World Economy
-
ప్రపంచ ఎకానమీపై ఐఎంఎఫ్ కీలక ప్రకటన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 2024 అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అప్‌గ్రేడ్ చేసింది. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అమెరికా వృద్ధి పయనం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. తాజా అవుట్‌లుక్‌లో 2024 వృద్ధి రేటును ఇంతక్రితం 2.9 శాతం అంచనాల నుంచి 3.1 శాతానికి పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ద్రవ్యోల్బణం అవుట్‌లుక్‌ను తగ్గించింది. 2023లో 6.8 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, 2024లో ఇది 5.8 శాతానికి, 2025లో 4.4 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి అగ్రదేశాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.6 శాతం ఉంటే 2024లో 2 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 2024లో 3.3 శాతంగా ఉంటే, 2025లో 3.6 శాతానికి పెరుగుతుందని తెలిపింది. చరిత్రాత్మాక వాణిజ్య వృద్ధి సగటు 4.9 శాతంగా ఉంది. -
వైఫల్యాలున్నా... కీలకమే!
జీ20 వార్షిక సదస్సు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం ఒక ఉన్నతమైన లక్ష్యాలతో కూడిన సమన్వయ విధానాన్ని అనుసరించడం కోసం ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చుతుంది. కానీ తన ఆశయాల పట్ల అది ఎంత పురోగతి సాధించింది? 1999లో ఏర్పడినప్పటి నుండి జీ20 ఉమ్మడి ప్రకటనలు చాలావరకు గాలి పొగల వంటి ఘనమైన తీర్మానాలే తప్ప, కార్యాచరణ శూన్యం. సభ్యదేశాల పనితీరు ఆశించినంతగా లేనప్పుడు, స్పష్టమైన పరిణామాలు ఉండవు. ఒక ఉదాహరణ. 2021 రోమ్ సదస్సులో, జీ20 నాయకులు భూతాపాన్ని ‘అర్థవంతమైన, సమర్థమైన చర్యలతో’ పరి మితం చేస్తామని చెప్పారు. విదేశాలలో బొగ్గు విద్యుత్ ప్లాంట్లకు ఆర్థిక సహాయం అందించడాన్ని ముగిస్తామని చేసిన ప్రతిజ్ఞ హైలైట్ అయింది. కానీ రోమ్ సదస్సు ప్రకటన దేశీయ బొగ్గు పెట్టుబడులను వదిలిపెట్టేసింది. 2022లో, అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. జీ20 ప్రకటనలో, బొగ్గు వినియోగాన్ని వెంటనే ముగించాలనే విషయంపై శాస్త్రీయ ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, 2023లో బొగ్గుపై పెట్టుబడి మరో 10 శాతం పెరిగి, 150 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 1990ల చివరలో కరెన్సీ విలువ తగ్గింపుల వెల్లువ తర్వాత ఆర్థిక మంత్రుల సమావేశంతో జీ20 ప్రారంభమైంది. ఒక దశాబ్దం తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ నాయకుల వార్షిక సమావేశానికి జీ20 నాంది పలికింది. ఈ కూటమిని నెలకొల్పిన దేశాలు, తర్వాత పెరుగుతున్న శక్తులు రెండింటినీ సమావేశపరచడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా పరిరక్షించవచ్చని విశ్వసించారు. ఈ విశ్వాసం సరైందేనని ముందస్తు ఆధారాలు సూచించాయి. 2008, 2009లో నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన చర్యలకు అంగీకరించడం ద్వారా, విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి బ్యాంకు సంస్కరణలను ప్రారంభించడం ద్వారా, ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించినందుకు చాలామంది నిపుణులు జీ20ని ప్రశంసించారు. 2016లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ సమస్యకు సంబంధించి పారిస్ ఒప్పందంపై తమ రెండు దేశాలూ సంతకం చేస్తాయని అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా నాయకుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. దీంతో నాయ కులను ఒకచోట చేర్చే శక్తిని జీ20 ప్రపంచానికి చూపించింది. ఇటీవల అంటే 2021లో, ప్రతి దేశానికి కనీసం 15 శాతం ప్రపంచ కనిష్ఠ పన్నుతో కూడిన ప్రధాన పన్ను సవరణకు జీ20 సదస్సు మద్దతునిచ్చింది. అమెజాన్ వంటి బడా అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించే దేశాలలో కార్యాలయాలు లేకపోయినా, పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉన్న కొత్త నిబంధనలకు కూడా ఇది మద్దతిచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి బిలియన్లను అదనంగా జోడించడమే కాకుండా, పన్నుల స్వర్గ ధామాలను ఏర్పర్చి, కార్పొరేషన్లకు చోదక శక్తిగా మార్చడానికి జీ20 ప్రణాళిక హామీ ఇచ్చింది. కానీ, కూటమి చేసిన అనేక ప్రకటనల మాదిరిగానే, వాటి తదుపరి అమలు బలహీనంగా ఉంటూవచ్చింది. ‘గ్లోబల్ ట్యాక్స్ ఒప్పందం సరైన దిశలో ఒక ముఖ్యమైన అడుగు’ అని అంత ర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఈ సంవత్సరం ప్రకటించింది, ‘అయితే అది ఇంకా పనిచేయడం లేదు’ అని పేర్కొంది. జీ20 ప్రారంభమైనప్పుడు, ప్రపంచాన్ని ఎలా కలిపి ఉంచాలనే దానిపై మరింత ఏకాభిప్రాయం ఏర్పడింది. స్వేచ్ఛా వాణిజ్యం పెరిగింది. అధికారం కోసం పోటీ ఒక పాత జ్ఞాపకం లాగే కనిపించింది. పైగా, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వంటి వయసుడిగిన సంస్థల స్థానంలో జీ20 విస్తృతమైన అధికార స్థావరంగా దారితీస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆశావాదులు భావించారు. ఆ ఆశలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పైగా మరెక్కడో వికసించాయి కూడా! ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం తాజా ఉదాహరణ. కానీ విభేదాలు జీ20 జట్టు ప్రయత్నాలను దెబ్బకొట్టాయి. అమెరికా, చైనా తీవ్ర పోటీదారులుగా మారాయి. కోవిడ్ –19 మహమ్మారి, ఉక్రెయిన్ లో యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థలు ప్రమాదకరంగా కనిపించడంతో జాతీయవాదం పెరిగింది. యుద్ధరంగానికి దూరంగా ఉన్న దేశాల్లో ఆహారం, ఇంధన ధరలను పెంచింది. కొంతమంది విమర్శకులు జీ20ని తొలగించాలని కోరుకుంటున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ సంవత్సరం సమావేశాన్ని దాటవేయడంతో అది ఇప్పటికే బలహీనపడిందని వారు అంటున్నారు. అయితే, జీ20 వైఫల్యాలు అంతర్జాతీయ సంస్థలలో ఆధునికీకరణ అవసరాన్ని సూచిస్తాయని చాలామంది విదేశాంగ విధాన నిపుణులు సూచిస్తున్నారు. డామియన్ కేవ్ వ్యాసకర్త ‘న్యూయార్క్ టైమ్స్’ పాత్రికేయుడు -
‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!
మహిళలపట్ల వివక్ష వల్ల సామాజికంగా వాటిల్లే నష్టానికి వెలకట్టలేం. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిల్వ, పంపిణీ (అగ్రి ఫుడ్ సిస్టమ్స్) రంగాల్లో లింగవివక్ష వల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నదో తెలుసుకొనేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇటీవల అధ్యయనం చేసింది. లింగవివక్ష కారణంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ. 81,84,550 కోట్లు) సంపదను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రంగంలో మహిళల స్థితిగతులపై 2010 విరామం తర్వాత ఎఫ్ఏఓ వెలువరించిన తొలి అధ్యయన నివేదిక ఇదే. వ్యవసాయంతోపాటు ఈసారి ఆహార శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ రంగాల్లో రైతులుగా, కూలీలుగా, ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా, చిరు వ్యాపారులుగా పనిచేసే మహిళల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయటం గమనార్హం. వివక్షను రూపుమాపితే రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలపట్ల లింగ వివక్షను నిర్మూలిస్తే ఆహారోత్పత్తి పెరిగి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. పేదరికం, ఆకలి తగ్గుతుంది. 4.5 కోట్ల మంది నిరుపేదలకు అదనంగా ఆహార భద్రత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఏఓ తేలి్చచెప్పింది. అంతేకాదు.. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను దీటుగా తట్టుకోవాలన్నా లింగవివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏఓ నివేదిక స్పష్టం చేసింది. లింగ వివక్షను తగ్గించి మహిళా సాధికారతను పెంచే పథకాల వల్ల సగానికి సగం చిన్న రైతులకు మేలు జరుగుతుంది. 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. మరో 23.5 కోట్ల మందికి విపత్తులను తట్టుకొనే శక్తి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు తెలిపారు. ఏ ముప్పు అయినా మహిళలనే ముందు దెబ్బతీస్తుంది. కోవిడ్ మహమ్మారి వచి్చన మొదటి ఏడాదిలో ఆహార శుద్ధి, పంపిణీ రంగంలో 22% మహిళల ఉద్యోగాలు పోతే, 2% పురుషుల ఉద్యోగాలు పోయాయి. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు పెచ్చుమీరిన సంక్షోభ కాలాల్లో వ్యవసాయ–ఆహార రంగాల్లో పనిచేసే మహిళల బిడ్డల పోషణ, ఇంటి పనికి అదనంగా దూరం వెళ్లి నీళ్లు తెచ్చే భారం పెరిగిపోతోంది. అల్ప, మధ్య తరహా ఆదాయ దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం విషయంలో లింగ వివక్ష 25% నుంచి 16 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. గత పదేళ్లుగా అనేక దేశాల్లో మహిళలకు అనుకూల విధానాలు వస్తున్నప్పటికీ వ్యవసాయం–ఆహార రంగాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. 68 దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 75% విధానాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ లింగవివక్షను తగ్గించే ప్రయత్నాలు 19% విధానాల్లోనే కనిపించింది. విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయిలో లింగవివక్షను తగ్గించేందుకు మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని ఎఫ్ఏఓ సూచించింది. గొడ్డు చాకిరీ.. 18% తక్కువ ఆదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 400 కోట్లు. ఏటా 1,100 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 36% మంది మహిళలకు, 38% మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. అయితే ఆఫ్రికా దేశాల్లో 66% మంది మహిళలకు వ్యవసాయమే ఉపాధి. చిన్న, సన్నకారు రైతులకు నిలయమైన భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువ. ఈ దేశాల్లో 71% మంది మహిళలు (మహిళా రైతులు, కూలీలు, ఉద్యోగినులు) వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్నారు. అలాగే పురుషులు 47% మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కూలికి వెళ్లే వారిలో పురుషులకన్నా మహిళల సంఖ్యే తక్కువ. గత పదేళ్లలో పొలం పనులపై ఆధారపడే వారి సంఖ్య 10% తగ్గినట్లు ఎఫ్ఏఓ.నివేదిక చెబుతోంది. వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్న మహిళల పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేసినా పని భద్రత లేదు. పార్ట్‌టైమ్ పనులు, కొన్నాళ్లు మాత్రమే ఉండే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమైన పనులే మహిళలకు ఇస్తున్నారు. అందువల్ల పురుషులకన్నా 18% తక్కువగా వారి ఆదాయం ఉంటోంది. కౌలు రైతులకు మరీ కష్టం.. భూమిని కౌలుకు తీసుకున్న మహిళా రైతులు తీవ్ర అభద్రతకు గురవుతున్నారని ఎఫ్ఏఓ పేర్కొంది. 46 దేశాల్లో గణాంకాలను పరిశీలిస్తే 40 దేశాల్లో పురుష రైతులకు ఎక్కువ భూమి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కౌలు నిబంధనలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మహిళా రైతులకు రుణ సంస్థల నుంచి పరపతి అందట్లేదు. శిక్షణా అవకాశాలు మహిళలకు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అన్నిటికన్నా మించి పురుషులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సాంకేతికతలు, యంత్రాలనే మహిళలు ఉపయోగించాల్సి వస్తోంది. ఈ అసమానతల వల్ల సమాన విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన పురుషులకన్నా మహిళలు సాగు చేసిన పొలాల్లో ఉత్పాదకత 24% తక్కువగా వస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు మహిళల కోసం వ్యవస్థలు పనిచేయాలి వ్యవసాయ, ఆహార రంగాల్లో లింగ అసమానతలను స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించి మ హిళలకు సాధికారత కలి్పస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఆకలి కేకలులేని ప్రపంచాన్ని సృష్టించ డం వంటి లక్ష్యాల సాధన కృషిలో ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలు అనాదిగా పనిచేస్తున్నారు. వారి కోసం ఈ వ్యవస్థలు పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – డా. క్యూ డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) చదవండి: కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే -
ఉత్పత్తి కోతలతో చమురు ధరలకు సెగ
ప్యారిస్: చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌ప్లస్ .. ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడం వల్ల ప్రపంచ ఎకానమీకి రిస్కులు పొంచి ఉన్నాయని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అధిక స్థాయుల్లో ఉన్న ఇంధన ధరలు.. దీని వల్ల మరింతగా ఎగిసే అవకాశం ఉందని, భారత్ వంటి దేశాలకు చమురు దిగుమతుల భారం భారీగా పెరిగిపోవచ్చని తెలిపింది. సరఫరా తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున 2023 ద్వితీయార్ధంలో అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్లలో కొరత నెలకొనవచ్చని ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ‘ప్రపంచ ఎకానమీ ఇంకా బలహీనంగానే ఉండటంతో పాటు పలు వర్ధమాన దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చమురు ఉత్పత్తి కోతల నిర్ణయం వల్ల అంతర్జాతీయ ఎకానమీకి రిస్కులు ఎదురవుతాయని భావిస్తున్నాను‘ అని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్ల సమావేశాల కోసం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌తో సమావేశం అనంతరం బిరోల్ ఈ విషయాలు వివరించారు. భారత ఎకానమీ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత బలంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని బిరోల్ చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షల ప్రభావం గురించి మాట్లాడుతూ ఆ దేశ ఆదాయాలను తగ్గించాలన్న లక్ష్యం సాకారమైందని తెలిపారు. చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే, వినియోగించుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్ 85 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ఆయిల్ దిగుమతులపై 118 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? బతుకుడెట్లా?
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది ప్రపంచం పరిస్థితి ఇప్పుడు! కోవిడ్ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంటుండగానే బోలెడన్ని ఇతర సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి! రెండేళ్ల వృద్ధిని అందుకొనే క్రమంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతూండటం ఒకవైపు... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని అదుపుతప్పిన ద్రవ్యోల్బణం ఇంకోవైపు... పలు దేశాల ఆర్థిక విధానాల్లో మార్పుల కారణంగా పేద, ధనిక అంతరాలూ పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? రానున్న రెండేళ్లలో ఏమైనా మార్పులొస్తాయా? దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండే చిక్కుల మాటేమిటి? ఈ అంశాలన్నింటిపై ఇటీవలే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సర్వే నిర్వహించింది. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే ప్రకారం ఇప్పటి ప్రధాన సమస్య ఏమిటో తెలుసా? బతకడానికయ్యే ఖర్చుల్లో పెరుగుదల! కాస్ట్ ఆఫ్ లివింగ్! రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఏడాది పూర్తయ్యింది. కోవిడ్ అనంతర పరస్థితుల్లో మొదలైన ఈ యుద్ధం అనేక రంగాల్లో ప్రపంచ స్థితిగతులను మార్చేసిందనడంలో సందేహం లేదు. పైగా ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే సూచనలు కనపడని నేపథ్యంలో ప్రపంచం మొత్తం మీద పెరిగిపోతున్న జీవన వ్యయంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే చెబుతోంది. ఇంకో రెండేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని సర్వేలో పాల్గొన్న అధికులు అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ముందు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పరిశ్రమలకు, కంపెనీలకు బ్యాంకుల ద్వారా చాలా సులువుగా అప్పులు పుట్టేవని, ఇప్పుడా స్థితి లేకపోవడం, మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్పై ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని ఆ సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలో గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే రాగల రెండేళ్లు, పదేళ్ల కాలవ్యవధుల్లో ఎదుర్కొనే అవకాశమున్న ఐదు అతిపెద్ద ముప్పులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే 40కిపైగా దేశాల్లోని వివిధ రంగాల నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించారు. విద్య, వ్యాపార రంగాలతోపాటు ప్రభుత్వ అధికారులు పలువురు నిపుణుల బృందంలో ఉన్నారు. ఈ సర్వేలో రిస్క్ లేదా ముప్పుగా పరిగణించిన అంశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిపై లేదా ప్రజలు, ప్రకృతి వనరులపై దుష్పభావం చూపగలిగేవి. రానున్న రెండేళ్లలో ఈ ముప్పుల తీవ్రత, పరిణామాలు, ప్రభుత్వాల సన్నద్ధత వంటి అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరిచారు. అన్ని ప్రియమవుతున్న వేళ కోవిడ్ కంటే ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద సమస్యగానే ఉండేది. కానీ మహమ్మారి పుణ్యమా అని సరఫరాలు నిలిచిపోవడం, డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆహారం, నివాసం వంటి కనీస అవసరాలు కూడా అందనంత స్థాయికి చేరుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధన సరఫరాలపై పలు దేశాలు నియంత్రణలు విధించాయి. ఇది ద్రవ్యోల్బణం తద్వారా కనీస అవసరాల ఖర్చులు పెరిగిపోయేలా చేసింది. నల్ల సముద్రం నుంచి ఆహారధాన్యాల ఎగుమతికి చేసుకున్న ఒప్పందం నుంచి రష్యా తొలగిపోయేందుకు సిద్ధమవుతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని యూరప్ దేశాల సమాఖ్య ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో ప్రపంచం సాధారణ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది విషయానికి వస్తే ఇంధన ధరలు గతేడాది జనవరితో పోలిస్తే దాదాపు 46 శాతం వరకూ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చైనాలో కోవిడ్ నియంత్రణలను సడలించడం వల్ల వినియోగం మరింత పెరిగి ఇంధన, ఆహార ధరలు ఇంకా పెరుగుతాయని, ఇది బ్యాంకుల వడ్డీరేట్ల పెంపునకు కారణమవుతుందన్న భయాందోళనలు అధికమవుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. వాణిజ్య యుద్ధాలతో తీవ్ర నష్టం ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఆయుధాలతో జరిగేవి. ఇప్పుడు వాణిజ్య ఆర్థికాంశాలపై ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీని ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదు. ఇతర దేశాలతోపాటు అనేక రంగాలకు విస్తరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో భారత్, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ఎంత దుమారం రేపిందో తెలియనిది కాదు. రానున్న పదేళ్లలో దేశాల మధ్య ఘర్షణలు మరింత పెరుగుతాయని, అవి వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న నిపుణులు భావిస్తున్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటం, దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతుండటాన్ని దీనికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా నియంత్రణలు, నిషేధాలు విధించినట్లే భవిష్యత్తులోనూ ఆర్థికాంశాలపై దాడులు తీవ్రతరం కానున్నాయని అంచనా. ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. సమాజంలో వైషమ్యాల పెరుగుదల విలువలు, సమానత్వాల మధ్య అంతరం పెరిగిపోతుండటం కూడా స్వల్పకాలిక ముప్పుగా పరిగణిస్తున్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చే విభజన క్రమేపీ రాజకీయాలకు విస్తరిస్తుందని, వలసలు, లింగవివక్ష, జాతి, కులం, మతం ఆధారంగా ఘర్షణలు పెరిగేందుకు కారణమవుతుందని అంచనా. ప్రపంచం నలుమూలలా పలు దేశాల్లో ఘర్షణలు, ఉద్యమాలు పెరిగిపోతుండటం ఇందుకేనని చెబుతున్నారు. ధరల నియంత్రణలో వైఫల్యం, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై అదుపు లేకపోవడం వల్ల సమాజం తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని అత్యధికులు ఆందోళణ వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రపంచం ఇప్పుడు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. సుమారు 30 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా చెప్పుకోదగ్గ ముందడు ఏదీ ఇప్పటిదాకా పడలేదు. వాతావరణంలో ఈనాటి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ స్థాయికి పెంచరాదన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించట్లేదు. గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది వాతావరణ మార్పులపై ప్రస్తుత స్థితిని తప్పుబట్టారు. 2030 నాటికే సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశాలు ఇప్పుడు 50 శాతమని ఐపీసీసీ అంచనా వేస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరోవైపు పరిస్థితిని ఎదుర్కొనేందుకు జీ–7 దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. పారిస్ ఒప్పందాన్ని ధనిక దేశాలే తుంగలో తొక్కిన కారణంగా 2050 నాటికే ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువకు చేరుకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా చేయాల్సిన పనులు కాకుండా రాజకీయంగా ఉపయోగకరమైన వాటిపైనే దేశాలు ఆధారపడటం పరిస్థితిని దిగజారుస్తోంది. యూరోపియన్ యూనియన్ తాజాగా శిలాజ ఇంధన ఆధారిత ఫ్యాక్టరీల మరమ్మతులకు, ఇంధనాల కోసం ఏకంగా 5000 కోట్ల యూరోలు ఖర్చు చేస్తుండటం ఇందుకు తార్కాణం. ఈ పరిస్థితి రానున్న రెండేళ్లలోనూ మెరుగయ్యే అవకాశాలు లేవని, దీర్ఘకాలంలో అంటే రానున్న పదేళ్ల వరకూ కూడా వాతావరణ మార్పులపై పోరు మందగమనం ప్రపంచానికి ఒక సమస్యగానే మిగలనుందని అంచనా. టర్కీలో ఇటీవలి భారీ భూకంపం, గతేడాది అకాల వర్షాలు, వరదలు, కరవులు అన్నీ వాతావరణ మార్పులను సూచిస్తున్నా ధనిక దేశాలిప్పటికీ మేలుకోకపోవడం ఆందోళనకరమేనని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వేలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పర్యావరణ విభాగం అధిపతి క్రిస్ ఫీల్డ్ అన్నారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
భారత్ వృద్ధి పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కలిగి ఉందని, 2023లోనూ ఇదే హోదాను కొనసాగిస్తుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఎకానమీ వృద్ధి బాటన తన ప్రత్యేకతను చూటుకుంటోందని 9.35 లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. పటిష్ట వినియోగ విశ్వాసం, పెట్టుబడులు భారత్ వృద్ధి బాటకు మద్దతు నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలోకి వస్తుందన్న భరోసాను వెలిబుచ్చారు. టాటా సన్స్ విజయాలు... టాటా సన్స్ 2022లో అద్భుత విజయాలను సాధించినట్లు కూడా ఈ సందర్భంగా వివరించారు. గ్రూప్‌లోకి ఎయిర్ ఇండియాను తిరిగి తీసుకురావడం, కస్టమర్లకు చక్కటి సేవలకు సంబంధించి టాటాన్యూ ఆవిష్కరణ, క్యాలెండర్ ఇయర్లో 5,00,000 టాటా మోటార్స్ పాసింజర్ వెహికిల్స్ విక్రయాలు, టాటా ఈవీ కార్ల 10 శాతం మార్కెట్ వాటా వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాటా సంస్థలకు ఇదే విజయవంతమైన ప్రయాణం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘మనం మన సంస్థల పురోగతి, వ్యాపారాలు, వాటాదారుల ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా.. మన దేశం, ప్రజల సమోన్నతి సాధనకు భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పురోగమిస్తాం. సాంకేతికత, తయారీ, స్థిరత్వ అంశాల్లో కొత్త ప్రమాణాలను మనం నెలకొల్పగలుగుతాము’’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. -
కొత్త సంవత్సరం బాగుంటుందా?
కోవిడ్ మహమ్మారి, రష్యా – ఉక్రెయిన్ యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన 2022 సంవత్సరం మరి కొద్ది రోజుల్లో గతించిపోనుంది. ఆ వెంటనే రానున్న 2023 ప్రపంచానికి శుభ సంకేతాలు ఏమైనా వెలువరిస్తుందా అనేది ప్రశ్న. ఎన్నో ఆశలతో మొదలైన 2022లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3 శాతం కంటే దిగువకు పడిపోయింది. నూతన ఏడాదిలో కూడా ఇది 2.1 శాతంగా మాత్రమే ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనా ఎంతమాత్రమూ ఆశ్చర్యం కలిగించదు. భారత్ వృద్ధిరేటు కూడా 5–6 శాతం మధ్య ఉండొచ్చు. అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మన ప్రస్తుత స్థితిని మనం మరికొంత కాలం పట్టుకుని వేలాడవచ్చు. కానీ ఏ రకంగానూ మన ప్రస్తుత ఉపాధి రికార్డు మెరుగుపడే అవకాశం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ, ప్రపంచ రాజ కీయ నాయకులకూ 2022 చెడు సంవత్స రంగా ఉంటూ వచ్చింది. 2020లో మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుని 2021లో అనేక భారీ ఆర్థిక వ్యవస్థల్లో బలంగా ఆర్థిక పునరుద్ధరణలు నమోదయ్యాయనీ, ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 5.8 శాతంగా ఉంటుందనే అంచనాతో, కోవిడ్ మహమ్మారి కథ ముగిసిం దనే వాగ్దానంతో 2022 ప్రారంభమైంది. ఫిబ్రవరి చివరలో ఉక్రె యిన్‌పై రష్యా యుద్ధం ద్వారా ద్రవ్య నియంత్రణతో కూడుకున్న ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ఇంధనం, ఆహారం, ఎరువుల ధరలు చుక్కలంటాయి. పైగా సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా నేతృత్వంలో ఐక్య పాశ్చాత్య కూటమి రష్యాపై విధించిన కనీవినీ ఎరగని ఆర్థిక ఆంక్షలు దీనికి తోడయ్యాయి. అలాగే, చైనాలో ఒమిక్రాన్ వైరస్ రకం దాడితో సరఫరా చెయిన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అనేక ప్రముఖ నగరాల్లో తీవ్ర స్థాయిలో లాక్డౌన్లు మళ్లీ నెలకొన్నాయి. అధిక వడ్డీరేట్లు, యుద్ధ అనిశ్చితిల వల్ల, ‘భద్రత ఉన్నచోటికి ఎగిరిపోవడం’ అనే సూత్రం ప్రాతిపదికన అమెరికాకుపెట్టుబడులు తరలిపోవడానికి దారితీసింది. దీంతో డాలర్ బాగా బలపడింది. ఇది అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విదేశీ ద్రవ్య సమస్యలకు, రుణ బాధలకు దారితీసింది. ఈ బహముఖమైన ప్రకంపనల ఫలితంగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విభాగపు వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అంచనా వేసినట్లుగా 2022లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3 శాతం కంటే దిగు వకు పడిపోయింది. ఆర్థికాన్ని అలా పక్కన ఉంచితే, 1945 తర్వాత యూరప్ చరిత్రలో తొలిసారిగా మొదలైన అత్యంత తీవ్రమైన భూతల యుద్ధం కారణంగా అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఒకవైపు పశ్చిమ దేశాల కూటమి, మరోవైవు రష్యా, కొంతమేరకు చైనా కూటమిలో దేని పక్షాన చేరాలి లేదా వీలైనంత వరకు తటస్థంగా ఉండిపోవాలా అనే విషయమై ప్రపంచ దేశాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. వాతావరణ మార్పు, అణు నిరాయుధీకరణ, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ పెట్రోలియం మార్కెట్, పెరుగు తున్న రుణ బాధలు, సీమాంతర డిజిటల్ డేటా తరలింపులు వంటి అనేక ఒత్తిడి కలిగించే అంశాల కారణంగా అంతర్జాతీయ సహకారానికి తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో మనం 2023లో ఏం ఆశించగలం? అంతర్జాతీయంగా ఇలా... ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యవిధానాలను విస్తృత స్థాయిలో బిగించి వేశారు. మరోవైపున ఇప్పటికే చుక్కలనంటిన చమురు, గ్యాస్, ఆహార ధరలు చాలా దేశాల్లో వినియోగదారులపై అలివి మాలిన భారాన్ని మోపడం కొనసాగనుంది. అయినప్పటికీ ద్రవ్యో ల్బణ రేట్లలో కాస్త మెరుగుదలను ఆశించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నిటికీ మించి ఉక్రెయిన్ యుద్ధ పథం ఎటువైపు దారితీస్తుందో అంచనా వేయడం అసాధ్యమైపోయింది. శీతాకాలం తర్వాత ఆకస్మి కంగా మిలిటరీ దాడులు తరచుగా జరుగుతూ దీర్ఘ కాలిక మంద్ర స్థాయి సైనిక ఘర్షణలు నెలకొంటాయని విశ్లేషకులు భావి స్తున్నారు. ఒక దశలో అంత సులభం కాని కాల్పుల విరమణ కూడా సాధ్య పడొచ్చు కానీ శాంతి నెలకొనకపోవచ్చనీ, ‘ఘనీభవించిన రూపంలో సైనిక ఘర్షణ’ కొనసాగవచ్చనీ చెబుతున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల మహమ్మారి అంతరించిపోయి ఉండొచ్చు కానీ, చైనా ఇటీవలే జీరో కోవిడ్ పాలసీని సడలించడంతో ఆ దేశంలోని 140 కోట్లకు పైగా జనాభాలో తిరిగి కోవిడ్ సంక్ర మించడం, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒమిక్రాన్ కంటే ప్రమాదకరమైన వైరస్ రకాలు ప్రబలే అవకాశం కూడా ఉందనీ, దీనివల్ల ప్రస్తుతం ఉనికిలో ఉన్న రోగనిరోధక రక్షణ వ్యవస్థలు పనిచేయకుండా పోతాయనీ సాంక్రమిక వ్యాధుల నిపు ణులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న అమెరికా, యూరప్, చైనాలు 100 ట్రిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యూరప్ ఇప్పటికే మాంద్య పరిస్థితుల్లో ఉన్నందున 2023లో అది ఎలాంటి వృద్ధిని చూపించలేక పోవచ్చు. ప్రత్యేకించి జర్మనీ, బ్రిటన్ రానురాను బలహీనపడిపోతున్నాయి. 2023 ప్రథమార్థంలో అమెరికా కూడా మాంద్యంలో ప్రవేశించవచ్చని చాలామంది విశ్లేషకులు భావిస్తు న్నారు. 2022లో చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయినందున 3 లేదా 4 శాతం కంటే ఎక్కువ వృద్ధిని చూడలేం. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త కోలుకున్నా, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్ట గలదు. ఈ పరిస్థితుల్లో ఐఎంఎఫ్ నివేదిక ప్రపంచ వృద్ధి రేటును 2.1 శాతంగా మాత్రమే పేర్కొనడం ఆశ్చర్యం కలిగించదు. నిజానికి ఐఎంఎఫ్ అధినేత ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 1 శాతం కంటే ఎక్కువగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉత్సాహ పడినప్పటికీ, 2023లో తైవాన్‌ని ఆక్రమించే ప్రమాదకరమైన చర్యకు చైనా పాల్పడకపోవచ్చు. అయితే 2020లో జరిగినట్లుగా భారత్, చైనా సరిహద్దుల పొడవునా మరో దశ సైనిక దొమ్మీ ఘటనలకు చైనా పాల్పడదని హామీ ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రపంచంలోని పది కోట్లమంది శరణార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆయా దేశాల ప్రభుత్వాలు దిద్దుబాటు చర్య కోసం టైమ్ టేబుల్ రూపొందించుకోవడంలో ఇంకా వెనుకబడి ఉన్నందున వాతావరణ ప్రమాదాలు పెరిగే అవకాశముంది. ఇక ఆఫ్రికా విషయానికి వస్తే ప్రపంచం దృష్టికి రాకుండా మరుగున ఉన్న యుద్ధాలు, కరువులు ఇంకా మరెంతోమంది ప్రాణాలను హరించ డమే కాకుండా మరింత వేదనకు, ఆకలికి కారణమవుతాయి. ఇండియా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్య ప్రమాదంలోకి జారుకుంటున్నం దున ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించడం భారతదేశానికి సవాలుగా మారుతుంది. 2023లో భారత్ వృద్ధిరేటు 5–6 శాతం మధ్య ఉంటుం దని నా ఆంచనా. స్థూలంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా మన ప్రస్తుత స్థితిని మనం మరికొంత కాలం పట్టుకుని వేలాడవచ్చు. సూక్ష్మ స్థాయిలో చూస్తే మనం ఈ స్థితిని ఇండోనేషియాకు, చివరకు చైనాకు కూడా వదులు కోవలసి రావచ్చు. ఏ రకంగా చూసినా మన ప్రస్తుత ఉపాధి రికార్డు మెరుగు పడే అవకాశం లేదనిపిస్తోంది. ప్రత్యేకించి ఎగుమతుల విష యంలో ఇటీవలి పతనం కొనసాగినట్లయితే, మన విదేశీ ద్రవ్య స్థితి 2023 లోనూ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. నాలుగు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరుగు తుండటం, ఇప్పటినుంచి 16 నెలల లోపు సార్వత్రిక ఎన్నికలు జరుగ నున్న నేపథ్యంలో ఈ కాలం పొడవునా రాజకీయ ప్రచారం చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అడుగంటిపోతున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తన ఆధిక్యతను మరింతగా పెంచుకోవచ్చు. ప్రపంచంలో అత్యధిక స్థాయిలో భౌగోళిక రాజకీయ చిక్కుముళ్లు ఉంటున్నందున, 2023 నవంబర్‌లో ముగిసే జీ–20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం భారత ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ప్రత్యేకించి జీ–20 కూటమిలోని అభివృద్ధి చెందుతున్న సభ్యదేశాలకు సంబంధించినంతవరకూ ప్రపంచ ఆర్థిక సమస్యల్లో కొంత స్పష్టమైన పురోగతి సాధిస్తే దానికి ఎంతో ప్రాధా న్యత ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే, 2022 కంటే 2023 ప్రపంచానికి మరింత చెత్త సంవత్సరంగా ఉండబోతోంది. వ్యాసకర్త భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
Recession In India 2022: భారత్‌లో మాంద్యానికి ఆస్కారమే లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకోనుందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో అటువంటి పరిస్థితేమీ రాబోదని నీతి ఆయోగ్ మాజీ వైస్–చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడినా .. దేశీయంగా మాంద్యం తలెత్తబోదని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో వృద్ధి రేటు 6–7 శాతం స్థాయిలో ఉంటుందని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా, యూరప్, జపాన్‌తో పాటు చైనా తదితర దేశాల్లో ఏకకాలంలో మందగమనం కనిపిస్తోందని, దీనితో రాబోయే నెలల్లో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో కుమార్ చెప్పారు. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం మరికొంత కాలం పాటు 6–7 శాతం స్థాయిలోనే ఉండవచ్చని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని, అలా కాకపోతే దేశీయ సానుకూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం దిగి రాగలదని కుమార్ చెప్పారు. ఎగుమతులపై దృష్టి పెట్టాలి.. వాణిజ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులను పెంచుకోవడానికి తగిన విధానాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కుమార్ చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉన్నప్పుడు దేశం మొత్తానికి ఒకే ఎగుమతుల విధానం అమలుపర్చడం సరికాదన్నారు. సముద్ర తీరమే లేని పంజాబ్‌కు, శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యం చేస్తున్న తీర ప్రాంత రాష్ట్రం తమిళనాడుకు ఒకే తరహా ఎగుమతుల విధానాలు పని చేయవని కుమార్ చెప్పారు. -
17 నుంచి డబ్ల్యూఈఎఫ్ వర్చువల్ సదస్సు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఐదు రోజుల వర్చువల్ సమావేశం 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజే ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ వృద్ధి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్త దేశాల నాయకులు ప్రసంగించనున్నారు. సమావేశం డిజిటల్‌గా జరగడం ఇది వరుసగా రెండవసారి. కోవిడ్–19, సాంకేతిక సహకారం, అంతర్జాతాయ సామాజిక సహకారం, వ్యాక్సిన్ విస్తృతి, ఇంధన బదలాయింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వాణిజ్యంలో విశ్వాసాన్ని పాదుగొల్పడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్, భవిష్యత్ సవాళ్లకు సంసిద్ధత వంటి అంశాలు ఐదు రోజుల సమావేశ అజెండాలో ప్రధాన అంశాలు కానున్నాయి. భౌతిక సమావేశం వేసవికి వాయిదా... కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక భౌతిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్‌లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్ లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు స్వయంగా పాల్గొనాల్సి ఉంది. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములు అవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో 2022 భౌతిక సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. -
2022లో 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకొనున్న ప్రపంచ ఎకానమీ..!
ప్రపంచ ఎకానమీ మొదటిసారిగా వచ్చే ఏడాది 2022లో 100 ట్రిలియన్ డాలర్లను మించిపోనుంది. ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భావించిన చైనా ఆశలు అది ఆశలు అయ్యాయి. వచ్చే ఏడాది కూడా ఆర్థిక వ్యవస్థ పరంగా యునైటెడ్ స్టేట్స్(యుఎస్) ఆఫ్ అమెరికానే మొదటి స్థానంలో నిలవనుంది. ప్రపంచంలో నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారడానికి చైనాకు కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఒక నివేదిక వెల్లడించింది. బ్రిటిష్ కన్సల్టెన్సీ సెబ్ర్ చైనా 2030లో డాలర్ పరంగా ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఫ్రాన్స్‌ను వచ్చే ఏడాదిలోనూ, 2023లో యుకెను భారతదేశం అధిగమించనున్నట్లు సెబ్ర్(CEBR) నివేదిక తెలిపింది. "2020 తర్వాత ప్రపంచాన్ని ప్రస్తుతం వేదిస్తున్న ప్రధాన సమస్య ద్రవ్యోల్పణం. అది ఇప్పుడు అమెరికాలో 6.8% కు చేరుకుంది" అని సెబ్ర్ డిప్యూటీ చైర్మన్ డగ్లస్ మెక్ విలియమ్స్ అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2023 లేదా 2024లో ఆర్థిక మాంద్యం తప్పదు అని అన్నారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ను జర్మనీ 2033లో అధిగమించే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రష్యా 2034 నాటికి టాప్ 10 జాబితాలో చేరే అవకాశం ఉంది ఈ నివేదిక తెలిపింది. (చదవండి: 2021లో తెగ వెతికిన టాప్-5 ఎస్యువీ కార్లు ఇవే..!) -
నవ ప్రపంచ ఆవిర్భావానికి ఇది సరైన సమయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టమవుతోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. దేశాల మధ్య పూర్తి సమన్వయంతో కూడిన కొత్త ప్రపంచ ఆవిర్భావానికి ఇది సరైన సమయమని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్ ఎటువంటి అవరోధాలూ లేకుండా ప్రతిదేశానికి అందుబాటులో ఉండే వాతావరణం ఉంటేనే నవ ప్రపంచం ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన విశ్లేషించారు. ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. (చదవండి: యువత మెచ్చే ఖరీదైన కలల బైక్స్!) ప్రపంచ దేశాల ప్రజలకు సరళీకృత, బహుళవిధ సేవలు అందుబాటుకు భావసారూప్యత కలిగిన దేశాలతో కొత్త సంకీర్ణం ఒకటి ఏర్పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రస్తుత బహుళజాతి సంస్థలను మరింత పటిష్టం చేసే చర్యలను చేపట్టాలి. ప్రపంచ యుద్ధాల అనంతర పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం కొంత పెరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమన్వయ, పారదర్శకత లోపించిన పరిస్థితి ఉంది. ఆయా లొసుగులను సరిదిద్దడానికి ప్రపంచ దేశాల నాయకులు అందరూ కలసికట్టుగా సమన్వయ, సహకార చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రపంచ వ్యవస్థ ఆవిర్భవంలో ఇది ఎంతో కీలకం. ప్రపంచ యుద్ధాల అనంతరం అంతర్జాతీయ వ్యవస్థ మార్పులో ప్రభుత్వాలు ఎంతో చేశాయి. అయితే కార్పొరేట్ రంగం నుంచి ఈ విషయంలో అంత సహకారం అందలేదు. దేశాల మధ్య సమన్వయం, సహకారం సాధనలో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి బహుళజాతి సంస్థలు సాధించిందిసైతం అంతంతమాత్రమే. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్లను కూడా ఇప్పుడు పటిష్టం చేయాల్సి ఉంది. ఆయా బహుళజాతి సంస్థల ద్వారానే దేశాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయా సంస్థలే మనముందు ఉన్న ఏకైక మార్గం. ప్రస్తుతం ప్రపంచం పరివర్తనకు సంబంధించిన క్లిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో మనకు అతి చురుకైన, సున్నితమైన ప్రపంచ సంస్థలు అవసరం. క్రియాశీలత విషయంలో ఆయా సంస్థలు జడత్వం బాటను అనుసరించకూడదు. ఎంత క్లిష్టతరమైన సమస్యపైనైనా ప్రతిస్పందించి, తగిన చర్యలు తీసుకోగలిగిన స్థాయిలో బహుళజాతి సంస్థలు ఉండాలి. భారత్‌కు సంబంధించి మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు (20.1 శాతం వృద్ధి) వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను (ప్రస్తుతం 10– 8 శాతం శ్రేణిలో అంచనా) పలు రేటింగ్, విశ్లేషణ సంస్థలు ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది. -
ఎగుమతులకు ‘గ్లోబల్’ దన్ను!
న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ పటిష్టత, పెరిగిన గ్లోబల్ ఆర్డర్స్ నేపథ్యంలో భారత్ నుంచి ఆగస్టులో ఎగుమతులు 45 శాతం ఎగశాయి. విలువలో 33.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ 22.83 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 47.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతి–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.87 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో పోలి్చతే (8.2 బిలియన్ డాలర్లు) వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు గురువారం తొలి అంచనాలను వెలువరించింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య..: ఈ ఏడాది (2021–22) తొలి 5 నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) భారత్ నుంచి జరిగిన ఎగుమతుల విలువ 163.67 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే (98.05 బిలియన్ డాలర్లు) ఈ పరిమాణం 67% పెరిగింది. ఇక ఇదే కాలంలో దిగుమతుల విలువ 82% పెరిగి 219.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ కాలంలో 56 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను భారత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కోవిడ్–19 ముందస్తు 2019 ఆగస్టులో పోల్చి చూసినా ఎగుమతులు 27.5 శాతం పెరగడం సానుకూల అంశం. ► ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు ఉత్పత్తుల ఎగుమతుల ఆదాయం పెరిగింది. ► ప్రస్తుత సమీమీక్షా నెలలో బంగారం దిగుమతుల విలువ 82.2 శాతం పెరిగి 6.7 బిలియన్ డాలర్లకు చేరింది. ► పెట్రోలియం క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు 11.63 బిలియన్ డాలర్లు. -
పొదుపు.. కొత్త మలుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే డ్వాక్రా మహిళల పొదుపు బిలియన్ డాలర్లను దాటేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బిలియన్ డాలర్లకు ప్రత్యేక స్థానం ఉంది. బిలియన్ డాలర్ల మూల ధన నిధి.. అంటే ప్రస్తుత ధరల ప్రకారం రూ.7,324 కోట్లు. ఈ మేరకు మూల ధన నిధి ఉండే కంపెనీలకు వ్యాపార రంగంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న మొత్తం ప్రస్తుతం రూ.8,706 కోట్లకు చేరింది. సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు ప్రతి నెలా వంద రూపాయల చొప్పున తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలన్న నిబంధన ఉంది. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థ మొదలైన కొత్తలో రోజుకు ఒక రూపాయి చొప్పున నెలకు రూ.30 పొదుపు చేసుకునేవారు. క్రమంగా ఆ మొత్తం రూ.వందకు పెరిగింది. సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంతమంది ప్రతి నెలా సమావేశమై, తమ స్థితిగతులను చర్చించుకుంటారు. అందరి సభ్యుల పొదుపును పోగు చేసి, సంఘం పేరిట బ్యాంకులో పొదుపు ఖాతాల్లో జమ చేసుకుంటారు. ఈ మొత్తానికి తోడు సంఘ సభ్యుల రుణ చెల్లింపుల రికార్డు ఆధారంగా బ్యాంకులు ఆయా సంఘాలకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేస్తుంటాయి. గత ప్రభుత్వ తీరుతో డీలా ఒక్క ఏప్రిల్ నెలలోనే మహిళలు రూ.81.76 కోట్ల మొత్తాన్ని పొదుపు చేసుకున్నారు. గత రెండేళ్లుగా ప్రతి నెలా రూ.70 కోట్లకు తగ్గకుండా పొదుపు చేసుకుంటున్నారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 జూన్ తర్వాత నుంచి 2016 మార్చి మధ్య చాలా నెలల పాటు గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా రూ.7 లక్షల చొప్పున మాత్రమే పొదుపు చేసుకునే పరిస్థితి ఉండేది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలొకి వచ్చాక హామీని గాలికి వదిలేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు పొదుపు పట్ల ఆసక్తి చూపలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను అమలు చేయడంతో వారు కార్యకలాపాల్లో తిరిగి చురుగ్గా పాల్గొంటున్నారు. పొదుపు డబ్బును వినియోగించుకోవచ్చు.. పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా దాచుకున్న డబ్బు ఇప్పటి వరకు బ్యాంకులో పొదుపు ఖాతాల్లో నిరుపయోగంగా ఉంటున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. వారు దాచుకున్న డబ్బు రూ.8,706 కోట్లు ఉన్నా, వారు ఆ డబ్బును అలానే తక్కువ వడ్డీ వచ్చే పొదుపు ఖాతాలో ఉంచి, అధిక వడ్డీకి ఆవే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. వారి పొదుపు డబ్బుకు 4 శాతం వడ్డీ వస్తుండగా, వారు బ్యాంకుల నుంచి 10 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి మహిళలు తమ పొదుపు సంఘంలో దాచుకున్న మొత్తాన్ని మొదట సంఘంలో డబ్బు అవసరం ఉన్న మహిళలకు అప్పుగా ఇచ్చిన తర్వాతే ఇతరులకు అవసరం మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా సెర్ప్ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. బ్యాంకులు కూడా పొదుపు సంఘాలలో డబ్బులను ష్యూరిటీగా ఉంచుకొని ఆయా సంఘాలకు కావాల్సిన మొత్తం రుణం ఇవ్వడం పరిపాటిగా కొనసాగుతోంది. కాగా, రుణ పంపిణీకి ఇబ్బంది లేకుండా పొదుపు సంఘాల మహిళలు తమ పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాలను తొలత తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఎస్బీఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, డీసీసీబీ బ్యాంకులు ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాలు ప్రస్తుతం వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.28 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు సంఘాలు దాచుకున్న రూ.8,706 కోట్లను వారి అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించడం ద్వారా మహిళలు బ్యాంకు రుణాలపై ఆధార పడే పరిస్థితి తగ్గుతుంది. ఆయా సంఘాల మూల ధన నిధి మరింత పెరిగే అవకాశం ఉంది. -
2021లో భారత్ వృద్ధి 12.5 శాతం!
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2021లో భారీగా 12.5 శాతం పురోగమిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇదే జరిగితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ తిరిగి సాధించగలుగుతుంది. కాగా 2022లో భారత్ వృద్ధి 6.9 శాతంగా ఉంటుందని పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి సవాళ్లలోనూ 2020లో వృద్ధి సాధించిన పెద్ద ఎకానమీగా చైనా నిలబడిన సంగతి తెలిసిందే. 2020లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం క్షీణించగా, చైనా 2.3 శాతం వృద్ధి సాధించింది. 2021లో ఆ దేశం 8.6%, 2022లో 5.6 శాతం పురోగతి సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్‌తో కలిసి త్వరలో వార్షిక ‘స్పింగ్’ సమావేశాలు నిర్వహించనున్న బహుళజాతి బ్యాకింగ్ దిగ్గజం– ఐఎంఎఫ్ తాజాగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గత అంచనాలను ఐఎంఎఫ్ మెరుగుపరచింది. 2020లో 3.3 శాతం క్షీణించిన గ్లోబల్ ఎకానమీ.. 2021, 2022లో వరుసగా 6 శాతం, 4.4 శాతం పురోగమిస్తుందని అంచనావేసింది. 2020 అక్టోబర్ నివేదికతో పోల్చితే 2020కి సంబందించి క్షీణత అవుట్‌లుక్ 1.1 శాతం మెరుగుపరచింది. 2020 చివరి ఆరు నెలల్లో పలు దేశాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు సడలించడం దీనికి కారణమని తాజా అవుట్‌లుక్ వివరించింది. లాక్డౌన్ ఆంక్షలు తగ్గడం వల్ల ఆర్థికరంగం క్రియాశీలత అంచనాలకు మించి మెరుగుపడిందని తెలిపింది. దీనికి అనుగుణంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను 2021, 2022ల్లో వరుసగా గతంకన్నా 0.8 శాతం, 0.2 శాతం మెరుగుపడినట్లు వివరించింది. చదవండి: (అదానీ గ్రూప్ సరికొత్త రికార్డ్) ఆరోగ్యరంగంపై భారీ వ్యయాలు అవుట్‌లుక్‌లోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. పర్యాటక రంగమూ మెరుగుపడలేదు. ప్రస్తుతం ఆరోగ్య రంగంపై అధిక వ్యయాలు చేయాలి. హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి. కోవిడ్–19 ప్రభావానికి గురైన కుటుంబాలు అలాగే సంస్థలకు ద్రవ్యపరమైన మద్దతు అవసరం. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న దేశాల్లో సరళతర ద్రవ్య విధానాలను కొనసాగించాలి. ప్రతి దేశం ఫైనాన్షియల్ స్థిరత్వానికి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. సంక్షోభం ఒక్కసారి ముగిసిన వెంటనే, రికవరీ వేగవంతం, ఉత్పత్తి పెంపుసహా ఆర్థిక వ్యవస్థల పటిష్ట పునర్నిర్మాణానికి తగిన ముందస్తు చర్యలను, వ్యూహాలను ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. పర్యావరణ అనుకూలమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వాతావరణ మార్పుల ప్రతికూలతలను తద్వారా నివారించుకోవచ్చు. ఉత్పాదక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను పెంచాలి. అసమానతలను తగ్గించడానికి సామాజిక సహాయ సహకారాలను పటిష్టం చేసుకోవాలి. సవాళ్లు పొంచి ఉన్నాయ్.. అటు అంతర్జాతీయంగా, ఇటు వివిధ దేశాల్లో అంతర్గతంగా రికవరీ వేగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో ఈ అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. ఇంకా మనం వైరస్‌ను ఓడించలేదన్న విషయాన్ని గమనించాలి. పైగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంక్షోభం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లే ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే తాజా అవుట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. – గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ నెల లాక్‌డౌన్‌తో జీడీపీ నష్టం 2 శాతం: బీఓఎఫ్ఏ భారత్ ఎకానమీ రికవరీ ఇంకా విస్తృత ప్రాతిపదికన పటిష్టంగా లేదని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ మంగళవారం హెచ్చరించింది. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీ 1 నుంచి 2 శాతం వరకూ పతనం అవుతుందని అంచనావేసింది. పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను తిరిగి ప్రకటించనప్పటికీ, రాత్రి పూట కర్ఫ్యూలు, స్థానిక లాక్డౌన్ విధింపు ద్వారా కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది కూడా ఎకానమీపై ప్రతికూలత చూపే అంశమేనని తెలిపింది. 2021–22లో భారత్ ఎకానమీ 9% వృద్ధి రేటును నమోదుచేసుకోవచ్చని అంచనావేసిన సంస్థ, దీనికి ప్రధాన కారణాల్లో బేస్ ఎఫెక్ట్ (2020–21లో అతి తక్కువ ఎకానమీ గణాంకాలు) ఒకటని తెలిపింది. సెకండ్‌వేవ్‌తో జీడీపీ నష్టం 0.3 శాతమే: యూబీఎస్ కోవిడ్–19 కేసులు ఫిబ్రవరి నుంచీ తిరిగి పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రాల వ్యాప్తంగా కఠిన లాక్డౌన్ విధింపు మరోసారి ఉండబోదన్న అభిప్రాయాన్ని స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్ సెకండ్‌వేవ్ సమస్య ఉన్నప్పటికీ, దీని ప్రతికూల ప్రభావం ఎకానమీపై 20 నుంచి 30 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర మాత్రమే ఉంటుందని యూబీఎస్ విశ్లేషించింది. 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 11.5 శాతం పురోగమిస్తుందన్న తమ సంస్థ అభిప్రాయంలో మార్పులేదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా జైన్ మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్య పరపతి విధానం దాదాపు యథాతథంగా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే రివర్స్ రెపో రేటు 25–40 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తన్వీ అభిప్రాయపడ్డారు. -
ప్రపంచ ఎకానమీ రికవరీపై ఒపెక్ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మున్ముందు రికవరీ బాటన పయనిస్తుందని చమురు ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్) అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తి పెంపునకు తన మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మే నుంచి జూలై వరకూ మొత్తంగా రోజుకు 2 మిలియన్ బ్యారళ్లకుపైగా అదనపు ఉత్పత్తి జరగనుంది. దీని ప్రకారం ఉత్పత్తి మే నెల్లో రోజుకు 3,50,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. జూన్ నెల్లో అదనపు ఉత్పత్తి కూడా ఇదే స్థాయిలో రోజుకు 3,50,000 బ్యారళ్లు జరుగుతుంది. జూలైలో రోజుకు 4,00,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి అవుతుంది. దీనికితోడు సౌదీ అరేబియా రోజుకు అదనంగా ఒక మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి జరపనుంది. మార్చిలో ఒపెక్ తన ఉత్పత్తిని రోజుకు 3,00,000 బ్యారళ్ల మేర అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో రోజుకు సగటు ఉత్పత్తి 25.33 మిలియన్ బ్యారళ్లకు చేరింది. (ఐటీ కంపెనీల తాజా సవాల్ ఏంటంటే?) గత మార్చి సమా వేశం తరహాలోనే సరఫరాల విషయంలో ఒపెక్ జాగరూకతతో వ్యవహరించింది. ఉత్పత్తి లక్ష్యా లను భారీగా పెంచకపోవడం వల్ల స్వల్ప కాల వ్యవధిలో ధరల స్థిరీకరణ జరగవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థల రికవరీ బాగుంటుందని, ఈ నేపథ్యంలో క్రూడ్ డిమాండ్ భారీగా పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతి, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల ఉద్దీపన చర్యలు గ్లోబల్ ఎకానమీ వృద్ధికి బాటలువేస్తాయని ఒపెక్ దేశాలు అంచనా వేస్తున్నాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రిఫైనరీలు భారీగా క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన విషయాన్ని సంబంధిత వర్గాలు ప్రస్తావించాయి. -
క్రూడ్ క్రాష్..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర పాతాళానికి పడిపోయింది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో లైట్ స్వీట్ క్రూడ్(డబ్లూటీఐ) బేరల్ మే నెల కాంట్రాక్ట్ ధర సోమవారం ఒకానొక దశలో కుప్పకూలి... మైనస్ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది. చరిత్రలో క్రూడ్ ధర ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడడం ఇదే మొదటి సారి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో తమ నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే. నిల్వలు భారీగా పేరుకుపోతున్న ధోరణి, కనుచూపుమేర కనిపించని ఆర్థిక రికవరీ నేపథ్యంలో మళ్లీ ముడిచమురు ధరలు ఎప్పుడు పుంజుకుంటాయోనని ఉత్పత్తిదారులు గగ్గోలు పెడుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల నుంచి కరోనా, ప్రైస్‌వార్ వరకూ... నిజానికి 2020 తొలి నాలుగు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసింది. 2020 జనవరిలో అమెరికా దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, దీనితో భౌగోళిక ఉద్రిక్త పరిణామాలతో క్రూడ్ ధర ఒక్కసారిగా ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, తర్వాత కరోనా ప్రభావంతో రష్యా–సౌదీ అరేబియాల మధ్య చోటుచేసుకున్న ఈ ‘ధరల యుద్ధం’తో క్రూడ్ ధర పతనమవుతూ వచ్చింది. ఫలించని ఒపెక్ ఒప్పందాలు.. క్రూడ్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు కుదిరిన ఒక డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలపై నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాయి. ఆయా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే, డిమాండ్ పెంచేందుకు ఒపెక్, అమెరికాలు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని కేవలం 10 రోజులకే స్పష్టమైపోయింది. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయిన పరిస్థితి నెలకొనడం ఇక్కడ ఒక కారణమైతే, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని విశ్లేషణ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి అమెరికాలోని ఒక్లహోమాలో క్రూడ్ నిల్వల హబ్‌లో నిల్వల పరిస్థితి దాదాపు దాని పూర్తి సామర్థ్యానికి చేరుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వర్కింగ్ స్టోరేజ్ సామర్థ్యం 76 మిలియన్ బేరళ్లయితే, 55 మిలియన్ బేరళ్లకు ఈ స్టోరేజ్‌కి చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే, కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్‌ను తీసుకువెళ్లాలని తమ కస్టమర్లపై చమురు ఉత్పత్తిదారులు ఒత్తిడి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుందన్నది విశ్లేషణ. అంతేకాదు అవసరమైతే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇచ్చిమరీ నిల్వలు తగ్గించుకోవాల్సి రావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఎలియట్‌వేవ్ సిద్ధాంతం ప్రకారం వచ్చే దశాబ్దంలో ఎప్పడోకప్పుడు ముడిచమురు ధర 4–10 డాలర్ల స్థాయికి పడిపోవచ్చు. మళ్లీ ఆల్‌టైమ్ గరిష్టాన్ని (147.67 డాలర్లు) చూడాలంటే చాలా ఏళ్లే పడుతుంది. – 2009లో ఎలియట్‌వేవ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు రాబర్ట్ ప్రెషెర్ అంచనా 1999 జనవరిలో క్రూడ్ కనిష్ట స్థాయి: 11.72 డాలర్లు 2008 జూన్ క్రూడ్ ఆల్‌టైమ్ గరిష్టం: 147.67 డాలర్లు 2020 ఏప్రిల్ 20న క్రూడ్ కనిష్ట స్థాయి: మైనస్ 28 డాలర్లు -
కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కోవిడ్-19 సృష్టించిన విలయానికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపూర్వమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నందున ఈ ముప్పు ఏర్పడనుందని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవాలంటే 2.5 ట్రిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్సిటిఎడి) కాన్ఫరెన్స్ అంచనావేసింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్-19 షాక్’ పేరుతో ఒక నివేదికను సంస్థ విడుదల చేసింది. ఎక్కువగా వినియోగ వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే వచ్చే రెండేండ్లలో రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపింది. అంతేకాదు అనేక అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభం ముదరనుందని తెలిపింది. ఆరోగ్యం సంక్షోభం వస్తే, ఈ దేశాలు మరింత ఆర్థిక కష్టాల్లో కూరకుపోతాయని అంచనావేసింది. ఆర్థిక ఆరోగ్య సంక్షోభం కలయిక చాలా దుర్మార్గంగా వుంటుందని వ్యాఖ్యానించింది. కాబట్టి ఆ దేశాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, సేవలను బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని పేర్కొంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చితే, మహమ్మారి కరోనా ఆర్ధిక షాక్ అభివృద్ధి చెందుతున్న దేశాలను భారీగా తాకనుందని యుఎన్సిటిఎడి తెలిపింది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లలో ప్రపంచ ఆదాయాన్ని కోల్పోతుందని తెలిపింది. చైనా, భారతదేశం మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుందని పేర్కొంది. కొనసాగుతున్న ఆర్ధిక పతనాన్ని ఊ హించడం చాలా కష్టం, కానీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడకముందే పరిస్థితులు మరింత దిగజారిపోతాయనేస్పష్టమైన సూచనలు ఉన్నాయని యుఎన్సిటిఎడి సెక్రటరీ జనరల్ ముఖిసా కిటుయ్ చెప్పారు. ఈ సంవత్సరం దూసుకుపోతున్న ఆర్థిక సునామీ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2-3 ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని కేటాయించాలన్నారు. అలాగేమాంద్యాన్ని నివారించేందుకు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు చైనా కూడా తమ ఆర్థిక వ్యవస్థల్లోకి భారీ ఎత్తున నిధులను కుమ్మరిస్తున్నాయని, జీ 20 కూటమి దేశాలు కూడా ఇటీవలే తమ ఆర్థిక వ్యవస్థల్లోకి 5 ట్రిలియన్ డాటర్లను పంపింగ్ చేయాలని నిర్ణయించినట్లు గుర్తుచేసింది. ఇది అసాధారమైన సంక్షోభానికి అసాధారణమైన ప్రతిస్పందన లాంటిదని పేర్కొంది. ‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో మాంద్యంలోకి జారుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. అయితే ఈ మ్యాంద్యం ప్రభావం ఇండియా, చైనాలపై ఉండకపోవచ్చు అని వెల్లడించింది. నాలుగు పాయింట్ల రికవరీ ప్రణాళిక ఇందుకు నాలుగు పాయింట్లు రికవరీ ప్రణాళికను ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా 2009 కేటాయింపులకు మించిన ఆర్థిక కేటాయింపులు ప్రస్తుతం జరగాలిల. బలహీ ఆర్థికవ్వవస్థలకు ఒక ట్రిలయన్ డాలర్లకు పైగా పెట్టుబడులను అందించాలి. రెండవ చర్యగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ అప్పులో సగం రద్దు చేసిన మాదిరిగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక వ్యవస్థలకు రుణాలను రద్దు చేయాలి. లేదా గణనీయంగా తగ్గించాలి. మూడవ చర్యగా పేద దేశాల్లో అత్యవసర ఆరోగ్య సేవలు, సంబంధిత సామాజిక సహాయ కార్యక్రమాలకుగాను 500 బిలియన్ల పెట్టుబడులను కల్పించాలి. చివరగా, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఇప్పటికే పెరుగుతున్న మూలధన ప్రవాహాన్ని తగ్గించడానికి నియంత్రణలను ఆయా దేశాలు అమలు చేయాలని పిలుపునిచ్చింది. UNCTAD urgently calls for a $2.5 trillion #coronavirus aid package to help developing countries avoid worst-case scenarios and impacts. https://t.co/0ORP07QKkd#COVID19 pic.twitter.com/0B97uMweju — UNCTAD (@UNCTAD) March 30, 2020 -
కోవిడ్ పరిణామాలే నడిపిస్తాయ్..
న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడమా లేదంటే.. మరింత పతనం కావడమా అనే కీలక అంశం ఆధారపడి ఉందని దలాల్ స్ట్రీట్ పండితులు విశ్లేషిస్తున్నారు. వైరస్ భయాలతో.. మార్కెట్లో చురుగ్గా పాల్గొనే ఇన్వెస్టర్లు గత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాల్యూమ్స్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రపంచ ఎకాన మీపై ఈ మహమ్మారి ప్రభావం ఎంత మేర ఉండనుందనే అంశం ఆధారంగానే ఈ వారంలో సూచీలు కోలుకుంటాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. యస్ బ్యాంక్ పరిణామాలు కీలకం గతవారంలో యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత దెబ్బతింది. కరోనా వైరస్ వ్యాప్తికి తోడు బ్యాంక్‌పై ఆంక్షలతో సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టస్థాయికి పడిపోయింది. ఇక ఈ వారంలో కూడా యస్ బ్యాంక్ పరిణామాలు కీలకంకానున్నాయని జిమీత్ మోడీ అన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అరెస్ట్ చేయగా.. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై కనిపించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యస్ బ్యాంక్‌లో కేవలం వాటాను మాత్రమే కొనుగోలు చేశామని, విలీనం ప్రసక్తి ఇప్పటికి లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ తాజా పరిణామాలు, వైరస్ వ్యాప్తి ఆధారంగా ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం క్లిష్టతరమేనని షేర్‌ఖాన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ దువా అన్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. హోలీ సందర్భంగా మంగళవారం (10న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఆర్థికాంశాల ప్రభావం.. జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం డేటా గురువారం వెల్లడికానున్నాయి. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ నెల్లో రూ. 13,157 కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో రూ. 13,157 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–6 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 8,997 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ. 4,160 కోట్లను వెనక్కు తీసుకున్నారు. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని గ్రోవ్ సహ వ్యవస్థాపకులు హర్‡్ష జైన్ విశ్లేషించారు. -
విమానానికీ వైరస్..!
టోక్యో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారుతోన్న కోవిడ్–19(కరోనా) వైరస్.. ప్రత్యేకించి విమానయాన రంగంలోని కంపెనీల మనుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది. పూర్తి ఎకానమీ మాటను అటుంచితే, ఈ రంగంలోని అనేక కంపెనీలు రెక్కలు తెగిన పక్షిలా పడిపోయేంతటి పరిస్థితికి దారితీస్తోంది. ఇంధన భారం, డిమాండ్‌కు మించి పెరిగిన పోటీవాతావరణం వంటి అనేక సమస్యలను నెట్టుకుంటూ ముందుకు సాగుతోన్న విమానయాన కంపెనీలకు ఇప్పుడు ఆక్యుపెన్సీ (ఒక విమానంలోని మొత్తం ప్రయాణికులు) సమస్య సవాలు విసురనుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సునాయాసంగా సోకిపోయే వైరస్ కావడంతో ప్రయాణికులు వీలైనంత తక్కువగా విమానయానం చేసేందుకే చూస్తారు. ప్రజలు ఇళ్లలోనుంచి వీలైనంత తక్కువగా బయటకు రావడం మంచిదని చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనాల ప్రకారం ఈ వైరస్ నిరోధకానికి సంబంధించిన మొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం 18 నెలలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాదిలో విమానయాన రంగం భారీగానే నష్టపోయే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) విశ్లేషించింది. ఆక్యుపెన్సీ తగ్గిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి 29 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. విమాన రద్ధీ 4.7% వరకు తగ్గనుంది. అంటే, 2008 ఆర్థిక సంక్షోభం సమయం తరువాత విమానయాన రంగం ఎదుర్కోనున్న అతిపెద్ద సవాలు ఇదేనన్నమాట. ఆసియా దేశాల్లో అధిక ప్రభావం చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. అక్కడికి సేవలందిస్తున్న ఎయిర్‌లైన్స్‌కు అపార నష్టాన్ని కలిగించనుంది. ఇక చైనాకు సర్వీసులు నడుపుతున్న కంపెనీలదీ ఇదే పరిస్థిదనేది ఐఏటీఏ అంచనా. గతంలో చైనాను అల్లాడించిన సార్స్(ఎస్ఏఆర్ఎస్) అనుభవాన్ని ప్రజలు మరిచిపోక పోవడం.. ప్రస్తుత వైరస్ కూడా ఇటువంటిదే అని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించడం అనేవి విమాన ప్రయాణాలను తగ్గించేవిగా కొనసాగుతున్నాయి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత సమయంలో అనేక సంస్థలు కుప్పకూలిపోయిన మాదిరిగా.. ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో విమానాలు నడుపుతున్న కంపెనీల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంలో పడిపోయింది. బ్రిటిష్ ఎయిర్వేస్, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్తో పాటు అమెరికాకు చెందిన 3 అతిపెద్ద విమానయాన సంస్థలు ఇప్పటికే చైనాకు తమ సర్వీసులను రద్ధు చేసినట్లు ప్రకటించాయి. పరిస్థితి ఆధారంగా మే నెల చివరి వరకు నిలిపివేసే అవకాశం ఉందని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 2020లో అంతర్జాతీయ విమానయాన రంగ ప్రయాణం ప్రతికూలమేనని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ అలెగ్జాండర్ డి జునియక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండనుంద న్నారు. ఈ ప్రాంతంలో విమాన రద్ధీ ఏకంగా 13% వరకు తగ్గనుందని ఐఏటీఏ అంచనావేసింది. -
ఎకానమీపై కరోనా ఎటాక్!
(సాక్షి, బిజినెస్ విభాగం): అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచమంతటికీ తుమ్ములొస్తాయన్నది నానుడి!! అయితే, ఇప్పుడు చైనాకు వచ్చిన ‘కరోనా’ జలుబుకు ప్రపంచదేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. చైనా ‘వూహాన్’ నగరంలో మొదలైన కరోనా వైరస్ ముసలం.. దావానలంలా మరిన్ని దేశాలకు విస్తరిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి చైనాలో 100 మందికిపైగానే మరణించగా... మరో 4,500 మందికి వైరస్ సోకినట్లు అంచనావేస్తున్నారు. అక్కడి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పాతాళానికి పడిపోతున్న తరుణంలో కరోనా రూపంలో మరో ముప్పు ముంచెత్తుతోంది. ప్రపంచ ఎకానమీకి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మరోపక్క, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. అసలు ఈ వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఏంటి లింకు? స్టాక్ మార్కెట్లతో దీనికి సంబంధమేంటి? గతంలో ఇలాంటి వైరస్లు దాడిచేసినప్పుడు ఎంత నష్టం వాటిల్లింది? ఇప్పుడు పరిస్థితేంటి? ఇవన్నీ వివరించే ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది... మొదట్లో ఒక్క చైనాకే పరిమితం అనుకున్న కరోనా వైరస్ ఇప్పుడు దాని సమీపంలోని దేశాలకూ వేగంగా విస్తరిస్తోంది. థాయ్‌లాండ్, వియత్నాం, సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, నేపాల్, జపాన్‌లతో పాటు ఎక్కడో దూరంగా ఉన్న ఫ్రాన్స్, అమెరికా, కెనడా, జర్మనీ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కరోనా సోకిన కేసులు నమోదవడంతో ప్రపంచమంతా బిక్కుబిక్కుమంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చైనాలో ఆరోగ్య ఎమర్జెన్సీకి ఇప్పటికే పిలుపునిచ్చింది. వైరస్ దెబ్బకు చైనాలో అనేక నగరాల్లో రాకపోకలను నిషేధించి తలుపులేసేశారు. స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించేస్తున్నారు. చివరికి స్టాక్ మార్కెట్లకు కూడా సెలవులను పొడిగించేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా చైనాకు రాకపోకలను నిలిపేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులనూ తాత్కాలికంగా ఆపేస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం చూస్తే... 2019లో చైనా వార్షిక స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.1 శాతానికి పడిపోయింది. ఇది 29 ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మరోపక్క, పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.7 శాతానికి, రిటైల్ విక్రయాల వృద్ధి 8 శాతానికి దిగజారింది. కాగా, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రవాణా వ్యవస్థను నిలిపేయడంతో ఫ్యాక్టరీలకు సరఫరాలు ఆగిపోతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకపోవడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. టూరిజం పూర్తిగా దెబ్బతింది. వెరసి ఆర్థిక కార్యకలాపాలు నిస్తేజంగా మారుతున్నాయి. ఇవన్నీ చూస్తే... అక్కడి ఎకానమీ మరింత పతనం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఎకానమీపై ప్రభావం ఎంత... అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా. అంతేకాదు, ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా ప్రధాన వృద్ధి చోధకం కూడా. గ్లోబలైజేషన్‌తో ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో చైనాలాంటి భారీ ఎకానమీల్లో ఏదైనా కుదుపులు వస్తే.. ఆ ప్రకంపనలు కచ్చితంగా అన్నిదేశాలనూ వణికిస్తాయనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే చైనాతో ప్రపంచదేశాలకు వాణిజ్య సంబంధాలు చాలా ఎక్కువ. తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనా, ఇతర దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు తాత్కాలికంగా బ్రేక్ పడటం ఆయా ఎకానమీలకు నష్టం చేకూరుస్తుంది. అంతేకాదు టూరిజం, విమానయానంతో పాటు ఇంకా అనేక వ్యాపార రంగాలు దెబ్బతింటాయి. అయితే, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం వాటిల్లుతుందనే తక్షణం అంచనాకు రాలేమని, వైరస్ వ్యాప్తి మరింత పెరిగితే నష్టం తీవ్రత ఇంకా పెరగడం ఖాయమని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. 2019 ఏడాదికి ప్రపంచ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తాజాగా 2.9%కి తగ్గించింది. అదేవిధంగా 2020 అంచనాను కూడా 6.7% నుంచి 5.9%కి కోతపెట్టింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా ఇటీవలే బ్రేక్ పడటం, ఇరాన్–అమెరికా మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణగడం, జర్మనీ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ముప్పు నుంచి తప్పించుకోవడం వంటి పరిణామాలతో స్టాక్‌మార్కెట్లు తాజాగా ర్యాలీ చేశాయి. ఇలాంటి తరుణంలో కరోనా రూపంలో హఠాత్తుగా మరో ముప్పు ముంచుకొచ్చింది. ఈ వైరస్‌కు త్వరగా పరిష్కారం కనుగొనకపోతే వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. కరోనాకు ఎంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చి, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తారనేదానిపైనే ప్రపంచ ఎకానమీకి తలెత్తే నష్టం ఆధారపడి ఉంటుం దని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే సంఘటనలేవైనా జరిగితే.... తక్షణం స్పందించేది స్టాక్మార్కెట్టే!! కరోనా వైరస్ బయటపడినప్పటినుంచీ చైనా మార్కెట్లు కుప్పకూలుతూనే ఉన్నాయి. అక్కడి ప్రధాన స్టాక్ సూచీ ‘షాంఘై కాంపొజిట్’ 5.5 శాతం మేర పతనమైంది. వాస్తవానికి ఈ నెల 24 నుంచి 30 వరకూ చైనా క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది సెలవులు ప్రకటించడంతో మార్కెట్లు కొంత ఊపిరిపీల్చుకున్నాయి. వైరస్ ముప్పు తీవ్రతతో చైనాలో ఈ సెలవులను ఫిబ్రవరి 2 వరకూ పొడిగించారు. షాంఘై స్టాక్ మార్కెట్ సెలవును ఏకంగా ఫిబ్రవరి 9 వరకూ పొడిగించడం గమనార్హం. వాస్తవానికి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లోని ఫైనాన్షియల్ మార్కెట్లోనే ఎక్కువ ప్రతికూలత ఉంటుంది. అయితే, చైనాలాంటి కీలకమైన, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఈ ఉపద్రవం చోటుచేసుకోవడం, మరణాలు అంతకంతకూ పెరగడం, ఇతర దేశాలకూ వైరస్ విస్తరించడంతో మొత్తం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని... భారత్ సహా ప్రపంచ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. కరోనా ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉండొచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు భారీగా పడిపోయాయి. మరోపక్క, ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనాలైన పుత్తడి, కరెన్సీల(జపాన్ యెన్, అమెరికా డాలర్ వంటివి)లోకి నిధులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం రేటు మళ్లీ పుంజుకుంటోంది. మరోపక్క, ఆర్థిక మందగమనం తీవ్రమైతే డిమాండ్ పడిపోవచ్చన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర మళ్లీ నేలచూపులు చూస్తోంది. ఇటీవలి గరిష్ట స్థాయి(బ్యారెల్‌కు సుమారు 65.65 డాలర్లు) నుంచి ఏకంగా 20 శాతం (13.5 డాలర్లు) కుప్పకూలడం గమనార్హం. అయితే, సార్స్ వైరస్ దాడి సమయంలో కూడా చైనా మార్కెట్లు తీవ్రంగా కుప్పకూలినప్పటికీ.. ఆరు నెలల్లోనే మళ్లీ కోలుకున్న సంగతిని కొంతమంది మార్కెట్ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే, తాజా కరోనా వైరస్‌కు గనుక త్వరలోనే వ్యాక్సిన్ కనుగొని... వ్యాప్తి తగ్గుముఖం పడితే మార్కెట్లపై ప్రభావం స్వల్పకాలికంగానే ఉండొచ్చనేది నిపుణుల అభిప్రాయం. అలాకాకుండా మరిన్ని దేశాలకు ఇది విస్తరించి.. మరణాలు పెరిగితే గ్లోబల్ మార్కెట్లలో పతనం తీవ్రతరం కావొచ్చని వారు పేర్కొంటున్నారు. ఏ రంగాలపై అధిక ప్రభావం... వైరస్ల ముప్పు సమయంలో టూరిజం, ట్రావెల్ రంగాలకు చెందిన హోటళ్లు, ఎయిర్‌లైన్స్ కంపెనీలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రజల వినియోగ వ్యయం తగ్గిపోవడం వల్ల లగ్జరీ, కన్సూమర్ గూడ్స్ రంగాలు కూడా దెబ్బతింటాయి. సహజంగానే ఆయా రంగాల స్టాక్స్ తీవ్ర నష్టాలను చవిచూస్తాయి. సార్స్ ఎటాక్ సమయంలో చైనాలో రిటైల్ అమ్మకాలు తీవ్రంగా పడిపోయిన విషయం గమనార్హం. అయితే, ఫార్మా రంగం మాత్రం ఇలాంటి తరుణంలో ప్రయోజనం పొందుతుంది. వైరస్‌కు తగిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడం, ఔషధాలు, ఇతరత్రా సామగ్రి అమ్మకాలు పెరగడమే కారణం. జపాన్‌కు ‘ఒలింపిక్స్’ గుబులు! కరోనా వైరస్ కల్లోలానికి చైనా కంటే జపాన్‌కే ఎక్కువ భయం పట్టుకుంది. జపాన్ అత్యధికంగా ఎగుమతులు చేసే దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉంది. అంతేకాదు.. జపాన్‌కు వచ్చే మొత్తం పర్యాటకుల్లో 30 శాతం చైనీయులే. అక్కడి పారిశ్రామిక సర్వే ప్రకారం గతేడాది విదేశీ పర్యాటకులు జపాన్‌లో వెచ్చించిన మొత్తంలో 40 శాతం చైనావాళ్లదే కావడం విశేషం. ఇప్పుడు కరోనా కారణంగా పర్యాటకానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. పరిస్థితి మరికొంతకాలం ఇలాగే కొనసాగితే తమ కంపెనీ కార్పొరేట్ కంపెనీల లాభాలతో పాటు పారిశ్రామికోత్పత్తి కూడా దెబ్బతినే అవకాశం ఉందని జపాన్ ఆర్థిక మంత్రి యసుతోషి నిషిమురా హెచ్చరించారు. ఈ ప్రభావంతో జపాన్ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగానే పతనమవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఈ ఏడాది జూలై–ఆగస్టు నెలల్లో జపాన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు కరోనా ప్రభావం ఇంకొన్నాళ్లు కొనసాగి.. వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి రాకపోతే టూరిస్టులు తగ్గిపోయే ప్రమాదం ఉందని జపాన్‌కు దిగులు పట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు అత్యధికంగా చైనా నుంచే టూరిస్టులు వస్తారని జపాన్ అంచనా వేస్తోంది. ఒకవేళ చైనా పర్యాటకుల సంఖ్య తగ్గినట్లయితే జపాన్ జీడీపీ వృద్ధి 0.2% తగ్గొచ్చనేది దైచి లైఫ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ హీడో కుమానో అంచనా. భారత్ సంగతేంటి..? కరోనా ముప్పు భారత్‌నూ వెంటాడుతోంది. చైనాతో మనకు వాణిజ్యం చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. చైనా ఆర్థిక వ్యవస్థగనుక మరింత పతనమైతే డిమాండ్ మందగించి మన ఎగుమతులు పడిపోతాయి. మరీ ముఖ్యంగా ఖనిజాలు, లోహాలు, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతేకాదు చైనా నుంచి మనకు వచ్చే భారీస్థాయి దిగుమతులకూ బ్రేక్ పడితే.. దానిపై ఆధారపడిన పారిశ్రామిక రంగాల్లో ఉత్పాదకత దిగజారుతుంది. 2018–19లో చైనా, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో భారత్ నుంచి ఎగుమతులు 30 శాతం ఎగబాకి 16.7 బిలియన్ డాలర్లకు చేరగా.. చైనా ఎగుమతులు 9 శాతం తగ్గి 70.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(2019–20, క్యూ2) భారత్ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి(4.5 శాతం) పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తి ఏడాది వృద్ధికి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలు కోత పెడుతున్నాయి. తాజాగా ఐఎంఎఫ్ 2019–20 భారత్ జీడీపీ అంచనాలను 6.1 శాతం నుంచి ఏకంగా 4.8 శాతానికి తగ్గించడం గమనార్హం. ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా మందగించి... చైనాతో వాణిజ్యం గనుక దిగజారితే.. భారత్ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్‌లో ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసూ అధికారికంగా నమోదు కాలేదు. ఒకవేళ మనదగ్గర కూడా ఇది వ్యాపించి తీవ్రరూపం దాల్చితే అత్యంత దుర్భర పరిణామాలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. సార్స్, ఎబోలా ఏం చెబుతున్నాయి.. 2002–03లో ప్రపంచాన్ని వణికించిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ కూడా చైనాలోనే వెలుగుచూసింది. దీని ప్రభావంతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర నష్టాన్నే చవిచూశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఈ ప్రభావం భారీగానే పడింది. దాదాపు 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.85 లక్షల కోట్లు) మేర ప్రపంచ ఎకానమీకి ‘సార్స్’తో నష్టం వాటిల్లినట్లు అప్పట్లో లెక్కగట్టారు. 2003 ఏడాది రెండో క్వార్టర్లో ప్రపంచ వృద్ధి రేటుకు ఏకంగా 1 శాతం కోత పడిందని.. దీనికి అధికంగా సార్స్ ప్రభావమే కారణమని లండన్‌కు చెందిన క్యాపిటల్ ఎకనామిక్స్ అనే కన్సల్టెన్నీ ప్రతినిధి జెన్నిఫర్ మెక్‌క్యూన్ పేర్కొన్నారు. అయితే, ఆతర్వాత రికవరీ చాలా వేగంగానే జరిగిందని కూడా ఆమె గుర్తుచేశారు. మరోపక్క, 2014లో ఆఫ్రికా దేశాలను వణికించిన ఎబోలా వైరస్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావాన్ని చూపింది. ఎబోలా దాటికి లైబీరియా, సియెర్రా లియోన్, గినియాల్లో 10 వేల మందికిపైగానే చనిపోయారు. ఈ దేశాల 2015 ఏడాది జీడీపీల్లో 2.2 బిలియన్ డాలర్ల నష్టానికి ఎబోలా కారణమైందని ప్రపంచ బ్యాంక్ లెక్కతేల్చింది. ►2017లో ప్రఖ్యాత ఆర్థికవేత్తలు విక్టోరియా ఫాన్, జీన్ జేమిసన్, లారెన్స్ సమర్స్ విడుదల చేసిన ఒక పరిశోధన పత్రం ప్రకారం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమాదకరమైన వైరస్ల కారణంగా అధిక దేశాలకు అంటువ్యాధులు ప్రబలితే(పాండెమిక్ రిస్క్)... దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వార్షికంగా సుమారు 500 బిలియన్ డాలర్లు (రూ.35.5 లక్షల కోట్లు) నష్టపోవచ్చని అంచనా. ►గ్లోబల్ హెల్త్ రిస్క్ ఫ్రేమ్‌వర్క్‌పై 2016లో ఏర్పాటైన కమిషన్ అధ్యయనం ప్రకారం.. వివిధ దేశాల్లో తలెత్తే అంటువ్యాధుల వల్ల 21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టం 6 ట్రిలియన్ డాలర్లకు పైగానే(ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) ఉండొచ్చని అంచనా. మన కరెన్సీలో చూస్తే నష్టం విలువ రూ.426 లక్షల కోట్ల కింద లెక్క!! యాపిల్‌కూ దెబ్బ... కరోనా.. టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌నూ వెంటాడుతోంది. ఎందుకంటే వైరస్ ఎక్కడైతే మొదలైందో ఆ వుహాన్ నగరంలోనే యాపిల్ ఫోన్ల కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు అతిపెద్ద ప్లాంట్ ఉంది. చైనా కొత్త సంవత్సరం సెలవులపై చుట్టుపక్కల తైవాన్ ఇతరత్రా దేశాలకు వెళ్లిన ప్లాంట్ సిబ్బందిని ఇప్పుడప్పుడే వెనక్కిరావద్దని ఫాక్స్‌కాన్ హెచ్చరించింది. కొద్దిరోజులు ఇక్కడిప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోనుంది. ఇక యాపిల్ ఉత్పత్తుల తయారీపై చైనాలో 50 లక్షల ఉద్యోగులు ఆధారపడ్డారు. యాపిల్‌కు సొంత సిబ్బందే చైనాలో 10 వేల మందికిపైగా ఉన్నారు. అంతేకాదు యాపిల్ ఉత్పత్తుల్లో 90% చైనాలోనే తయారవుతున్న నేపథ్యంలో వైరస్ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించకపోతే ప్లాంట్ల మూసివేతతో తీవ్ర నష్టమే తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోపక్క, ఐఫోన్ అమ్మకాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో రిటైల్ సేల్స్ పడిపోవచ్చని అంటున్నారు. ఇక తమ ప్రజలు చైనాకు వెళ్లే విషయంలో పునరాలోచించుకోవాలంటూ అమెరికా ప్రభుత్వం సహా అనేక కంపెనీలు ట్రావెల్ అలెర్ట్‌ను కూడా ప్రకటించాయి. -
పసిడి... దీర్ఘకాలంలో పటిష్టమే!
ప్రస్తుతానికి కొంత బలహీనంగా కనబడుతున్నా... దీర్ఘకాలంలో పసిడి ధర పటిష్టంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. గడిచిన 52 వారాల్లో పసిడి ధర ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో 1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగి నెలన్నర క్రితం 1,566 డాలర్లను తాకింది. అటు తర్వాత ప్రస్తుతం 100 డాలర్ల దిగువన 1,466 డాలర్లు–1,456 డాలర్ల శ్రేణిలో ట్రేడవుతోంది. 22వ తేదీతో ముగిసిన వారంలో 1,470 డాలర్ల వద్ద ముగిసింది. వారంవారీగా దాదాపు 15 డాలర్లు పెరిగింది. అయితే ప్రస్తుత శ్రేణి పసిడికి పటిష్టమైనదన్నది నిపుణుల విశ్లేషణ. లాభాల స్వీకరణే...: తాజా దిద్దుబాటు భారీగా పెరిగిన ధర నుంచి లాభాల స్వీకరణే తప్ప, పసిడి బులిష్ ధోరణిని కోల్పోలేదన్నది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. ఈ స్థాయి నుంచి ఏ మేరకు పతనమైనా అది కొనుగోళ్లకు అవకాశమే తప్ప, ఏడాది కనిష్ట స్థాయిలను ఇప్పట్లో పసిడి చూసే అవకాశం లేదన్నది ఈ విభాగంలో నిపుణుల అభిప్రాయం. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం సమసిపోతున్నట్లు వార్తలు వస్తున్నా... అది వాస్తవ రూపం దాల్చడంపై ఇప్పటికీ పలు సందేహాలు ఉన్నాయి. ఇక హాంకాంగ్ ఉద్రిక్తతలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం. ఇవన్నీ దీర్ఘకాలంలో పసిడి మరోసారి 1,566 డాలర్ల స్థాయికి చేరడానికి వీలు కల్పించే అంశాలేనన్నది అంచనా. అయితే ప్రస్తుత శ్రేణి మద్దతు కోల్పోతే, సమీప రోజుల్లో 1,425 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. సీజనల్‌వారీగా ఈ కాలంలో పసిడి ధర కొంత తగ్గుతుండడమే దీనికి నేపథ్యం. ‘‘దీర్ఘకాలంలో పసిడి పటిష్టంగానే ఉంటుందన్నది మా అభిప్రాయం. పసిడిని కొనడానికి ఇన్వెస్టర్లు సిద్ధంగానే ఉన్నారని మాకు సమాచారం ఉంది. అయితే స్వల్పకాలికంగా అమెరికా–చైనా చర్చలపై వారు దృష్టి సారించారు. పసిడి 1,450 డాలర్ల వైపు కదిలితే అది కొనుగోళ్లకు చక్కటి అవకాశం. 2020లో సగటున ధర 1536 డాలర్లుగా ఉంటుందన్నది మా అంచనా’’ అని స్టాండెర్డ్ చార్టర్డ్ ప్రీసియస్ మెటల్స్ విశ్లేషకులు– సుకీ కూపర్ తెలిపారు. -
వాణిజ్య ఉద్రిక్తతలు... ప్రపంచ ఆర్థికానికి ముప్పు
ఫుకోవా (జపాన్): వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్‌తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు పరిష్కారం కావాల్సిన అవసరాన్ని బలంగా చెప్పింది. జపాన్ పోర్ట్ పట్టణం ఫుకోవాలో రెండు రోజుల పాటు జరిగిన జీ20 దేశాల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో అన్ని దేశాలు ఒక్కతాటిపై నిలవగా, అమెరికా మాత్రం వేరుగా వ్యవహరించింది. ప్రతీ ఒక్కరు వాణిజ్య ఉద్రిక్తతలు ఆర్థిక వృద్ధికి ముప్పుగా అభిప్రాయపడినట్టు, అమెరికా యంత్రాంగంలో ఈ తరహా భావన లేదని ఈయూ ఆర్థిక, మానిటరీ వ్యవహారాల కమిషనర్ పీరే మోస్కోవిసి తెలిపారు. -
‘టాటా’ అంతా ఒక్కటే
న్యూఢిల్లీ: సులభత్వం, సమష్టితత్వం, పరిమాణం ఈ మూడింటిపై దృష్టి పెట్టాలని టాటా గ్రూపు ఉద్యోగులను టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కోరారు. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఆర్థిక రంగం 4 శాతం మేర వృద్ధి చెందుతుందన్న అంచనాల నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సూచన చేశారు. ఈ మేరకు గ్రూపు పరిధిలోని 6.45 లక్షల మంది ఉద్యోగులకు నూతన సంవత్సర సందేశం పంపారు. ‘‘అంతర్జాతీయంగా లోతైన పరివర్తనకు ఇది సమయం. ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలతోపాటు అనిశ్చిత భావన నెలకొని ఉంది. నేను ఎంతో ఆశాభావంతో ఉన్నా. ప్రపంచ ఆర్థిక రంగం వార్షికంగా 2018లో 4 శాతం మేర వృద్ధి చెందనుంది. 2011 తర్వాత వేగవంతమైన నడక ఇది. ఈ దిశలో ప్రపంచ విస్తరణ అంతా అభివృద్ధి చెందిన దేశాల వైపు ముఖ్యంగా భారత్ వైపు సాగిపోనుంది’’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా గ్రూపు వ్యాపారాలకు భవిష్యత్తు అవకాశాల విషయంలో ఇంతకుముందటి కంటే తాను ఎంతో నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. భారత వృద్ధి ప్రయాణంలో టాటా గ్రూపు మూలస్తంభంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రూపు కంపెనీల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తూ ‘టాటా ఒక్కటే’ అన్న ఆలోచనను ఆవిష్కరించారు. ‘‘టాటా ఒక్కటే అన్నది నా మనసులో ఉంది. ఈ విధమైన ఆలోచన ప్రతి అవకాశాన్ని అందుకునేందుకు గ్రూపును ఏకతాటిపైకి తీసుకొస్తుంది’’ అని పేర్కొన్నారు. అవకాశాలను సొంతం చేసుకునేందుకు గ్రూపు కంపెనీలు, అసోసియేట్స్ మధ్య సహకారం మెరుగుపడాలని సూచించారు. -
చైనాతో ముప్పు ఉంది.. జర జాగ్రత్త!
ముంబై : చైనా చూపిస్తున్న నెమ్మదస్తు ఆర్థికవ్యవస్థ గణాంకాలపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆరోపణలు చేశారు. గ్లోబల్ ఎకనామీకి ఇది ముప్పువాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. భారత్ లాంటి ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ ముప్పు నుంచి తట్టుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చైనా పక్కన ఉన్న దేశాలకు మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్(గ్లోబల్ ఫైనాన్సియల్ సిస్టమ్ లో రుణాన్ని కల్పించడం) నుంచి తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు.. దక్షిణ ప్రాంతీయ సహకార ఆసియా అసోసియేషన్ గ్రూపింగ్(సార్క్) సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సదస్సులో రాజన్ ప్రసంగించారు. భారత ఆర్థిక క్యాపిటల్ ను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ.. ఆయన చైనా ఆర్థికవ్యవస్థ చూపించే గణాంకాల ప్రభావం ఇతర ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్ లో మొండిబకాయిల బెడద పెరగడం, మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్ లో తీవ్రమైన బలహీనతలు సార్క్ ఆర్థికవ్యవస్థల్లో మందగమనం నెలకొనేలా చేస్తాయన్నారు. చైనా ఆర్థికాభివృద్ధి కేవలం పాలసీల మీదే ఆధారపడి లేదని, ప్రపంచ వృద్ధిపైనా కూడా ఆధారపడి ఉందని పేర్కొన్నారు. -
భారత్-యూకే సంబంధాల్లో కొత్త శకం
న్యూఢిల్లీ: ‘యూకే పర్యటన.. భారత-ఇంగ్లాండ్ సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలకనుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో వాణిజ్య, ఆర్థిక, రక్షణ, విద్యుత్ రంగాల అభివృద్ధితోటు ఉగ్రవాదం, వాతావరణంలో మార్పుపైనా ఇంగ్లాండ్ ప్రధానితో చర్చించనున్నారు. దశాబ్దం తర్వాత యూకేలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని అయిన మోదీ.. ఆర్థిక సహకారంపైనే కీలకంగా చర్చ జరగనున్నట్లు తెలిపారు. భావ సారూప్యత ఉన్న యూకేతో సత్సంబంధాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలకంగా మారేలా ముందడుగు వేస్తామని ఫేస్బుక్ ద్వారా ప్రధాని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మోదీ.. బ్రిటన్ ప్రధాని కేమరూన్‌తో చర్చలతో పాటు.. బ్రిటన్ పార్లమెంటులో, ప్రవాస భారతీయులు వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ప్రధాని ప్రసంగించనున్నారు.