కొనసాగుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూలు
అనంతపురం: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేపట్టిన క్యాంపస్ ఇంటర్వ్యూలు మంగళవారం రెండో రోజూ కొనసాగాయి. తొలి రోజు రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మంగళవారం కల్పతరు ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ చేపట్టింది. అనంతపురం, ఉరవకొండ, తాడిపత్రి, హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, కళ్యాణదుర్గం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మొత్తం 92 మంది పాల్గొన్నారు. తొలుత రాత పరీక్షను నిర్వహించగా 64 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. తుది రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం ప్రిన్సిపాల్ సి. జయచంద్రా రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాసరావు, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ధీరేంద్రబాబు పాల్గొన్నారు.
పట్టపగలే చోరీ
గుత్తి: స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు రాజేష్ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. మంగళవారం ఉదయం 9 గంటలకు రాజేష్ తన ఇంటికి తాళం వేసి పాఠశాల విధులకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ ఆగంతకుడు... తాళాలు తీసి లోపలకు ప్రవేశించాడు. బీరువాలోని 15 తులాల బంగారు నగలు, రూ.లక్ష నగదు అపహరించాడు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకున్న రాజేష్... చోరీ విషయం గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టారు.
వివాహిత ఆత్మహత్య
అనంతపురం: మద్యం మత్తులో కుటుంబ పోషణను నిర్లక్ష్యం చేసిన భర్త వైఖరితో మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని వేణుగోపాల్ నగర్‌లో నివాసముంటున్న పుష్పావతి (32), రామాంజనేయులు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెయింటింగ్ పనితో కుటుంబాన్ని పోషించుకుంటున్న రామాంజనేయులు కొన్ని నెలలుగా మద్యానికి బానిసై, జులాయిగా మారాడు. ఈ క్రమంలో కుటుంబ పోషణను పూర్తిగా విస్మరించాడు. తాగుడు మానేసి, కుటుంబ పోషణపై దృష్టి పెట్టాలని మంగళవారం ఉదయం భార్య హితవు పలికింది. ఇది రుచించని రామాంజనేయులు ఆమెతో ఘర్షణ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన పుష్పావతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment