బాలలూ..భళా
● కాకినాడలో రాష్ట్ర స్థాయి క్రియ
పిల్లల పండగ ప్రారంభం
● ఆటపాటలతో చిన్నారుల సందడి
● ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
● ఆలోచింపజేసిన లఘు నాటికలు
● తొలి రోజు 15 అంశాలపై పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నగరానికి చెందిన క్రియ స్వచ్ఛంద సంస్థ ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రియ పిల్లల పండగకు జేఎన్‌టీయూకే వేదికై ంది. తొలి రోజైన శనివారం నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 4,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడంతో.. అప్పుడే రెక్కలు విచ్చుకున్న పక్షుల మాదిరిగా.. వేలాదిగా చిన్నారులు వర్సిటీ అవరణలో సందడి చేశారు. శాసీ్త్రయ నృత్యం, నాటికలు, ఏకపాత్రాభినయం, కోలాటం, గ్రూప్ సాంగ్స్, పోస్టర్ ప్రజెంటేషన్, సైన్స్ ప్రయోగాలు, డిబేట్ గ్రూపు, మ్యాప్, గణితం, క్విజ్, వ్యాసరచన, కథా రచన, కథా విశ్లేషణ, ఇంటర్‌నెట్‌లో విశ్లేషణ వంటి 15 అంశాల్లో చిన్నారులకు పోటీలు నిర్వహించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలుగా ఈ పోటీలు జరిగాయి. ఎక్కడ చూసినా రకరకాల వేషధారణలతో అలరించిన చిన్నారులతో వర్సిటీ మైదానం కళకళలాడింది. అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, ఝూన్సీ లక్ష్మీబాయి తదితరుల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. పార్వతీ పరమేశ్వరులు, మహిషాసుర మర్దిని వంటి శాసీ్త్రయ నృత్యాలతో పాటు చదువు, ఆరోగ్యం, ప్రాధాన్యాన్ని తెలిపేలా ప్రదర్శించిన లఘు నాటికలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని రంగాల్లో ముందుంటున్న మహిళలు నేటికీ వివక్షకు గురవుతున్న వైనాన్ని, మహిళల ప్రాధాన్యాన్ని వివరించేలా ప్రత్యేక నాటికను ప్రదర్శించారు. త్యాగరాజు, అన్నమయ్య తదితర వాగ్గేయకారుల కీర్తనలను విద్యార్థులు పోటీ పడి మరీ వీనుల విందుగా ఆలపించారు. వ్యవసాయ ప్రాధాన్యం, గ్రహణాలు ఏర్పడటం, భూ భ్రమణం, భూ పరిభ్రమణం తదితర భౌగోళిక అంశాలపై ప్రాజెక్టులు ప్రదర్శించారు. మరికొన్ని అంశాలపై ఆదివారం పోటీలు నిర్వహించనున్నారు.
పోటీతత్వం అలవర్చుకోవాలి
సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని, బహుమతులతో సంబంధం లేకుండా నైపుణ్యం చూపి, దానిని మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన చిన్నారులకు మొదటి మూడు బహుమతులతో పాటు రెండు కన్సొలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్రియ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథరావు, వలంటీర్లు పాల్గొన్నారు.
గోపాలబాలుడమ్మా..: శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణల్లో విద్యార్థులు
నమో వేంకటేశ..: వేంకటేశ్వరస్వామి వేషధారణలో..
తెలుగువీర లేవరా..: అల్లూరి సీతారామరాజుగా ఆకట్టుకున్న చిన్నారి
Comments
Please login to add a commentAdd a comment