వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్
కష్టపడే వారికి ప్రాధాన్యత.. నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం
ఇది మన పార్టీ.. మనందరి పార్టీ.. మనం కలిసికట్టుగా నిర్మించుకున్న పార్టీ
‘జగన్’ మీ అందరి ప్రతినిధి మాత్రమే
పార్టీలో అనుబంధ విభాగాలు చాలా కీలకం.. గ్రామ స్థాయి వరకు విస్తరించి ఆర్గనైజ్డ్‌గా పని చేయాలి
పిలుపునిస్తే గ్రామ స్థాయి నుంచి కదలిక రావాలి
పార్టీ నిర్మాణంలో యువత, మహిళలు, రైతులకు భాగస్వామ్యం
సమన్వయం కోసం త్వరలో వర్క్‌షాప్
క్షేత్ర స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేద్దాం. పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఒక పిలుపు ఇస్తే.. ఆ సమాచారం గ్రామ స్థాయి వరకు పోవాలి. ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామ స్థాయి నుంచి పోరాటం చేయాలి. అలాంటి వ్యవస్థను నిర్మించాలి. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ నిర్మాణంలోకి తీసుకు రావాలి. మనందరం కలిసికట్టుగా పార్టీని మరింతగా పటిష్టం చేసుకుందాం. జగన్‌మోహన్‌రెడ్డి మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయినవారికి పార్టీ పూర్తి అండగా ఉంటుంది.
– వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీకి సంబంధించి దాదాపు 24 అనుబంధ విభాగాలను క్రియాశీలకం చేస్తున్నామని, తద్వారా ఏదైనా సాధించేలా పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత పటిష్టంగా నిర్మిద్దామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ మనది.. మనందరిది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మనందరం కలిసికట్టుగా పార్టీని మరింతగా పటిష్టం చేసుకుందామని చెప్పారు.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పోషించే పాత్ర చాలా కీలకం అని.. పార్టీకి కాళ్లు, చేతులు ఈ విభాగాలేనని, ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పరుగెత్తి పోరాడగలదన్నారు. అందుకే పార్టీని మరింతగా పటిష్ట పరిచేందుకు శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు.
రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ‘15 సంవత్సరాలుగా పార్టీ బలంగా ఉంది. మరింత ఆర్గనైజ్డ్‌గా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వీరిని ఆర్గనైజ్డ్‌గా అనుబంధ విభాగాల్లోకి తీసుకొస్తే.. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. మనం చేసే కార్యక్రమాన్ని పద్ధతిగా తీసుకురావడంతో పాటు, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పిలుపునిచ్చినా మొత్తం కేడర్ కదులుతుంది.
ఎప్పుడైతే కేడర్ అగ్రెసివ్‌గా కదులుతుందో అప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడగలుగుతాం. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటేనే మనం ఈ పోరాటం చేయగలుగుతాం. మనం పిలుపునిస్తే.. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరగాలి. అప్పుడే మనం ఆర్గనైజ్డ్‌గా పని చేస్తున్నట్లు స్పష్టమవుతుంది’ అని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
అందరినీ కలుపుకొనిపోవాలి
మీ మీద నమ్మకంతో పెట్టిన ఈ బాధ్యతను మీరు అంతే బాధ్యతగా నెరవేరిస్తే.. మీ క్కూడా మంచి జరుగుతుంది. పార్టీ మీ సేవలను గుర్తిస్తుంది. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు, జిల్లా అధ్యక్షులు సహా పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వారికే ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ మనది, మనందరిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ క్రమంలోనే మిమ్నల్ని రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించాం.
తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పూర్తయింది. ఇప్పుడు మీరు ఆయా జిల్లాల్లో అధ్యక్షులతో మమేకం కావాలి. ప్రతి జిల్లాలోనూ అనుబంధ విభాగాలకు సంబంధించి.. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి వరకు నియమించాలి. ముందుగా బలమైన జిల్లా అధ్యక్షుడిని నియమించాలి. ఆ తర్వాత నియోజకవర్గం, మండలాల ద్వారా ప్రతి గ్రామంపై దృష్టి పెట్టాలి. జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిస్తే ఆ జిల్లా అంతా కదలాలి. అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి మిమ్మల్ని ఎంపిక చేశాం.
గతంలో ఎప్పుడూ లేనంతగా దృష్టి పెడుతున్నాం. గ్రామ స్థాయి నుంచి తొలిసారిగా ఇంత ధ్యాస పెట్టి ఆర్గనైజ్డ్‌గా ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. వేగంగా అడగులు వేస్తున్నాం. మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ జిల్లాలో తిరగాలి. పర్యవేక్షణ చేయాలి. ఏం జరుగుతుందో చూడాలి. అందుకే ఇందులో అనుభవం ఉన్న వాళ్లను నియమించాం.
సమన్వయంతో సమష్టి కృషి
జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా సమ్వయంతో పని చేయాలి.. సంయుక్తంగా పార్టీని ఎలా గ్రామ స్థాయికి తీసుకుని పోవాలి.. అన్నదానిపై ఒక వర్క్ షాప్ కూడా ఉంటుంది. ఇందులో గ్రామ స్థాయికి పార్టీని ఎలా తీసుకుపోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న 24 విభాగాల్లో కొన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన విభాగాలు ఉంటాయి.
వాటికి గ్రామ స్థాయి వరకు ప్రతినిధులుగా.. యువత, మహిళలు, రైతులు ఉండాలి. ఈ కార్యక్రమాన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కలిసి చేయాలి. జిల్లా అధ్యక్షుడితో అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంత విస్తృతంగా మమేకమై తిరగగలిగతే.. అంత లోతుగా గ్రామ స్థాయి వరకు పార్టీ విస్తరిస్తుంది. అలాగే పార్టీకి కూడా అంతే మేలు జరుగుతుంది. నేను కూడా ఆయా విభాగాలతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది.
క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం
పార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం మూడు, నాలుగు నెలల్లో పూర్తి కావాలి. ఆ తర్వాత బూత్ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. ఈ ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలి. వైఎస్సార్‌సీపీని దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో పని చేస్తున్నాం. క్షేత్ర స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తాం.
పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వారంతా పార్టీని నమ్ముకుని ఉన్నారు. వాళ్లందరినీ పార్టీ వ్యవస్థలోకి తీసుకురావాలి. అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఇద్దరూ ఎలా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం చేసుకోవాలన్న దానిపై త్వరలో నిర్వహించే వర్క్ షాప్‌లో పూర్తి స్పష్టత వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment