో 90 శాతం మంది చదువుకున్నవారే. తత్ఫలితంగా దళితులు సామాజికంగా ఎంత అణచివేతకు గురవుతున్నారు? ఏయే రంగాల్లో తమ వర్గం పరిస్థితి ఎలా ఉందన్న అవగాహన వారిలో బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రస్తుతం 27,518 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా వాటిలో మూడో వంతు దళితులకు రిజర్వ్ చేసినవే. కానీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 2012 సంవత్సరం నుంచి ఒక్క ప్రయత్నం కూడా జరగలేదు. అలాగే దళిత వర్గానికి చెందిన వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల కంటే బాగా కింది స్థాయి ఉద్యోగాల్లోనే ఎక్కువగా పనిచేస్తుండటంతో యువ దళితులు అసహనంతో ఉన్నారు. అన్యాయాలపై గళమెత్తి ప్రశ్నించే వారి సంఖ్య కూడా పెరిగింది. బుజ్జగించే వ్యూహంలో బీజేపీ దళితుల్ని ఆకట్టుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా బీజేపీ పలు వ్యూహాలను రచిస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై పెరిగిపోతున్న దాడులు, అంబేడ్కర్ విగ్రహాల కూల్చివేతలు, వాటికి కాషాయ రంగులు పూయడం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వంటి పరిణామాలతో దేశంలో దళితులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మోదీ దళిత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే అంబేడ్కర్ స్మారకం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ యువ దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఓటుకు తూటు
జిల్లాలోని గుంటూరు నగరంతో పాటు ఇతర పట్టణాల్లో గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలలో అధికారులు, బీఎల్వోలు, విద్యార్థులు ఐఆర్‌ఈఆర్ (ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్) సర్వే చేపట్టారు. సర్వేను తప్పుల తడకగా చేపట్టడంతో జిల్లాలో వేలాది ఓట్లు గల్లంతయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఎవరి ఓట్లు ఏ పోలింగ్ బూత్‌లకు మారాయో తెలియని పరిస్థితి. కొన్నిచోట్ల బీఎల్వోలు సక్రమంగా సర్వే చేయకపోవడం, అవగాహన లేని కళాశాలల విద్యార్థులతో సర్వే చేయించడం, అధికార పార్టీ కుయుక్తుల కారణంగానే ఈ పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య తగ్గి పట్టణాల్లో ఓట్లు పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా పట్టణాల్లో ఓట్లు తగ్గిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో: వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలంలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు వాటిని పరిశీలించకుండా పక్కన పడేశారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మీకోసం గ్రీవెన్స్‌లో కలెక్టర్ కోనశశిధర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి దరఖాస్తులను పరిశీలించేలా చేసి సమస్యను పరిష్కరించారు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలోని మిగతా మండలాల్లోనూ ఉంది. సత్తెనపల్లెలో ఓ వర్గం వారిని టార్గెట్ చేసి.. సత్తెనపల్లె పట్టణంలో ఓ వర్గం వారి ఓట్లనే టార్గెట్ చేసి తొలగించినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. పట్టణంలోని పోలేరమ్మ వీధి ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కాపు వర్గానికి చెందిన 50 మందికి పైగా ఓట్లను తొలగించారు. రాజుపాలెం మండలంలో గతంలో 33,297 ఓట్లు ఉండగా వాటి సంఖ్య ప్రస్తుతం 35,935కు చేరింది. నకరికల్లు మండలంలో గతంలో 46,136 ఓట్లు ఉండగా, ప్రసుత్తం వాటి సంఖ్య 47,137 నమోదైంది. ముప్పాళ్లలో గతంలో 31,772 ఓట్లు ఉండగా, ప్రస్తుతం ఓట్ల సంఖ్య 32,608గా ఉంది. సత్తెనపల్లి రూరల్ మండలంలో గతంలో 54,348 ఓట్లుండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 56,490గా నమోదు అయ్యింది.ఇలా పట్టణంలో 9 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. నరసరావుపేటలో మారిన ఓట్లు.. నరసరావుపేటలో ఐఆర్‌ఈఆర్ సర్వే తప్పుల తడకగా మారింది. ఓ పోలింగ్ బూత్ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్‌ను, ఇంకో పోలింగ్ బూత్‌కు మార్చి సర్వే చేయించడం, కొన్నిచోట్ల కళాశాల విద్యార్థులను వినియోగించడంతో తప్పులు నమోదయ్యాయి. నరసరావుపేటలో 21,000 ఓట్లు తగ్గిపోయాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో కళ్లు తెరిచిన అధికారులు కొన్ని తప్పులను సరి దిద్దారు. కొంతమంది ఓటర్లను మాత్రం సంబంధం లేని మరో ప్రాంతంలో బూత్‌లు పెట్టారు. వినుకొండ కథ వేరు.. వినుకొండ నియోజకవర్గంలో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకొన్న వారి దరఖాస్తులు పరిశీలించకుండా పక్కన వేస్తున్నారు. ప్రధానంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న బీఎల్వోలు ఉన్న చోట ఈ తంతు సాగుతోంది. కొన్ని చోట్ల ఉదాహరణకు 20 మంది దరఖాస్తు చేసుకొంటే నామమాత్రంగా పరిశీలించి మిగతా వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ‘ఈ ఫొటోలోని వ్యక్తి అంబటి రాంబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసరావు పేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు. పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి. తనతో పాటు ఆయన, కుటంబ సభ్యులకు సంబంధించిన నాలుగు ఓట్లు గల్లంతు అయ్యాయి’ ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతల ఓట్లు గల్లంతయ్యాయి. గతంలో పట్టణంలో 44,107 ఓట్లు ఉండగా ప్రస్తుతం 34,475 ఓట్లు మాత్రమే ఉండటం గమనార్హం. 9632 ఓట్లు సర్వేలో గల్లంతయ్యాయి’ ‘ఈ ఫొటోలోని వ్యక్తి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. నరసరావుపేట ఎమ్మెల్యే. గతంలో ఈయన 150 నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటర్‌గా ఉండేవారు. ప్రస్తుతం ఆయన ఓటు 162 పోలింగ్ బూత్‌లోకి మారింది. ఇలా నరసరావుపేటలో 21 వేలకు పైగా ఓటర్లను ఇష్టారీతిన సర్వే పేరుతో ఇతర బూత్‌లకు మార్చారు. సంబంధం లేని దూరప్రాంతాల బూత్‌లకు మార్చారు. ఓటు హక్కు కోల్పోవడం ప్రమాదకరం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కోల్పోవడం ప్రమాదకరం. సత్తెనపల్లి పట్టణంలో అధికార పార్టీ నేతలు పనిగట్టుకొని దాదాపు 9 వేలకు పైగా ఓట్లు తీసివేయించారు. ఓ అధికారి పార్టీ నేతకు కమిషనర్ తొత్తుగా వ్యవహరించి ఓట్ల తొలగింపులో కీలక పాత్ర పోషించారు. ఓట్లు గల్లంతు కావడం హేయమైన చర్య. ఈ విషయాన్ని తక్షణం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరతాం. పరిష్కరించకపోతే తగిన విధంగా పోరాడతాం.– వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
‘ఉత్తమ్ మతి లేకుండా మాట్లాడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్ లో కూర్చొని పీసీ సీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నార ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఉత్తమ్ మతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశారని, పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అప్పుడు ఎందుకు పెంచలేదని నిలదీశారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, ఆదివాసీల ఉద్యమం వెనుక ఉన్న సోయం బాబూరావు, ఆత్రం సక్కు వంటి వారు ఏ పార్టీకి చెందినవారో అందరికీ తెలుసునని రాములు నాయక్ అన్నారు. నాయీల వృత్తి నైపుణ్యానికి రూ.250 కోట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: నాయీ బ్రాహ్మణులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అత్యాధునిక శిక్షణ అవసరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో నాయీ బ్రాహ్మణుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కుల వృత్తిదారులు రాణించాలంటే పరిస్థితులకు అనుగుణంగా వృత్తిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.