ఒక పెద్ద భవనం నిర్మిస్తేనో, ఒక పరిశ్రమ స్థాపిస్తేనో అభివృద్ధి జరిగింది అనుకోవడం మన దగ్గర ప్రచారంలో ఉంది. దానికి గత ప్రభుత్వాలు ఇచ్చిన ప్రచారం అలాంటిది. నిజమైన పరిశ్రమలు వస్తే స్వాగతించవలసిందే. కానీ ఆ పేరుతో జరిగిన ఆర్థిక అవకతవకలకు, రియల్ ఎస్టేట్ దందాలకు లెక్క లేదు. దీనికి భిన్నంగా, మిరుమిట్లు గొలిపే గ్రాఫిక్స్ చూపడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవిక పునాదుల మీద అభివృద్ధిని చూపిస్తోంది. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నట్టుగా ఒక ఊరిని సర్వతోముఖాభివృద్ధి చేస్తోంది. ఇది ఆలోచనాత్మక పంథా, మానవీయ పంథా, సంక్షేమ పంథా.
కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించిన అంశం ఒక కొత్త చర్చకు దారి తీసింది. అభివృద్ధి అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామాలలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆ పక్కనే ఉన్న గ్రామ సచివాలయం, దాని వెంటనే విలేజ్ క్లినిక్, మరో వైపు అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడులలో కార్పొరేట్ తరహాలో పూర్తి మార్పులు చేయడం... ఇదంతా అభివృద్ధి కాదా అని ఆయన అడిగారు. నిజమే, ఇవన్నీ అభివృద్ధి కిందకే వస్తాయి. కానీ మన దేశంలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, ఆ తర్వాత విభజిత ఏపీలో గానీ ఒక అంశం విస్తారంగా ప్రచారం అయింది. ఒక భారీ భవనం నిర్మిస్తేనే, ఒక పరిశ్రమ ఏదైనా పెడితేనే అభివృద్ధి అని కొన్ని సూత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. దానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలు కొంతవరకు కారణం కావచ్చు. ఆయన సుదీర్ఘకాలం, సుమారు పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏంచేస్తే అదే అభివృద్ధి అన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. అమరావతి ఉంటేనే యువతకు ఉద్యోగాలు లభిస్తాయేమో అన్న అభిప్రాయం విస్తారంగా వెళ్లేలా చూశారు. అంతదాకా ఎందుకు... ఈ మధ్యన జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సైతం అమరావతిని నాశనం చేయడం అంటే యువత భవితను నాశనం చేయడమేనని వ్యాఖ్యానించింది. అదే పార్టీ నాయకులు కొందరు అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నాడని విమర్శిస్తుంటారు.
ఒక పరిశ్రమ వస్తే మొత్తం అభివృద్ధి జరిగిపోయినట్లు అనుకోవాలన్నది ఒక థియరీ. పరిశ్రమలు రాకూడదని ఎవరూ అనరు. విశాఖ నగరంలో చంద్రబాబు ప్రభుత్వం ఏవేవో సదస్సులు పెట్టి, ఆ తర్వాతి సంవత్సరాలలో అవన్నీ పెట్టుబడులుగా మారిపోయినట్లు, పరిశ్ర మలు వచ్చేసినట్లు నమ్మబలికించే యత్నం చేసింది. ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టేవారు. నిజం గానే అలా జరిగితే అంతకన్నా కావల్సింది ఏమిటి? కానీ ఒక్కసారి విశాఖలో కానీ, ఇతర ప్రాంతాలలో కానీ పరిశ్రమలు, సంస్థలు పెడ తామని ముందుకు వచ్చినవారిలో కొందరు భూములు తీసుకున్నారే తప్ప, ఎలాంటి అభివృద్ధి చూపలేదు. ఉదాహరణకు జగ్గయ్యపేట వద్ద ఒక సంస్థకు 400 ఎకరాలు కేటాయిస్తే, అక్కడ ఎలాంటి ప్రగతి లేదు. పైగా దాన్ని ఎలా రియల్ ఎస్టేట్ కిందకు మార్చాలా అన్న ఆలోచన చేశారన్న విమర్శ వచ్చింది. విశాఖలో లూలూ కంపెనీకి అత్యంత విలువైన పదమూడు ఎకరాలు ఇస్తే, అక్కడ సుయి, సయి లేదు. అమరావతి ప్రాంతంలో ఒక భారీ ఆస్పత్రితో పాటు, పలు పరి శ్రమలు స్థాపిస్తామని ప్రతిపాదించిన బి.ఆర్. షెట్టి అనే పారిశ్రామిక వేత్త ఏ రకంగా ఆర్థిక నేరాల కేసులో ఇరుక్కున్నారు అన్నదానిపై పలువార్తలు వచ్చాయి. అలా అని అసలు ఏమీ రాలేదని అనజాలం. అనంతపురం జిల్లాలో కియా కార్ల కర్మాగారం వచ్చింది. కానీ అందుకు ఏపీ ప్రభుత్వం రాయితీల రూపంలో భారీగా చెల్లించవలసి వచ్చింది. ఆ సంస్థ ద్వారా వేలాదిమందికి ఉపాధి కలిగితే మంచిదే. కానీ వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఇచ్చిన రాయితీలు ఎన్ని అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పైగా ఆ కంపెనీకి కేటాయించిన భూమి చుట్టుపక్కలా టీడీపీ నేతలు ఎలా రియల్ ఎస్టేట్ చేసి కోట్ల వ్యాపారాలు చేశారన్నదానిపై కథలు, కథలుగా చెబుతారు. ఇక పవర్ ప్రాజె క్టులు, సోలార్ ప్లాంట్ల వంటివాటికి పాతికేళ్ల ఒప్పందం అధిక ధరలకు చేసుకోవలసి రావడం రాష్ట్రానికి పెద్ద శాపంగా పరిణమించిందన్న భావన ఉంది. చంద్రబాబు టైమ్‌లో పరిశ్రమలు వచ్చింది తక్కువ, ఊదర గొట్టింది ఎక్కువ. ఈ పరిశ్రమలను కొందరు కేవలం బ్యాంకు రుణాల కోసం పెట్టి, ఆ తర్వాత వాటిని సరిగా నడపకుండా కోట్ల రూపాయలను ఎగవేస్తున్న వైనం చూస్తున్నాం. ఇందులో వ్యాపారులే కాదు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. ఉదాహరణకు టీడీపీ నుంచి బీజేపీలోకి మారిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గ్రూపు వారు అనేక బోగస్ కంపెనీలను స్థాపించి, తద్వారా సుమారు 5,500 కోట్ల రూపాయల మేర బ్యాంకులను డూప్ చేశారని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ఇలాంటి అభివృద్ధి కావాలా లేక వాస్తవిక ప్రాతిపదికన జరిగే అభివృద్ధి కావాలా?
నిజమైన పరిశ్రమలు వస్తే స్వాగతించవలసిందే. వారికి అవసర మైన రాయితీలు ఇవ్వాల్సిందే. కానీ పరిశ్రమలు వస్తేనే అంతా అభివృద్ధి అయిపోతే ముంబై నగరంలో పేదరికం ఉండకూడదు. అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి. వాటి చెంతే ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ ధారావి కూడా ఉంది. పరిశ్రమలు వస్తే ఉపాధి పెరిగి, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. అదే పరిశ్రమ మూతపడితే వంద లాది మంది రోడ్డున పడుతున్నారు. ఈ నేప«థ్యంలో ముఖ్యమంత్రి జగన్ లేవనెత్తిన అంశాన్ని గమనంలోకి తీసుకుంటే- రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల కోసం వేలాది భవనాలు నిర్మించారు. గ్రామ సచివాలయాల కోసం కొన్ని వేల భవనాలు వెలిశాయి. నాడు-నేడు కింద స్కూళ్లను మార్చడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్య ఒక పారిశ్రామికవేత్త రాజంపేట వద్ద ఉన్న తన సొంత గ్రామానికి వెళ్లారట. అక్కడ ఆయన పిల్లల సదుపాయార్థం ఒక స్కూలు నడుపుతున్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ స్కూలును ఇటీవలికాలంలో మార్చిన తీరు చూసి ఆశ్చర్యపోయి, తమ స్కూలుకు దీటుగా అది తయారైందని వ్యాఖ్యానించారు. ఇవన్నీ చేయడానికి ఆలోచన కావాలి. జగనన్న కాలనీల పేరుతో కొత్త ఊళ్లను వేల సంఖ్యలో నిర్మిస్తున్నారు. వాటి నిర్మాణానికి అవసరమైన లక్షల టన్నుల సిమెంట్, ఇనుము, గృహనిర్మాణ సామగ్రికి సహజంగానే డిమాండ్ వస్తుంది. ఇదంతా ఆర్థిక వ్యవస్థలో భాగమే ఒక్కో పేద వాడికి ఐదు నుంచి పదిహేను లక్షల వరకు ఆస్తిని సమకూర్చిన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచిపోతుంది. దీన్ని అభివృద్ధి అనరా? గ్రామ, వార్డు సచివాలయాలలో స్థానికులైన పది, పదిహేను మంది పిల్లలకు ఉపాధి లభిస్తోంది. వాలంటీర్ల రూపంలో కొన్ని లక్షల మందికి ఎంతో ఊతం లభిస్తోంది. దీన్ని ఉపాధి కల్పన అనకూడదా?
మరోమాట. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క అమరావతి ప్రాంతం లోనే భారీ నిర్మాణాలు చేపట్టాలని తలపెట్టింది. అంతకుముందు అదంతా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారన్నది బహిరంగ రహస్యమే. మరి ఒకే చోట వేల కోట్లు ఖర్చు పెట్టడం అభివృద్ధి అవు తుందా? రాష్ట్రం అంతటా ఆ డబ్బును వికేంద్రీకరించి నిర్మాణాలు చేపట్టడం అభివృద్ధి అవుతుందా? పేదలకు పలు సంక్షేమ పథకాలను ఇవ్వడంపై కూడా కొన్ని వర్గాలలో విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే అవే వర్గాలు చంద్రబాబు టైమ్‌లో పసుపు-కుంకుమ అనో, అన్నదాత సుఖీభవ అనో, రుణమాఫీ అనో వేల కోట్ల రూపా యలను ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఖర్చు పెడితే ఆహాఓహో అని పొగిడాయి. కరోనా సంక్షోభంలో జగన్ ప్రభుత్వం పేదలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేయడం ఎంతో ఉపయోగ పడిందన్న వాస్తవాన్ని విస్మరించి ఇవే వర్గాలు డబ్బు పంచుడేనా, అభివృద్ధి ఏమైనా జరుగుతుందా అని ప్రచారం చేస్తున్నాయి.
ఇతరత్రా అభివృద్ధిని విస్మరిస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయ డానికి వీలుగా రాష్ట్రం అంతటికీ కనిపించేలా కొన్ని ప్రాజెక్టులు చేపట్టడం కూడా అవసరమే అనిపిస్తోంది. పరిశ్రమలు ప్రచారం కోసం కాకుండా నిజంగా పనిచేసే వాటిని స్థాపింప చేయగలగాలి. పోర్టులు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా అవి పూర్తి కావడానికి కొంత వ్యవధి పట్టవచ్చు. అయినా ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు వెళుతోందన్న అభిప్రాయం కలిగించక పోతే, ప్రత్యర్థులు అసలు అభివృద్ధి జరగడం లేదన్న అబద్ధపు ప్రచారం చేసి మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గాలను నమ్మించడానికి యత్నిస్తారు. వీటన్నిటికి చెక్ పెట్టే విధంగా అమరావతి ప్రాంతంలో కొన్ని హబ్‌ల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ రంగాల ప్రాజెక్టులు అమలులోకి తీసుకురాగలిగితే జగన్ ప్రభుత్వానికి తిరుగు ఉండదు.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
వాస్తవిక పునాది మీదే అభివృద్ధి
Published Wed, Jul 14 2021 12:40 AM | Last Updated on Wed, Jul 14 2021 5:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment