ఆలమూరు: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీతిరుపతి తిరుమల దేవస్థానం అఽనుబంధ సంస్థ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా పురందరదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు హిందుత్వానికి ప్రాచుర్యం కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని డైరెక్టర్ పగడాల ఆనంద తీర్థాచార్యులు అన్నారు. స్థానిక అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో బుధవారం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాస సాహిత్య ప్రాజెక్టు పర్యవేక్షణలో సుమారు 8,600 మహిళ భక్తిమండళ్లను ఏర్పాటు చేశామన్నారు. అందులో 4,500 గ్రూపులు చురుగ్గా పని చేస్తూ టీటీడీ చేపడుతున్న భక్తి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్నాయన్నారు. భజన మండళ్ల ఏర్పాటుకు విశేష స్పందన వస్తున్నందున త్వరలోనే ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువచ్చి మరిన్ని మండళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగానే వెబ్‌సైట్ నిర్వహించనున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో దాస సాహిత్యం ప్రాచుర్యం పొందిందన్నారు. పురందరదాసు 4.75 లక్షల సంకీర్తనలు రచించారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 47ఏళ్ల క్రితం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఏర్పాటు చేసిందన్నారు. పురందరదాసు కీర్తనల సారాంశాన్ని వివరించి మండలి సభ్యులకు నేర్పిస్తామని వివరించారు. కోలాటం ద్వారా కూడా సంకీర్తనలు ఆలపించే విధంగా బాలికలకు దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా శిక్షణను ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కోలాట శిక్షణ కోసం బడ్జెట్ కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో కోలాటానికి మరింత ప్రాచుర్యం కల్పించే విధంగా బాలికలకు శిక్షణ కోసం టీటీడీ గత ఏడాది రూ.2.30 కోట్ల బడ్జెట్ కేటాయించిందని దాస సాహిత్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మరిన్ని భజన మండళ్లు ఏర్పాటు చేసి టీటీడీ ధార్మిక వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద తీర్థాచార్యులు దంపతులు అయ్యప్పస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాస సాహిత్య ప్రాచుర్యకర్త పి.ముకుందేశ్వరస్వామి. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు వంటిపల్లి సతీష్ పాల్గొన్నారు.
దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా
8,600 భక్తి మండళ్ల ఏర్పాటు
డైరెక్టర్ ఆనంద తీర్థాచార్యులు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment