శనేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం
హిందూపురం అర్బన్: స్థానిక మోతుకపల్లి సమీపంలో శనేశ్వర స్వామి ఆలయం ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన స్వామి వారి రాతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ ఆలయానికి సమీపంలోనే ఇస్తేమా జరిగింది. అయితే విగ్రహాన్ని ఎదరు ధ్వంసం చేశారు అనే అంశంపై స్పష్టత లేదు. ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందుకున్న వన్‌టౌన్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా, విగ్రహం ధ్వంసంపై విశ్వ హిందూపరిషత్, హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు శనీశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రిలో వరుస చోరీలు
తాడిపత్రి టౌన్: స్థానిక టైలర్స్ కాలనీ, టీచర్స్ కాలనీలో మంగళవారం రాత్రి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు వరుస చోరీలకు తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... టైలర్స్ కాలనీలో నివాసముంటున్న కట్టుబడి అల్లాబకాస్ మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి బంధువుల ఇంటికి వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండగులు అర్ధరాత్రి సమయంలో ఇంటి తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి, రూ.20వేల నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. అనంతరం అదే కాలనీలో నివాసముంటున్న చాంద్‌బీ ఇంటికి వేసిన తాళం బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించి రూ.10 వేల నగదు అపహరించుకెళ్లారు. టీచర్స్ కాలనీలోని నాగేశ్వరరావు ఇంటి తాళాలు బద్ధలుగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ గౌస్‌బాషా.. బాధితులను ఇళ్లను పరిశీలించి, కేసు నమోదు చేశారు.
బెంగళూరులో
వలస కూలీ మృతి
బ్రహ్మసముద్రం: బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లిన వ్యక్తి అక్కడ చోటు చేసుకున్న ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి గ్రామానికి చెందిన పూజారి చిన్నరాజన్న (44)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం తాను పనిచేస్తున్న ప్రాంతంలో అడ్డుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కొమ్మలు కత్తిరిస్తుండగా అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కూలీలు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment