ఘటనా స్థలంలో ఏగోలపు మల్లయ్య మృతదేహం
సాక్షి ప్రతినిధి, వరంగల్/ఏటూరు నాగారం: ఆదివారం ఉదయం 6.15 గంటలు. అప్పటిదాకా పక్షుల కిలకిలారావాలు వినిపించిన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో ఉన్నట్టుండి తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని ఆయన తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కూంబింగ్ జరుపుతుండగా..
నవంబర్ 21న రాత్రి ములుగు జిల్లా వాజేడులో ఉయికే రమేష్, ఉయికే అర్జున్‌లను ఇన్‌ఫార్మర్ల పేరిట మావోయిస్టులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో గ్రౌహౌండ్స్ బలగాలు ములుగు జిల్లా అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఆదివారం ఉదయం చెల్పాక అడవుల్లో 10 నుంచి 12 మంది ఆలివ్‌గ్రీన్ దుస్తులు ధరించిన సాయుధ మావోయిస్టులు.. పోలీసు పార్టీలను గుర్తించి వెంటనే కాల్పులు మొదలెట్టారు.
ఆయుధాలు వదిలి లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు కొనసాగించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మిగతా వారు పారిపోగా ఘటన స్థలంలో రెండు ఏకే–47 రైఫిళ్లు, ఒక జీ–6, ఒక ఇన్సాస్, 303 రైఫిళ్లు, మందుగుండు సామగ్రి పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతులను తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, పాపన్న (35), దండకారణ్యం డివిజన్ కమిటీ సభ్యుడు, ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు, కోటి, కమలాకర్ (43), ఏరియా కమిటీ సభ్యులు ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సాకి జమున (23), పార్టీ సభ్యులు జైసింగ్ (25), కిషోర్ (22), కామేష్ (23)గా పోలీసులు గుర్తించారు. ఏగోలపు మల్లయ్యది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామం కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు.
తొమ్మిదేళ్ల తర్వాత ఎన్‌కౌంటర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పాగా వేసేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే 2015 సెపె్టంబర్ 15న ములుగు జిల్లా వెంగళాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హనుమకొండ వడ్డేపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థి తంగళ్లపెల్లి శ్రుతి అలియాస్ మహిత, వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెండ్యాలకు చెందిన మణికంటి విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సాగర్ మరణించారు. అప్పట్నుంచి సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరగడం కలకలం రేపుతోంది.
మావోయిస్టు పార్టీ సాయుధ విభాగం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ రెండురోజుల క్రితమే పిలుపునిచ్చింది. ఈ మేరకు వారోత్సవాలకు సన్నద్ధమవుతున్న సమయంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుని ఏకంగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
33 ఏళ్ల తర్వాత మళ్లీ వార్తలకెక్కిన చెల్పాక
తాజా ఎన్‌కౌంటర్‌తో చెల్పాక పేరు 33 ఏళ్ల తర్వాత మళ్లీ వార్తలకెక్కింది. 1991 జూన్ 21న అప్పటి పీపుల్స్‌వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ నక్సలైట్లు భారీ మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఏటూరునాగారం సీఐ సంతోష్‌కుమార్, ఎస్‌ఐ కిషోర్‌కుమార్ సహా ఏడుగురు సీఆర్‌పీఎఫ్ పోలీసులు మరణించారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజునే గ్రామ సమీపాన నక్సలైట్లు ఈ ఘటనకు పాల్పడ్డారు. చెల్పాక పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోసి, పథకం ప్రకారం పోలీసులకు సమాచారం చేరవేసి రప్పించిన నక్సల్స్.. ఈ భారీ మందుపాతర పేల్చారు. అదే చెల్పాక సమీప అడవుల్లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.
కొనసాగుతున్న కూంబింగ్
భారీ ఎన్‌కౌంటర్ పల్లెల్లో కలకలం రేపింది. ఇన్‌ఫార్మర్ల పేరిట వాజేడులో ఇద్దరి హత్య, ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్‌కౌంటర్ తర్వాత కూడా పోలీసు బలగాల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. పీఎల్‌జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు గొత్తికోయ గూడాలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు.
మృతుల వివరాలు.. లభ్యమైన ఆయుధాలు
1.కుర్సం మంగు: గొత్తికోయ. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చేరమంగి గ్రామం. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఇల్లందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి. ఇతని వద్ద లభ్యమైన ఆయుధం ఏకే–47.
2.ఏగోలపు మల్లయ్య: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామం. తెలంగాణ, డివిజన్ కమిటీ సభ్యుడు, ఏటూరునాగారం–మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి. ఇతని వద్ద కూడా ఏకే–47 లభ్యమైంది.
3.ముస్సాకి దేవల్: గొత్తికోయ. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసుర్ గ్రామం.
ఇతని వద్ద జీ3 రైఫిల్ లభ్యమైంది.
4.ముస్సాకి జమున: గొత్తికోయ. ఛతీస్‌గఢ్ రాష్ట్రం బైరామ్‌ఘర్ గ్రామం.
5.జైసింగ్: పార్టీ సభ్యుడు. ఇంద్రావతి ప్రాంతం. లభ్యమైన ఆయుధం.303 రైఫిల్.
6.కిషోర్: పార్టీ సభ్యుడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు పీఎస్ పరిధి పాంపాడ్ గ్రామం. లభ్యమైన ఆయుధం ఇన్సాస్ రైఫిల్.
7.కామేష్: పార్టీ సభ్యుడు. ఛతీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ పీఎస్ పరిధి మలంపెంట గ్రామం. లభ్యమైన ఆయుధం ఎస్‌బీబీఎల్ గన్.
Comments
Please login to add a commentAdd a comment