పెట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న నటి వరలక్ష్మి తదితరులు
పెట్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన సినీనటి వరలక్ష్మీ శరత్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: మూగజీవుల పట్ల కరుణ, సానుభూతి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ సినీ నటి వరలక్ష్మీశరత్ కుమార్ తెలిపారు. హెర్మియోన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నెక్లెస్ రోడ్డులోని డాగ్ పార్క్ వేదికగా ఏర్పాటు చేసిన ఉచిత పెట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో భాగంగా కుక్కలకు వరలక్ష్మి స్వయంగా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నగరంలోని సాధు జంతువులు, వీధి కుక్కల కోసం హెచ్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉచితంగా వ్యాక్సిన్ అందించడం అభినందనీయమన్నారు. ఆకలితో అలమటించే కొన్ని సందర్భాల్లోనే మూగజీవులు దాడి చేస్తాయని, వాటి సంరక్షణ బాధ్యత అందరిపై ఉంటుందని ఆమె పేర్కొన్నారు. చైన్నె వేదికగా తన తండ్రి శరత్ కుమార్‌తో పాటు తాను కూడా చాలా కుక్కలను పెంచుతున్నామని, వాటి ప్రేమ అనిర్వచనీయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను స్థాపించి వాటికి సేవ చేస్తున్నానని, హెచ్‌డీఆర్‌ఎఫ్‌తో కలిసి చైన్నెలో కూడా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ఆమె వెల్లడించారు. జంతువుల ఆరోగ్యం కోసం ఉచిత సేవలు నగరంలోని అందరూ వినియోగించుకోవాలని, మూగజీవాలంటే భయం వద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెర్మియోన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ వ్వవస్థాపకులు డాక్టర్ శ్రీరెడ్డి మాట్లాడుతూ... నగరంలో రానున్న 3 రోజుల్లో 5 వేల కుక్కలకు టీకాలు వేయాలనే ప్రణాళికను రూపొందించామన్నారు. నగరమంతా తిరిగి సేవలందించడానికి ప్రత్యేకంగా రెండు మొబైల్ వ్యాన్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ సేవలను పొందాలనుకునే నగరవాసులు ఫోన్: 91008 73829లో సంప్రదించవచ్చని అన్నారు. మున్సిపల్ అధికారులు, జంతు ప్రేమికుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్‌లో మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నగరంలోని వీధి కుక్కలకు మైక్రో చిప్స్ ఏర్పాటు చేసి ఆ వివరాలతో ఒక డెటాబేస్ తయారు చేయనున్నామని అన్నారు. నగరంలోని పలువురు జంతు ప్రేమికులు, సంరక్షకులు కుక్కలను తీసుకొచ్చి టీకాలను వేయించారు.
మూగజీవాలపై శ్రద్ధ, సానుభూతి చూపాలని వినతి
3 రోజుల్లో 5 వేల కుక్కలకు టీకాలు వేయాలని ప్రణాళిక
మొబైల్ వ్యాన్లతో టీకాలు సరఫరా చేస్తున్న హెచ్‌డీఆర్‌ఎఫ్ సంస్థ
రేబిస్ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్
Comments
Please login to add a commentAdd a comment