అందని ‘రుణమాఫీ’
ఇక్కడ కనిపిస్తున్నది ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు శంకర్. ఈయన గుడిహత్నూర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గతంలో రూ.లక్ష 90వేల పంట రుణం తీసుకున్నాడు. రుణమాఫీకి అర్హుడై ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన నాలుగు విడతల జాబితాల్లోనూ ఈయన పేరు లేకపోవడం గమనార్హం. మూడో విడతలో వ్యవసాయ కార్యాయానికి వెళ్లి అధికారులతో సెల్ఫీ సైతం తీసుకున్నాడు. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఇతనొక్కడే కాదు.. రుణమాఫీకి అర్హులై ఉండి పథకం వర్తించని రైతులు జిల్లాలో వేలల్లోనే ఉన్నారు. – ఇచ్చోడ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. రూ.2లక్షల లోపు పంటరుణం పొందిన రైతులకు ఈ ఏడాది ఆగస్టు 15 లోపు పూర్తిస్థాయిలో వర్తింపజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో అన్నదాతలు సంబురపడిపోయారు. ఐదు నెలలు గడిచినా ఇంకా వర్తించకపోవడంతో అర్హులైన వేలాది మంది రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా పంట రుణం తీసుకున్న రైతులు 90వేల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన జీవో నం. 567 ప్రకారం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పట్టాపాస్ బుక్ ఆధారంగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. అయితే ఇప్పటి వరకు 62,568 మందికే వర్తింపజేశారు. ఇంకా 27వేల మందికి అందాల్సి ఉంది. మరోవైపు నాలుగో విడతలో 6,607 మందికి రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం నవంబర్‌లో ప్రకటించింది. అయితే ఇప్పటికీ వారి ఖాతాలో డబ్బులు జమకాకపోవడం గమనార్హం. మరోవైపు రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారి అయోమయంగా మారింది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు పేర్కొంటున్నారు.
అర్హతలున్నా వర్తించని వైనం
జిల్లాలో 27వేలకు పైగా రైతులకు మొండిచేయి
నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
Comments
Please login to add a commentAdd a comment