వాళ్లు సర్క్యులేషన్‌ కోసం ఏవైనా రాస్తారు..  నేనలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు  | High Court Justice Mallikarjuna Rao comments on Eenadu | Sakshi
Sakshi News home page

వాళ్లు సర్క్యులేషన్‌ కోసం ఏవైనా రాస్తారు..  నేనలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు 

Published Wed, Feb 7 2024 5:59 AM | Last Updated on Wed, Feb 7 2024 5:59 AM

High Court Justice Mallikarjuna Rao comments on Eenadu - Sakshi

మరీ ఇంత బరితెగింపా? రామోజీరావుకేమ­యింది? ‘ఈనాడు’ అసలు పత్రికేనా? కోర్టుల్లో న్యాయమూర్తులు చేయని వ్యాఖ్యల్ని సైతం వాళ్లకు అంటగట్టి రాసేస్తే ఎలా? ‘మీరు పోలీసులేనా?.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడితే.. సామాన్యుల పరిస్థితేంటి?’’ అని ఓ న్యాయమూర్తి అన్నట్టుగా పతాక శీర్షికను వండేసిన రామోజీకి.. అసలు ఆ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలే చేయలేదన్న నిజం తెలి­యదా? ఈ రాతల వల్ల పోలీసుల ఆత్మ స్థయి­ర్యం ఎంతలా దెబ్బతింటుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లటమే లక్ష్యంగా దుష్ప్ర ­చారంతో చెలరేగిపోతున్న రామోజీకి వయసు తప్ప బుద్ధి రాలేదా? ఎంతసేపూ చంద్ర­బాబు యావే తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహమేంటో అర్థమవుతోందా రామోజీ!?. 

సాక్షి, అమరావతి : ఓ కేసు ప్రస్తావన సమయంలో తాను చేసిన వ్యాఖ్యలంటూ ఎల్లో మీడియా ప్రచురించిన కథనాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్క్యులేషన్‌ కోసం ఏవైనా రాస్తాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాంటి కథనాలపై తానెందుకు స్పందించాలని ప్రశ్నిచారు. ఆ పత్రికలు ఏం రాశాయో కూడా తనకు తెలియదన్నారు. ఇటీవలి కాలంలో పత్రికలు చదవడమే మానేశానని తెలిపారు. ‘వాళ్లేం రాశారో మీరు (పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌) ఇప్పుడు చెబితేనే నాకు తెలిసింది.

నేనేదో యధాలాపంగా మాట్లాడానే తప్ప ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. వాళ్ల రాతలు పరువు నష్టం కలిగించే విధంగా ఉంటే అందుకు అనుగుణంగా మీరు (ప్రభుత్వం) తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. మీడియాలో నాకు వ్యతిరేకంగా కూడా కథనాలు రాశారు. అయినా నేను గొంతెత్తలేను. అదేమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. పత్రికల్లో వచ్చే కథనాలకు నేనేం చేయగలను?’ అని జస్టిస్‌ మల్లికార్జునరావు అన్నారు. న్యాయమూర్తి నుంచి ఈ స్పందనను ఊహించని ఎమ్మెల్యే తరఫు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఎల్లో మీడియా కథనాలను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఆ పత్రికల వారితో తాను మాట్లాడానని, ప్రజలను ఎడ్యుకేట్‌ చేయడానికే అలా ప్రచురించామని వారు చెప్పారని పోసాని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి స్పందిస్తూ.. మీరు వ్యాఖ్యలు చేశారంటూ ప్రచురించిన కథనాల వల్ల పోలీసుల మనోస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని, అందుకే వాటిని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నామని న్యాయమూర్తికి వివరించారు. అలాగే 41(ఏ) విషయంలో కోర్టుకు స్పష్టతనిచ్చేందుకు, కోర్టు సందేహాలను నివృత్తి చేసేందుకు, అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏముందో స్పష్టంగా తెలిపేందుకే సుదీర్ఘ వాదనలు వినిపించామన్నారు.

అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై నమోదు చేసిన కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) నోటీసు ఇస్తామని దుష్యంత్‌ కోర్టుకు వివరించారు. ఈ విషయంలో పోలీసు అధికారుల నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నాయని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, ఎమ్మెల్యే సాంబశివరావుకు 41(ఏ) నోటీసులు ఇచ్చి, అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని పోలీసులను ఆదేశించారు. 41(ఏ) నోటీసులు ఇస్తామని చెప్పినందున కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని జస్టిస్‌ మల్లికార్జునరావు తెలిపారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

అధికారులపై దాడి చేసిన ఎమ్మెల్యే 
గ్రానైట్‌ ఫ్యాక్టరీ తనిఖీకి వచ్చిన తమను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమే కాక తమపై దాడి కూడా చేశారంటూ గనుల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ సాంబశివరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు.  

ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు 
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డి, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, విధులు నిర్వర్తించకుండా అధికారులను అడ్డుకున్నారని తెలిపారు. న్యాయమూర్తులపై గతంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వారిపై నమోదు చేసిన కేసులు కూడా ఏడేళ్ల లోపు శిక్షలు పడేవేనని, అయినా వారికి కోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేదన్నారు. 70 రోజుల పాటు వారంతా జైల్లోనే ఉన్నారని తెలిపారు. ఆ కేసుల్లో అడ్వొకేట్లు కూడా అరెస్టయ్యారని వివరించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదన్నారు.

నేరాన్ని మళ్లీ చేస్తారన్న నిర్ణయానికి పోలీసు అధికారి వస్తే చాలని, నిందితుడిని అరెస్ట్‌ చేయవచ్చని చెప్పారు. ప్రస్తుత కేసులో ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని, ఇప్పుడు కూడా పోలీసులు మౌనంగా ఉండాలంటే ఎలా అని ప్రశ్నిచారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపే సమయంలో నేరం చేశారనేందుకు మేజి్రస్టేట్‌కు స్పష్టమైన ఆధారాలు చూపితే సరిపోతుందన్నారు.  విధి నిర్వహణలో ఉన్న అధికారులను ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురి చేశారని, అందుకు వీడియో ఆధారాలున్నాయని చెప్పారు.

41(ఏ) నోటీసు ఇవ్వాలా లేక అరెస్ట్‌ చేయాలా అన్నది పూర్తిగా పోలీసుల విచక్షణాధికారమని తెలిపారు. కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. ఈ విషయంలో ఇదే హైకోర్టు ఓ తీర్పులో స్పష్టంగా చెప్పిందని నివేదించారు. ఈ కేసులో కూడా ఎమ్మెల్యేకు 41(ఏ) నోటీసులు ఇస్తామన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్ట్‌ చేయకూడదన్నారు. సెక్షన్‌ 41(ఏ) నోటీసులు ఇచ్చి తీరాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు పోలీసులు వక్రభాష్యం చెబుతున్నారని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు పెట్టారన్నారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని లేని పక్షంలో 41(ఏ) నోటీసులు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement