హొసపేటె(బెంగళూరు): ఎంతో నెమ్మదస్తులు.. అందరితో సౌమ్యంగా మెలిగే కుటుంబం.. వైశ్య సముదాయంలో మంచి పేరు గడించిన ఆ ఇంట్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. దంపతుల సహా నలుగురు మృత్యువాతపడ్డారు. విజయనగర జిల్లా మరియమ్మనహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న రాఘవేంద్రశెట్టి, రాజశ్రీ దంపతుల ఇంటిలో శుక్రవారం వేకువజామున ఏసీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సిలిండర్ పేలి మంటలు చెలరేగి ఊపిరి ఆడక అతని కుమారుడు వెంకట ప్రశాంత్ (42), కోడలు చంద్రకళ (38), మనవడు అద్విక్ (16), మనవరాలు ప్రేరణ (14)లు మృతి చెందారు.
దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాఘవేంద్ర శెట్టికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకట ప్రశాంత్ స్థానికంగా కిరాణా వ్యాపారం చేస్తుండగా మరో కుమారుడు అమెరికాలో ఉన్నాడు. కుమార్తె కర్నూలులో ఉంది. వెంకట ప్రశాంత్‌కు కిరాణా వ్యాపారం ఉండటంతో మరియమ్మనహళ్లితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కడసారి చూపు కోసం వందలాదిగా జనం తరలివచ్చారు. ఎంతో మంచి కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడని విలపించారు. బంధువులు ఇంటివద్దకు చేరుకొని గుండెలు బద్దలయ్యేలా రోదించారు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలిని పోగొట్టుకొన్న రాఘవేంద్ర శెట్టి, రాజశ్రీ దంపతులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు.
చదవండి: వివాహేతర సంబంధం..భార్య, అత్త, ప్రియుడు, మరో మిత్రుడితో కలిసి..
Comments
Please login to add a commentAdd a comment