హైడ్రో పవర్ ప్లాంట్‌ను రద్దు చేయాలి
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి, నగరంపాలెం ప్రాంతాలలో నిర్మాణం తలపెట్టిన అదానీ హైడ్రో పవర్ ప్లాంట్‌ను అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.లోకనాథం హెచ్చరించారు. చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించబోయే స్థలాన్ని గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్నతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానిక గిరిజనులకు చేటు కలిగించే ఈ ప్రాజెక్టును నిర్మించవద్దని డిమాండ్ చేస్తూ భారీగా హాజరైన గిరిజనులతో కలిసి నిరసన చేపట్టారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ నగరంపాలెం గ్రామంలో అటవీ ప్రాంతం ఉందని జలజీవన్ మిషన్ పథకం పైపులైన్ పనులను అడ్డగించిన ఫారెస్టు అధికారులు అదానీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రైవాడ, కోనాం ప్రాజెక్టులకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయకట్టు భూములన్నీ ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల 9న విశాఖలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైడ్రో పవర్ ప్లాంట్ రద్దుకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ పర్యటనలో మోదీ ప్రకటనచేయాలన్న సీపీఎం
Comments
Please login to add a commentAdd a comment