అన్యమతాలకు ఆసరాగా నిలవడంపై హిందువులు ఆలోచించాలి
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మండిపాటు
కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం తయారీ దారుణం
పార్టీ నష్టపోయినా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడతా
మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేశాడని నేను అనలేదు
అప్పటి ఈవో ధర్మారెడ్డి చేసిన పాపాలు వెలికి తీస్తాం
గత పాలనలో 31 వేల మంది ఆడ పిల్లలు మిస్ అయ్యారు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :సనాతన ధర్మాన్ని చిన్న చూపు చూస్తూ అన్యమతాలకు న్యాయ స్థానాలు కొమ్ముకాస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తిరుపతి జ్వోతిరావు పూలే కూడలిలో గురువారం సాయంత్రం వారాహి డిక్లరేషన్ సభలో ఆయన ప్రసంగించారు. పనికిరాని చట్టాలంటూ ర్యాజ్యాంగంపై ఊగిపోతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన కోర్టులు అన్యమతాలకు ఆసరాగా నిలబడటం యావత్ భారతదేశం ఆలోచించాలన్నారు. చట్టాల పేరుతో మన నోటికి తాళాలు ఉన్నాయన్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ మతస్తులు భయంతో నోరు మెదపక మిన్నకుంటున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని ఉన్నత న్యాయ స్థానం నుంచి అన్ని కోర్టులు సనాతన ధర్మాన్ని కాపాడకుండా, అన్యమతాలకు కొమ్ముకాస్తున్నాయి. రాజ్యాంగంలోని చట్టాలు సైతం కొన్ని మతాలకే న్యాయం చేకూరేలా ఉన్నాయి. ఆ చట్టాలలో వెంటనే మార్పు తీసుకురావాలి.
న్యాయస్థానాలు సూడో సెక్యులరిజాన్ని ప్రొత్సహించే విధంగా న్యాయవాదులు, జడ్జిలు ప్రయత్నిస్తున్నారు. దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది. ఆయన్ని చెప్పులతో కొడితే చూస్తూ ఊరుకుంటుంది. ఇస్లాం, క్రిస్టియన్ వంటి అన్యమతాలకు చిన్న అపచారం జరిగితే వెంటనే స్పందించే విధంగా న్యాయ వ్యవస్థ తయారైందన్నారు. ఈ సందర్భంగా పవన్ ఇంకా ఏమన్నారంటే..
సగటు హిందువుగా వచ్చాను
సగటు భారతీయుడిగా, హిందువుగా మీ ముందుకు వచ్చాను. హైందవ, సనాతన ధర్మం పాటిస్తూ ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బుద్ధిజాన్ని గౌరవిస్తాను. నా చిన్న కూతురు క్రిస్టియన్ కావడంతో హిందూ ధర్మం ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేయించి శ్రీవారి దర్శనం చేసుకున్నా. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో శ్రీవారి ప్రసాదం తయారు చేయడం దారుణం.
పార్టీ నష్టపోయినా సరే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతా. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేశాడని నేను అనలేదు. అతనికి తెలియకుండా కల్తీ బాగోతం జరిగింది. గత ఈఓ ధర్మారెడ్డి కాలంలోనే తప్పులు జరిగాయి. ఆయన హయాంలో జరిగిన పాపాలను వెలికి తీస్తాం. గత పాలనలో 31 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment