చిరుతపులి దాడిలో మేక మృతి
ములకలచెరువు : చిరుతపులి దాడిలో మేక మృతిచెందిన సంఘటన గురువారం సాయంత్రం మండలంలో చోటు చేసుకుంది. మేకల కాపరి పి. నరసింహులు కథనం మేరకు... మండలంలోని పెద్దపాళ్యంకు చెందిన పి. నరసింహులకు వంద వరకు మేకలు ఉన్నాయి. వీటిని ప్రతి రోజూ స్థానికంగా ఉన్న కనుగొండ అడవిలోకి మేపేందుకు తోలుకొని వెళ్తుంటాడు. గురువారం సాయంత్రం మేకలను ఇంటికి తోలుకొని వస్తుండగా చిరుతపులి ఒక మేకపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిందన్నాడు. తనతో ఉన్న కుక్కలు, అతను ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పులి వెళ్లిపోయినట్లు చెప్పాడు. భయబ్రాంతులకు గురైన కాపరి గ్రామంలోని పలువురికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నట్లు చెప్పాడు. అప్పటికే చిరుత పులి అక్కడినుంచి నిష్క్రమించినట్లు చెప్పారు. పులి దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన మేకను అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. ఘటనపై అధికారులకు వివరించామన్నారు. అటవీశాఖ సెక్షన్ అధికారి షబీన్ తన సిబ్బందితో పెద్దపాళ్యం చేరుకొని విచారించారు. కనుగొండ అడవిలో చిరుతపులులు ఉన్నాయన్నారు. గతంలో అడవిలోని కోతులు, జింకలను తిన్నట్లు తెలిసిందన్నారు. పులి కాలి ముద్రలు సైతం గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులు గుర్తించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment