రత్నగిరిపై భక్తుల రద్దీ
ఆలయ ప్రాంగణంలో సత్యదేవుని రథ సేవ
●
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరికి ఆదివారం కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకుని, వ్రతమాచరించారు. వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సప్తగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణునికి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో స్వామివారి అన్నప్రసాదాన్ని 4 వేల మంది స్వీకరించారు.
కన్నుల పండువగా రథసేవ
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథసేవను ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం మేళతాళాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్ల విగ్రహాలను పండితులు ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో వేంచేయించి, పూజలు చేశారు. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి రథసేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారం నాలుగువైపులా కొబ్బరి కాయలు కొట్టి రథసేవ కొనసాగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. ఏఈఓ కృష్ణారావు రూ.2,500 టికెట్టుతో ఈ సేవలో పాల్గొన్నారు.
రత్నగిరిపై నేడు
● సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలంకరణలో (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు.
● మార్గశిర అమావాస్యను పురస్కరించుకుని సోమవారం ఉదయం 9 గంటల నుంచి వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. భక్తులు రూ.750 టికెట్టుతో ఈ హోమంలో పాల్గొనవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment