వెక్కిరిస్తున్న తొలి సంతకం
రాయవరం: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలు పైనే తొలి సంతకం అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫైలుపై సంతకం చేశారు. అయితే నేటి వరకు నోటిఫికేషన్ మాత్రం జారీ చేయలేదు. ప్రభుత్వం నుంచి రోజుకో ప్రకటనతో అభ్యర్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఏవేవో సాకులు చూపుతూ నోటిఫికేషన్‌ను జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు అభ్యర్థుల నుంచి విన్పిస్తున్నాయి. తాజాగా ఎస్సీ వర్గీకరణ నివేదిక రాగానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ కొత్త రాగం అందుకున్నారు. మరోపక్క అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పట్టి..డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా..అంటూ ఎదురుచూపులు చూస్తున్నారు.
వాయిదాలపై వాయిదాలు
డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూసిన ప్రతి సారీ ఏదో ఒక సాకు చెప్పి ప్రభుత్వం వాయిదా వేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ మరోసారి నిర్వహించి, ఆపై డీఎస్పీ నోటిఫికేషన్ ఇస్తామని తొలుతగా ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. టెట్‌ను నిర్వహించి, నెలలు గడిచాయి. అనంతరం డీఎస్సీపై కోర్టు కేసులు పరిశీలించి, అడ్డంకులు తొలగించి నోటిఫికేషన్ ఇస్తామంటూ వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చాక నోటిఫికేషన్ అంటూ మెలిక పెట్టారంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే వయసు మీరి, అవకాశాన్ని కోల్పోతామని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోచింగ్ బాట పట్టిన అభ్యర్థులు
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 60వేల మంది వరకు వేచి చూస్తున్నట్టు అంచనా. ఇప్పటికే పలువురు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆశతో వేలాది మంది అభ్యర్థులు వారు చేస్తున్న ఉద్యోగాలను వదిలి, మరోపక్క అప్పులు చేసి మరీ కోచింగ్‌ల బాట పట్టారు. టీచర్ కొలువు సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది కోచింగ్ సెంటర్లలో చేరారు. వారు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలి, కుటుంబాలకు దూరమై కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీశారు. ఉన్న ఉద్యోగాన్ని వదలడంతో జీతం నష్టపోవడమే కాాకుండా, మరోపక్క కోచింగ్‌కు వేలాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నష్టపోతున్నారు.మరోపక్క కోచింగ్ సెంటర్లకు కాసుల పంట పండినట్టయింది.
టెట్‌కు 30వేల మంది హాజరు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గతేడాది అక్టోబరు 3 నుంచి 21వ తేదీ వరకు టీచర్ ఎలిజబిలిటీ పరీక్ష (టెట్)ను జిల్లాల వారీగా నిర్వహించారు. ఈ పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 30వేల మంది హాజరయ్యారు. రెట్టింపు సంఖ్యలో బీఎడ్, డీఎడ్ శిక్షణ పొందిన అభ్యర్థులు ఉన్నప్పటికీ 30వేల మంది వరకు టెట్ రాశారు. గతంలో టెట్ రాసిన వారు, తాజాగా టెట్ రాసిన అభ్యర్థులంతా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్‌కు తప్పని ఎదురుచూపులు
కోచింగ్‌లకు రూ.లక్షలు వెచ్చిస్తున్న వైనం
జిల్లాలో 60వేల మంది
బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు
నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా
డీఎడ్ పూర్తి చేశాను. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాను. గతేడాది జూలైలో నోటిఫికేషన్ ఇస్తారని ప్రభుత్వం ప్రకటించడంతో కోచింగ్ కూడా తీసుకున్నాను. టెట్‌కు హాజరయ్యాను. నోటిఫికేషన్‌పై అభ్యర్థులంతా ఆశలు పెట్టుకుని చూస్తున్నారు. త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలి.
– పి.శశికళ, కోట, కె.గంగవరం మండలం
వాయిదాలు పడుతున్నాయి
డీఎడ్, బీఎడ్ కూడా పూర్తి చేశాను. డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించగానే ప్రైవేట్‌గా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కోచింగ్‌కు వెళ్లాను. వేలాది రూపాయలు వెచ్చించి, కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకున్నాను. త్వరగా నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంటుంది.
– టి. వెంకటసాయి హర్షిక, వెదురుపాక, రాయవరం మండలం.
టీచర్ పోస్టులపై కానరాని స్పష్టత
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ కొలువులు ఎన్ని అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం క్షేత్ర స్థాయి నుంచి నివేదిక కోరింది. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,146 వరకు ఖాళీలున్నట్టు సమాచారం. క్షేత్ర స్థాయిలో ఉన్న ఖాళీలను లెక్కించి, ఆర్థిక శాఖ అనుమతితో డీఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య ప్రకటించే అవకాశముంటుంది.
Comments
Please login to add a commentAdd a comment