ఆదివాసీ వంటకాలు వడ్డించాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు వచ్చే భక్తులు, పర్యాటకులు బస చేసేందుకు ఏర్పాటు చేస్తున్న హట్స్‌ల్లో విడిది చేసే వారికి ఆదివాసీ వంటకాలనే వడ్డించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. పట్టణంలోని గోదావరి కరకట్ట సమీపంలో ఏర్పాటుచేస్తున్న పర్యాటకుల విడిది గృహాల నిర్మాణ పనులను ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహాల నిర్మాణ పనులను నిర్ణీత సమయానికంటే ముందుగానే పూర్తి చేయాలని, ఈనెల 9న రివర్ ఫెస్టివల్ ప్రారంభిస్తున్నందున ఏర్పాట్లు రెండు రోజుల ముందే పూర్తి చేసి లాంఛనంగా ట్రయల్ నిర్వహించాలని ఆదేశించారు. విడిది గృహాల వద్ద పరిశుభ్రత పాటించాలని, గృహాల సమీపంలో డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరకట్ట వద్ద ఏర్పాటు చేసే స్టాళ్లలో ఆదివాసీ గిరిజనుల వంటలు, వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళలకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేసి నాణ్యమైన వస్తువులను భక్తులకు సరసమైన ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా పర్యాటకులకు వడ్డించే గిరిజన వంటకాల్లో మూడు రోజుల పాటు శాకాహార వంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనులు చేసి భద్రాద్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీఓ దామోదర్‌రావు, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వరరావు, రమణయ్య, రాజారావు, జగదీష్, కిషోర్, హరికృష్ణ, శ్రీనివాసరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment