ఉద్యమకారులు ఐక్యత చాటాలి
హన్మకొండ : స్వరాష్ట్ర, స్వపరిపాలన, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ నినాదాలతో రాష్ట్రాన్ని పాలించుకుందామని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సందెల సునీల్‌కుమార్ అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో సంఘం ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ముందు ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాల పై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నామని, ఉద్యకారులు కలిసి వచ్చి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులు కాగా, మలి దశలో 1300 మంది అమరులయ్యారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సంఘం నాయకులు గుర్రం రఘు, బాబు, కాశబోయిన యాకన్న, ఇమ్మడి రవీందర్, గజ్జి సంతోశ్, ముద్దసాని వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి నరసింహారెడ్డి, సమ్మన్న, కక్కెర్ల వెంకన్న, ఎర్రవెల్లి దండయ్య, రమేశ్, శంకర్‌రావు, కోదండరాం, పరశురాములు, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.
ఊడిన గూడ్స్ రైలు లింక్
● పట్టాలపై నిలిచిన బోగిలు
మహబూబాబాద్ రూరల్ : గూడ్స్ రైలు బోగిల లింక్ ఊడిపోవడం (అన్ కప్లింగ్)తో వెనుక భాగంలో ఉన్న మూడు బోగిలు పట్టాలపై నిలిచాయి. ఫలితంగా రైలు రెండు భాగాలుగా విడిపోయింది. ఈ ఘటన మంగళవారం ఉదయం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డోర్నకల్ వైపు నుంచి కాజీపేట వైపునకు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా అప్ లైన్‌లో ఓ గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో గేట్ క్యాబిన్ సమీపంలో లింక్ ఊడిపోవడంతో సదరు గూడ్స్ రైలుకు వెనుక భాగంలో ఉన్న మూడు బోగిలు పట్టాలపై నిలిచాయి. గూడ్స్ రైలు రెండు భాగాలుగా విడిపోయిన విషయాన్ని గమనించిన గార్డు వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే నిలిపివేశాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేసి గూడ్స్ రైలును పంపించారు. కాగా, 45 నిమిషాలపాటు బోగిలు పట్టాలపై నిలిచిపోవడంతో ఎగువ మార్గంలో వెళ్లాల్సిన పలు రైలు ఆలస్యంగా నడవగా ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment