కొనసాగుతున్న దౌర్జన్యకాండ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యం
చంద్రబాబు, లోకేశ్‌ల అండతో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చంపుతామని బెదిరింపు.. ఊరొదిలి వెళ్లాలని పోలీసుల ఉచిత సలహా
పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామాల్లో దాడులు
తెనాలిలో, సత్తెనపల్లి మండలంలో ఇద్దరు నేతలపై హత్యాయత్నం
టీడీపీ దౌర్జన్యాలు, విధ్వంసాలపై నేడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ
ఢిల్లీ చేరుకుని అపాయింట్‌మెంట్ కోరిన ఎంపీల బృందం
జాతీయ మీడియాకు ఏపీలో పరిస్థితిని వివరించనున్న ఎంపీలు
రాష్ట్రంలో బీభత్సకాండపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైఎస్సార్‌సీపీ
హైకోర్టుకు వెళ్లాలని సూచన.. పిటిషన్ దాఖలు.. 13న విచారణ
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. వారం రోజులుగా జరిగిన వందలాది ఘటనల్లో వైస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ.. వైఎస్సార్ విగ్రహాలను కూలదోస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు మొదలైనప్పటికీ.. ఫలితాల వెల్లడి తర్వాత పరిస్థితి శ్రుతిమించి పోయింది.
ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. ‘ఇదేం అన్యాయం.. కాపాడండయ్యా..’ అంటూ బాధితులు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీస్తున్నా.. ఆ ఖాకీలు మాత్రం వృత్తి ధర్మాన్ని మరచి చోద్యం చూస్తున్నారు. తాజాగా అనంతపురంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను చంపుతామని బెదిరించారు.
ఊరు వదిలి వెళ్లాలని సాక్షాత్తు పోలీసు అధికారులే ఉచిత సలహా ఇస్తుండటం నివ్వెరపరుస్తోంది. తెనాలిలో వైఎస్సార్‌సీపీ నేత కాళిదాసు సత్యంపై, పల్నాడు జిల్లా బట్లూరులో ఆర్‌ఎంపీ వైద్యుడు శివయ్యపై హత్యాయత్నం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తల అరాచకం.. దౌర్జన్యం.. కనుసైగ చేసి దాడులను ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌ల తీరుపై రాష్ట్రపతికి నివేదించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది.
ఇందులో భాగంగా పార్టీ ఎంపీల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకుంది. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరింది. రాష్ట్రంలో విధ్వంసకాండ గురించి బుధవారం జాతీయ మీడియాకు కూడా వివరించనుంది. ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 13న ఈ పిటిషన్ విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment