మదనపల్లె : మదనపల్లె పట్టణంలో బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం...పెద్దదై పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసేవరకు దారి తీసింది. బుధవారం సాయంత్రం పట్టణంలోని మేదర వీధికి చెందిన ఓ వ్యక్తి ఎస్టేట్ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తన తల్లిని తీసుకొని ద్విచక్ర వాహనంలో వెళుతుండగా...ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ముందర బైకులో వెళుతున్న మరోవ్యక్తి ఉన్నట్టుండి ఆపేశాడు... దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిపై చేయి చేసుకోవడంతో దానిని అవమానంగా భావించిన కొందరు వ్యక్తులు తమకు న్యాయం చేయాలంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గొడవకు కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ కుదిర్చి సమస్యను పరిష్కరిద్దామనుకున్నా ఆందోళనకారులు వినకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు రెండు గంటలసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన డీఎస్పీ కొండయ్య నాయుడు ఆందోళనకారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ లోపు కొందరు రాజకీయ పార్టీ నాయకులు ఆందోళనకారులతో కలిసి గొడవను మరింత పెద్దది చేశారు.. పోలీసులు రంగ ప్రవేశం చేసి సారీ చెప్పించినప్పటికీ ఆకతాయిలు వినకుండా సమస్యను మరింత జటిలం చేసేందుకు ప్రయత్నించారు. అందరినీ స్టేషన్ దాటి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నా అల్లరిముకలు వెళ్లిపోకుండా స్టేషన్ ఎదుటే నిరసన తెలుపుతూ ఘర్షణ వాతావరణాన్ని కొనసాగించారు. దీంతో పోలీసులు రాయచోటి, చిత్తూరు, తంబళ్లపల్లి, పీలేరు నుంచి పోలీసు బలగాలను మదనపల్లికి తీసుకువచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
చిన్న వివాదం కాస్త పెద్దదై
ఆందోళనకు దారి తీసిన వైనం
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
పోలీసుల జోక్యంతో
సద్దుమణిగిన వ్యవహారం
Comments
Please login to add a commentAdd a comment