రక్షణకు తలమానికం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): హెల్మెట్ ధారణపై పోలీసు శాఖ దృష్టిసారించింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ వాడకపోవడంతో 650 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధారణ అంశాన్ని రవాణా, పోలీసు శాఖ అధికారులు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తక్షణ చర్యలపై నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఎస్పీ సతీష్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హెల్మెట్ ధారణను తప్పనిసరి చేసే చర్యలు చేపట్టారు. జరిమానాలకే పరిమితం కాకుండా ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలోనూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
హెల్మెట్ లేకే మరణాలు
రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవిస్తున్నాయని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల గుంటూరు రింగురోడ్డు వద్ద రాత్రిపూట రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయ్యప్పమాల వేసుకున్న ఓ యువకుడితోపాటు ఓ సీనియర్ సిటిజన్ మరణించారు. వీరిద్దరూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలై మృతిచెందడం విషాదకరం.
● మంగళరి బైపాస్‌లో జరిగిన మరో ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి లారీ కింద పడి తల నుజ్జునుజ్జు అయి మరణించాడు. హెల్మెట్ ఉండి ఉంటే బతికేవాడు.
● కొల్లూరు వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను కారు ఢీకొంది. ఈ ఘటనలో హెల్మెట్ లేకపోవడంతో భర్త అక్కడికక్కడే మరణించాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
కళా రూపాల ద్వారా
పోలీసు శాఖ ప్రత్యేక కళారూపకాల ద్వారా వినూత్న ప్రదర్శనలతో ప్రజల్లో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తోంది. నిబంధనలను వివరిస్తూ ప్రమాదాలు జరిగే తీరును కళ్లకు కడుతున్నారు. యమదూతలు వచ్చి పట్టుకెళ్లినట్టు వినూత్నంగా ప్రదర్శనలు చేపడుతున్నారు. యమధర్మరాజు వేషధారి చేత నిబంధనలు చెప్పించడం, హెల్మెట్‌ధారణతో ప్రయాణించే వారికి వినాయకుని వేషధారి గులాబీ పువ్వు అందించి అభినందిచడం వాహనదారులను ఆకట్టుకుంటోంది. దీంతోపాటు పోలీసులు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహన ర్యాలీలు చేపడుతున్నారు. కొత్త సంవత్సరం నుంచి కట్టుదిట్టంగా నిబంధనల అమలుకు సిద్ధమవుతున్నట్టు ఎస్పీ సతీష్‌కుమార్ చెబుతున్నారు. అందరూ హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు.
హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం వినూత్న ప్రదర్శనలతో పోలీసుల అవగాహన స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ సతీష్‌కుమార్ ఇప్పటికే జరిమానాల పరంపర కొత్త సంవత్సరంలో మరింత స్పీడు పెంచనున్న పోలీసులు ఈ ఏడాదిలో 380 మందికిపైగా మృతి, 1500 మందికిపైగా గాయాలు నిబంధనలను కట్టుదిట్టం చేయనున్న పోలీసుశాఖ
గుంటూరు జిల్లాలో గత మూడేళ్లుగా ప్రమాదాల సంఖ్య ఇలా..
సంవత్సరం ప్రమాదాలు మరణాలు క్షతగాత్రులు
2022 1092 427 2,122
2023 972 334 1,782
2024 855 352 1,900
(నవంబర్ వరకు)
(మృతుల్లో 60శాతం హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోయారు)
తలకు గాయం కావడం వల్లే మరణాలు
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందే. ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 60శాతం మంది హెల్మెట్ లేక తలకు బలమైన గాయం కావడం వల్లే మరణించారని తేలింది. ప్రతిఒక్కరూ హెల్మెట్ పెట్టుకుని మాత్రమే ద్విచక్రవాహనంపై ప్రయాణం మొదలు పెట్టాలి. లేకుంటే భారీ జరిమానాలు విధిస్తాం. ప్రజలు అర్థం చేసుకోవాలి.
– ఎస్ సతీష్‌కుమార్, ఎస్పీ, గుంటూరు జిల్లా
ద్విచక్ర వాహన ప్రమాదాలకు కారణాలు
రోడ్డు మలుపుల వద్ద వేగంగా వెళ్లడం, జాగ్రత్తలు పాటించకపోవడం
కూడళ్లలో రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా దూకుడుగా వెళ్లడం
ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లడం వల్ల వాహనం అదుపు తప్పడం
మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడపడం
సరైన నైపుణ్యం లేని డ్రైవింగ్, రహదారి భద్రతపై అవగాహన లేకపోవడం
Comments
Please login to add a commentAdd a comment