చౌడేపల్లె: విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్ల మంజూరు కోసం అర్జీ రాయడానికి రూ.150 తీసుకుంటూ చౌడేపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద కొందరు దళారులు వసూళ్ల దందా నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రతి విద్యార్థికి బర్త్, ఎంట్రీ రిజిష్టర్‌లో పేరు నమోదు కాకుంటే నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ల కోసం పిల్లల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు జిరాక్స్ సెంటర్ల ద్వారా తెచ్చిన అర్జీలను పూర్తి వివరాలను నింపి ఇవ్వడానికి దొరికినంతా దోచేస్తున్నారు. అందుకు గానూ రూ.150 వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు చదువు రాకపోవడంతో పాటు వారి అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు కార్యాలయం వద్ద తిష్టవేసుకున్నారు. దీనిపై తల్లిదండ్రులు మాట్లాడుతూ అపార్ ఐడీ కోసం విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్, బర్త్, సర్టిఫికెట్లలో ఒకేలా ఉండాలనే నిబంధనలు పెట్టారని, కూలీపనులు వదిలేసి వచ్చిన తమ నుంచి అర్జీలు, నోటరీ, వివిధ సేవా రుసుం ద్వారా అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు ఈ తంతు సాగిస్తున్నట్లు తెలిసినా రెవెన్యూ అఽధికారులు ఏమీ పట్టనట్టు ఉదాసీనంగా వ్యవహరించడం ఏమిటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్టిఫికెట్లు పొందేందుకు వచ్చే వారి కోసం అధికారులు సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment