శ్రీకనక దుర్గమ్మకు విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ తల్లికి అర్చకులు ఆదివారం విశేష పూజలు జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజాది కార్యక్రమాలను ఈఓ ఎన్ రజనీకుమారి పర్యవేక్షించారు.
క్రీడలతో నూతనోత్సాహం
జిల్లా జడ్జి పాటిల్ వసంత్
కొత్తగూడెంటౌన్: ఆటలతో శారీరక ధృడత్వంతోపాటు నూతనోత్సాహం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామవరంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. అడ్వకేట్ల జట్టుపై జడ్జి శివనాయక్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి కె.శిరీష, న్యాయవాదులు పలివెల సాంబశివరావు, పోసాని రాధాకృష్ణమూర్తి, అనుబ్రోలు రాంప్రసాదరావు, గాజుల రాంమూర్తి, పాతూరి పాండురంగ విఠల్, అరికల రవికుమార్, రామకృష్ణ, నాగరాజు, దొడ్డ ప్రసాద్, మెండు రాజమల్లు, కాసాని రమేష్, ఎండీ సాధిక్‌పాషా, దొడ్డ సుమంత్, రామిశెట్టి రమేష్, లగడపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
24న మంత్రి
పొంగులేటి పర్యటన
ఇల్లెందు: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నెల 24న ఇల్లెందులో పర్యటించనున్నారు. మోడల్ మార్కెట్‌లో దుకాణ సముదాయం, డిజిటల్ గ్రంథాలయం, పార్క్‌లో స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో పాల్గొనున్నారు.
నేటి ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం(నేడు) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సర్వేలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేయడానికి కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
మానవత్వం చాటిన ఎమ్మెల్యే
దమ్మపేట : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన తోకల శ్యామ్ బైక్‌పై అప్పారావుపేట గ్రామానికి వెళ్లి, తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో కొమ్ముగూడెం శివారులో బైక్ అదుపుతప్పి శ్యామ్ కింద పడిపోగా, కాలికి స్వల్పంగా దెబ్బ తగిలింది. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే గమనించి క్షతగాత్రుడిని తన కారులో దమ్మపేట ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి బాధితుడికి వైద్యం అందేలా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment