సాగరం.. సాహసం..
ఉత్కంఠభరితంగా నేవీ సన్నాహక విన్యాసాలు రణరంగంలా మారిన ఆర్‌కే బీచ్
సాగర జలాల్లో యుద్ధ నౌకల కవాతు.. గగనతలంలో హెలికాప్టర్ల పహారా.. శత్రుమూకలపై మార్కోస్ ఉప్పెనలా దాడి.. దూసుకొచ్చిన మిసైల్స్.. దానితో పోటీ పడేటట్లుగా మెరుపు వేగంతో వెళ్లిన యుద్ధ విమానాలు.. మొత్తంగా ఆర్.కె.బీచ్ రణరంగాన్ని తలపించింది. ఉత్కంఠభరితంగా సాగిన నేవీ రిహార్సల్స్.. ఉవ్వెత్తున ఎగిసిపడిన జనసంద్రం నడుమ ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని నింపాయి. జనవరి 4న జరిగే నేవీ విన్యాసాల్లో భాగంగా శనివారం జరిగిన రిహార్సల్స్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. విన్యాసాల్లో చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్‌లు, మైరెన్ కమాండోల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మైరెన్ కమాండోలు తాడు సహాయంతో హెలికాప్టర్ నుంచి దిగి.. శత్రువులను ఓడించే నమూనా ప్రదర్శన చూపించారు. పారాచూట్‌లతో దిగిన నావికా సిబ్బంది ప్రత్యేక జ్ఞాపికను అతిథికి అందజేశారు. యుద్ధ నౌకలపై హెలికాప్టర్ల ల్యాండింగ్, హాక్ యుద్ధ విమానాల విన్యాసాలు, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. సీ క్యాడెట్ విద్యార్థుల నృత్య ప్రదర్శన క్రమశిక్షణకు అద్దం పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment