నేత్రపర్వంగా భీమేశ్వరుని జల విహారం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలోని బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి తెప్పోత్సవం మంగళవారం రాత్రి నేత్ర పర్వంగా జరిగింది. కార్తిక మాసంలో స్వామి వారి జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకొని ప్రతీ ఏడాది ఆలయ కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాత్రి స్వామి,అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బ్యాండ్ మేళాలు వేద మంత్రాల మధ్య ఆలయ కోనేరు వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకొని వచ్చారు. పూలతో అలంకరణ చేసిన వేదికపై స్వామివారి అమ్మవారి విగ్రహాలను ఉంచి ఆలయ పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పారిశ్రామిక వేత్త వీరేంద్ర, నిమ్మకాయల రంగనాథ్, ఈఓ భళ్ల నీలకంఠం దంపతులు వేదికపై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పండితులు పూజలు చేసి వేదికపై ఆశీనులైన వారికి ఆశీర్వచనాలు అందజేశారు. బాణసంచా కాల్పుల మధ్య స్వామి,అమ్మవార్లను ఆలయ కోనేరులో విద్యుత్తు దీపాలంకరణతో ఏర్పాటు చేసిన హంస వాహనంపై ఉంచి వేదపండితుల ఆధ్వర్యంలో తెప్సోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మూడు పర్యాయాలు కోనేరులో స్వామివారి జలవిహారం అత్యంత అద్భుతంగా జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు, ఉత్సవాల ప్రత్యేకాధికారి కేవీ సూర్యనారాయణ, భక్త సంఘం నాయకులు బిక్కిన సాయి, ఆర్వీ సుబ్బరాజు భక్తులకు సేవలందించారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment