World Cup chess tournament
-
‘మేధావి’కి ఘన స్వాగతం
చెన్నై: ప్రపంచకప్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తన స్వస్థలం చెన్నై చేరుకున్నాడు. ప్రతిష్టాత్మక చదరంగ వేదికపై తనదైన ముద్ర వేసి తిరిగొచ్చిన ఈ 18 ఏళ్ల కుర్రాడిని సొంత నగరం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది. అతనికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒకవైపు ఆత్మీయులు, సన్నిహితులు ఆనందంగా తమవాడికి వెల్కమ్ చెప్పగా, మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సాంప్రదాయ నృత్యాలు కరగట్టం, ఒయిలట్టంలతో విమానాశ్రయం బయట కళాకారులు ప్రజ్ఞానందకు స్వాగతం పలికారు. పూలు, శాలువాలు, పుష్పగుచ్చాలతో మిత్రులు, అభిమానులు ప్రజ్ఞను ముంచెత్తారు. ‘నాకు లభించిన ఈ స్వాగతం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ జాతీయ పతాకాన్ని చేతిలో ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. అతని తల్లి నాగలక్ష్మి కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయింది. అనంతరం ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్‌బాబులను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందకు జ్ఞాపికతోపాటు రూ. 30 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ‘ఫిడే’ వరల్డ్ కప్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. -
టైటిల్ కార్ల్‌సన్‌కు... ప్రశంసలు ప్రజ్ఞానందకు
గత దశాబ్దకాలంగా పురుషుల చెస్‌లో మాగ్నస్ కార్ల్‌సన్‌కు ఎదురులేదు. ఈ నార్వే సూపర్‌స్టార్ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. చెస్‌లో అత్యుత్తమ రేటింగ్ కూడా అందుకున్నాడు. అయితే అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్ల మధ్య రెండేళ్లకోసారి నాకౌట్ పద్ధతిలో జరిగే ప్రపంచకప్ టో ర్నీలో మాత్రం కార్ల్సన్ శిఖరాన నిలువలేకపోయాడు. ఈసారి మాత్రం నిలకడైన ఆటతీరుతో కార్ల్సన్ తన కెరీర్లో తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాడు. కార్ల్‌సన్‌కు టైటిల్ దక్కినా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందనే. తన అసమాన పోరాటపటిమతో... ఊహకందని ఎత్తులతో... తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ... తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ఈ టీనేజర్ రెండో ప్రయత్నంలోనే ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. కార్ల్‌సన్‌కు ఆద్యంతం గట్టిపోటీనిచ్చాడు. అనుభవలేమితో తుది మెట్టుపై తడబడ్డా... భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్ అయ్యే లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయని ప్రజ్ఞానంద చాటుకున్నాడు. బాకు (అజర్బైజాన్): ఇన్నాళ్లూ భారత చెస్ అంటే ముందుగా విశ్వనాథన్ ఆనంద్ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇక నుంచి ఆనంద్‌తోపాటు తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద పేరు కూడా అభిమానుల మదిలో మెదులుతుంది. గత 25 రోజులుగా అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన ప్రపంచకప్ టో ర్నీలో ఆరంభం నుంచి మేటి ఆటగాళ్లను మట్టికరిపించిన ఈ తమిళనాడు కుర్రాడు తుదిపోరులో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌ను బోల్తా కొట్టించలేకపోయాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేముల్లో ప్రజ్ఞానంద నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొని ‘డ్రా’తో సంతృప్తి పడ్డ 32 ఏళ్ల కార్ల్సన్ టైబ్రేక్‌లోని ర్యాపిడ్ గేముల్లో తన అనుభవాన్నంతా ఉపయోగించి గట్టెక్కాడు. తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 47 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొంది... రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడి 22 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఓవరాల్‌గా 2.5–1.5తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కార్ల్సన్ 156 మంది ఆటగాళ్ల మధ్య నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలో మాత్రం తొలిసారి విజేతగా నిలిచాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఫాబియానో కరువానా (అమెరికా) 3–1తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)పై గెలిచాడు. విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు 1,10,000 డాలర్లు (రూ. 90 లక్షలు), రన్నరప్ ప్రజ్ఞానందకు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షలు), మూడో స్థానం పొందిన కరువానాకు 60 వేల డాలర్లు (రూ. 49 లక్షలు)... నాలుగో స్థానంలో నిలిచిన అబసోవ్కు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ప్రపంచకప్ టోర్నీలో టాప్–3లో నిలిచిన ముగ్గురు ప్లేయర్లు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించారు. తనకు సరైన పోటీనిచ్చే వారు లేకపోవడంతో ప్రపంచ చాంపియన్íÙప్లో పాల్గొనే ఆసక్తి లేదని గత ఏడాది ప్రకటించిన కార్ల్సన్ క్యాండిడేట్ టో ర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో రన్నరప్ ప్రజ్ఞానంద, కరువానా, అబసోవ్ క్యాండిడేట్ టో ర్నీకి అర్హత పొందారు. క్యాండిడేట్ టోర్నీ విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడతారు. ఒక్కో రౌండ్ దాటి... 2019 ప్రపంచకప్‌లో తొలిసారి బరిలోకి దిగిన ప్రజ్ఞానంద నాలుగో రౌండ్లో వెనుదిరిగాడు. ఈసారి మాత్రం ఈ తమిళనాడు కుర్రాడు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ నుంచి ఓపెన్ విభాగంలో పది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడగా ఒకరు ఫైనల్‌కు, మరో ముగ్గురు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం విశేషం. ♦ 2690 రేటింగ్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న ప్రజ్ఞానందకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ♦ రెండో రౌండ్లో 2599 రేటింగ్ ఉన్న ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి లగార్డె (ఫ్రాన్స్)పై 1.5–0.5తో గెలిచాడు. ♦ మూడో రౌండ్లో చెక్ రిపబ్లిక్ గ్రాండ్‌మాస్టర్, 2689 రేటింగ్ ఉన్న డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)ను ప్రజ్ఞానంద ఓడించాడు. ♦ నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద ప్రపంచ రెండో ర్యాంకర్, 2787 రేటింగ్ ఉన్న హికారు నకముర (అమెరికా)పై టైబ్రేక్‌లో 3–1తో సంచలన విజయం సాధించాడు. ♦ ఐదో రౌండ్లో 1.5–0.5తో ఫెరెంక్ బెర్కెస్ (హంగేరి)పై గెలిచాడు. ♦ క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్, 2710 రేటింగ్ ఉన్న ఇరిగేశి అర్జున్‌పై టైబ్రేక్‌లో 5–4తో సంచలన విజయం సాధించాడు. ♦ ప్రపంచ మూడో ర్యాంకర్, 2782 రేటింగ్ ఉన్న ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రజ్ఞానంద టైబ్రేక్‌లో 3.5–2.5తో గెలుపొంది ఫైనల్ చేరాడు. -
విజేత తేలేది ‘టైబ్రేక్స్’లోనే...
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో చాంపియన్ ఎవరో టైబ్రేక్స్ ద్వారా తేలనుంది. భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్‌వన్ కార్ల్సన్ (నార్వే) మధ్య ఫైనల్లో రెండో గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. వరుసగా రెండో ‘డ్రా’ తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా నేడు వీరిద్దరి మధ్య టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ముందుగా ర్యాపిడ్ ఫార్మాట్లో 25 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడిస్తారు. ఇందులో ఫలితం వస్తే ఫైనల్‌ను ముగిస్తారు. రెండు గేమ్‌ల తర్వాత కూడా సమంగా ఉంటే... ఈసారి 10 నిమిషాలు నిడివిగల రెండు గేమ్‌లు నిర్వహిస్తారు. ఇక్కడా ఫలితం తేలకపోతే 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడిస్తారు. అయినా ఫలితం తేలకపోతే 3 నిమిషాల నిడివిగల గేమ్‌లను ఇద్దరిలో ఒకరు గెలిచే వరకు ఆడించి విజేతను ఖరారు చేస్తారు. 32 ఏళ్ల కార్ల్సన్ గతంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... ప్రజ్ఞానంద కెరీర్లో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్నాడు. -
రెండో గేమ్‌లో కార్ల్సన్తో గట్టి పోరాటమే చేయాలి: ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగం టైటిల్ కోసం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) మధ్య జరిగిన తొలి గేమ్ ‘డ్రా’గా ముగిసింది. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడాడు. 35 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు సమ్మతించారు. ‘తొలి గేమ్‌లో నేను ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. రెండో గేమ్‌లో కార్ల్సన్తో గట్టి పోరాటమే చేయాల్సి ఉంటుంది. అతడిని నిలువరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. వీరిద్దరి మధ్య నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో కార్ల్సన్ తెల్ల పావులతో ఆడతాడు. ఈ గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు ప్రపంచకప్ టైటిల్ లభిస్తుంది. ఒకవేళ రెండో గేమ్ కూడా ‘డ్రా’ అయితే గురువారం టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
అర్జున్ పరాజయం సెమీస్‌లో ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 5–4తో గెలుపొందాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి భారత ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్ కడదాకా పోరాడినా చివరకు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఎత్తులకు చేతులెత్తేశాడు. బుధవారం ఇద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు గురువారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు గేమ్‌లు ఆడించారు. ఈ రెండూ ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 76 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో స్కోరు 3–3తో సమంగా నిలిచింది. ఈ దశలో 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. ఇందులో తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో అర్జున్ 36 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 4–4తో సమంగా నిలిచింది. దాంతో ‘సడన్ డెత్’ టైబ్రేక్ మొదలైంది. ‘సడన్‌డెత్’లో తొలుత నెగ్గిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ‘సడన్‌డెత్’ తొలి గేమ్‌లోనే ప్రజ్ఞానంద 72 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్ తొలి గేముల్లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)... కరువానా (అమెరికా)తో ప్రజ్ఞానంద తలపడతారు. -
విదిత్ సంచలనం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్, రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్‌ని షితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విదిత్ 4–2తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించగా ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించారు. ఈ రెండింటిలో విదిత్ గెలుపొందడం విశేషం. తొలి గేమ్‌లో 60 ఎత్తుల్లో గెలిచిన విదిత్ రెండో గేమ్‌లో 52 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో విదిత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఈ టోర్నీలో నాలుగో భారత ప్లేయర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ఇప్పటికే ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్ చేరారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌లలో కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో విదిత్; ప్రజ్ఞానందతో అర్జున్; కరువానా (అమెరికా)తో లీనియర్ (అమెరికా) తలపడతారు. హారిక ఓటమి మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో హారిక 3.5–4.5తో అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. వీరిద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌లో గోర్యాచ్కినా, రెండో గేమ్‌లో హారిక గెలిచారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం నిర్వహించిన రెండు గేమ్‌లు ‘డ్రా’ కావడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో గోర్యాచ్కినా 43 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 95 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
క్వార్టర్స్‌లో అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద తమ ప్రత్యర్థులపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అర్జున్ 1.5–0.5తో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్)పై, ప్రజ్ఞానంద 1.5–0.5తో ఫెరెంక్ బెర్కిస్ (హంగేరి)పై, గుకేశ్ 1.5–0.5తో హావో వాంగ్ (చైనా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; ప్రజ్ఞానందతో అర్జున్ తలపడతారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్ తొలి గేముల్లో నెగ్గిన అర్జున్, గుకేశ్ ఆదివారం జరిగిన రెండో గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ప్రజ్ఞానంద 49 ఎత్తుల్లో గెలుపొంది క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. నిపోమ్‌నిషి (రష్యా)తో జరుగుతున్న మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో గేమ్‌ను కూడా విదిత్ (భారత్) ‘డ్రా’ చేసుకోవడంతో ఇద్దరూ 1–1తో సమఉజ్జీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు ఆడనుంది. హారిక–అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా)తో క్వార్టర్ ఫైనల్లో రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో నేడు టైబ్రేక్ అనివార్యమైంది. -
అర్జున్ విజయం హారిక ‘డ్రా’
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు ఇరిగేశి అర్జున్ కీలక విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి రౌండ్లో నల్ల పావులతో ఆడి అర్జున్ గెలుపు నమోదు చేయడం విశేషం. ఈ గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్ను ఓడించాడు. నేడు జరిగే రెండో రౌండ్‌ను అతను ‘డ్రా’గా ముగించినా సరే క్వార్టర్ ఫైనల్ చేరతాడు. మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌ను నల్లపావులతో ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాకినా (రష్యా)తో జరిగిన ఈ పోరును 48 ఎత్తులో హారిక ముగించింది. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడి డి.గుకేశ్ కూడా విజయాన్ని అందుకున్నాడు. గుకేశ్ 38 ఎత్తుల్లో వాంగ్ హావో (చైనా)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్ మ్యాచ్‌లలో ఫెరెన్స్ బెర్క్స్ (హంగేరీ)– ప్రజ్ఞానంద (45 ఎత్తుల్లో)...ఇయాన్ నెపొమినియాచి (రష్యా)– విదిత్ గుజరాతీ మధ్య (31 ఎత్తుల్లో) జరిగిన తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
క్వార్టర్ ఫైనల్లో హారిక
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఎలైన్ రోబర్స్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక 2.5–1.5తో గెలిచింది. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో గేమ్‌లో హారిక 73 ఎత్తుల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెలా ఖొటెనాష్ లి (జార్జియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 1–3తో ఓడిపోయింది. ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్ తొలి గేమ్‌లో హంపి 54 ఎత్తుల్లో... రెండో గేమ్‌లో 43 ఎత్తుల్లో పరాజయం పాలైంది. గుకేశ్ ముందంజ... ఓపెన్ విభాగంలో 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)పై ప్రజ్ఞానంద గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్లోని రెండు గేముల్లో 2787 ఎలో రేటింగ్ ఉన్న నకమురను 2690 రేటింగ్ కలిగిన ప్రజ్ఞానంద ఓడించడం విశేషం. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద తొలి గేమ్‌లో 33 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 41 ఎత్తుల్లో విజయం సాధించాడు. తమిళనాడుకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2.5–1.5తో ఆండ్రీ ఎసిపెంకో (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... నిహాల్ సరీన్ 1–3తో నెపోమ్నిశి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
‘సడన్‌డెత్’లో హారిక విజయం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... ఓపెన్ విభాగంలో నిహాల్ సరీన్, విదిత్ సంతోష్ గుజరాతి నాలుగో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మూడో రౌండ్ టైబ్రేక్ పోటీల్లో హారిక 5.5–4.5తో లెలా జవఖి‹Ùవిలి (జార్జియా)పై... నిహాల్ 2.5–1.5తో డేనియల్ బొగ్డాన్ (రొమేనియా)పై... విదిత్ 5–4తో మథియాస్ బ్లూ»ౌమ్ (జర్మనీ)పై విజయం సాధించారు. ఆదివారం రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో హారిక–లెలా మధ్య విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. వీరిద్దరు ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు ర్యాపిడ్ గేమ్‌లు ఆడారు. రెండూ ‘డ్రా’గా ముగియడంతో 2–2తో సమంగా నిలిచారు. దాంతో 10 నిమిషాలు నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహించారు. ఇందులో చెరో గేమ్‌లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. అనంతరం 5 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు ఆడించగా...రెండూ ‘డ్రా’ కావడంతో స్కోరు 4–4తో నిలిచింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆఖరుగా 3 నిమిషాల నిడివిగల ‘సడన్‌డెత్’ గేమ్‌లు మొదలయ్యాయి. ‘సడన్‌డెత్’లో ‘డ్రా’ అయితే విజేత తేలేవరకు గేమ్‌లు నిర్వహిస్తారు, గెలిస్తే మాత్రం వెంటనే ముగిస్తారు. ఇందులో హారిక, లెలా తొలి గేమ్ ‘డ్రా’కాగా... రెండో గేమ్‌లో హారిక 59 ఎత్తుల్లో నెగ్గి నాలుగో రౌండ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
హర్ష భరతకోటి శుభారంభం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి శుభారంభం చేశాడు. లెవాన్ పాంట్సులయ (జార్జియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో హర్ష 40 ఎత్తుల్లో గెలిచాడు. గ్రెగరీ కైదనోవ్ (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, విదిత్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానందలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మహిళల విభాగంలో మరీనా బ్రునెల్లో (ఇటలీ)తో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక 27 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. -
హరికృష్ణ పరాజయం
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగం నాలుగో రౌండ్ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు పరాజయం ఎదురైంది. అమిన్ (ఇరాన్)తో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు. నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ తప్పనిసరిగా గెలిస్తేనే టోర్నీలో నిలుస్తాడు. మరోవైపు విదిత్ (భారత్) 49 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ (అమెరికా)పై విజయం సాధించాడు. మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి గేమ్‌ను ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. -
హరికృష్ణ ముందంజ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో రౌండ్లోకి ప్రవేశించాడు. కాన్స్టాన్టిన్ లుపులెస్కు (రొమేనియా)తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్ హరికృష్ణ 1.5–0.5తో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో గెలిచిన హరికృష్ణ, సోమవారం జరిగిన రెండో గేమ్‌ను 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. భారత్‌కే చెందిన నిహాల్ సరీన్ 0.5–1.5తో ఆంద్రికిన్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. విదిత్–ఆధిబన్ (భారత్); ప్రజ్ఞానంద (భారత్)–క్రాసెన్‌కౌ (పోలాండ్) నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు నేడు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. మరోవైపు హిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 0.5–1.5తో గునీనా (రష్యా) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
మూడో రౌండ్లో హరికృష్ణ
సోచి (రష్యా): ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణతోపాటు భారత్‌కే చెందిన ఆధిబన్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో హరికృష్ణ 1.5–0.5తో యాసిర్ పెరెజ్ క్యూసాడా (క్యూబా)పై, ఆధిబన్ 2–0తో న్యూరిస్ డెల్గాడో రమిరెజ్ (పరాగ్వే)పై, ప్రజ్ఞానంద 2–0తో గాబ్రియెల్ సర్గాసియన్ (అర్మేనియా)పై, నిహాల్ 1.5–0.5తో సనన్ జుగిరోవ్ (రష్యా)పై గెలిచారు. నిర్ణీత రెండు గేమ్‌లు ముగిశాక విదిత్ (భారత్)–అలెగ్జాండర్ ఫియెర్ (బ్రెజిల్); గుకేశ్ (భారత్)–దుబోవ్ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు శనివారం ‘టైబ్రేక్’ నిర్వహిస్తారు. అరవింద్ చిదంబరం (భారత్) 0.5–1.5తో నోదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... ఇనియన్ (భారత్) 0–2తో తొమాస్‌షెవ్‌స్కీ (రష్యా) చేతిలో ఓడిపోయారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్లోకి ప్రవేశించింది. హారిక ప్రత్యర్థి మెదీనా (ఇండోనేసియా)కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె బరిలోకి దిగలేదు. భక్తి కులకర్ణి 0.5–1.5తో నటాలియా పొగోనినా (రష్యా) చేతిలో... వైశాలి 0–2తో బేలా ఖొటెనాష్విలి (జార్జియా) చేతిలో ఓడిపోయారు. పద్మిని రౌత్ (భారత్)–సారాసదత్ (ఇరాన్) 1–1తో సమంగా నిలువడంతో శనివారం టైబ్రేక్‌లో తలపడతారు. -
పద్మిని రౌత్ శుభారంభం
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి పద్మిని రౌత్ శుభారంభం చేసింది. రష్యాలో సోమవారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్ తొలి గేమ్‌లో పద్మిని 36 ఎత్తుల్లో ఉల్వియా (అజర్బైజాన్)పై గెలిచింది. నేడు వీరిద్దరి మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. దీనిని ‘డ్రా’ చేసుకుంటే పద్మిని రెండో రౌండ్‌కు చేరుకుంటుంది. మరో తొలి రౌండ్ గేమ్‌లో భారత్‌కే చెందిన వైశాలి 62 ఎత్తుల్లో కియు జౌ (కెనడా)పై నెగ్గింది. ద్రోణవల్లి హారిక, భక్తి కులకర్ణిలకు నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ లభించింది. -
గెలిస్తేనే నిలుస్తారు
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతిలకు ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు హరికృష్ణ 52 ఎత్తుల్లో కిరిల్ అలెక్‌సీన్‌కో (రష్యా) చేతిలో... మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ 93 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే... నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ, విదిత్ తప్పనిసరిగా గెలవాల్సిందే. వీరిద్దరు కనీసం ‘డ్రా’ చేసుకున్నా ఈ టోర్నీలో భారత కథ ముగుస్తుంది. -
ఆధిబన్, నిహాల్ నిష్క్రమణ
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ నుంచి భారత గ్రాండ్ మాస్టర్లు నిహాల్ సరీన్, ఆధిబన్ ని్రష్కమించారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్ టైబ్రేక్ పోటీల్లో వీరిద్దరికీ పరాజయం ఎదురైంది. కేరళకు చెందిన 15 ఏళ్ల నిహాల్ 1.5–2.5తో ఎల్తాజ్ సఫార్లీ (అజర్బైజాన్) చేతిలో... తమిళనాడుకు చెందిన ఆధిబన్ 1.5–2.5తో యు యాంగి (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. శనివారం నిరీ్ణత రెండు గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి ఆదివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. నిహాల్తో జరిగిన టైబ్రేక్ తొలి గేమ్‌లో ఎల్తాజ్ 61 ఎత్తుల్లో గెలిచి... రెండో గేమ్‌ను 25 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఆధిబన్‌తో జరిగిన టైబ్రేక్ తొలి గేమ్‌లో యు యాంగి 54 ఎత్తుల్లో నెగ్గి... రెండో గేమ్‌ను 40 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నిహాల్, ఆధిబన్ ఓటమితో ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ సంతోష్ గుజరాతి మాత్రమే బరిలో మిగిలారు. నేడు జరిగే మూడో రౌండ్ తొలి గేమ్‌ల్లో కిరిల్ అలెక్‌సీన్‌కో (రష్యా)తో హరికృష్ణ... సో వెస్లీ (అమెరికా)తో విదిత్ తలపడతారు. -
మూడో రౌండ్లో హరికృష్ణ
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ మూడో రౌండ్‌కు అర్హత పొందాడు. శనివారం వ్లాదిమర్ ఫెడోసీవ్ (రష్యా)తో జరిగిన రెండోరౌండ్ రెండో గేమ్‌ను అతను 61 ఎత్తుల్లో డ్రా చేసుకొని 1.5–0.5 పాయింట్లతో ముందంజ వేశాడు. విదిత్ గుజరాతి కూడా మూడో రౌండ్‌కు చేరాడు -
హరికృష్ణ హ్యాట్రిక్ విజయం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ రెండో రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణతోపాటు నిహాల్ సరీన్ గెలుపొందగా... విదిత్, ఆధిబన్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మరోప్లేయర్ అరవింద్ చిదంబరం ఓడిపోయాడు. హరికృష్ణ 54 ఎత్తుల్లో వ్లాదిమిర్ ఫెడోసీవ్ (రష్యా)పై, నిహాల్ 37 ఎత్తుల్లో సఫార్లి ఎల్తాజ్ (అజర్బైజాన్)పై నెగ్గారు. నేడు హరికృష్ణ, నిహాల్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంటే మూడో రౌండ్‌కు అర్హత పొందుతారు. ఈ టోర్నీలో హరికృష్ణకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. విదిత్–రఖ్మనోవ్ (రష్యా) గేమ్ 31 ఎత్తుల్లో; ఆధిబన్–యు యాంగీ (చైనా) గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. అరవింద్ 37 ఎత్తుల్లో తొమవ్స్కీ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
హరికృష్ణ నిష్క్రమణ
తిబిలిసి (జార్జియా): ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో తెలుగు ఆటగాడు పెంటేల హరికృష్ణ ఆట ముగిసింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో భారత్‌కే చెందిన సేతురామన్ చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు. ఇద్దరి మధ్య టైబ్రేక్‌లో రెండు ర్యాపిడ్ గేమ్‌లు జరిగాయి. తొలి గేమ్ 58 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. అయితే రెండో గేమ్‌లో తీవ్ర ఒత్తిడికి లోనైన హరికృష్ణ స్వీయ తప్పిదాలతో 62 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. -
ఆనంద్ నిష్క్రమణ
తిబిలిసి (జార్జియా): గతంలో రెండుసార్లు (2000, 2002లో) చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఈసారి ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో చేదు అనుభవం ఎదురైంది. 15 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ బరిలోకి దిగిన ఆనంద్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆశలు సజీవంగా ఉండాలంటే ఆంటోన్ కొవల్యోవ్ (కెనడా)తో గురువారం జరిగిన రెండో గేమ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. దాంతో 0.5–1.5తో కొవల్యోవ్ చేతిలో ఆనంద్ ఓడిపోయాడు. మరోవైపు లీ క్వాంగ్ లియెమ్ (వియత్నాం)తో జరిగిన రెండో గేమ్‌ను విదిత్ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని 1.5–0.5తో గెలుపొంది మూడో రౌండ్‌కు చేరాడు. పెంటేల హరికృష్ణ–సేతురామన్ల మధ్య; ఆదిబన్–నెపోమ్నియాచి (రష్యా)ల మధ్య రెండో గేమ్ కూడా ‘డ్రా’ కావడంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో శుక్రవారం టైబ్రేక్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. -
హరికృష్ణ ఆశలు సజీవం
తిబిలిసి (జార్జియా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రాణించాడు. యూరీ గొంజాలెజ్ విడాల్ (క్యూబా)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో ఓడిపోయిన హరికృష్ణ... సోమవారం జరిగిన రెండో గేమ్‌లో 41 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ 1.5–0.5తో లీ తియాన్ యో (మలేసియా)పై, సేతురామన్ 1.5–0.5తో పొనొమరియోవ్ (ఉక్రెయిన్)పై, విదిత్ 1.5–0.5తో డెల్గాడో (పరాగ్వే)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకోగా... దీప్ సేన్‌గుప్తా 0.5–1.5తో వాంగ్ హావో (చైనా) చేతిలో ఓడిపోయాడు. వలెజో పోన్స్ (స్పెయిన్)తో కార్తికేయన్ మురళీ; త్రుయోంగ్ సన్ (వియత్నాం)తో ఆదిబన్ స్కోరు 1–1తో సమం కావడంతో మంగళవారం టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. సోమవారం జరిగిన రెండో గేమ్‌ల్లో ఆనంద్ 71 ఎత్తుల్లో లీ తియాన్ యోతో... ఆదిబన్ 34 ఎత్తుల్లో త్రుయోంగ్ సన్తో ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్ 58 ఎత్తుల్లో పొనొమరియోవ్పై, విదిత్ 44 ఎత్తుల్లో డెల్గాడోపై, కార్తికేయన్ మురళీ 45 ఎత్తుల్లో వలెజో పోన్స్పై గెలిచారు. దీప్ సేన్‌గుప్తా 48 ఎత్తుల్లో వాంగ్ హావో చేతిలో ఓటమి పాలయాయ్యాడు. -
తొలి గేమ్‌లో హరికృష్ణ ఓటమి
తిబిలిసి (జార్జియా): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో తొలి రౌండ్ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు ఓటమి ఎదురైంది. యూరీ గొంజాలెజ్ విడాల్ (క్యూబా)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌లో హరికృష్ణ నల్లపావులతో ఆడుతూ 36 ఎత్తుల్లో ఓడిపోయాడు. హరికృష్ణ ఆశలు సజీవంగా ఉండాలంటే సోమవారం గొంజాలెజ్‌తో జరిగే రెండో గేమ్‌లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ 66 ఎత్తుల్లో తియాన్ లి యో (మలేసియా)పై గెలిచి శుభారంభం చేశాడు. ఇతర తొలి రౌండ్ గేముల్లో రుస్లాన్ పొనోమరియోవ్ (ఉక్రెయిన్)తో సేతురామన్ 16 ఎత్తుల్లో; ఎన్గుయెన్ త్రుయోంగ్ సన్ (వియత్నాం)తో ఆదిబన్ 15 ఎత్తుల్లో; వాంగ్ హావో (చైనా)తో దీప్ సేన్‌గుప్తా 34 ఎత్తుల్లో; డెల్గాడో రమిరేజ్ (పరాగ్వే)తో విదిత్ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. వలేజో పోన్స్ (స్పెయిన్)తో జరిగిన గేమ్‌లో కార్తికేయన్ మురళి 64 ఎత్తుల్లో ఓటమి చవిచూశాడు. -
ఆనంద్, హరికృష్ణలపైనే దృష్టి
నేటి నుంచి ప్రపంచకప్ చెస్ టోర్నీ తిబిలిసి (జార్జియా): వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత పొందడమే లక్ష్యంగా ఆదివారం మొదలయ్యే పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ బరిలోకి దిగనున్నారు. 128 మంది మేటి క్రీడాకారులు పాల్గొంటున్న ఈ నాకౌట్ టోర్నమెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు క్యాండిడేట్స్ చెస్ టోర్నీకి అర్హత సాధిస్తారు. తొలి రౌండ్లో తియాన్ లి యో (మలేసియా)తో విశ్వనాథన్ ఆనంద్; యూరీ గొంజాలెజ్ విడాల్ (క్యూబా)తో హరికృష్ణ తలపడతారు. ప్రతి రౌండ్లో రెండు గేమ్‌లు జరుగుతాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ స్కోరు సమమైతే టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఆనంద్, హరికృష్ణలతోపాటు భారత్ నుంచి విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, దీప్ సేన్‌గుప్తా, సేతురామన్, కార్తికేయన్ మురళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. క్యాండిడేట్స్ టోర్నీ ద్వారా ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడే ప్రత్యర్థిని నిర్ణయిస్తారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రుస్లాన్ పొనోమరియోవ్ (ఉక్రెయిన్)తో సేతురామన్; వలేజో పోన్స్ (స్పెయిన్)తో కార్తికేయన్ మురళి; ఎన్గుయెన్ త్రుయోంగ్ సన్ (వియత్నాం)తో ఆదిబన్; వాంగ్ హావో (చైనా)తో దీప్ సేన్ గుప్తా; డెల్గాడో (పరాగ్వే)తో విదిత్ తలపడతారు. ఎనిమిది సార్లు ప్రపంచకప్ జరగ్గా... భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్ రెండుసార్లు (2000లో, 2002లో) విజేతగా నిలిచాడు. 15 ఏళ్ల తర్వాత ఆనంద్ మరోసారి ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతుండటం విశేషం. -
ముగిసిన భారత్ పోరు
బాకు (అజర్బైజాన్) : ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ మూడో రౌండ్లో నిష్ర్కమించాడు. షఖిరి యార్ మమెద్యరోవ్ (అజర్బైజాన్)తో జరిగిన మూడో రౌండ్లో సేతురామన్ 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. గురువారం జరిగిన తొలి గేమ్‌లో సేతురామన్ 41 ఎత్తుల్లో ఓడిపోగా... శుక్రవారం జరిగిన రెండో గేమ్‌ను సేతురామన్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు సూర్యశేఖర గంగూలీ, లలిత్, ఆదిబన్, విదిత్ తొలి రౌండ్లోనే ఓటమి చెందగా... హరికృష్ణ రెండో రౌండ్లో నిష్ర్కమించాడు.