రాయచోటి : రాయచోటి మండలం, మాధవరం అటవీ ప్రాంతంలో కలకలం రేపిన తుపాకీ పేలుళ్ల సంఘటనపై పోలీసులదర్యాప్తు కొనసాగుతోంది. బుధవారం రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, అర్బన్ సీఐ చంద్రశేఖర్‌లు తుపాకీ పేల్చిన వారిలో ఒకరిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి పరిశీలించినట్లు సమాచారం. ఈ వేటలో పాల్గొన్న మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకున్న తరువాతనే అందరినీ హాజరు పెట్టనున్నట్లు తెలిసింది. అడవి జంతువుల వేటలో పాల్గొన్న వారందరి నుంచి వేటకు ఉపయోగించిన తుపాకుల సేకరణలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
కానిస్టేబుల్‌దే పెత్తనం...
అడవి జంతువుల వేటలో భాగంగా తుపాకీ తూటాలకు బలైన విషయంలో స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ప్రధాన భూమికను పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పలుకుబడి కలిగిన ఆ కానిస్టేబుల్ కేసులో ఎవరిపేర్లు నమోదు చేయాలి, ఎన్ని తుపాకులను చూపించాలని తానే సూచిస్తున్నట్లు పోలీస్ స్టేషన్‌లో చర్చ జోరుగా సాగుతోంది. ఉన్నతాధికారులకు వాస్తవ సమాచారాన్ని అందించాల్సిన పోలీసు నిఘా వర్గాలు కూడా మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
త్వరలో నిందితులను
హాజరు పరుస్తాం : అర్బన్ సీఐ
తుపాకీ కాల్పుల కేసులో నిందితులను త్వరలోనే హాజరుపరుస్తామని రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని బుధవారం డీఎస్పీ కృష్ణ మోహన్‌తో కలిసి రెండోసారి పరిశీలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment