భూ సమస్యలు పరిష్కరించుకోండి
గుత్తి రూరల్: భూ సమస్యలను గ్రామ పెద్దల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని గ్రామీణులకు జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ సూచించారు. మండలంలోని ధర్మాపురం, మార్నేపల్లి గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ధర్మాపురంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు జేసీ, మార్నేపల్లిలో జరిగిన సదస్సుకు ఎంపీపీ విశాలాక్షి హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ... గ్రామాల్లో ఇరువురి మధ్య నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి తమ పరిధిలో చాలా సమయం పడుతుందన్నారు. దీంతో గ్రామాల్లో రైతులు పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని పరస్పరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమమన్నారు. చిన్నపాటి విషయాలకు గొడవలు పడుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కాలం వృధా చేసుకోవద్దన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఓబులేసు, డీటీ శ్రీలత, వీఆర్‌ఓలు సురేంద్ర, వెంకట్రాముడు పాల్గొన్నారు.
ఇద్దరు బాలుర అదృశ్యం
గుంతకల్లు టౌన్: స్థానిక మోదినాబాద్‌కు చెందిన విద్యార్థులు బి.రాహుల్, పరుశురాముడు కనిపించడం లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న రాహుల్ స్కూల్‌కి సక్రమంగా వెళ్లకపోవడంతో తల్లి ఉరుకుందమ్మ మందలించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం అదే వీధికి చెందిన తన స్నేహితుడు పరుశురాముడితో కలసి స్కూల్‌కి వెళుతున్నట్లు చెప్పి బయల్దేరాడు. సాయంత్రమైన ఇద్దరూ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం రాహుల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు వన్‌టౌన్ పీఎస్ సీఐ మనోహన్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96821కు సమాచారమందించాలని కోరారు.
రిమాండ్‌కు ఇద్దరు
ఉరవకొండ: వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మహానంది తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ఉరవకొండ మండలం మోపిడి గ్రామానికి చెందిన ఎగ్గడి నారాయణస్వామిపై గత ఏడాది డిసెంబర్ 31న రాత్రి అదే గ్రామానికి చెందిన మీనుగ వంశి, మీనుగ ఓబన్న పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడి చేశారు. క్షతగాత్రుడి భార్య సుంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం వంశి, ఓబన్నను గుర్తించి అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment