యాదమరి: కుదువ వ్యాపారం దుకాణాన్ని తెరుస్తున్న పోలీసులు
● రెండు నెలలుగా కుదువ వ్యాపార దుకాణానికి తాళం ● గగ్గోలు పడిన బంగారం, వెండి నగలు తాకట్టు పెట్టిన బాధితులు ● అర్ధరాత్రి దుకాణం తెరుస్తుండగా పోలీసులకు చిక్కిన యజమాని ● కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు
యాదమరి: మండల కేంద్రంలో జ్యువెలరీ, కుదువ వ్యాపారం దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి గత రెండు నెలలుగా షాపు తెరవట్లేదు. దీంతో అతని వద్ద బంగారం, వెండి నగలను తాకట్టు పెట్టిన బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి సదరు దుకాణ యజమాని షాపులో ఉన్న నగలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో రాత్రివేళ గస్తీలో ఉన్న పోలీసులు అతన్ని ప్రశ్నించారు. దీంతో పూటుగా మద్యం సేవించి ఉన్న వ్యాపారి, ఈ దుకాణం తనదే అని, ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అక్కడ తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయం బయట పడింది. వివరాలు ఇలా.. మండల కేంద్రమైన యాదమరిలో రాజస్థాన్‌కు చెందిన మధు అనే వ్యక్తి శ్రీకృష్ణ జ్యువెలర్స్, కుదువవ్యాపారం దుకాణాన్ని గత 4 ఏళ్లుగా నడుపుతున్నాడు. మండలంలోని ప్రజలు, రైతుల బంగారం, వెండి నగలను కుదువ పెట్టుకుని వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. అయితే గత రెండు నెలలుగా దుకాణానికి తాళాలు వేశాడు. విషయం తెలిసి బంగారం కుదువ పెట్టిన బాధితులు నిత్యం దుకాణం వద్దకు తిరిగారు. ఇంటి వద్దకు వెళ్లి ఆరా తీయగా సదరు వ్యాపారి మధు రాజస్థాన్‌కు వెళ్లాడని చెప్పడంతో బాధితులు వెంటనే పోలీసులు ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుకాణ యజమాని బంధువులను విచారించారు.
వెండి తీసుకెళ్లడానికి వచ్చి ..
రెండు నెలలుగా తాళం వేసి రాజస్థాన్‌కు వెళ్లిన కుదువ వ్యాపారి మధు సోమవారం అర్ధరాత్రి తన దుకాణంలో ఉన్న వెండిని తీసుకెళ్లడానికి వచ్చి పోలీసులకు చిక్కాడు. మద్యం మత్తులో తన దుకాణం తీయడానికి ప్రయత్నిస్తుండగా రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అసలు విషయం బయటపడింది. అయితే సదరు కుదువవ్యాపారి పోలీసుల అదుపులో ఉన్నాడని బాధితులకు తెలియడంతో వారంతా అక్కడికి చేరుకుని పోలీసుల వద్ద తమ గోడు చెప్పుకున్నారు.
వేలూరు, గుడియాత్తంలో నగలు తాకట్టు..
మండలంలోని ప్రజలు, రైతులు పెట్టిన బంగారం నగలను కుదువ వ్యాపారి సమీప బంధువులు వేలూరు, గుడియాత్తంలో ని సేట్‌ల వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్లు గుర్తించామని చిత్తూరు వెస్ట్ సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 3 కిలోల బంగారం నగలు, 10 కిలోల వెండి తాకట్టుకు వచ్చినట్లు తెలిసిందన్నారు. ఇంకా బాధితులు ఇచ్చే ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేస్తామన్నారు. అలాగే సదరు దుకాణాన్ని యజమాని మధు ఆధ్వర్యంలో తెరిచి అందులో ఉన్న నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే మండల పరిధిలో పలువురి వద్ద చీటీలు వేసి నగదు తీసుకెళ్లాడని, వడ్డీకి రూ.లక్షల్లో అప్పు తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారిస్తున్నామని, ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment