![సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/18/17abd101-160005_mr_0.jpg.webp?itok=yXtl9GdD)
సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య కొలకలూరి ఇనాక్
నాంపల్లి: తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకుని జాతి గొప్పతనాన్ని నిలుపుకోవాలని ఆటా అంతర్జాతీయ సదస్సులో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకల్లో భాగంగా ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు జరిగింది. ప్రముఖ రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ అధ్యక్షతన ప్రారంభమైన సదస్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి, నటుడు తనికెళ్ల భరణి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకలను ప్రారంభించి ప్రసంగించారు. తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆటాకు అమితమైన ప్రేమ ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తోందని అన్నారు. తెలుగువారు ఏ దేశంలో ఉన్నా తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కాగా ఈ సందర్భంగా ‘ప్రపంచీకరణ నేపథ్యం–మీడియా రంగం, అనువాదం–నాటకం–అవధానం, తెలుగు కథలు–నవల–విశ్లేషణ, ఆధునిక కవితా పరిణామాలు, సినిమా సాహిత్య మేళవింపు’ అనే అంశాలపై సదస్సులు నిర్వహించారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ గేయ రచయితలు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, దేశపతి శ్రీనివాస్, పెంచలదాసు, కాసర్ల శ్యామ్ తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఆటా ముగింపు వేడుకలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.
ఆటా అంతర్జాతీయ సదస్సులో వక్తలు
Comments
Please login to add a commentAdd a comment