సిరులతల్లి.. కరుణించమ్మా..
● కనకమహాలక్ష్మి ఆలయంలో ఘనంగా లక్ష కుంకుమ పూజలు ● మార్మోగిన అమ్మవారి నామస్మరణ
యలమంచిలి రూరల్: కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా భాసిల్లుతున్న యలమంచిలి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక లక్ష కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభించిన పూజల్లో సుమారు 1000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. కలశం, అమ్మవారి ఫొటో, గాజులు, జాకెట్టుతో మహిళలంతా భక్తిశ్రద్ధలతో పూజా క్రతువు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెలవలపల్లి కోటేశ్వర కుమారశర్మ భక్తులతో పూజలు చేయించారు. పూజాదికాల తర్వాత పూర్ణాహుతిలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు స్థానిక కిరాణా వ్యాపారి సమయమంతుల బుచ్చియ్య జాకెట్లు, పసుపు, కుంకుమ సమకూ ర్చారు. పూజల అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అంతకుముందు ఉదయం వేకువ జామున అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించి, తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. శుక్రవారం ఉద్యయం వర్షం కురిసినప్పటికీ పూజకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక షామియానాలు, బల్లలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొఠారు సాంబ, పిల్లా రాము, కొఠారు సూర్యప్రకాష్, తాటిపాకల మాణిక్యాలరావు, తాటిపాకల చిన్ని, చాగంటి శివ మణికంఠ, తుంపాల దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment