ముంబై: ‘వాన రాకడ, ప్రాణం పోకడ’ జాబితాలో ‘కరెంట్’ను కూడా చేర్చారు మహారాష్ట్ర సతార జిల్లాలోని మన్యచివాడి గ్రామస్థులు. ఆ ఊళ్లో కరెంటు అనేది ఉన్నప్పటికీ ఎప్పుడు ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. చీకటే చీకటి! రైతుల పొలాలు దెబ్బతింటున్నాయి. వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. సుదీర్ఘమైన కరెంటు కోతలు భరించలేక గ్రామప్రజలు ఎక్కే గడప, దిగేగడపలా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ‘చూద్దాం, చేద్దాం’ అనే మాటలు తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదు.
ఇక ఇలా కాదనుకొని మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘ఎవరో ఇవ్వడం ఏమిటీ, కరెంట్ మనమే తయారు చేసుకుందాం’ అని ఒకరు ప్రతిపాదించినప్పుడు– ‘అవేమైనా రొట్టెలా మనమే తయారు చేసుకోవడానికి’ అని అనుకునేంత అమాయకులు కూడా ఉన్నారు. వారు సోలార్ పవర్ గురించి వినింది లేదు!
రకరకాల మాటల తరువాత అందరూ సోలార్ పవర్‌కే ఓటు వేశారు. ఆ తరువాత సోలార్ పవర్ నిపుణులతో చర్చించారు. ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. మొదట గ్రామ వీధుల్లోకి సోలార్ పవర్ లైట్లు వచ్చాయి. ఆ తరువాత ప్రతి ఇంటికి ‘సోలార్ యూనిట్’ ఆలోచన చేశారు. అయితే ఒక్కో యూనిట్‌కి సుమారు ఆరువేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
ఊళ్లో బీదాబిక్కీ ఉంటారు కాబట్టి అంత మొత్తాన్ని అందరూ భరించే పరిస్థితి లేదు. దీంతో మహిళా స్వయం సహాయక బృందాలు ఆ ఖర్చులో ఎక్కువ భాగాన్ని భరించాయి. గ్రామపంచాయితీ, దాతలు తమ వంతుగా సహాయపడ్డారు. ఎట్టకేలకు ఊరు చీకటి నుంచి విముక్తి అయింది...‘సోలార్ గ్రామ్’గా మారింది. ఇప్పుడు ఆ ఊళ్లో కరెంటు కోత అనే మాట వినబడదు. ‘ఒకప్పుడు మా ఊరికి కోడలుగా రావడానికి భయపడేవారు. కరెంటులాంటి మౌలిక సదుపాయాలు లేని ఊరు అనే పేరు ఉండేది.
గ్రామ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండేది. అయితే పవర్ అనేది గ్రామ అభివృద్ధికి ఎంత కీలకం అనే విషయం అర్ధమైంది’ అంటుంది సంగీత అనే మహిళ. ‘చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు...చిరుదీపమైనా వెలిగించు’ అనే మంచిమాట ఉంది. చిరుదీపం ఏమి ఖర్మ....శక్తిమంతమైన సోలార్ దీపాన్నే వెలిగించారు గ్రామ మహిళలు. ఆ వెలుగులు ఊరకే పోలేదు. ఊరి అభివృద్ధికి గట్టి ఇంధనం అవుతున్నాయి. మన్యచివాడి ఇప్పుడు ఆదర్శ గ్రామం అయింది. ఈ చిన్న గ్రామం గురించి ఎప్పుడూ వినని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం...చిన్నా,పెద్దా తేడా లేకుండా ఊళ్లో ప్రతి ఒక్కరూ సోలార్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం.
చదవండి: ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్‌కు ఎందుకు పెట్టారు..?
Comments
Please login to add a commentAdd a comment