మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తా
ముంచంగిపుట్టు: మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీలేరు కాంప్లెక్స్ ఎస్‌ఈ(సివిల్) చంద్రశేఖర్‌రెడ్డి ఉద్యోగులు, సిబ్బందికి హామీ ఇచ్చారు. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు.విద్యుత్ ఉత్పత్తిపై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు అతిథి గృహంలో ప్రాజెక్టు కార్మిక నాయకులు, ఐకాస నాయకులతో సమావేశం అయ్యారు. వివిధ సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రాజెక్టులో ఏటా తాగునీటి కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నా నేటికి బురదనీరే గతి అవుతోందని ఉద్యోగులు వివరించారు. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు పరిసర మార్గాలు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ లేనందున వర్షం పడితే రోడ్లుపై బురద, చెత్త ఉండిపోతుందని వారు పేర్కొన్నారు. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులు అధ్వాన రహదారుల వల్ల అవస్థలు పడుతున్నారని వారు వివరించారు. వించ్ హౌస్, విద్యుత్‌కేంద్రం, ప్రాజెక్టు ఆస్పత్రి రహదారులు వర్షకాలంలో చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు. నిధులు కేటాయిస్తున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని కార్మిక సంఘ నాయకులు, ఐకాస నాయకులు వాపోయారు. దీనిపై స్పందించిన ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టెండర్ల సమయంలో టెండర్ పొందిన వ్యక్తి వద్ద ముందుగా 10శాతం ఈఎండీ తీసుకున్న తరువాతే పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు. అనంతరం ప్రాజెక్టు కాలనీలను ఎస్‌ఈ పరిశీలించారు. నెలకొన్న సమస్యలను గుర్తించారు. మూడు నెలల వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామని చీఫ్ ఇంజినీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ బి.గోవిందరాజులు, ఏడీఈ సివిల్ టి.వెంకటమధు, ఉద్యోగ ఐకాస నాయకులు ఈశ్వరావు, వీరస్వామి, మోహన్‌లాల్, జోగి కూర్మారావు, రబీరావు, సూర్యప్రకాష్, మాధవరావు, వెంకటరమణ పాల్గొన్నారు.
సీలేరు ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి హామీ
Comments
Please login to add a commentAdd a comment