జాతీయ సైక్లింగ్ పోటీలకు అర్షతునీసా బేగం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన షేక్ అర్షతునీసా బేగం ఈ నెల 28వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌లో జరగనున్న జాతీయ సైక్లింగ్ పోటీలకు ఎంపికై నట్లు నేషనల్ సైక్లిస్ట్ బండ్లమూడి సుబ్బయ్య శనివారం తెలిపారు. ఈ మేరకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తమకు లెటర్ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో అర్షతునీసా బేగాన్ని అభినందించారని తెలిపారు. పేద కుంటుంబంలో పుట్టిన అర్షతునీసా గతంలోనూ జాతీయ స్థాయి పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు.
ఆయుష్ ఆరోగ్య మందిర్‌కు స్థల పరిశీలన
ప్రత్తిపాడు: మండలంలోని నడింపాలెంలో శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ పర్యటించారు. స్థానిక జాతీయ రహదారి సమీపంలోని 149/4ఏ సర్వే నంబరులో 21.61 ఎకరాల స్థలాన్ని ఆయుష్ ఆరోగ్య మందిర్‌కు కేటాయించేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో సంబంధిత స్థలాన్ని జేసీ పరిశీలించారు. హద్దులు, సర్వే నంబరు మొత్తం విస్తీర్ణం, రోడ్డు, కోర్టు కేసులు, వివాదాలు తదితర విషయాలను తహసీల్దార్ జి.కరుణకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. స్థలంలో పెద్దపెద్ద గోతులు ఉండటంతో మైనింగ్ తవ్వకాలపై ఆరా తీశారు. అనంతరం అదే గ్రామంలోని సర్వే నంబరు 110–ఓ2లో ఇటీవల ఈఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణానికి అప్పగించిన 6.35 ఎకరాల భూమిని కూడా జేసీ పరిశీలించారు. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు జేసీకి వివరించారు. వెంట మండల సర్వేయర్ శ్రీనివాసరావు ఉన్నారు.
ఆటోనగర్ పరుపుల
కంపెనీలో మహిళ మృతి
పెదకాకాని: ఆటోనగర్‌లో పరుపులు, దిండ్లు తయారీ కంపెనీలో మహిళ ప్రమాదవశాత్తూ మరణించిన సంఘటన శనివారం జరిగింది. గుంటూరు ఆటోనగర్‌లోని శ్రీసాయి ఎంటర్‌ప్రైజెస్ పరుపుల తయారీ కంపెనీలో రెడ్డిపాలెం ఆదిత్యనగర్‌కు చెందిన కంభంపాటి రమణి పని చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే శనివారం వచ్చిన ఆమె మిషన్ వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ అందులో పడింది. పక్కన ఉన్న వారు చూసి మిషన్ ఆపి తీసే సరికే రమణి(26)ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. మృతురాలికి భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.టి. నారాయణస్వామి తెలిపారు.
రేపు సీపీఆర్‌పై వర్క్‌షాపు
గుంటూరు మెడికల్: కార్డియో పల్మనరీ రిససిటేషన్(సీపీఆర్)పై గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఎమర్జన్సీ మెడిసిన్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ వేమూరి ఎస్. మూర్తి తెలిపారు. వర్క్‌షాపు పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమూరి ఎస్. మూర్తి మాట్లాడుతూ గుండె జబ్బుతో ఆకస్మాత్తుగా కుప్పకూలిన వారిని సీపీఆర్(ప్రాణ రక్షణ ప్రక్రియ)తో బతికించవచ్చని చెప్పారు. జీజీహెచ్ ఎమర్జన్సీ మెడిసిన్ వైద్య విభాగాధిపతి డాక్టర్ చండ్ర రాధికారాణి మాట్లాడుతూ ఫిజీషియన్స్, రెసిడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, నర్సెస్, సాధారణ ప్రజలు సైతం ఈ వర్క్‌షాపును వినియోగించుకోవాలని ఆమె కోరారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పాల శ్రీనివాసరావు, డాక్టర్ అమరేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment