● చేదెక్కిన చెరుకు ● దళారులు నిర్ణయించిందే ధర ● టన్నుకు
ఫ్యాక్టరీకి తరలించడానికి లారీకి చెరుకు లోడ్ చేస్త్తున్న కూలీలు
విజయపురం : సంప్రదాయ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు చెరుకు సాగుపై దృష్టి సారించారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు సాగు చేసే చెరుకు క్రషింగ్‌కు సరిపడా కర్మాగారాలు లేకపోవడంతో ఏజెంట్లకు డిమాండ్ పెరిగింది. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసినా.. ధరలు నిర్ణ యించేది మాత్రం ఏజెంట్లే. అలా కాదు..కుదరదు అంటే పర్మింట్లు ఇవ్వకుండా అడ్డుపడుతూ రైతులను ఇబ్బంది పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పోనీ వరి సాగు చేసుకుందామంటే అక్కడ కూడా దళారుల చేతుల్లో మోసం పోతున్నారు. ఇలా రైతులు ఏ పంట సాగు చేసినా అటు దళారులు...ఇటు ఏజెంట్ల చేతుల్లో మోసపోతూ అప్పుల పాలవుతున్నారు.
టన్నుకు మిగిలేదేది రూ.వెయ్యి
ఉమ్మడి జిల్లా పరిధిలో ఒకటే చక్కెర కర్మాగారం ఉండడంతో పర్మిట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రైతులు తమిళనాడులోని చక్కెర కర్మాగారాలకు చెరుకు తరలించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా భావించిన ఏజెంట్లు పర్మిట్లు దొరకడం లేదంటూ టన్నుకు రూ.3 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. చక్కెర కర్మాగారం యాజమాన్యం మాత్రం ఏజెంట్లకు టన్నుకు రూ.3150 ఇస్తోంది. కానీ, ఏజెంట్లు మాత్రం రైతుల అవసరాన్ని ఆసరా తీసుకుని టన్నుకు రూ.150 నుంచి రూ.200 కమీషన్ తీసుకుని, మిగిలిన సొమ్ము అందజేస్తున్నారు. ఇందులో టన్ను చెరుకు కటింగ్ చేయడానికి కూలీలకు దాదాపు రూ.800 చెల్లించాల్సి వస్తోంది. ఇక ఎద్దుల బండిలో చెరుకును పొలంలో నుంచి గట్టుపైకి తరలించడానికి టన్నుకు రూ.200 నుంచి రూ. 250, ట్రాక్టర్ అయితే రూ.125 నుంచి రూ.150 వరకు చెల్లించాల్సి వస్తోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కూలీలు రేటు మరింత పెరుగుతుంది. ఈ ఖర్చులన్నీ పోను రైతుకు రూ.1500 చేతికందుతోంది. అందులోనూ ఎరువులు, పెట్టుబడి ఖర్చులు పోతే టన్నుకు రూ.వెయ్యి మాత్రమే మిగులుతుందని రైతులు వాపోతున్నారు.
అధిక విస్తీర్ణంలో చెరుకు సాగు
నగరి నియోజకవర్గంలో చెరుకు అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ఒకసారి సాగు చేస్తే మూడు నుంచి నాలుగేళ్ల వరకు ఫలితం అందుతుందన్న ఆశతో చెరుకు సాగుపై రైతులు మొగ్గు చూపుతు న్నారు. అయితే చెరుకు క్రషింగ్‌కు సరిపడా కర్మాగారాలు లేకపోవడంతో ఏజెంట్లకు డిమాండ్ పెరిగింది. ఫ్యాక్టరీలో ఇచ్చే ధరలో రూ.150 నుంచి రూ.200 వరకు కమిషన్ తీసుకోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఏజెంట్లు చెప్పిందే వేదం
కొన్ని రోజులు వరి సాగు చేసి గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరుకు సాగు చేశాను. అందులోనూ ఆశించిన స్థాయిలో రాబడి లేదు. ఫ్యాక్టరీ యజమాన్యం ఎంత ధర ఇచ్చినా..ఏజెంట్లు చెప్పిందే వేదంగా మారుతోంది. దీంతో మూడేళ్లు ముందే చెరుకు సాగు చేయడం ఆపేశాను. ప్రస్తుతం సజ్జలు, ఉద్దులు, వేరుశనగ పంట సాగు చేస్తున్నాను.
– హరి, కేవీపురం, విజయపురం.
Comments
Please login to add a commentAdd a comment