పసుపు సౌభాగ్యం దక్కేనా!
భరోసా లేక రైతుల ఆందోళన
తెనాలి/కొల్లిపర: ఏపుగా పెరిగి, పచ్చని పసిమితో కళ్ల ముందు కళకళలాడుతున్న పసుపు పైరు రైతుకు సంతృప్తినివ్వడం లేదు. భూమిలో దుంప చక్కగా ఊరుతుందన్న భరోసా లేదు. పంట దున్నేనాటికి ఆశించిన దిగుబడి రాదనే గుబులుతో రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజనులో అధిక వర్షాలు, అల్పపీడనాలు, ప్రతికూల వాతావరణంతో కొనసాగటమే పైరుకు చేటు తెచ్చింది. అక్కడక్కడా తెగుళ్లూ ఆశించాయి. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర ఉండటమే రైతులకు కొంచెం ఊరటనిచ్చే అంశం. పసుపు మార్కెట్‌కు వచ్చేవరకు ఇవే ధరలు ఉండాలని కోరుకుంటున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
తెనాలి నియోజకవర్గంలోని 2,300 ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. ఇందులో అధికశాతం కొల్లిపర మండలంలోనే ఉంది. కృష్ణా నదికి వరదల కారణంగా లంక భూముల్లో దాదాపు 800 ఎకరాల వరకు పంట దెబ్బతింది. ప్రస్తుతం 1,500 ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. ఖరీఫ్ సీజనులో నాటిన పసుపు జనవరి, ఫిబ్రవరి నెలల్లో చేతికొస్తుంది. వాస్తవానికి 2023లో పసుపుకు మార్కెట్ ధర పతనం కావడంతో ఆ ఏడాది కొందరు రైతులు సాగుకు విముఖత చూపారు. అయితే, 2024 సీజనులో అనూహ్యంగా ధర పెరిగింది. ప్రారంభంలో క్వింటాలు రూ.5వేలకు కాస్త అటూఇటూగా ఉన్న ధర పెరుగుతూ రూ.14,800 వరకు పలికింది. దీంతో 2024–25 ఖరీఫ్ సీజనులో సాగు విస్తీర్ణం కొంత పెరిగింది.
పెట్టుబడి అధికం
ఇతర పంటలతో పోలిస్తే పసుపుకు ఖర్చులు అధికం. గతేడాది మార్చిలో పెరిగిన మార్కెట్ ధరలతో విత్తనం ధర కూడా భారీగానే పెరిగింది. ఎకరాకు ఆరు పుట్ల చొప్పున నాటుతారు. ఒక్కో పుట్టి ధర రూ.10 వేలకు రైతులు కొనుగోలు చేశారు. విత్తనం నాటడం నుంచి ఎండు పసుపు చేతికొచ్చే సరికి ఒక్కో ఎకరాకు కనీసం రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కౌలు రైతులకు రూ.50 వేలు అదనం.
వెంటాడిన ప్రతికూల వాతావరణం
భారీ పెట్టుబడితో సాగుచేస్తున్న పసుపు పైరును ఖరీఫ్ సీజనులో ఆది నుంచి ప్రతికూల వాతావరణమే వెంటాడింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీవర్షాలతో పల్లపు చేలల్లో నీరు నిలిచింది. కృష్ణానది ఒడ్డున గల లంక చేలు వరదల్లో మునిగిపోయాయి. నీరు నిలిచిన చేలల్లో అక్కడక్కడా దుంపకుళ్లు, తాటాకు తెగులు సోకాయి. భూమిలో పసుపు దుంప ఊరే సమయంలో గత డిసెంబరులో అల్పపీడనం కారణంగా నెల మొత్తం ముసురు వాతావరణం నెలకొంది. సూర్యరశ్మి పెద్దగా లేకపోవడంతో ఈసారి ఎకరాకు కనీసం అయిదు క్వింటాళ్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
ధర ఆశాజనకం
దిగుబడి తగ్గినప్పటికీ మార్కెట్ ధర నిలకడగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ధర ఆశాజనకంగానే ఉంది. దుగ్గిరాల యార్డులో క్వింటాలు రూ.11 వేల వరకు ధర పలుకుతోంది. పంట చేతికొచ్చేసరికి ఈ ధరలు పెరిగితే ఒడ్డున పడతారు. గతేడాది కల్లాల్లోనే రూ.12 వేల ధర పలికిందని రైతులు గుర్తు చేస్తున్నారు.
దిగుబడి తగ్గుతుందని దిగులు అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణమే కారణం సగటున ఎకరాకు ఐదు టన్నుల దిగుబడి తగ్గే అవకాశం మార్కెట్ ధరలపైనే ఆశలు
Comments
Please login to add a commentAdd a comment