మియాపూర్: ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మాణిక్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రం కమలాపూర్ జిల్లాకు చెందిన జిహూర్ గోరి (25) తన స్నేహితుడు అవని గోరితో కలిసి మియాపూర్ ఓల్డ్ హపీజ్‌పేటలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. కొంతకాలంగా జిహూర్ ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజాము వరకూ ఆన్‌లైన్ గేమ్ ఆడి రూ.20 వేలు పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా గతంలో చేసిన అప్పులు భారీగా పెరిగిపోయాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని జిహూర్ ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. హఫీజ్‌పేట్‌లోని డబుల్ బెడ్రూం భవన సముదాయం సమీపంలోని ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు చూసి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అవని గోరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment