పాటే.. ప్రాణమై..
జిత్ మోహన్ మిత్రా
అది 1954వ సంవత్సరం.. నాడు హైస్కూల్ విద్యార్థిగా ఉన్న ఓ బాల గాయకుడు.. తబలా, హార్మోనియం వాయిద్యాలతో తొలిసారిగా బైజు బావ్రా హిందీ సినిమాలోని ‘ఓ దునియా కీ రఖ్‌వాలే’ పాటను ఉత్సాహంగా పాడుతున్నాడు. చుట్టూ ఉన్న మిత్రులు కేరింతలు, కరతాళధ్వనాలు అతడికి మరింత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆతడి గళం నుంచి జాలువారుతున్న పాటల ఝరి 70 వసంతాలుగా శ్రోతలను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేరొందిన చారిత్రక రాజమహేంద్రవరం నగరానికి
చెందిన ఆ గాయకుడి పేరు.. శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా. అంతకు ముందు నుంచే పాటలు
పాడుతున్నా తొలిసారిగా సంగీత వాయిద్య సహకారంతో పాడి 70 సంవత్సరాలు కావస్తున్న
సందర్భంలో కళాభిమానులు ఆదివారం జిత్ గాన వైభవ
వజ్రోత్సవం నిర్వహిస్తున్నారు.
నేడు వజ్రోత్సవ సభ
శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా 70 వసంతాల గాన వైభవ వజ్రోత్సవం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఉన్న ఆనం రోటరీ హాలులో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముదపాక నాగేశ్వరరావు, కేవీ నరసింహారావు, వడ్డాది సింహాచలం, సన్నిబాబు, జాన్ ఎలీషా, ఎండీ ఫర్వీజ్, అహ్మద్, జీకే వెంకటేష్, ఒంపోలు గోపాలకృష్ణ, బద్రీ బాబూరావు, భూషి శ్రీనివాస్ సత్కారాలు అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖుల ప్రసంగాలతో పాటు పాటల విందుకు కూడా భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నారయి.
● అలుపెరగని జిత్ స్వరఝురి
● సప్తస్వరాలకు సప్తతి మహోత్సవం
● నేడు 70 వసంతాల జిత్ గాన
వైభవ వజ్రోత్సవం
రాజమహేంద్రవరం రూరల్: జిత్ మోహన్ మిత్రా సంగీత ప్రస్థానం ఏడు దశాబ్దాలుగా అలుపూ సొలుపూ లేకుండా కొనసాగుతోంది. ఆయన గాత్రం నిత్యనూతనమే అంటే అతిశయోక్తి కాదు. రాజమహేంద్రవరంలో శ్రీపాద కృష్ణమూర్తి, సుబ్బలక్ష్మి దంపతులకు 1943లో జిత్ జన్మించారు. విద్యార్థి దశ నుంచే పాటతో జత కట్టిన జిత్.. ఓ సందర్భంలో తెలిసినవారి ఆర్కెస్ట్రాలో, తనలోని అభినివేశాన్ని ఆపుకోలేక, ఓ పాట పాడాడు. తమ ఆర్కెస్ట్రాలో పాడినందుకు దాని నిర్వాహకులు మందలించడంతో ఆయనలో పట్టుదల పెరిగింది. వేటగాడి బాణ ప్రయోగానికి క్రౌంచ పక్షుల జంటలో ఒకటి దెబ్బ తిన్న సందర్భంలో.. మహర్షి వాల్మీకి శోకం నుంచి రామాయణ ఆవిర్భావ శ్లోకం ఉదయించినట్లు.. నాటి అవమానం.. జిత్‌లో పట్టుదలను పెంచింది. అంతే 1970లో జిత్ మోహన్ మిత్రా ఆర్కెస్ట్రా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆయన వయసు 83 వసంతాలయితే.. గాయకుడిగా ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన స్థాపించిన ఆర్కెస్ట్రా వయసు 54 సంవత్సరాలు కావడం మరో విశేషం.
రివార్డులు.. రికార్డులు
జిత్ మోహన్ మిత్రా తన ఆర్కెస్ట్రా ద్వారా ఇప్పటి వరకూ సుమారు 6 వేల ప్రదర్శనలు ఇచ్చి, సంగీత ప్రియులను అలరించి, సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రసిద్ధ గాయకులు ఘంటసాల, బాలు, ముఖేష్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి మేటి గాయకుల పాటలను అలవోకగా గానం చేసిన జిత్.. ‘ఆంధ్రా కిషోర్ కుమార్’గా పేరొందారు. 1970, 1971, 1972, 1973 సంవత్సరాల్లో అఖిల భారత స్థాయి హిందీ పాటల పోటీల్లో జిత్ ఆర్కెస్ట్రా ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ ఆర్కెస్ట్రాలో రూ.5 పారితోషికం మీద పని చేసిన అలీ నేటి ప్రముఖ కమెడియన్‌గా సినీ రంగంలో నిలదొక్కుకున్నారు.
సినీ రంగంలో..
కళలంటే ప్రాణం ఇచ్చే కుటుంబ వారసత్వం జిత్‌మోహన్ మిత్రాది. తండ్రి, అన్నలు ఇద్దరు రంగస్థల నటులు. సోదరీ సోదరులు గాయనీ గాయకులు. నటుడు కూడా అయిన జిత్‌కు సినీ రంగం నుంచి ఎన్నో ఆహ్వానాలు వచ్చాయి. 300కు పైగా సినిమాల్లో నటించారు. బాపు, విశ్వనాథ్, జంధ్యాల వంటి అగ్రశ్రేణి దర్శకుల సినిమాల్లో నటించిన ఆయన.. బాపు దర్శకత్వంలో 1975లో వచ్చిన ముత్యాలముగ్గు చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. శంకరాభరణం, సప్తపది, వంశవృక్షం, ఆనంద భైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, బొబ్బిలి బ్రహ్మన్న, మేఘసందేశం, సీతారత్నంగారబ్బాయి, సర్‌గమ్, సుర్ సంగమ్ వంటి పలు హిట్ సినిమాల్లో తన నటకౌశలాన్ని ప్రదర్శించారు. ముద్దమందారం సినిమాలో ’నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి’ పాటను ఈయనే పాడారు. శంకరాభరణంలో ’హల్లో శంకరశాస్త్రి’ పాటలో నటించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలయిన సప్తపది సినిమాలో ‘గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన.. గోధూళి ఎర్రన ఎందువలన’ పాటలో జిత్, తన కుమార్తెతో కలిసి నటించడం మరో విశేషం. గోదావరి తీరంలో ఏ సినిమా షూటింగ్ జరిగినా, జిత్ సహకారం తప్పనిసరి. గోదారమ్మ ఒడిని విడిచి, దర్శక నిర్మాతల కోరిక మేరకు చైన్నె, హైదరాబాద్ నగరాలకు వెళ్లి ఉంటే, జిత్ అగ్రశ్రేణి నటుడిగా నేడు నీరాజనాలు అందుకుని ఉండేవారు. అయితే, కళ అనేది కాసుల కోసం పరుగులా మారకూడదని నమ్మిన ఆయన రాజమహేంద్రవరంలోనే ఉండిపోయారు.
జిత్ ప్రోత్సాహం మరువలేనిది
జిత్ కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది. నాటి వీరభద్ర టా కీస్ వద్ద నా నివాసం. అప్పటి నాగదేవి థియేటర్ సమీపాన జిత్ ని వాసం. బంగారు పళ్లేనికై నా గోడ చేరువ కావాలి. మా వాయిద్య ప్రతిభకు చక్కని వే దికను కల్పించి, వేలాది ప్రదర్శనల్లో పాల్గొనడానికి జిత్ మోహన్ మిత్రా ఆర్కెస్ట్రా చక్కని అవకాశం కల్పించింది. ఈ ఆర్కెస్ట్రా చేతుల మీదుగా సత్కారం అందుకోవ డం ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తోంది. – కేవీ నరసింహారావు, జాజ్ వాయిద్య కళాకారుడు
పాట నా ఆరో ప్రాణం
గాయకుడిగా నా సుదీర్ఘ జీవన యానంలో పాటే నాకు తోడుగా నిలిచింది. తుది శ్వాస విడిచే వరకూ పాడుతూనే ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను స్థాపించిన ఆర్కెస్ట్రాలో కొందరు కళాకారులు నేడు లేరు. వారిని స్మరించుకుంటూ, ఇప్పుడున్న వారిని సత్కరించుకోవడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. పాట నా ఆరో ప్రాణం.
– శ్రీపాద జిత్ మోహన్ మిత్రా, నటుడు, గాయకుడు, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment