కూనవరం: విజయవాడ, కూనవరం ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని, వీ.ఆర్. పురం వరకు పొడిగించాలని విలీన మండలాల ప్రజలు కోరుతున్నారు. గత అక్టోబర్ 28న నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సర్వీసు విజయవాడ, కూనవరం మీదుగా కుంట గ్రామం వరకు ఉండేది. ఇటీవల అర్ధంతరంగా ఈ సర్వీసును నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనవరం, వి.ఆర్.పురం, ఎటపాక మండలాల ప్రజలకు ఈ సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. విజయవాడలో రాత్రి 10.15 గంటలకు బయలుదేరి భద్రాచలం తెల్లవారుజామున 4.00 గంటలకు చేరుకుంటుంది. ఆ సమయంలో భద్రాచలం నుంచి కూనవరం, వి.ఆర్.పురం, ఎటపాక మండల ప్రజలకు ఎలాంటి బస్సు సౌకర్యం లేదు. రాత్రి వేళల్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి భద్రాచలం చేరుకున్న ప్రయాణికులకు ఉదయం 4.00 గంటల ఈ సర్వీసు ఎంతో వెసులు బాటుగా ఉండేది. భద్రాచలం బస్టాండ్‌లో వైటింగ్ సమస్య తీరిందని ప్రయాణికులు ఆనందపడేవారు. అయితే మూడు రోజుల క్రితం నుంచి ఈ సర్వీసును ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. వాస్తవానికి కూనవరం నుంచి కుంట గ్రామానికి వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండరు. విజయవాడ, కూనవరం సర్వీసును వి.ఆర్.పురం మండలం రేఖపల్లి వరకు పొడింగించినట్లు అయితే సర్వీసుతో ఎక్కువ ప్రయాణికులు ఉంటారని పలువురు చెబుతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ డీటీఓ, విజయవాడ డీఎంలు పరిశీలించి విజయవాడ, కూనవరం, వి.ఆర్.పురం సర్వీసు ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై విజయవాడ డీఎంను వివరణ కోరగా ఆ సర్వీసు విజయవాడ–కుంట సర్వీసు అని కొద్ది రోజులు వయా కూనవరం నుంచి కుంట గ్రామానికి నడిపామన్నారు. టార్గెట్ రావడం లేదని కూనవరం నిలిపివేశామన్నారు.
డీటీవో కృష్ణకు వినతిపత్రం ఇస్తే విజయవాడ టు కూనవరం వయా రేఖపల్లి రూట్ బస్సు సర్వీ సుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment