చోరీ కేసులో నిందితుల అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని భుజంగేశ్వర స్వామి ఆలయంలో చోరీ చేసిన నిందితులను ఎస్‌ఐ నవీన్ బాబు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనం చేసిన నిందితులు బాలిరెడ్డిపల్లికి చెందిన కొమ్మలపాటి గోవర్దన్, మల్లిబోయిన శివకుమార్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ. 66,132లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితుడు కొమ్మలపాటి గోవర్దన్‌పై గతంలో చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు.
కేరళ ట్రెక్కింగ్‌కు ఎన్‌సీసీ విద్యార్థి
చిట్వేలి : ఆల్ ఇండియా కేరళ ట్రెక్కింగ్‌కు చిట్వేలి జెడ్పీ ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ ట్రూప్ విద్యార్థి పులి దిలీప్ కుమార్ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు ఏబిఎన్ ప్రసాద్, ఎన్‌సీసీ ట్రూప్ అధికారి పసుపుల రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ నుంచి 28వ తేది వరకు కెడెట్ దిలీప్ కుమార్ జాతీయస్థాయిలో కేరళలో జరిగే ట్రెక్కింగ్‌లో పాల్గొంటారన్నారు. జాతీయస్థాయి శిబిరానికి ఎంపిక కావడంపట్ల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
శిక్షణలో నేర్చుకున్న
విషయాలను అమలు చేయండి
రాయచోటి టౌన్ : శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న విషయాలపై తరగతి గదిలో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం రాయచోటి – గాలివీడు రోడ్డులోని అర్చనా విద్యాసంస్థలలో పునాదిస్థాయి అక్షరాస్యత, సంఖ్యా/్ఞానంపై ఉపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఈ శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ ఈవో శివప్రకాష్‌రెడ్డి, స్టేట్ అబ్జర్వర్ ఎస్‌సీఈఆర్‌టీ అధికారి డాక్టర్ రోషిణిలతో కలసి డీఈఓ తనిఖీ నిర్వహించారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి విషయాన్ని పాఠశాలలోని తరగతి గదిలో అమలు పరిచి విద్యార్థులకు నేర్పాలని చెప్పారు. విద్యార్థులలో లెర్నింగ్ అవుట్ కమ్స్ మెరుగుపరుచుకోవడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
గుంతకల్ డివిజన్ మజ్దూర్ యూని యన్ అధ్యక్షుడిగా బీఎం బాషా
రాజంపేట : గుంతకల్ రైల్వే డివిజన్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడిగా నందలూరు రైల్వేకేంద్రానికి చెందిన రచయిత, నంది అవార్డు గ్రహీత బద్వేలు మస్తాన్‌బాషా(బీఎంబాష) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం దక్షిణ మధ్యరైల్వే జోనల్ మజ్దూర్ యూనియన్ నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఇప్పటివరకు డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న కెఎస్ రాజు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో బీఎం బాషా నియమితులయ్యారు.1997లో ఆర్‌ఆర్‌బీ ద్వారా ఎఎల్‌పీగా చేరారు. ప్రస్తుతం ఈయన రేణిగుంట జంక్షన్‌లో లోకో ఫైలెట్‌గా పనిచేస్తున్నారు. నందలూరు రైల్వేకేంద్రంలోనే విద్యాభాస్యంతో పాటు రైల్వే స్కౌట్స్ అం డ్ గైడ్స్, రైల్వే ఇన్సిట్యూట్ సెక్రటరీగా కార్మికులకు అనేక సేవలందించారు. ఈయన డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నిక పట్ల నందలూరు మజ్దూర్ యూనియన్ నేతలు గోపి, విశ్వనాథ్‌లతో పాటు పలువురు యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నూతన నిర్మాణ భవనంలో కరెంటు దొంగలు
–రూ.7లక్షల విలువ చేసే కరెంట్ సామగ్రి చోరీ
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయరహదారి రాజంపేట మండల గుండ్లూరు శివాలయం క్రాస్‌లో నందలూరు జెడ్పీటీసీ గడికోట ఉషా సుబ్బారెడ్డి నిర్మిస్తున్న నూతన కళ్యాణ మండపం, లాడ్జీలలో రూ.7లక్షలకు పైగా విలువ చేసే కరెంట్ సామగ్రిని దొంగలు దోచుకెళ్లారు. ఒక ముఠాగా ఏర్పడి రోజు రాత్రులలో మూడురోజులపాటు కరెంటు సామగ్రి తీసుకొనివెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున కరెంటు సామగ్రిని పూర్తి స్ధాయిలో తొలిగించే పనిలో ఉండగా జెడ్పీటీసీ డ్రైవరు, వాచ్‌మెన్ పసిగట్టి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఒంటిమిట్ట మండలం కొత్తపల్లెకు చెందిన మధు అనే వ్యక్తి దొరికారు. అక్కడే స్కూటీను పట్టుకున్నారు. ఇద్దరు దొంగలు గోడ దూకి పారిపోయారు. మన్నూరు పోలీసులు సమాచారం అందుకున్న సంఘటన స్ధలానికి చేరుకున్నారు. కాగా స్కూటీ ఆర్‌సీ పరిశీలన చేసే మన్నూరుకు చెందిన దిల్సాద్ పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ చోరీపై విచారణ చేస్తున్నారు.
విద్యుత్ తీగలు తగిలి ఆవు మృతి
గాలివీడు : విద్యుత్ తీగలు తగిలి పాడి ఆవు మృతి చెందిన సంఘటన మండలకేంద్రంలోని చోటు చేసుకుంది. పెద్దూరుకు చెందిన రియాజ్ అహమ్మద్‌కు చెందిన పాడి ఆవు శుక్రవారం మేతకు వెళ్లిన క్రమంలో పెద్దూరు పక్కనే వరిమళ్ళలో ఉరుసు జరిగే ప్రాంతంలో 11 కేవీ విద్యుత్ తీగలు డిస్క్ కట్ అయిన కారణంగా కిందకు వేలాడుతున్నాయి. ప్రమాదవశాత్తు పాడి ఆవుకు తీగ తగిలి మృతి చెందినట్లు సమాచారం. మరో 20 రోజుల్లో పాడి ఆవు ప్రసవించాల్సి ఉండగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగల ధాటికి పాడి ఆవు విగత జీవులై పడివుండటం చూపరుల హృదయాన్ని కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment