హైదరాబాద్: చిన్నారుల పాలిట స్కూల్ బస్సులు యమదూతల్లా మారాయి. అభం శుభం తెలియని బాలలను బలిగొంటున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు మృత్యవాతపడుతున్నారు. డ్రైవింగ్‌లో అనుభవం, నైపుణ్యం లేకుండానే స్కూల్ బస్సులను నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డుపై పాదచారులను, చిన్నారులను గమనించకుండానే వాహనాలను నడపడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
హబ్సిగూడలో గురువారం నాటి ఘటనే ఇందుకు ఉదాహరణ. బస్సు ఆగినప్పుడు, తిరిగి బయలుదేరే సమయంలో విధిగా ముందూ వెనకా గమనించాలి. బస్సులో ఉండే సహాయకులు కిందకు దిగి అన్నివైపులా చూసి డ్రైవర్‌కు సంకేతం ఇవ్వాలి. కానీ.. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలను కూడా పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు పిల్లలను బస్సెక్కించేటప్పుడు, దిగిన తర్వాత తిరిగి ఇళ్లకు తీసుకెళ్లే సమయంలో తమ వెంట ఉండే చిన్నారులను గమనించకపోవడంతోనూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
తనిఖీలు తూతూమంత్రం
రహదారి భద్రతలో భాగంగా బడి బస్సుల నిర్వహణపై రవాణాశాఖ ప్రత్యేక శ్రద్ధ వహించడంలేదు. కొంతకాలంగా అధికారుల ఉదాసీనత, డ్రైవర్లపై కొరవడిన నియంత్రణ ప్రమాదాలకు దారితీస్తోంది. ఏటా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకొనే సమయానికి అన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాలకు చెందిన తనిఖీ అధికారులు విధిగా బస్సులను తనిఖీలు చేసి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించాలి. డ్రైవర్ల అనుభవంపైనా అధికారులకు కచ్చితమైన అవగాహన ఉండాలి. విద్యాసంస్థల యజమానులు డ్రైవర్లను నియమించుకొనే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలి. కానీ.. రవాణా అధికారులు ఏడాదికి ఒకసారి మొక్కుబడి తనిఖీలకు మాత్రమే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు స్కూల్ బస్సుల నిర్వహణలో విద్యాసంస్థల వైఫల్యం కూడా ఉంది. రూ.లక్షల్లో ఫీజులు తీసుకొనే కార్పొరేట్ స్కూళ్లు బస్సుల నిర్వహణలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి. డ్రైవర్ల నియామకం, సహాయకుల ఏర్పాటుపై అశ్రద్ధ చూపుతున్నాయి. లారీలు, గూడ్స్ వాహనా లను నడిపేవారికి పిల్లల బస్సులను అప్పగించడంతో ర్యాష్ డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్‌కు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రులు సైతం బాధ్యులే..
పెద్ద పిల్లలను స్కూల్ బస్సెక్కించే సమయంలో వారితో పాటు చిన్నారులను బయటకు తీసుకురావడం ఒక నిర్లక్ష్యపు అలవాటుగా మారింది. బయటకు వచ్చిన తర్వాత తమ వెంట మరో పాప, లేదా బాబు ఉన్నారనే విషయాన్ని మరిచి.. పెద్ద పిల్లలను బస్సెక్కించడంలోనే నిమగ్నమవుతున్నారు. చాలాసార్లు ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటిసమయాల్లో చిన్నవారిని ఇంటి నుంచి బయటకు రానివ్వకపోవడమే మంచిది. ఒకవేళ బయటకు తీసుకొచ్చినా ఒక చేత్తో పట్టుకొని ఉండడం మరిచిపోవద్దు. మరోవైపు స్కూల్ బస్సు నడిపే డ్రైవర్‌కు రవాణా అధికారులు ఆమోదించిన లైసెన్స్, అనుభవం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. పేరెంట్స్ కమిటీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
డ్రైవర్లకు రిఫ్రెషర్ శిక్షణ అవసరం..
► బస్సులను నడిపే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై పాఠశాల యాజమాన్యం డ్రైవర్లు, అటెండర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.
► రవాణా అధికారుల పర్యవేక్షణలో డ్రైవర్లకు తప్పనిసరిగా రిఫ్రెషర్ శిక్షణ కోర్సులను నిర్వహించాలి.
► సాధారణంగా రోజూ నడిపే డ్రైవర్ లేని సమయంలో కొత్త వారికి బస్సులను అప్పగిస్తారు. ఇలా ప్రత్యామ్నాయ డ్రైవర్‌ను ఎంపిక చేసేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం.
► నిలిపి ఉంచిన స్కూల్ బస్సుల వద్దకు పిల్లలు వెళ్లకుండా జాగత్తలు పాటించాలి.
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ప్రమాదాలిలా..
► గత జూలైలో ఆదిభట్లలో ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది.
► ఆగస్ట్‌లో బాచుపల్లిలో ఓ స్కూల్ బస్సు బైక్‌ను ఢీకొన్న ఘటనలో రెండో తరగతి చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. ఇదే నెల 28న సునీత అనే పారిశుద్ధ్య కార్మికురాలిని ఒక మెడికల్ కాలేజీ బస్సు ఢీకొట్టడంతో ఆమె కన్నుమూశారు.
► సెప్టెంబర్‌లో ఇబ్రహీంపట్నం వద్ద ఓ స్కూ ల్ బస్సు ఇద్దరు చిన్నారులను ఢీకొంది.
► నవంబర్ 2న సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ తండ్రితో కలిసి రోడ్డు దాటుతున్న మూడేళ్ల చిన్నారిని ఢీకొట్టాడు.
► నవంబర్ 19న ఆనంద్‌నగర్‌లో రెండున్నరేళ్ల చిన్నారి స్కూల్ బస్సు.. ముందు చక్రాల కింద నలిగిపోయింది.
► డిసెంబర్ 15న బీఎన్‌రెడ్డినగర్‌లో నాలుగేళ్ల చిన్నారిని స్కూల్ బస్సు ఢీకొట్టింది.
► జనవరి 4వ తేదీన హబ్సిగూడలో ఏడాదిన్నర చిన్నారి స్కూల్ బస్సు చక్రాల కిందపడి అసువులు బాసింది.
Comments
Please login to add a commentAdd a comment