అబిడ్స్: బిర్యానీ విషయంలో చోటు చేసుకున్న వాగ్వాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబిడ్స్ గ్రాండ్ హోటల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..నూతన సంవత్సరం సందర్భంగా దూల్‌పేట్ గంగాబౌలికి చెందిన ఎనిమిది మంది ఆదివారం రాత్రి అబిడ్స్ గ్రాండ్ హోటల్‌కు వచ్చారు. మటన్ బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను ఆర్డర్ చేశారు. వెయిటర్స్ మటన్ బిర్యానీ తీసుకురాగా అది సరిగ్గా ఉడకలేదని, చల్లగా ఉందని వారు వాపస్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వెయిటర్లు అదే బిర్యానీని వేడి చేసుకుని తీసుకువచ్చారు.
దీంతో వారు బిర్యానీతో ఇతర వంటకాలను తిన్నారు. అయితే మటన్ బిర్యానీ మాత్రం తాము డబ్బులు చెల్లించమని, మటన్ ఉడకనప్పుడు ఎందుకు చెల్లించాలని వెయిటర్స్‌ను నిలదీశారు. మిగతా పైసలు చెల్లిస్తామని, మటన్ బిర్యానీ డబ్బులు మాత్రం చెల్లించేది లేదని భీష్మించారు. దీంతో వెయిటర్స్, ధూల్‌పేట్ వాసుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో వెయిటర్స్ కర్రలు, కుర్చీలతో వారిపై దాడి చేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రాండ్ హోటల్ వెయిటర్స్ దాడి చేస్తున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: రాజాసింగ్
ఈ విషయమై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ హోటల్ యాజమాన్యంపై, వెయిటర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు వెంటనే హోటల్ యజమానితో పాటు వెయిటర్స్‌ను అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హోటల్‌కు వచ్చిన కస్టమర్లపై దాడులు చేయడం దారుణమన్నారు. పోలీసులు వెంటనే హోటల్‌ను మూసివేయని పక్షంలో తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. హోటల్‌కు వచ్చిన వారిలో మహిళలు కూడా ఉన్నారని వారిపై కూడా వెయిటర్స్ దాడి చేయడం దారుణమన్నారు.
పోలీసుల అదుపులో 10 మంది వెయిటర్స్
ధూల్‌పేట వాసులపై దాడులకు దిగిన 10 మంది వెయిటర్స్‌ను అబిడ్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారాజును వివరణ కోరగా హోటల్ యజమానితో పాటు వెయిటర్స్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితుడు సుమిత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హోటల్ యజమానితో పాటు వెయిటర్స్‌పై కూడా కేసులు నమోదు చేశామన్నారు. ముందు జాగ్రత చర్యగా హోటల్‌ను మూసివేశామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment