నిత్యం రద్దీగా కార్యాలయం
పట్నంబజారు: డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలకు మళ్లీ స్మార్ట్ కార్డుల పక్రియను కూటమి ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. గతంలో రవాణాశాఖ అధికారులు ఈ– ప్రగతి, పరివాహన్ పోర్టల్ ద్వారా సేవలు అందించేవారు. ప్రస్తుతం వాహన్ సారథి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు.ప్రస్తుతం వాహనదారులు దరఖాస్తు చేసుకున్న క్రమంలో ఆర్‌సీ, ఎల్‌ఆర్‌లకు సంబంధించి రూ కార్డుకు రూ.235 చొప్పున వసూలు చేస్తున్నారు. కార్డు ఫీజు రూ. 200, పోస్టు ద్వారా పంపడానికి రూ.32, ఇతరత్రా కలిపి రూ. 235 మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, టెండర్లు పిలువకుండా కార్డుల ముద్రణ ఎలా సాధ్యపడుతుందని, ఈ విషయంలో ఎలాంటి స్పష్టత కూడా లేదనే వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై రవాణాశాఖ అధికారుల్లో సైతం సరైన స్పష్టత లేకుండా పోతోంది. కనీసం వారికి కూడా కార్డులు ఎప్పుడు వస్తాయి.. ఎన్ని వస్తాయి ?అనే వివరణ తెలియకపోవడం గమనార్హం. గుంటూరు జిల్లాలో 40వేలకు పైగానే కార్డులకుపైగా అవసరమయ్యే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
అయోమయంలో వాహనదారులు
వాహన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే క్రమంలో ముందుగా రాష్ట్రం, జిల్లా వారీగా దరఖాస్తుదారుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం చలానా కట్టే సమయంలో స్మార్ట్ కార్డు పేరుతో నగదు వసూలు చేస్తున్నారు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా కార్డుల జారీ చేయడం ఎలా సాధ్యపడుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులకు అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే, టెండర్ల ప్రక్రియ రూపుదిద్దుకోకుండా ఫీజు వసూలు చేయడంపై వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే వాటిల్లో రవాణాశాఖ కూడా ఒకటి. నిత్యం సుమారు 100 నుంచి 150 మంది లైసెన్స్‌ల నిమిత్తం కార్యాలయానికి వస్తుంటారు. వీటితో పాటుగా ఆర్సీలకు సుమారుగా వంద మందికిపైగా వస్తూనే ఉంటారు. కరోనా వ్యాప్తి కారణంగా స్మార్ట్ కార్డుల జారీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలలో 60వేలకు పైగా పెండింగ్‌లో ఉన్న కార్డులను వారి నివాసాలకు పోస్టల్ ద్వారా రవాణాశాఖ చేర్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అరచేతిలోనే సేవలను పొందేలా రవాణాశాఖ చర్యలు చేపట్టింది. స్మార్ట్ కార్డుతో వాహనదారుల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీనిపై ఆర్టీఏ అధికారులను వివరాలు అడగగా, పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఆప్షన్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్మార్డ్ కార్డు అంశంపై దృష్టి సారిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment