నగరంలో అంతకంతకూ కాలుష్యం విస్తరిస్తోంది. కాంక్రీట్ జంగిల్‌లో ప్రస్తుతం మండుతున్న ఎండలు దీనికో చిన్న ఉదాహరణ మాత్రమే. వాహనాల వెల్లువతో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధుల సంఖ్య పెరిగిపోతోంది. ఊపిరితిత్తుల్లోకి చొరబడుతున్న కాలుష్యం ఆస్తమా, కేన్సర్‌కు సైతం కారణమవుతోందని కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డా.బాలసుబ్రమణియం అంటున్నారు. అంతేకాదు.. కాలుష్యం గర్భిణుల ముందస్తు డెలివరీలకు, ప్రీ మెచ్యూర్ జననాలకు కూడా దారి తీస్తోందంటున్నారు. ఛాతీ వ్యాధుల ఆసుపత్రి వైద్యులు డా.ప్రమోద్ మాట్లాడుతూ.. పొగతాగని వారూ కేన్సర్ బారిన పడేందుకు గాలి కాలుష్యం దోహదం చేస్తోందన్నారు. తాగునీరు సైతం అనేక ప్రమాదకర బాక్టీరియాలను మోసుకొస్తోంది. మరోవైపు భూగర్భజలాల్లో కాలుష్య కారకాల పరిమాణం ప్రమాదకర స్థాయికి చేరిందని ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో–కెమికల్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ ఆఫ్ హైదరాబాద్ పేరిట తాజాగా నిర్వహించిన ఓ పరిశోధన వెల్లడించింది.
► వాహన విస్ఫోటనంతో వాయు కాలుష్యం.. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులు
► కలుషిత నీటితో పుట్టుకొస్తున్న ప్రమాదకారక బ్యాక్టీరియాలు
► ఆహార పదార్థాల కల్తీలో నగరం ప్రథమ స్థానం.. అనేక రోగాలతో అతలాకుతలం
► దడ పుట్టిస్తున్న జంక్ ఫుడ్.. 32 శాతం కేసులతో హానికరమైన వ్యాధులు మానసిక సమస్యలతో విలవిల
► కదలకుండా చేసే కార్పొరేట్ ఉద్యోగాలతో రోగాలకు రాచబాట స్మార్ట్ ఫోన్లతో నిద్రలేమి వ్యాధులు
► యాంటీబయాటిక్స్ వినియోగంతో శక్తియుక్తులు నిరీ్వర్యం
► కబళిస్తున్న వీకెండ్ జోష్.. మత్తుకు చిత్తవుతున్న యువత
కాదేదీ కల్తీకి అనర్హం..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. ఆహార పదార్థాల కల్తీలో నగరం ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం 19 ప్రధాన నగరాల వ్యాప్తంగా ఓ ఏడాదిలో 291 కేసులు నమోదైతే అందులో 241 కేసులు మన నగరంలో నుంచే కావడం గమనార్హం. అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో మొదలుపెట్టి పసుపు, గరం మసాలా, ఇంకా అనేక కల్తీ దినుసులు నగరంలో రాజ్యమేలుతున్నాయి. ఇవి విక్రయదారులకు లాభాల పంట పండిస్తూ మరో వంక వినియోగదారులకు తీవ్రమైన రోగాల బారిన పడేస్తున్నాయి.
మానసికం.. బలహీనం
ప్రస్తుతం నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంటున్నారు. ‘పిల్లల్లో మానసిక సమస్యల చికిత్సకు స్పీచ్ థెరపిస్ట్‌లు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు, స్పెషల్ అధ్యాపకులు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు అవసరం పెరిగిపోతోంది. ఆటిజం, హైపర్ ఆక్టివిటీ, అభ్యాస వైకల్యాలు, పరీక్షల భయం, మొబైల్ ఫోన్‌లు, ఇంటర్నెట్‌కు విపరీతమైన వ్యసనం, జూదం, డ్రగ్స్, ఆల్కహాల్ వ్యసనం, స్కూల్ ఫోబియా, ప్రవర్తనా సమస్యలు, ఉన్మాదం, ఆత్మహత్య ధోరణులు, మొండితనం, కోపంతో కూడిన మనస్తత్వాలు పెరుగుతున్నాయి’ అన్నారు ఆయన. పెరుగుతున్న వివాహ వయసు, ఆలస్యమైన గర్భాలు, పని ఒత్తిడి కారణంగా తల్లిదండ్రులకు సమయం లేకపోవడం కరోనా సమయంలో సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లుఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడం వంటివి మానసిక సమస్యల విజృంభణకు కారకాలుగా ఆయన అభిప్రాయపడ్డారు.
జంక్.. ఫసక్..
బర్గర్స్, పిజ్జాలు, కేఎఫ్‌సీల పేరుతో రెడీమేడ్ ఆహారాల వినియోగం సిటీలో మోడ్రన్ లైఫ్ స్టైల్‌కి సూచికగా మారాయి. ప్యాకేజ్డ్ ఫుడ్, అ్రల్టాప్రాసెస్డ్ ఫుడ్ సిటిజనుల ఆరోగ్యాన్ని కుళ్ల»ొడిచేస్తున్నాయని వైద్యులు, పరిశోధనలు హెచ్చరిస్తున్నా సిటిజనులు వినియోగంలో వెనుకంజ వేయడం లేదు. తాజాగా నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి నిర్వహించిన సర్వేలో సిటీలో విస్తృతంగా వినియోగంలో ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ నగర చిన్నారుల శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా హరిస్తోందని హెచ్చరించింది. కేన్సర్, టైప్2 డయాబెటిస్, హృద్రోగాలు, జీర్ణకోశ వ్యాధులు, డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు నగరంలో 32శాతం పెరగడానికి ఈ ఆహారపు అలవాట్లే కారణమని బీఎన్‌జే మేగజైన్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం తేలి్చంది. ‘ఈ తరహా ఆహారపు అలవాట్లు వేగంగా ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. కొన్నిసార్లు ఆల్కహాల్ కన్నా ఇవి హానికరంగా పరిణమిస్తున్నాయి’ అని ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డా.నాగేశ్వర్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు.
కదలిక లేక.. రోగాల రాక
నాలుగ్గోడల మధ్య, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కంప్యూటర్లకు అతుక్కుపోతున్న జీవనశైలి నగరవాసుల్ని ఆ తర్వాత రోజుల్లో ఆసుపత్రి మంచాలకు అతుక్కుపోయేలా చేస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగాలు ఆదాయాలకు మాత్రమే కాదు రోగాలకు రాచబాట వేస్తున్నాయి. తాజాగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) నిర్వహించిన అధ్యయనంలో ఇదే వెల్లడైంది. సగటున 30 ఏళ్ల వయసున్న నగర ఐటీ ఉద్యోగుల్లో 46 శాతం మందికి కనీసం 3 లేదా 4 మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని, ఆరోగ్యానికి అవసరమైన హెచ్‌డీఎల్ కొలె్రస్టాల్ లోపంతో బాధపడుతున్నారని స్పష్టం చేసింది. నడుం చుట్టుకొలత 90 సెం.మీ కన్నా ఎక్కువైన మగవాళ్లు, 80సెం.మీ కన్నా ఎక్కువైన మహిళలు పెరుగుతున్నారని శారీరక శ్రమ, కదలిక లేకుండా నిశ్చలంగా ఎక్కువసేపు ఉండడం దీనికి కారణమని స్పష్టం చేసింది.
మార్పు చేర్పులే శరణ్యం..
మారుతున్న జీవనశైలులు నగరవాసుల్లో పోషకాహార లోపాలకు అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దీనిని అధిగమించడానికి ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరి. తగినంత వ్యాయామం చేయడంతో పాటు జంక్ ఫుడ్ మానేసి ఆ స్థానంలో కొలె ఆల్మండ్స్ వంటి ఆరోగ్యకరమైన దినుసుల్ని స్నాక్స్‌గా మార్చుకోవాలి. ఇవి కొలె్రస్టాల్, బ్లడ్ షుగర్ స్థాయిల్ని నియంత్రిస్తాయి. ఇలాంటి స్వల్ప మార్పులతో ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటూ మై హెల్త్ మై రైట్ థీమ్ అనే వరల్డ్ హెల్త్ డే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలి.
– షీలా కృష్ణమూర్తి, పోషకాహార నిపుణురాలు
వ్యాయామం, ధ్యానం...
ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట వ్యాయామం, తగినంత నీరు తాగడం, ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, సమయానికి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్స్, వేయించిన ఆహారం, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైండ్ చేసిన ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. ప్రతిరోజూ 8 గంటలు మంచి నిద్ర పట్టేలా చూసుకోవాలి. రోజుకు రెండు రకాల పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ పిడికెడు డ్రైఫ్రూట్స్ తినడం, ఆహారంలో కూరగాయలు, ఆకు కూరలు, పాలు, పన్నీరు. కోడిగుడ్లు ఉండేలా చూసుకోవాలి
– డాక్టర్ అనిల్, ఫీవర్ ఆస్పత్రి
నిర్లక్ష్యం చేయొద్దు
నాన్–కమ్యూనికేబుల్ డిసీజెస్ , కార్డియోవాసు్కలర్ వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు నగరంలో పెరుగుతున్నాయి. వీటిని నిరోధించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఒక్కటే పరిష్కారం. ఆహారం, వ్యాయామం జీవనశైలి పరిశీలించుకుంటూ ఆరోగ్యకర నియమాలను నిర్దేశించుకోవాలి. నిర్లక్ష్యం చేయకుండా ఓ వయసు దాటాక రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలి. ఆరోగ్యంపై పర్యావరణ కారకాల ప్రభావం, గాలి, నీటి కాలుష్యం, వాతావరణ మార్పు వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలి.
– డాక్టర్ ఆరతి బళ్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్
Comments
Please login to add a commentAdd a comment